కథా భారతి

జోస్యం

– ఆర్. శర్మ దంతుర్తి

జ్యోతిషం చెప్పే వాడికి పేరు రావాలంటే మార్గం ఆయన చెప్పేవి నిజం అవుతున్నాయని వ్యాప్తి చేయడం. ఆ వ్యాప్తికి ఉన్న అనేకానేక పద్ధతుల్లో జనా లు ఒకరి కొకరు చెప్పుకోవడం, లేకపోతే అదృష్టం ఉంటే పత్రికల్లోనో పేపర్లలోనో వార, నెల వారీగా రాశి ఫలితాలు రాయడమో అనేవన్నీ ఒకప్పటి మాట. హై టెక్ యుగానికి ఇవన్నీ అక్కర్లేదు. ఓ బ్లాగో, వెబ్ సైటో మొదలుపెట్టి అంతర్జాలం మీదో ఫేసు బుక్కులోనో వదిల్తే చాలు. గొర్రెల్లాంటి జనం పొలోమంటూ వచ్చి పడతారు.
అదిగో అలాగే అప్పారావు పండిట్ గానూ, దైవజ్ఞుడిగానూ మారిపోయేడు బ్లాగు మొదలుపెట్టి. ఇందులో ఆయన పోస్టుచేసేవి వరుసగా జరుగుతూ ఉండడంతో అప్పారావుని ‘గురువుగారూ’ అని పిలిచే అభిమాన సంఘం ఒకటి మొదలైంది. ప్రతీ పోస్టుకీ ‘ఆహా ఓహో’ లనడం, బాజా భజంత్రీలు వాయించడం, లైకులు కొట్టడం వీళ్ల పని.

అప్పారావు మొదటి జోస్యం – మార్చ్ నెలలో రాబోయే అమావశ్య కి జనం చావడం – ఎక్కడో కాదు కానీ దేశంలోనే, దాదాపు ఉత్తరంగా. భజన పరులు ఊపిరి బిగబట్టి చూసారు ఏమౌతుందా ఆ రోజన అని. అమావాశ్య అయిన నాలుగో నాడు అప్పారావు చెప్పేడు ఏమైందో తన బ్లాగులో ఫోటోలతో సహా రాసి – ఎవరికీ తెలియని విషయం – భోపాల్ దగ్గిర ఒకానొక ప్రదేశంలో కొండ చరియ విరిగి పడి క్వారీలలో పనిజేసే ముగ్గురు రోజువారీ కూలీలు మరణించారు. భజన పరులు ‘హమ్మ బాబోయ్ మరీ ఇంత నిజం అవుతుందా గురువుగారి జోతిష్యం’ అని గుండెలమీద చెయ్యేసుకున్నారు. ఈ వార్త గూగిల్లో సేకరించడానికి – అంటే తన జ్యోతిష్యం నిజం అయిందని చెప్పడానికి – అప్పారావుగారికి ఇంటర్నెట్లో మూడు గంటలు పట్టింది అది వేరే విషయం.
ఏప్రిల్ నెలలో అప్పారావు చెప్పినది మరోసారి నిజమైంది – ఈ సారి కూడా అమావశ్య నాడే – పేరున్న పాత్రికేయుడూ, ‘మీ రోజు’ పత్రికాధిపతి అయిన, తొంభై ఆరేళ్ళ పిచ్చేశ్వర్రావు మరణించేడు. యధాతధంగా నిజమైన జోస్యానికి భజంత్రీలు మోగాయి. అప్పారావు ఇదంతా మామూలేనన్నట్టూ భుజాలు ఎగరేశాడు.
మే నెలలో రోహిణీ కార్తి. ఎండలవల్ల జనం చావడం అప్పారావు ఎంతో ముందు చెప్పిందే. ఆ చెప్పడానికి ముందు పోయిన ఏడాది ఎంతమంది ఎండలవల్ల పోయారో, ఈ ఏడాది ఉజ్జాయింపుగా ఎంతమంది పోతారో ఆయన ఇంటెర్నెట్టులో చూసి లెక్కలు కట్టాడనుకోండీ కానీ అవి మనకి అనవసరం కదా? ఆయన వాక్శుద్ధి ఒకటే మనకి కావాల్సింది. భజంత్రీలు ఢమ ఢమ లాడేయి. మే నెలలో రెండో ప్రకటన వెలువడింది బ్లాగు ముఖంగా – జనం ఊకుమ్మడిగా పోతారని. రెండు రోజులకి మలేషియా వెళ్ళే విమానం కూలిపోయి 350 మంది తనువులు చాలించి అప్పారావుని ఆకాశానికెత్తేసారు. అప్పట్నుంచి అప్పారావంటే జనాల్లో కొంత భయం మొదలైంది. భజన పరులు బాకాలు ఊదినా వాటిలో కాస్త దిగులు ధ్వనించిందనేది వాస్తవం.

జూన్ లో వర్షాలు వచ్చి చల్లబడింది వాతారవణం. అప్పారావు ఏమీ చెప్పలేదు ఆ నెలకి. కానీ జూలైలో సగం నెల పోయాక చెప్పేడు ఈ చివరి అమావాశ్యకి ఒక పెద్దాయన పోతాడు చూసుకోండోహో అంటూ. అది ఎవరు అయి ఉండోచ్చో కూడా చెప్పేడు ఈ సారి – ఒక సినిమా నటుడో, రాజకీయనాయకుడో అని. అయితే సినిమా కళాకారుడీకే ఎక్కువ అవకాశం ఉందని కితాబిచ్చేడు. ఈ సారి ఈ బ్లాగు చూ సిన వాళ్ళు పెద్ద ఎత్తున తమ స్నేహితులకీ, మిగతా తెలిసిన వాళ్ళకీ చెప్పేరు ఈ సంగతి. అలా అప్పారావు, ఆయన బ్లాగూ మరింత ప్రముఖులయ్యేరు

జూలై ఆఖరి అమావశ్య నాడు కాదు కానీ తర్వాత రోజు పాడ్యమి నాడు హిందీ చిత్రసీమలో అవకాశాల్లేక తెలుగులోకి వచ్చి అధిక సంపాదకురాలై, మొదటి హీరోయిన్ గా ఉన్న తారామణి ఇరవైతొమ్మిదేళ్ళ మధురవాణి హఠాత్తుగా గుండాగి చచ్చి పోయింది. తన బ్లాగులో అప్పారావు మధురవాణి ఎందుకు చచ్చిపోయిందో, జాతకం చక్రం వేసి మరీ చెప్పేడు. అక్కడితో ఊరుకోక రోజుకో పోస్టుతో ఆవిడ పుట్టడం, చదువే లేకపోయినా పైకిజీవితంలో రావడం, మళ్ళీ సినీ ఫీల్డ్ లో ఉన్న అనేకానేక రహస్యాలూ అన్నీ విడమర్చి ఏ గ్రహం ఉఛ్ఛలో ఉన్నప్పుడు ఏమైందో అన్నీ విడమర్చి చెప్పేడు. ఆవిడని శారీరకంగా వాడుకుని చంపేసారనీ, నిజంగా గుండాగి చచ్చి పోలేదని గ్రహ స్థితి చెప్తున్నట్టూ, అలా పైకి రాని, రాకూడని రహస్యాలన్నీ ఇప్పుడు అప్పారావు గురువు గారి ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది. అది చదివిన అభిమానులకీ, జనాలందరికీ అప్పారావు మీద కోపం తన్నుకొచ్చింది. అప్పారావుకే అభిమాన సంఘాలు ఉండగా, బాగా పాపులర్ అయిన మధురవాణికి ఉండడంలో వింతేమీలేదు కదా? ఇలా రహశ్యాలు బయటకొస్తున్నందువల్ల, అప్పారావుని ఎప్పుడో ఎవరో లేపేస్తారని కొంతమంది గుసగుసలాడారు

ఆగస్టులో అప్పారావు మరో సారి హెచ్చరిక జారీ చేశాడు. ఈ నెల అమావశ్య కి దగ్గిర దగ్గిరలో మరో ప్రముఖుడు బాల్చీ తన్నేస్తాడని. చతుర్దశి నాడు రాత్రి అందరూ ఊపిరి బిగబట్టుకుని చూసారు ఏమౌతుందా అని. ఎవరికీ ఏమీ తెలియలేదు ఎంత వెతికినా ఇంటర్నెట్టులో.
ఆగస్టులో అమావశ్య తర్వాత వచ్చే వినాయక చవితినాడు మీరోజు పత్రికలో మూడో పేజీలో చిన్న వార్త పడింది – ప్రముఖ జ్యోతిష్కుడు అప్పారావు అమావశ్య, అర్ధరాత్రి తన స్వంత ఇంట్లో ఎవరూ లేనప్పుడు దారుణంగా హత్య చేయబడ్డాడు – ఈ సారి కూడా అప్పారావు జోతిష్యం నిజమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked