కథా భారతి

మధురంతో నా ప్రేమ యాత్ర

– భారతీ నాథ్

మధ్యాహ్నపు కునుకులో ఉండగా, హాలులో నుండి మా ఆవిడ మాటలు గట్టిగా వినపడడంతో, లేచి ఏమిటా అని చూశాను.

మా అబ్బాయి, అమ్మాయితో స్కైప్ లో మాట్లాడుతూ, గొడవ పడుతూంది, ఆవిడ. సరే, విషయం ఏమిటా అనుకుంటూ, నాకున్న చిన్నపాటి తలను, ఆ సంభాషణలో, దూర్చాను. కాకినాడ ఇంజనీరింగు కళాశాలలో పదును పెట్టిన తలఅవడం వలన, సులభంగానే, విషయం కూలంకషంగా అర్ధమయ్యింది.

నన్ను మధు మేహ మహమ్మారి పెళ్ళాడి అర్ధ శత దినోత్సవము అయిన తరువాత, ఎంతో కష్టపడి దింపిన చక్కెర నిలవల సూచి, మళ్ళీ, ఒక్కసారిగా బంగారం ధర పెరిగినట్టు పెరిగి పోయిందని, దానికి గల కారణాలను, విశ్లేషిస్తూ, వాళ్ళ ముగ్గురి మధ్య మేధో మధన కార్యక్రమం జరుగుతుంది.

అసలు, ఈ మహమ్మారితో, బహిరంగముగా, పెళ్ళయి 50రోజులే అయినా, ఆమెతో, ఎప్పటినుంచో, అక్రమ సంభంధం పెట్టుకున్నానని, మా ఆవిడ అనుమానం. ఇప్పుడు పరీక్షలు చేయ బట్టి, మీ భాగోతం బయట పడింది, అంటూంది. సగటు మొగుడులాగా, భార్య ఏం చెప్పినా, ఎడ్డెం అంటే తెడ్డెం, అనే రకం వాడినే అయినా, ఈ మాటలలో, నిజం ఉందేమో,అనిపించింది. అసలు, ఈ మహమ్మారితో, నా ప్రేమ వ్యవహారం ఎప్పటిదా, అని ఆలోచించడం మొదలు పెట్టాను. చిన్ననాటి నుండీ, జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకున్నాను.

చిన్నప్పుడు తాగిన తల్లి పాలు, అన్న ప్రాసన రోజున తినిపించిన పాయసం, తరవాత కొంచెం పెద్దయిన తరువాత అమ్మ చేతి వెన్న ముద్దలు, నేతి అన్నం ముద్దలు, ఇంకా పెద్దయిన తరువాత, అమ్మ పెట్టిన బూరెలు, అరిసెలు, కజ్జికాయలు, కోవాబిళ్ళలు, కొబ్బరి ఉండలు, ఇంకెన్నెన్నో, నాన్న హైదరాబాదు నుండి తెచ్చిన పుల్లా రెడ్డీ మిఠాయిలు, అన్నీ మధురాతి మధురమే, కదా. ఆ మధురంలోంచే, మధుమేహంతో, ప్రేమ వ్యవహారం, అప్పుడే, మొదలయ్యిందేమో.

మా తణుకులో, ఆంధ్ర ప్రదేశ్ లోనే , పేద్ద చక్కెర కర్మాగారం ఉంది. ఆ కర్మాగారానికి, చెరుకును చెరుకును తీసుకు వెళుతున్న, ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్ల నుండి చెరుకు గడలు లాగి, తిన్న రోజులు, గుర్తుకు వచ్చాయి. అలా దొంగిలించి తిన్న చెరుకుల తియ్యదనాన్ని మించిన మధురం, జీవితంలో మరేదీ లేదనిపిస్తూంది. ఆ పాత మధురమే, మా ప్రేమకు మలి మెట్టయిందేమో.

పాఠశాల రోజుల్లో, నాకు సైకిల్ తొక్కడం రాదు. ఆది వారాలలో, మిత్రులు, అద్దె సైకిళ్ళపై, విహారానికి వెళ్ళేవారు. నన్ను ఎవరో ఒకరు, వారి సైకిల్ పై తీసుకు వెళ్ళే వారు. అలా, ఒకసారి, ర్యాలీ క్షేత్రానికి, వెళ్ళాలనుకున్నారు. చాలా దూరం కాబట్టి, ఇద్దరు కలిపి ఒక సైకిల్ పై వెళ్ళాలనుకున్నారు. ఒకరు కొంత దూరం తొక్కితే, ఇంకొకరు మరికొంత దూరం తొక్కాలి. అయితే, నా సంగతేమిటని, చర్చ వచ్చింది. సరే, నేను, సైకిల్ తో పాటు, చోదకుడిని, కూడా అద్దెకు తీసుకుని, వారితో వెళ్ళాను.

అలా వెళుతుంటే, దారి మధ్యలో, పచ్చని పంట పొలాల అందాలు, నెలలు నిండిన తల్లుల అందాలను సంతరించుకున్న, పంట కాలువలు, విడివడి ఎగురుతున్న, శివుని జఠలలా, నిండు గోదావరీ పాయల పరవళ్ళు, మధ్యలో, పెరవలి లాకుల వద్ద తిన్న 5పైసల పుల్ల అయిసు చల్లదనం, మనస్సును ఉల్లాస పరుస్తుంటుంటే, సైకిల్ తొక్కిన ఆయాసాన్ని, మిత్రులు, సైకిల్ పై వెనక కూర్చొన్న ఆయాసాన్ని, నేను, మరచి పోయి, ర్యాలీ చేరాము. ర్యాలీ, క్షేత్రంలో, ఆ జగన్మోహనుడి, జగన్మోహిని రూపం దర్శించి, తిరుగు ప్రయాణంలో, రావులపాలెం సంతలో, జీళ్ళు కొనుక్కున్నాం. ఆ జగన్మోహనుడి సౌందర్య మాధుర్యం, జీళ్ళ తియ్యదనంతో కలిసి, మా ప్రేమకు మరో మెట్టయ్యిందేమో.

తరువాత, కాకినాడలో ఇంజనీరింగు రోజుల్లో, భానుగుడి జంక్షన్ లోని, బోంబే శ్రీనివాస్ కేఫ్ లో, బాసుందీ తియ్యదనం, కోటయ్య కాజా కమ్మదనం, అప్పారావు బడ్డీలో, వేరు శనగ ఉండల రుచులు, మా ప్రేమకు సోపానాలయ్యాయి. ప్రత్యేక శిక్షణ కోసం, ఇఛ్ఛాపురం వెళ్ళినపుడు, ఉదయం అల్పాహారంతో, తిన్న రసగుల్లాలు, మా ప్రేమకు బాసటయ్యాయి.

మొదటి రాత్రి, భార్య, నోటికందించిన, బాదుషా తిన్నప్పుడు, ఈ ప్రపంచానికి, నేనే బాద్ షా అయ్యానన్న ఆనందంతో, ఆ తియ్యదనంపై మక్కువ ఇంకా ఎక్కువయింది. అలా, దిన దిన ప్రవర్ధమానమైన, మా అనుభంధం, ఇంక కొన్ని రోజులలో, 61 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకోవడానికి, సిధ్ధమవుతుండగా, విధి, మా అబ్బాయి, అమ్మాయి,భార్య రూపంలో, మా అనుభంధముపై అసూయ చెంది, మధురానికి నానుండి, విడాకులు ఇప్పించాలని, కుట్ర చేసింది.

ఒక మంచి వైద్యుని సహాయంతో, విడాకులకు, సిధ్ధం చేశారు, మా ఆవిడ, పిల్లలు. ఇకపై చక్కెరపై మక్కువ వదిలేయాలని, గుండెపై స్టెత్ పెట్టి మరీ చెప్పాడు, వైద్యుడు. నడక అలవాటులేని, నన్ను రోజూ నడవాలని, చెప్పారు. చిన్నప్పటి నుంచి, మధురం వెనక నడవడం అలవాటయిన నాకు, మథురానికి దూరంగా నడవడం, భాధగా అనిపించినా, విధి బలీయం కదా, రాముడంతటి వాడే, రాజభోగాలు వదిలి, కంద మూలాలు, తిన్నాడు,నేనెంత అని సరి పెట్టుకున్నాను

అలా, చిన్ననాటి నుంచి, ఇప్పటి వరకు, మధురంతో నా అనుభందాన్ని, నెమరు వేసుకుంటుండగా, మా ఆవిడ దోసకాయ ముక్కల పళ్ళెం ఇవ్వడంతో, తిరిగి, ప్రస్తుతానికి వచ్చి, మేధో మధనం విషయానికి వచ్చాను.

నిన్న , నాన్న పుట్టిన రోజు కదా, స్వీట్లు ఏమైనా పెట్టావా, అని పిల్లలు, వాళ్ళమ్మను నిలదీశారు. ఏమీ చేయలేదు, ఆయనే, బజారులో, కొని తెచ్చి, చుట్టు పక్కల పిల్లలకు పంచారు కానీ, పాపం, నాలుకకి కూడా రాసుకోలేదు, మీ నాన్న, అంది మా ఆవిడ. నువ్వు చూడకుండా తిన్నారేమో, పిల్లల అనుమానం.

అలా చెయ్యరు. వైష్ణవాలయాలలో, చక్కెర పొంగలి ప్రసాదం తినవలసి వస్తుందనే,భయంతో, పాపమైనా, వైష్ణవాలయాలకు వెళ్ళడమే మానేశారు,మీ నాన్న, పాపం, అంటూ నన్ను వెనకేసుకొచ్చింది, మా ఆవిడ.

మొగుడిని, వెనకాలేసుకు తిప్పుకుంటుంది, అని కిట్టని వాళ్ళంటే,ఏమో, అనుకునే వాణ్ణి, వెనకేసుకోవడమంటే, ఇదేనేమో.

అవును, తాత గారు, అలా తినరు, అని, మా ఆవిడకు మద్దతుగా, నిలిచింది, మనవరాలు, హంసిని. నీకేం తెలుసు, అంటూ, గదమాయించింది, మా కూతురు, తన కూతురిని.

నాకు జలుబు చేసినపుడు, నన్ను మానమని, తను కూడా, చల్లని నీరు మానేశారు, అంటూ సమర్ధించుకుంది, హంసిని.

అలా కారణాలు విశ్లేషిస్తూ, వాళ్ళు తలలు పగుల కొట్టుకుంటుంటే, నేను మాత్రం, టి వీ లో, వస్తున్న సీతా రామ కళ్యాణంలోని, తలంబ్రాల ఘట్టము వింటున్నాను. తెల్లటి ముత్యముల తలంబ్రాలు, సీతాదేవి దోశిట కెంపులుగా మారాయంట, అని చెపుతున్నారు. అది వినగానే, నా చక్కెర నిలవల సూచి, అలా పెరిగి పోవడానికి, కారణం అర్ధమయ్యింది.

అసలు విషయమేమిటంటే, పెళ్ళయినప్పటినుంచీ, నా ప్రతి పుట్టిన రోజున, ద్రాక్ష పళ్ళు , నా నోటికి అందించడం, మా ఆవిడకు అలవాటు.
అయితే, ద్రాక్ష పళ్ళు మధుమేహాన్ని పెంచుతాయని, ఈ పుట్టిన రోజున, ద్రాక్ష పళ్ళు పెట్టలేదు. వాటికి బదులు, మధుమేహాన్ని తగ్గించుతాయని, నేరేడు పళ్ళు నోటికి అందించింది.

“జంబూ ఫలము తిన జరజర చక్కెర
తగ్గును అనవిని తరగని ప్రేమన
చక్కని ఫలములు మక్కువ తెచ్చితి
పుట్టిన దినమున పెట్టెద నేనని
అందించె నోటికి భార్య, ఆ చేతిన
అయ్యె నా ఫలములు అమృతపు గుళిక నా
చక్కెర నిలవలు మిక్కుటం చేయగ,
మనమున పెరిగెను మధుమేహ కాంతులు”

అదయ్యా, నా దేహమున చక్కెర నిలవలు పెరగడానికి, కారణం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked