కథా భారతి

పతి పత్ని ఔర్ వహ్

-ఆర్. శర్మ దంతుర్తి

సాయింత్రం రావాల్సిన మనోహర్ మధ్యాహ్నం ఒంటి గంటకే ఇంటికొచ్చి నిస్త్రాణగా సోఫాలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళ టెన్షన్ కి తెరపడి మొత్తానికో లే ఆఫ్ నోటీసు చేతిలో పెట్టి రెండు నెలల జీతంతో వదిలించుకున్నారు తనని మేనేజర్లు. అమ్మాయి ఇప్పుడు కాలేజీలో చేరింది కనక ఇంట్లో ఉండేది తనూ, సంధ్యా మాత్రమే. ఆవిడ డాక్టరు కనక డబ్బులకేమీ ప్రస్తుతానికి ఢోకాలేదు కానీ …. ఆలోచనలు కట్టిపెట్టి, ఫోను తీసి సంధ్యకి ఫోన్ చేసాడు. డాక్టర్ గారు పేషెంట్ ని చూస్తున్నారుట మరో పావుగంటలో ఆవిడే పిలుస్తారని సమాచారం. చేసేదేమీ లేదు కనక ఉద్యోగంలో ఇప్పటివరకూ పోగేసుకున్న కాయితాలూ బాక్సులూ బేస్ మెంట్ లోకి చేరేసేసరికి గంటన్నర; అప్పుడు సంధ్య ఫోన్ చేసింది. ఉద్యోగం పోయినట్టు తెలియగానే ఆవిడే అంది, “పోనీలెండి ఇప్పుడు కాస్త ఇల్లు సర్ది, వంట వండుదురు గాని.” నవ్వేడు మనోహర్. సాయింత్రం మరోసారి మాట్లాడుకోవచ్చు అని నిర్ణయించుకున్నాక ఆవిడ పనిలో పడిపోయింది.
సాయింత్రం మాత్రం పెద్దగా మాట్లాడుకోవడానికేవుంది? ఉన్న దారిలోనే ఉద్యోగం వెతుక్కోవడం, లేకపోతే మరో దార్లో – అంటే వేరేగా బిజినెస్ పెట్టడం, లేకపోతే ఉన్న కమ్యూనిటీ కాలేజీలో జేరి కొత్త భాష నేర్చుకోవడం. రెండూ అంత సులభం కాదు. ఏం బిజినెస్? రోడ్డుకో ఇండియన్ షాపు ఉన్న ఈ రోజుల్లో పచారీ సరుకుల బిజినెస్ అంత బాగా లాగక పోవచ్చు. కాలేజీలో జేరాలంటే మన ఇష్టం వచ్చినప్పుడూ క్లాసులు ఉండవు కనక మరో మూడు నెలలు ఆగాలి. మరోదారి చూడాల్సిందే.
మర్నాటి నుంచి మనోహర్ ఉద్యోగం వేటలో పడ్డాడు. మొదట తెలిసి వచ్చినది, ఎక్కడో మెయిన్ ఫ్రేమ్ ఉన్న పెద్ద కంపెనీలు కోబాల్ వాళ్ళని తీసుకుంటున్నారు కానీ ఉన్న ఊరిలో కష్టమే. పోనీ వేరే ఊళ్ళలో తీసుకుంటున్నారు కదా అనుకుంటే జూనియర్ లని తీసుకుంటున్నారు కానీ తనలాంటి తల నెరిసిన సీనియర్ల ని కాదు. ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలనేదే అసలు సమస్య.
* * * *

నాలుగు నెలలు గడిచాక మనోహర్ కి తెలిసివచ్చిన విషయం – తనకి ఉన్న ఊళ్ళో ఉద్యోగం రావడం అసంభవం. వేరే ఊళ్ళో ప్రయత్నం చేయాల్సిందే. సంధ్యతో చెప్తే ఒప్పుకోకపోవచ్చు ఆవిడకి ఉన్న ఉద్యోగం వదులుకోవడానికి. మొదట తనకో ఉద్యోగం వస్తే అప్పుడు ఇలా అని చెప్పి ఒప్పించవచ్చు. డాక్టర్లకి ఎక్కడైనా వస్తుంది కదా ఉద్యోగం.
మూణ్ణెల్లు పోయాక – ఓహైయో లో సింసినాటీ కి వంద మైళ్ళకి పైగా దూరంలో ఉన్న జాక్సన్ అనే పల్లెటూర్లోంచి – మనోహర్ కి ఫోన్ వచ్చింది. ఆరునెలల కంట్రాక్ట్. ఎక్కడి విచిటా కాన్సాస్, ఎక్కడి జాక్సన్ ఓహైయో? మిగతా విషయాలు తర్వాత తెలిసొచ్చాయి – ఆరు నెలల కంట్రాక్ట్ సరే ఆ తర్వాత మరో ఆరునెలల చొప్పున పొడిగించే దారి ఉంది. ఎలా ఇంతకాలం అని అడిగితే బుల్లెట్ లాగా వచ్చింది సమాధానం – “ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు”. దేశాధ్యక్షుడికే నాలుగేళ్ళు కంట్రాక్టు. అది మహా అయితే గియితే మరో నాలుగేళ్ళు పొడిగిస్తారు. ఆ ఎనిమిదేళ్ళు ఎలాగోలా నెట్టుకొస్తే ఆ తర్వాత ఉద్యోగం అంటూ చేయక్కర్లేదు కానీ అసలు ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టుకోలేని అశక్తుల్లో ఆయనే మొదటివాడు కదా? ఆయనకేలేని పెర్మనెంటు ఉద్యోగం మిగతావాళ్లకెలా దొరుకుతుంది? అసలు ఉద్యోగం పెర్మనెంట్ అయితే ఉద్యోగస్తుడు కూడా ఆ ఉద్యోగం వదిలి మరో ఉద్యోగానికి వెళ్ళగలడా?

మొత్తానికి వాదోపవాదాలు అయ్యేక మనోహర్ ఒకడే జాక్సన్ వెళ్ళేటట్టూ సెటిల్ అయింది. ఉద్యోగం కనక పొడిగిస్తే అప్పుడు మరోసారి చూసుకోవచ్చు. ఒక్కడే కనక చిన్న ఇల్లో మరోటో దొరుకుతుంది. చుట్టూ ఎవరేనా మన ఇండియన్స్ ఉన్నా లేకపోయనా మన దూరపు చుట్టం అనబడే ఓ వాల్ మార్టూ, ఓ టార్గెట్ షాపూ ఉంటాయి ఎలాగానూ. బెండకాయ, దొండకాయలు దొరక్కపోయినా ఓ కాబేజీ, కాలీఫ్లవర్ దొరకవా? కొన్నివారాలకోసారి వెనక్కి వచ్చి బియ్యం పప్పు ఉప్పూ తీసుకెళ్ళవచ్చు. అయినా ఆరు నెలలంటే ఎంత, ఇట్టే గడిచిపోవూ? అలా మొత్తానికి మనోహర్ జాక్సన్ ప్రయాణమయ్యేడు.
ఆరునెలలే అనుకున్న ఉద్యోగం ఆరేసి నెలలకోసారి పెంచబడుతూ మరో మూడేళ్ళు గడిచాక మనోహర్ కి ఒక్కడే ఉండడం; ఈయన పరిస్థితి చూసాక సంధ్యకీ అదే అలవాటైంది. ఒకరినొకరు విడిచి ఉండలేమనుకున్న పతీ, పత్నీలు ఇప్పుడు హాయిగా ఉన్నారు. మనోహర్ కూతురు డిగ్రీ సంపాదించి ఏదో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం, దానితో వచ్చే జీతం చేతిలో పడగానే మరో నాలుగు నెలకి ఆవిడ మటుక్కి ఆవిడే ఎంచుకున్న కుర్రాడితో వెనక్కి వచ్చేసరికి మనోహర్ కీ సంధ్యకీ మొదట్లో ఏం చేయాలో తోచలేదు. అయితే ఉద్యోగం చేసే కూతురితో వాదోపవాదాలు దేనికి దారితీస్తాయో తెలుసు కనక గుళ్ళో పెళ్ళి చేయించి ఇద్దరికీ అక్షింతలు వేసి చేతులు దులుపుకున్నారు.
* * *

జాక్సన్ వెళ్ళిపోయిన మనోహర్ సంధ్యని ఉద్యోగం వదిలేసి తనకూడా రమ్మని అడగడం మొదలు పెట్టాడు. జాక్సన్ పల్లెటూరు లాంటిది కనక ఇళ్ళు చవక. సంధ్య తన డాక్టర్ ప్రాక్టీస్ పెట్టవచ్చు. ఒంటరితనం అలవాటైపోయిన పతీ పత్నీ ఇప్పుడు నేను ఎందుకు రావాలంటే, నువ్వెందుకు రావని వాదించుకోవడం మొదలెట్టారు. సంధ్య తెగేసి చెప్పిన మాట “మీ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు? ఇక్కడ ప్రాక్టీస్ లో నాకు మంచి జీతం వస్తోంది. మీ ఉద్యోగం వదిలేసి వస్తే ఇంట్లో పని చేసుకోవచ్చు. ఈ లోపుల నాకు ఉన్న చోట పార్ట్ నర్ షిప్ ఇస్తానని ఆఫర్ ఉంది. ఇక్కడే ఉండొచ్చు.” మనోహర్ తోక ముడిచేడు.
ఆ వాదోపవాదాలయ్యేక కూతురోచోటా, తల్లీ తండ్రీ మరోచోటా ఈ తతంగం ఇలా సాగుతుంటే మరో రెండేళ్ళు గడిచాయి. చేతిలో గలగల్లాడే డబ్బుల్తో మనోహర్ ఇప్పుడు హైద్రాబాద్ లో ఓ అపార్ట్ మెంట్ కొన్నాడు – తాము అమెరికా నుంచి ఇండియాకి వెనక్కి వెళ్తారా లేదా అనేది అటుంచితే, అసలు వెళ్ళిపోయే రోజొస్తే పనికొస్తుంది కదా? అప్పుడోసారీ ఇప్పుడోసారీ హైద్రాబాద్ వెళ్ళి ఆ ఇంట్లో వారం పదిరోజులుండడం, తాళాలు పెట్టి వెనక్కిరావడం.
అటువంటి ఇండియా ట్రిప్పులో మనోహర్ కధంతా ఓ స్నేహితుడు బయటకి కూపీలాగేడు. మొత్తానికి ఓ మందు బాటిల్, రెండు ప్లేట్ల చికెన్ కడుపులోకి వెళ్ళాక మాట ముద్దగా వస్తూంటే, “మనోహర్ అయితే నీకు సంసార సుఖం లేదా?” తెగించి అడిగేసాడు స్నేహితుడు.
“జగమే మాయ, బ్రతుకే మాయ….ఇంకెక్కడి సంసారం నాయినా?” మనోహర్ చెప్పేడు.
“మరెప్పుడైనా తోడు కావాలిస్తే?”

“కావాలిస్తే మొదట్లో ప్రతీవారం రెండు వారాలకని జాక్సన్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్ళేవాణ్ణి. ఇప్పుడైతే రెండేసి నెలలకోసారి వెళ్తే వెళ్తా; అదీ మొదట్లో ఫోన్ చేసి మరీను. లేకపోతే తీరా అంతదూరం వెళ్ళాక మేడం గారికి అర్జెంట్ కేసు వచ్చినా, మడి వచ్చినా అంతే సంగతులు” వెర్రినవ్వు నవ్వేడు మనోహర్.
“ఇక్కడ మన హైద్రాబాద్ లో మనకో తెలిసినావిడ ఉంది. కావాలిస్తే చెప్పు మరి. రెండ్రోజులు సరదాగా గడిపేసి వెళ్ళిపోవచ్చు. ఏ బాదరబందీ లేదు. ఎవరూ కేస్ పెట్టరు; ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేయరు.”
“ఏమిటీ? ఇది వ్యభిచారం కింద రాదా?” మత్తు దిగిపోయిన మనోహర్ నిటారుగా కూర్చుంటూ అడిగేడు.
“తప్పు తమ్ముడూ, ఇది అవసరం. వ్యభిచారం అనేది పెద్ద మాట. ఈవిడ నీ అవసరం బట్టి నీ దగ్గిరకొస్తారు. గర్ల్ ఫ్రెండ్ అనుకో. అందరి దగ్గిరకీ వెళ్ళేది కాదు. పెళ్ళి అయినా విడాకులు తీసుకున్నారు. పిల్లలనే బాదరబందీలేదు. నీకూ సంధ్యకి రేప్పొద్దున్న విడాకులొస్తే ఈవిణ్ణి చూడు. నీ కిష్టం లేకపోతే వద్దులే.”
స్నేహితుడు పడుకున్నాక నిద్ర పట్టక ఓ గంట ఆలోచించేడు మనోహర్. అసలు తాను ఇక్కడ మరో ఆవిడతో అలా ఉండొచ్చా? ఎవరైనా చూస్తే? సంధ్యకి తెలిస్తే? ఆలోచించే కొద్దీ తాను చేసే పని రైటే అనిపించడం మొదలైంది మనోహర్ కి. అలా సరోజ గారితో కలిసిన స్నేహం నెల నెల ప్రవర్ధమానం అయింది – దిన దిన ప్రవర్ధమానానికి ఈయన అమెరికాలో ఆవిడ హైద్రాబాదులోనూ ఉండి కుదరకపోవడం వల్ల.
* * *

అనేకానేక ఇండియా ట్రిప్పులూ మరో రెండేళ్ళూ గడిచేక, హైద్రాబాద్ ఔరత్ గారితో బోరు కొట్టడం మొదలౌతూంటే, ఓ రోజు దిలాసాగా సంధ్యని కలవడానికి డ్రైవ్ చేసుకుంటూ విచిటా బయల్దేరాడు మనోహర్. దారి అంతా ఒకటే ఆలోచన, ఈ సారైనా సంధ్యని తనతో వచ్చేయమని చెప్పాల్సిందే. ఈ హైద్రాబాద్ ఔరత్ గార్కి తిలోదకాలిచ్చేసి, అంటుకున్న మురికి కడిగేసుకుని మళ్ళీ దారిలో పడొచ్చు. ఇంట్లోకి వస్తూనే చెప్పేడు మనోహర్ సంధ్యతో, “ఈ సారి ఎలాగైనా మనం ఇంక జాక్సన్ వెళ్ళిపోదాం. నీకు అక్కడ ప్రాక్టీస్ బాగానే ఉంటుంది. నాకూ మరో అయిదారేళ్ళు ఉద్యోగం ఉండొచ్చని చెప్తున్నారు. ఇక్కడెందుకు ఉండడం?”
“నాకో నెల రోజులు కావాలి మా బాస్ తో మాట్లాడ్డానికి. ఆయన యూరప్ ట్రిప్పులో ఉన్నాడు. ఒక డాక్టర్ కొత్తగా చేరాడు. ఇల్లు అమ్మడం గురించి చూడాలి కదా? అది రెండు మూడు నెలలు పట్టదూ?”
“అయితే ఇప్పుడే ఏజెంట్ తో మాట్లాడి ఇల్లు అమ్మకానికి పెడదాం. అది అమ్ముడయ్యేలోపు నీకు నెల టైమ్ సరిపోతుంది. సరేనా?” సంతోషంగా అడిగేడు మనోహర్ సంధ్య దగ్గిరకి వచ్చి మీద చేయి వేయబోతూ.
“దూరం, దూరం ఇప్పుడు మడి,” పక్కకి తప్పుకుంది సంధ్య.
* * *

మర్నాటి నుంచి ఇంటికి ఉన్న చిన్న చిన్న రిపేర్లు చేయించడం, ఇల్లు అమ్మకానికి పెట్టడం అయ్యేక మనోహర్ వెనక్కి జాక్సన్ వచ్చేసాడు. నెలన్నర తర్వాత ఓ రోజు సంధ్యతో మాట్లాడుతూంటే ఆవిడే చెప్పింది ఫోన్ మీద, “ఓ బేరం వచ్చింది ఇంటికి. అయితే పదివేలు తగ్గించి అడుగుతున్నారు. ఇస్తామంటే పదిరోజుల్లో క్లోజింగ్ అవీ అయిపోతాయి అంటున్నారు.”
“పది రోజులూ, పదివేలా? ఆగాగు, పదిరోజుల్లో మరి నాకు అక్కడకి రావడం కుదరదు. ఆఫీసులో పని వల్ల. ఈ ఇల్లు అమ్మకం కాయితాలు అవీ శని ఆదివారాల్లో కుదరకపోవచ్చు. ఇంతకీ అవతల ఇల్లు కొనే పార్టీ నమ్మకమైనదేనా?”
“ఏజెంట్ చెప్పాడు నమ్మకమైందే అని.”
“సరే మీ బాస్ ఏమన్నాడు ఉద్యోగం మానేస్తే ఫర్వాలేదా?”
“కొంచెం కోపం వచ్చింది. కొత్తగా జేరాడని చెప్పిన డాక్టర్ కూడా కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు డాక్టర్లు ఒకసారి వెళ్ళిపోతే ఎలాగా అని ఏడుపు.”
“సరే అయితే. ఉన్నంతలో ఈ ఇంటి బేరం మంచిదిలా ఉంది. ఏం చేద్దాం?”
“క్లోజింగ్ అయ్యే రోజుకి రావడం కుదరదు అన్నారు కనక ఏం చేయాలో ఏజెంట్ ని అడుగుతా సంతకాలకీ దానికీను.”
“పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇవ్వొచ్చు. నేను నీ పేరు మీద ఇస్తాను. అంటే నువ్వు సంతకాలు పెడితే నేను పెట్టినట్టే అని చూసి అన్నీ ఫైనలైజ్ చేస్తారు.”
“సరే అయితే ఆ కాయితాలు పంపించండి ముందు. నేను ఏజెంట్ కి ఫోన్ చేసి ఇంటికి వచ్చిన ఆఫర్ తీసుకుంటామని చెప్తా. కావాలిస్తే ఏజెంట్ తో మాట్లాడండి. గుడ్ నైట్.”
* * *

మర్నాడు ఏజెంట్ కి ఫోన్ చేసి అన్నీ మాట్లాడేక, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్లన్నీ సంధ్యకి పంపించాడు. క్లోజింగ్ కి ఓ వారం ముందు వెళ్ళి తన దగ్గిరున్న ఇంటి డూప్లికేట్ తాళాలు సంధ్యకి ఇచ్చేసి తనకి సరుకులన్నీ సూట్ కేసుల్లో తెచ్చుకున్నాడు. మిగిలినవి ఎక్కడివక్కడపోగా సంధ్య సరుకులు, బట్టలూ నగలూ వగైరా మిగిలాయి. మొత్తానికి దరిద్రం వదులుతోంది.
ఆదివారం జాక్సన్ వచ్చేస్తూంటే సంధ్య చెప్పింది గుమ్మం దగ్గిర, “ఈ ఇంట్లో ఇదే మీ ఆఖరి రోజు. క్లోజింగ్ అయ్యేక నేను ఫోన్ చేసి చెప్తాను. టా, టా.”
మనోహర్ బండి ముందుకి పోనిచ్చాడు.
మంగళవారం క్లోజింగ్ అయ్యేక మరోసారి ఫోన్ – అన్నీ సరిగ్గా జరిగినట్టూ, ఇచ్చిన డబ్బుల ప్రకారం తమకి కొన్నప్పటికంటే డబ్బై వేలు లాభం వచ్చినట్టూ. ఇంక మిగిలినది, తాను శుక్రవారం వెళ్ళి సంధ్యని తీసుకొచ్చేయడమే.
బుధ గురువారాల్లో మనోహర్ సంధ్యకి అనేకానేక సార్లు ఫోన్ చేసాడు కానీ ఎప్పుడు ఒకటే సమాధానం, “పనెక్కువగా ఉంది, నేనే మళ్ళీ చేస్తా’ అంటూ. ఉద్యోగం వదిలేసేటప్పుడు చివరి రోజుల్లో ఇవన్నీ మామూలే కదా అని మనోహర్ మరీ మరీ ఫోన్ చేయలేదు. వారం అంతా అసహనంగా కూర్చొని ఆఫీసు పని కానిచ్చాక, మనోహర్ బండి ని హైవే మీదకి పోనిచ్చాడు శుక్రవారం మధ్యాహ్నం
* * *

అర్ధరాత్రి విచిటా చేరిన మనోహర్ ఇంటి డ్రైవ్ వే లో కారు పార్క్ చేసి కాలింగ్ బెల్ నొక్కేడు. ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. పావు గంట నొక్కినా ఎవరూ తీయకపోయేసరికి కాస్త అనుమానం. సంధ్యకి కానీ కార్ ఏక్సిడెంట్ లాంటిదేమీ కాలేదు కదా? మరో అరగంట అక్కడే గడిపాక ఏం చేయాలో తెలియక వెనక్కి కార్ దగ్గిరకొచ్చి ఆలోచనల్తో అక్కడే మరో అరగంట గడిపేడు. ఎవరికి ఫోన్ చేయాలన్నా అర్ధరాత్రి ఎవరు ఏం మాట్లాడతారో అనే సందేహం.
ఫోన్ తీసి సంధ్యకి మరోసారి ఫోన్ చేసాడు. అదే మెసేజ్, “ఇప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉంది, మళ్ళీ చేస్తాను’ అంటూ. దాదాపు తెల్లవారు ఝామున రెండు గంటల దాకా చూసి ఇంటి తాళాలు ఎలాగా తన దగ్గిర లేవు కనక ఊళ్ళోనే తమకి తెలుసున్న సాటి తెలుగువారింటికి ఫోన్ చేసాడు. తనకి బుద్ధిలేక గానీ అర్ధరాత్రి ఎవరెత్తుతారు ఫోన్? అలా ఓ అరగంట కిందా మీదా పడ్డాక ఒకాయన ఫోన్ ఎత్తేడు.
“నమస్కారమండి. ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి చంపుతున్నానని ఏమనుకోకండేం?”
“ఏం ఫర్వాలేదండి. శుక్రవారం కదా, మేమింకా పడుకోలేదు. సినిమా చూస్తున్నాం; బాగున్నారా? ఏంటి సంగతి?”
“నేను ఓ గంట క్రితం వచ్చాను సంధ్యని వెనక్కి జాక్సన్ తీసుకెళ్ళాలని ఈ వారాంతంలో. ఇంట్లో ఏమీ అలికిడి లేదు. బయటకి ఎక్కడకైనా వెళ్ళిందో, ఫ్రెండ్స్ ఇంటిక్కానీ వెళ్ళిందో కనుక్కుందామని ఫోన్ చేసాను మీకు.”
“అబ్బే మా ఇంటికి రాలేదే? మరో స్నేహితుల ఇంటిక్కానీ వెళ్ళి ఉంటుందా? మీరెక్కడున్నారు ఇప్పుడు? ఇంటి తాళాలు ఉన్నాయా?”
“తెలియదండి. తెలుసున్న అందరికీ ఫోన్ చేసాను. మంగళవారం ఇల్లు అమ్మేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కనక నా తాళాలు సంధ్యకే ఇచ్చాను.”
“ఫోన్ పోయిందేమో? మీ దగ్గిర తాళాలు లేవంటున్నారు కదా, రాత్రికి మా ఇంటికి వచ్చేయండి. రాత్రి ఒక్కరూ కార్లో ఏం చేస్తారు?”
“సరే ఓ అరగంటలో వస్తాను. ఏమనుకోరు కదా?”
“ఏమీ ప్రోబ్లెం లేదు. ఇందులో అనుకోవడానికేమీ లేదు. చూస్తూ ఉంటాం. రండి”
స్నేహితుల ఇంటికి చేరాక వాళ్ళడిగిన వాటికి సమాధానం చెప్పి పడుకున్నాడన్నమాటే గానీ బుర్ర పనిచేయడం మానేసి చాలాసేపయింది మనోహర్ కి. కాస్త నిద్ర పట్టినా ఏడింటికి లేచి కూర్చుని మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఒక్కోసారి సంధ్య శనివారం పేషెంట్స్ ని చూడ్డానికి వెళ్తూ ఉండేదని గుర్తు రాగానే ఫోన్ చేసాడు. ఆన్సరింగ్ మెషీన్ లో సమాధానం వచ్చింది, “ఈ రోజు శనివారం మా ఆఫీసు మధ్యాహ్నం పన్నెండు నుంచి అయిదు దాకా తీసి ఉంటుంది. అపాయింట్ మెంట్ లేకపోయినా ఖాళీ ఉంటే డాక్టర్ మిమ్మల్ని చూడగలరు. అందువల్ల నేరుగా ఆఫీసుకి రావొచ్చు. హావ్ ఎ గ్రేట్ వీకెండ్.”
ఇంటాయనతో ఏవో కబుర్లూ మరో కొంతమందికి ఫోన్లూ కొట్టి సంధ్య ఆఫీసుకి చేరాడు ఇంకా తెరిచినట్టు లేదు; కాసేపు ఆగేక మొదట గా వచ్చిన ఇద్దరు నర్సులూ ఆఫీసు తలుపులు తీస్తూంటే వెళ్ళి పలకిరింఛాడు ఒకావిడని గుమ్మం దగ్గిరే. రెండో నర్స్ లోపలకి వెళ్ళింది.
“హాయ్, నేను డాక్టర్ సంధ్య గారి హస్బండ్ ని….”
“ఓ, చాలాకాలం అయింది మిమ్మల్ని చూసి ఏమిటిలా వచ్చారు?”
“నేను నిన్న రాత్రి వచ్చాను. సంధ్య ఇంట్లో లేదు. అసలు లైట్లే లేవు. తనకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఒకటే సమాధానం వస్తోంది. సంధ్య ఎక్కడుందో మీకు తెలుస్తుందేమోనని….”
“ఓ మై గుడ్ నెస్, మాకు తెలియదండి. ఆవిడ ఆఖరి రోజు గురువారం. ఎంతో మంచి డాక్టర్. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవారు.”
“సంధ్య బాగానే ఉందా అసలు?”
“అదేమిటలా అడుగుతున్నారు?”
“సంధ్యకి ఏక్సిడెంట్ గానీ అయిందో, ఎవరైనా ఎటాక్ చేసారేమో అనుకున్నాను, అసలెలా ఉంది ఎక్కడుందో చెప్పగలరా?”
“జీసస్! సారీ ఆగండి, మేరీ తో ఏదైనా చెప్పారేమో కనుక్కుంటా. హావ్ ఎ సీట్.”
“మేరీ, డాక్టర్ శుక్రవారం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా చెప్పారా? ఈయన డాక్టర్ గారి వాళ్ళాయన. ఆవిడ ఇంట్లో లేరుట. మనకేమైనా తెలుసేమో అని ఇక్కడకి వచ్చారు.”
“ఓ ష్యూర్, వెళ్ళేటప్పుడు ఓ కవర్ ఇచ్చారు. ఆవిడ హస్బెండ్ ఇక్కడకి వస్తే ఈ కవర్ ఇవ్వమనీ చెప్పారు. గురించి మిగతా విషయాలు ఏవీ తెలియవు. ”
“సంధ్య గురించి మీకేం తెల్సినా కాస్త ఈ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పగలరా?”
“మాకు తెలిస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాం.”
* * *

బయటకొచ్చిన మనోహర్ కార్లో కూచుని కవర్ విప్పాడు అందులో ఉండేవి ఇంటికి సంబంధించిన కాయితాలు కాబోలనుకుంటూ. తెల్ల కాయితం మీద స్వహస్తాలతో రాసిన ఉత్తరం కనబడితే చదవడం మొదలుపెట్టాడు, కొంచెం ఆశ్చర్యంతో.
“మనోహర్, నేను మిమ్మల్ని ఇండియాలో పెళ్ళి చేసుకున్నాను. మీకు ఉద్యోగం లేకపోయినా ఇక్కడే ఊళ్ళో ఉండమంటే దూరంగా జాక్సన్ లో ఉద్యోగం వచ్చిందనీ నన్నే అన్నీ విడిచి వచ్చేయమనీ అన్నారు. ఈ ఊళ్ళో ఉన్న నా ప్రాక్టీస్ అక్కడ ఉండదు. నాకు ఇక్కడ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. అయినా అలా ఇస్తారని ముందునుంచీ అనుకుంటున్నదే కదా? అమ్మాయి చదువూ, పెళ్ళి బాధ్యతలు తీరిపోగానే ఏదో ఒకటి ఆలోచిద్దామనుకునేలోపుల మీరు హైద్రాబాద్ లో వెలిగించిన రాచకార్యాలు ఆ తర్వాత ఆవిడతో ఎన్ని సార్లు గడిపారో నాకు తెలిసి వచ్చాయి. మన పెళ్ళి పెటాకులు చేయడానికి మీకు పదిరోజులు చాలినట్టున్నాయి. మీకు బుద్ధి చెప్పడానికి మాతో కొత్తగా చేరాడని చెప్పిన డాక్టర్, నేనూ కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాం. మాకు మనసులు కలిశాయని చెప్పక్కర్లేదనుకుంటా. ఇంతకాలం ఉన్న ఇల్లు అమ్మేసిన డబ్బులు నేనే తీసుకుంటున్నా. మీకు ఆ హైద్రాబాద్ ఆవిడకీ నేను తాంబూలాలు ఇచ్చేసాను. వీలుంటే, లేకపోతే నాకు ఇష్టం వచ్చినప్పుడు డైవోర్స్ కాయితాలు పంపిస్తా. ఊరికినే పోలీస్ రిపోర్ట్ లూ లాయర్లూ అంటూ తిరగితే, నేను మైనర్ ని కాదు, దానివల్ల ఎవరికి నష్టమో నేను చెప్పక్కర్లేదు. ఇండియా మా పుట్టింట్లో అందరికీ, మీరు వెలిగించిన రాచకార్యాలూ, నేను ఇలా వెళ్ళిపోతున్న విషయం పూర్తిగా తెలుసు. వెళ్ళి అక్కడ ఏడిస్తే మిమ్మల్ని ఎముకలు విరిగేలా తన్నవచ్చు. ఇది మీరు చదువుతున్న సమయానికి – బహుశః శనివారం – నేను పారిస్ లో మా కొత్త ఆయనతో సంతోషంగా ఈఫిల్ టవర్ దగ్గిరుంటా. టా.. టా..”

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked