కథా భారతి

భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)

రచన: ఇర్షాద్ జేమ్స్

జగన్ పూర్తి పేరు జంబలకిడి జగన్మోహన రావు. జగన్ ఆమెరికా వచ్చి Jag అని పేరు మార్చుకున్నాడు, పిలవటానికి సులువుగా వుండటానికి.
జగన్‌కి ముప్పై యేళ్ళుంటాయి. కాని ఇంకా పెళ్ళి కాలేదు. జగన్ ఎప్పుడు ఇండియాకి ఫోన్ చెసినా, వాళ్ళమ్మ, నాన్న, “ఒరేయ్, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా?” అని అడుగుతూంటారు. “నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా !!” అంటాడు జగన్. కాని ఈసారి ఇండియాకి ఫోన్ చేసినప్పుడు జగన్ వాళ్ళ నాన్న ఒక కొత్త డైలాగు వేసాడు. “ఒరేయ్, త్వరగా పెళ్ళి చేసుకోరా, మేము ముసలివాళ్ళమైపొతున్నాము”, అన్నాడు జగన్ వాళ్ళ నాన్న.
“నేను పెళ్ళి చేసుకుంటే మీరు ముసలివాళ్ళవటం మానేస్తారా?” అని మనసులొ అనుకున్నాడు జగన్. కాని బయటకి మాత్రం, “నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్నా !!” అని పాత డైలాగే వేసాడు జగన్. ఈసారి జగన్ వాళ్ళమ్మ కొత్త డైలాగు వేసింది.
“ఒరేయ్, మా సంగతి పక్కన పెట్టు. నువ్వు కూడా ముసలి వాడివయిపోతున్నావు !!” అంది జగన్ వాళ్ళమ్మ.
“ఓ, నో !!! ఇది కరక్టే…”, అని మనసులొ అనుకున్నాడు జగన్. కాని, బయటకి మాత్రం, “నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా”, అన్నాడు.
“ఎందుకొద్దూ? నీ ఫ్రెండు కుటుంబరావు చూడు, చక్కగా పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకి ఐదుగురు పిల్లలు కూడా!!” చెప్పాడు జగన్ వాళ్ళ నాన్న.
“అవును, కుటుంబరావుది పెద్ద కుటుంబమే…” అని మనసులో అనుకున్నాడు జగన్.

కుటుంబరావు వాళ్ళకి మొదటిసారే ఇద్దరు అబ్బాయిలు (twins) పుట్టారు. ఒక అమ్మాయి కూడా వుంటే బాగుంటుందనుకొని, మళ్ళీ ట్రై చేసారు.
ఈసారి ముగ్గురు అమ్మాయిలు (triplets) పుట్టారు. జగన్ ఒకసారి వాచిలో టైము చూసుకొని, “నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్నా. నేను ఫోను పెట్టేస్తున్నాను. తర్వాత మాట్లడతాను.” అన్నాడు. వెంటనే జగన్ వాళ్ళమ్మ, “ఆగాగు, అప్పుడే పెట్టెయ్యకు, నీకో విషయం చెప్పాలి”, అంది కంగారుగా. “ఏమిటమ్మా?” అడిగాడు జగన్.

“మీ నాన్నగారి ఫ్రెండు అప్పడాల అప్పారావు గారు గుర్తున్నారా? వాళ్ళు చాలా సంవత్సరాలుగా అమెరికాలోనే వుంటున్నారు. వాళ్ళమ్మాయి అప్పడాల అంబాదేవి కూడా మీ టెక్సాస్ లోనే వుందట. మీ ఇద్దరి జోడీ చాలా బాగుంటుందిరా. నీకు ఫొటో పంపించనా?”
“వద్దమ్మా, నేను తర్వాత మాట్లాడతాను”, అని ఫోను డిస్కనెక్ట్ చేసాడు జగన్.

ఆ రోజు సాయంత్రం జగన్ గోల్డ్స్ జిం నుంచి బయటకి వచ్చి, పార్కింగ్ లాట్‌లో తన కారు వైపు నడుస్తూంటే, అతని ఫ్రెండు మల్లిక్ కనిపించాడు.
మల్లిక్ పూర్తి పేరు మాయమాటల మల్లికార్జున రావు.
మల్లిక్ అమెరికా వచ్చి Mack అని పేరు మార్చుకున్నాడు.

“హౌ ఆర్ యూ?” అని పలకరించాడు మల్లిక్.
“సూపర్ గురూ, నువ్వు కూడా గోల్డ్స్ జిం కి మారావా?” అడిగాడు జగన్.
“అవును. ఇంతకు ముందు వేరే జిం కి వెళ్ళేవాడిని. ఇదయితే ఆఫీసుకి దగ్గరని ఇక్కడికి మారాను” చెప్పాడు మల్లిక్.
“ఓ, కూల్, కూల్. హౌ ఈజ్ మేరీడ్ లైఫ్?” అడిగాడు జగన్.
“సో ఫార్, సో గుడ్. మీ పేరెంట్స్ ఎలా వున్నారు?” అడిగాడు మల్లిక్.
“ఆ, బాగానే వున్నారులే”, అన్నాడు జగన్, కొంచెం చిరాకుగా.
“లెట్ మీ గెస్… పెళ్ళి చేసుకోమంటున్నారా?” అడిగాడు మల్లిక్.
“అవును. ఎప్పుడూ అదే గోల.”
“అయితే పెళ్ళి చేసుకోవచ్చుగా?” అని నవ్వాడు మల్లిక్.
“పెళ్ళా? ఎందుకొచ్చిన గొడవరా బాబూ? ఇప్పుడు లైఫ్ ఈజ్ గుడ్. నన్ను ఇలగే వుండనీ.”
“అయితే ఎప్పుడూ పెళ్ళి చేసుకోవా? ఇలాగే వుండిపోతావా?”
“అవును.”
“మరి మీ పేరెంట్స్ ఓకేనా?”
“నా పేరెంట్స్ కోసం నేను పెళ్ళి చేసుకోవాలా?”
“సరే, నీ కోసం అయినా చేసుకో.”
“నేను చిన్నపటినుంచి ఎన్నో ఫ్యామిలీస్‌లో చూసాను. హస్బెండ్, వైఫ్ ఎప్పుడు ఏదో ఒక కారణం వల్ల గొడవ పడుతూంటారు. పెళ్ళి చేసుకొని కొట్టుకొని చావటం కన్నా, సింగిల్‌గా ప్రశాంతంగా వుండటం బెటర్.” చెప్పాడు జగన్.
“పొనీ అరేంజ్డ్ మేరేజ్ కాకుండా, డేటింగ్ చేసి నీకు నచ్చిన అమ్మాయినే చేసుకోవచ్చుగా?”
“పెళ్ళి చేసుకోవటం సులభమే. ఆ తరువాత మొదలవుతాయి కష్టాలు. ఈ మధ్య డివోర్స్ రేట్ చాలా ఎక్కువయిపొయింది. అమెరికాలో, ఇండియాలో కూడా.”
“అయితే సోలో లైఫే సో బెటరు అంటావా?” నవ్వాడు మల్లిక్.
“అవును”, అన్నాడు జగన్.
“ఇప్పుడు సింగిల్‌గా బాగానే వుండొచ్చు. కానీ తరువాత ఓల్డ్ ఏజ్‌లో నీకు ఎవరయినా తోడు వుండాలిగా?” అడిగాడు మల్లిక్.
“ఎప్పుడో ఓల్డ్ ఏజ్‌లో తోడు కోసం ఇప్పటినుంచె కాంప్రమైజ్ అవ్వాలా? అయినా, ఓల్డ్ ఏజ్ లో ఇంకొకరి మీద డిపెండ్ అయి, వాళ్ళని కష్టపెట్టటం కన్నా, యేదైనా సీనియర్ లివింగ్ హోంలో డబ్బులిచ్చి వుండటమే బెటర్.” చెప్పాడు జగన్.
“మరి నీకు పిల్లలు వద్దా?” అడిగాడు మల్లిక్.
“పిల్లలా? ఒక వైపు ప్రపంచ జనాభా పెరిగిపోయి, చాలా దేశాలలో జనం తిండిలేక చస్తూంటే, ఇక్కడ మనం ఇంకా పిల్లల్ని కనాల్సిన అవసరం వుందా?” కోపంగా అడిగాడు జగన్.
“సరే. నీతో వాదించటం కష్టం. యూ ఆర్ ఫ్రీ టు డూ వాటెవర్ యూ వాంట్ !!” చెప్పాడు మల్లిక్, తన కారు డోరు తెరుస్తూ.
“కరెక్ట్. పెల్లి చేసుకుంటే ఆ ఫ్రీడం పోతుంది. టాక్ టు యూ లేటర్. నేను రేపు పొద్దున్నే సాన్ ఆంటోనియో వెళ్ళాలి. ఒక కాన్‌ఫరెన్స్ వుంది”, అని తన కారు వైపు నడిచాడు జగన్.

ఆ మరుసటి రోజు పొద్దున్నే జగన్ ఆస్టిన్ నుంచి గంటన్నర డ్రైవ్ చేసి, సాన్ ఆంటోనియో చేరుకున్నాడు.
రివర్ వాక్ పక్కన వున్న హిల్టన్ హోటెల్ లో ఆరోజు ఒక టెక్నాలజీ కాన్‌ఫరెన్స్ వుంది.
కాన్‌ఫరెన్స్ లో మార్నింగ్ సెషన్ అయిన తరువాత, లంచ్ బ్రేక్ మొదలయింది.
జగన్ బయటకి వచ్చి, సాండ్‌విచ్ తిని, కాఫీ తాగుతూ కూర్చున్నాడు, తన సెల్ ఫోన్‌లో మెసేజెస్ చూసుకుంటూ.

“ఎక్స్‌క్యూజ్ మీ, ఈజ్ దిస్ సీట్ టేకెన్?” అని అడిగింది ఒక ఆమె వచ్చి.
“నో, ప్లీజ్ హేవ్ ఎ సీట్”, అన్నాడు జగన్.
“థేంక్ యూ సో మచ్” అని కూర్చుంది ఆమె.

ఆమెని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది జగన్‌కి.

“మై నేం ఈజ్ జగన్. అయాం హియర్ టు అటెండ్ ది ఇంటర్నెట్ సెక్యూరిటీ సెషన్” అన్నాడు జగన్.
“మై నేం ఈజ్ ఏమీ”, అంది ఆమె.
“విచ్ సెషన్ ఆర్ యూ అటెండింగ్?” అడిగాడు జగన్.

ఇంతలో ఏమీ ఫోన్ మ్రోగింది.

“వన్ సెకండ్ ప్లీజ్…”, అని ఫోన్ అందుకుంది ఏమీ.
“నేను సాన్ ఆంటోనియోలో వున్నాను. తరువాత మాట్లాడతాను”, అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఏమీ.
“ఓ, మీరు తెలుగు మాట్లాడతారా?” ఆశ్చర్యంగా అడిగాడు జగన్.
“అవును. నేను చిన్నప్పుడే మా పేరెంట్స్ వైజాగ్ నుంచి అమెరికా వచ్చారు”, నవ్వుతూ అంది ఏమీ.
“ఓ… నైస్” అన్నాడు జగన్.

ఇంతలో ఏమీ ఫోన్ మళ్ళీ మ్రోగింది.
“సారీ, వన్ సెకండ్”, అని ఫోన్ అందుకుంది ఏమీ.
“అమ్మా, నేనిప్పుడు బిజీగా వున్నాను. తరువాత ఫోన్ చేస్తాను”, అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఏమీ.
“సారీ, మా అమ్మ” అంది ఏమీ.
“ఇట్స్ ఓకే, ఐ అండర్‌స్టేండ్”, అన్నాడు జగన్.
“యూ డూ?” అని నవ్వింది ఏమీ.
“యెస్, ఏబ్సల్యూట్లీ. మా పేరెంట్స్ కూడా నాకు రోజూ వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తూంటారు. పెళ్ళి చేసుకోమని ఒకటే గోల, ఎప్పుడూ.” అన్నాడు జగన్.
“మీకిష్టం లేదా?” అడిగింది ఏమీ.
“నాటెటాల్ !!” అన్నాడు జగన్.
“మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడూ అదే అడుగుతూంటారు”, చెప్పింది ఏమీ.
“ఓ, అవునా…” అన్నాడు జగన్.
“అవును… ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరీర్. నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకొని, పిల్లల్ని కని, ఒక ఇంట్లో పడి ఉండాలని లేదు. ఒకప్పుడయితే అమ్మాయిలు పెళ్ళి చేసుకొని, ప్రతిదానికి భర్తలపై డెపెండ్ అయి వుండేవారు. ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకొని వుద్యోగాలు చేస్తున్నారు. అసలు పెళ్ళి చేసుకొవలసిన అవసరమే లేదు. ఐ లైక్ టు హేవ్ మై ఫ్రీడం”, చెప్పింది ఏమీ.
“ఏబ్సల్యూట్లీ”, అన్నాడు జగన్, కాఫీ తాగటం మర్చిపోయి ఆశ్చర్యంగా వింటూ.

“మా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను పెళ్ళి చేసుకోమని, ఒక మనవడిని కనమని, అంటూంటారు. ఒక వైపు ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఎంతో మంది అనాధలు వున్నారు. ఐ వుడ్ లైక్ టు అడాప్ట్ ఎ కపుల్ ఆఫ్ ఓర్ఫన్ చిల్‌డ్రెన్. వాళ్ళని చక్కగా పెంచి, మంచి భవిష్యత్తు వుండే అవకాశం కల్పించాలి…” అంది ఏమీ.
“వెరీ వెల్ సెడ్”, అన్నాడు జగన్.

ఇంతలో కాన్‌ఫరెన్స్ రూంలో బెల్ మ్రోగింది. మధ్యాహ్నం సెషన్ మొదలు కాబోతోంది.

“ఓకే, టాక్ టు యూ లేటర్. ఐ హేవ్ టు గో టు మై సెషన్”, అని లేచింది ఏమీ.
“షూర్. బై ద వే, నా పేరు జగన్. నేను ఇప్పుడు ఇంటర్నెట్ సెక్యూరిటీ సెషన్‌కి వెళ్తున్నాను” అని లేచాడు జగన్.
“ఓ, అయాం ది స్పీకర్ ఫర్ ది ఇంటర్నెట్ సెక్యూరిటి సెషన్. అయాం ఏమీ అప్పడాల”, అంది ఏమీ.

కొన్ని రోజుల తరువాత…

జగన్ ఇండియాకి ఫోన్ చేసి, వాళ్ళమ్మతో మాట్లాడుతున్నాడు.

“… అవునమ్మా, బాగానే వున్నాను”, అన్నాడు జగన్.
“అవును… నిన్నొక విషయం అడగాలి. కోప్పడతావేమో…”, అంది జగన్ వాళ్ళమ్మ.
“ఏమిటమ్మా?” అడిగాడు జగన్.
“నీకు చోడవరం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. చాలా మంచి ఫ్యామిలీ. అమ్మాయి చాలా చక్కగా వుంది. నీకు ఫొటో పంపించనా?” అంది అమ్మ.
“వద్దమ్మా” అన్నాడు జగన్.
“ఏం? ఎందుకొద్దూ?” కోపంగా అడిగింది అమ్మ.
“అమ్మా, నాకు ఇక్కడ ఒకమ్మాయి నచ్చింది…”, చెప్పాడు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)

సత్యం mamdapaati said : Guest 2 years ago

మీ కొత్త కథ, 'భిన్నత్వంలో ఏకత్వం' బాగుంది, ఇర్షాద్. సీరియస్ కథా వస్తువు మీద సరదాగా వ్రాసిన కథ.

  • Pflugerville, TX