సారస్వతం

భక్తి వ్యసనంగా మారకూడదు!

(కార్టూన్ సౌజన్యం –మిత్రుడు శ్రీ రామకృష్ణ గారు)

-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

​నాకొక మిత్రుడున్నాడు.నా కన్నా వయసులో చాలా చిన్నవాడే!24 గంటలూ భక్తి టీవీ చూస్తుంటాడు.అన్ని భక్తి కార్యక్రమాలకు వెళ్లుతాడు. వివిధ యాత్రాస్ధలాలు చూస్తుంటాడు. కుటుంబం కోసం కన్నా ఎక్కువ కాలాన్ని భక్తి కార్యక్రమాలకు కేటాయిస్తాడు. అడ్డూ, అదుపు లేకుండా ధనాన్ని భక్తి కార్యక్రమాలకోసమే విపరీతంగా ఖర్చు చేస్తాడు.ఎన్నో గ్రంధాలను కొంటాడు.నిజానికి అతనొక మధ్యతరగతి కుటుంబీకుడు. పైకి రావలసిన పిల్లలున్నారు.కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోతున్నాడేమోననిపిస్తుంది!ఒక్కొక్కసారి తాదాత్మ్యం చెంది ,”నాకు శివుడిలో లీనం కావాలనిపిస్తుందని అంటాడు!శివైక్యం చెందని జీవితం వృధా” అని అంటాడు. నిజం చెబితే బాధపడుతారేమో కానీ ఇవన్నీ histrionic లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది స్త్త్రీలు ఒక రకమైన ఉద్వేగానికి లోనౌతుంటారు. ఏ జీవి అయినా భగవంతుడు తనకు ఇచ్చిన మెమొరాండంను పూర్తి చేసుకున్న తర్వాతే శివైక్యం చెందుతాడు . ఇది అన్ని జీవరాశులకు వర్తిస్తుంది. ఒక్క భక్తులకే ఇది పరిమితం కాదు.నా దృష్టిలో అన్నిటిలోకి కష్టమైంది భక్తి యోగమే!Bhakti is not that much easy to adopt!శ్రీనారదమహర్షి భక్తి సూత్రాలకు ఒక manual of instructions వ్రాసారు.అదే నారద భక్తి సూత్రాలుగా ప్రసిద్ధి చెందింది.ఇప్పుడు మనం అనుకుంటున్నది భక్తి కాదు.దేవుడితో వ్యాపారం!నారద భక్తి సూత్రాలను గురించి మరొకసారి విపులంగా తెలియచేస్తాను. శంకర భగవత్పాదులుఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే”(మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది). భక్తికి exhibition అవసరం లేదు. అనవసరమైన ఆడంబరాలు భక్తిని దూరం చేస్తాయి. మనం చేసే అన్ని పనులను ఆ సర్వేశ్వరుడు చూస్తూనే ఉంటాడు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ధ్వజస్తంభానికి పొర్లుదండాలు పెడితే ,మనం చేసే తప్పులు మాసిపోతాయని అనుకోవటం ఒట్టి భ్రమ!ఇటువంటి వారిని గురించి వేమన ఇలా అన్నాడు, “అంతరంగమందు అపరాధములు చేసి/ మంచివాని వలెనె మనుజుడుండు!/ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా!!/ విశ్వదాభిరామ! వినుర వేమ!!” మనకు నిర్దేశించిన బాధ్యతలను వదిలేసి,దేవాలయాల చుట్టూ తిరిగితే దైవం కూడా అంగీకరించదు. పిల్లలకు తండ్రిగా,భార్యకు భర్తగా, తల్లితండ్రులకు కొడుకుగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే, అటువంటి భక్తి వలన భుక్తికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది.ఏవో పురాణాలలోని కధలను తీసుకొని అనవసరమైన విధానాలను యోచించకుండా ఆచరిస్తే, తర్వాత కాలంలో యాచించవలసి వస్తుంది.భక్తి వ్యసనంగా మారితే, రామదాసు కథే జరుగుతుంది.రామదాసు భక్తి (?)ఎక్కువై ప్రభుత్వ ధనాన్ని రామాలయం నిర్మించటానికి పూనుకున్నాడు. ఫలితంగా అతనికి రామదర్శనం కలుగలేదు.కారణం అతను అక్రమమైన ధనాన్ని దేవాలయ నిర్మాణానికి ఖర్చు చేయటమే కారణం!తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి, రామదాసును బందీగా చేసిన తానీషాకు రామదర్శనం అయింది.అలా కాకుండా రామదాసుకే రామదర్శనం అయితే మన జేబుల్లో డబ్బులు కొట్టేసి కూడా దేవుడి హుండీల్లో వేస్తుండేవారు. అనైతిక పనులు ద్వారా సత్య దర్శనం కలుగదు.ఏదీ ఒక స్థాయిని మించి ఉండకూడదు,ఆఖరికి భక్తితో సహా!అలనాటి ప్రఖ్యాత నటుడు నాగయ్య గారు విచక్షణ లేకుండా దానధర్మాలు చేసి, జీవిత చరమాంకంలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి ఒక అనాధగా మరణించాడు.పరిధులు దాటితే భక్తితో సహా అన్నీ వ్యసనాలుగా మారుతాయి అనే సందేశం నాగయ్య గారి జీవితం మనకు ఇచ్చింది.మొదట్లో రచన నాకొక వ్యాపకం. తర్వాతి రోజుల్లో అదొక వ్యాసంగంగా మారింది.

రోజూ ఏదో ఒకటి వ్రాయంది నాకు నిద్రపట్టదు. అంటే ఈ వ్యాసంగం ఒక వ్యసనంగా మారుతుందేమో అనిపిస్తుంది.వ్యసనంగా అది మారకుండా జాగ్రత్త పడాలి!మీరు ఒప్పుకోరేమో కానీ రోజూ సాయంత్రం 6 గంటలకు అన్ని బాధ్యతలను వదిలేసి ప్రార్ధన చేసేవాడికి, రోజూ అదే సమయానికి మందు కొట్టేవాడికి పెద్దగా తేడా లేదు నా ఉద్దేశ్యంలో!రెండూ ఒకటే!రెండూ వ్యసనాలే!ఏపనైతే మనం నిత్యం చేయకుండా ఉండలేమో, చేయకుండా బతకలేమో అది వ్యసనమే!వ్యసనపరులు తమ జీవితాలను పాడు చేసుకోవటమే కాదు, నమ్మిన వారిని నట్టేట ముంచుతారు కూడా! సహజంగా ఉండి, సహజంగా జీవించటమే చాలా గొప్ప కర్తవ్యం. ధర్మవ్యాధుడి కధలోని ఆ సాధారణ ఇల్లాలు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ,ఏ యోగం, యాగం చేయకుండా సహజంగా జీవించిన ఆమెకు తనకు తెలియకుండానే ఎన్నో మహిమలు వచ్చాయి. సహజంగా జీవించటాన్ని మించిన భక్తి ఏదీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

4 Comments on భక్తి వ్యసనంగా మారకూడదు!

కాంతారావు ఎం.ఎల్. said : Guest 8 years ago

సంసార బాధ్యతలను విడిచిపెట్టి నిరంతరం ఎదో ఒక జపం లేదా పూజలూ చేసేవాళ్ళను చూసాను. ఇది వ్యసనమే. బాధ్యతలను విస్మరించి చేసే ఏ పనైనా సరే అది వ్యర్ధమే.

వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి said : Guest 8 years ago

భుక్తి కోసం భక్తిని వృత్తిగా ఎంచుకున్నవాళ్ల సంఖ్యే ఎక్కువ. వారే భక్తిని ఒక వ్యసనంగా మార్చి పబ్బం గడుపుకుంటున్నారు. పిచ్చి భక్తులు అమాయక గొర్రెల్లా ఆ కసాయిల మాటలు నమ్ముతుంటారు..

  • Tirupati
VYAASA MURTHY said : Guest 8 years ago

చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు

  • హైద్రాబాద్
విజయలక్ష్మి said : Guest 8 years ago

ANOTHER EXCELLENT ARTICLE BY SARADA PRASAD.CONGRATULATIONS

  • GUNTUR