కథా భారతి

రంగ్ దే బసంతి

-ఆర్ శర్మ దంతుర్తి

ఒకానొక రాజ్యంలో రాజు తెలుపు, ప్రథానమంత్రి తెలుపు, అనుయూయులూ తెలుపే. ప్రజలందరూ తెలుపు. అన్నీ సజావుగా సగిపోతున్న రోజుల్లో ఓ తెల్లవాడు అడవుల్లో వేటకెళ్ళాడు. అక్కడో చిన్న తండా అందులో కొంతమంది మనుషులూ ఉంటే, దాహం కోసం వాళ్ళదగ్గిరకెళ్ళిన ఈ తెల్లవాణ్ణి ఆ తండా మనుషులు వింతగా చూడ్డం మొదలుపెట్టారు. కారణం ఏవిటంటే తండాలో మనుషులందరూ నల్లవాళ్ళు. బావిలో కప్పల్లా బతుకుతున్న వాళ్ళకి మనుషులు తెల్లగా ఉంటారని తెలీదు ఈ తెల్లవాణ్ణి చూసేవరకూ. తెల్లవాడిక్కూడా అదే పరిస్థితి. వీడూ తెల్లబావిలో కప్పే కానీ ఆ నల్లవాళ్లలా ‘నాకూ ఇలా నల్లవాళ్ళు ఉంటారని తెలియదు’ అనే మాట బయటకి చెప్పలేదు. వీడు దాహం తీర్చుకున్నాక వేట చాలించి తన రాజ్యానికికొచ్చి తను చూసిన విషయం తెల్ల రాజ్యంలో చెప్పేసేడు ఇలా తాను నల్ల మనుషులని చూసినట్టు. కొంతమంది నమ్మితే, కొంతమంది నమ్మలేదు. నమ్మనివాళ్లని కొంతమందిని పోగు చేసి తెల్లరాజు ఓ తెల్ల నాయకుణ్ణి ఇచ్చి వీళ్ళందర్నీ ఆ నల్లతండా చూసిరమ్మని పంపించేడు.

అలా చూసివచ్చి నల్లవాళ్ళు ఎందరున్నారో, ఎంత బలంగా ఉన్నారో అన్నీ చెప్తే తెల్లరాజు మంత్రులతో విస్తుపోయి ఆలోచించాడు ఏం చేయాలో. మానవుడన్నవాడు ఎప్పుడూ నీచ జాతి జంతువు కాబట్టి, తెల్లరాజుకీ, తెల్ల మంత్రులకీ ఈ నల్లవాళ్ళు తమకి దగ్గిర్లో – అడవిలో అయితే మాత్రం – ఉండడం నచ్చక సైన్యంతో పోయి వీళ్లందర్నీ పట్టుకున్నారు. ఈ నల్లవాళ్లందర్నీ అలా పట్టుకోవడానికి అభియోగం ఏమిటంటే, అడవిలో ఉండే జంతువులని అన్నింటినీ పట్టుకుని బోనులో పెట్టే అథికారం తెల్లవాళ్ళకి ఉందిట. కుక్కల్నీ పందుల్నీ, ఏనుగులనీ పట్టుకుని మచ్చిక చేసినట్టే వీళ్ళని కూడా మచ్చిక చేసి వీళ్ల చేత పనులు చేయించుకుంటారుట. అలా నల్లవాళ్ళనందర్నీ ఏరుకొచ్చి తమ పనులు చేయించుకోవడం సాగించారు. తెల్లవాడు గమనించిన దాని ప్రకారం నల్లవాడికి రోమాలు తెల్లవాడికంటే వేరేగా ఉన్నాయి. వాడి దంతాలు అవీ తెల్లవాడిలాగా లేవు. నడకా అదీ తెల్లవాడిలా ఉన్నా, చర్మం మొత్తం పూర్తి నలుపు. తెల్లవాడికి శరీరం మీద ఇక్కడో నల్లటి చుక్కా, అక్కడో నల్లటి చుక్కా పుట్టుమచ్చల్లా ఉన్నట్టు నల్లవాడి శరీరం మీద ఎక్కడా ఒక్క తెల్లని చుక్క లేదు. పుట్టుమచ్చల కోసం నల్లవాడి వంటిమీద చూస్తే మరింత నల్లని చుక్కలు కనిపించేయి. ఇదంతా తెల్ల రాజ్యంలో వింతగా చెప్పుకున్నారు.

నల్లవాళ్ళు తమ చర్మం రంగు తెల్లవాళ్లతో పోల్చి చూసుకుని తాము తెల్లవాళ్ళకన్నా అథములం కాబోలని అనుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అలా అనుకోవడం మొదలుపెట్టారో అప్పుడే ఆ ఆలోచన వీళ్ళ జీవితాలని ప్రభావితం చేయడం మొదలైంది. ఆ ఆలోచనా క్రమం రావడానికి తెల్లవాళ్ళు తమని పట్టుకుని జంతువుల్లా చూడ్డం అనేది కారణం అని వీళ్లకి తెలియలేదు అప్పట్లో. తెల్లవాడు నల్లవాణ్ణి పని చేయించుకోవడానికీ, తన ఇష్టం వచ్చినట్టు వాడుకోడానికీ, ఎదురుతిరిగితే కొట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నల్లవాడు ఇంక తనకి అక్కర్లేదనిపించిందో అప్పుడు తెల్లవాడు నల్లవాణ్ణి మరో తెల్లవాడికి అమ్మి డబ్బుచేసుకోవడం మొదలుపెట్టాడు. నల్లవాడికి ఎప్పుడైనా రోగం, రొచ్చో తగిలితే దానికి మందు ఇప్పించడం, రోగం బాగా ముదిరితే విషం పెట్టి చంపడం లాంటివి జంతువులకి జరిగినట్టే నల్లవాళ్ళకీ జరుతుతున్నై. ఎప్పుడైనా తెల్లవాడు కొట్టినప్పుడు నల్లవాడికి జంతువులకి కారినట్టే రక్తం కారుతోంది కూడా. దానికి ఏవో మందూ మాకూ వేస్తున్నాడు తెల్లవాడు.

జీవితం ఇలా సాగిపోతుండగా ఓ రోజు ఎక్కడినుంచో ఒక నలుపూ తెలుపూ కాని మనిషి దిగబడ్డాడు దేశంలో. వీడి జుట్టు తెల్లవాడి జుట్టులాగానే పొడుగ్గా సాగుతూ ఉంది. అయితే చర్మం రంగు మాత్రం కొంచెం తెలుపులో చాలామటుకు నలుపు కలిపినట్టుంది. తెల్లవాడు వీణ్ణి కూడా జంతువులా పట్టుకుందామా, వీడు నలుపా కాదా అనే సందిగ్థంలో ఉండగానే వీడు నల్లవాళ్ల కంట కూడా పడ్డాడు. వాళ్ళకీ వీడు నలుపో తెలుపో తెలియలేదు. చూడబోతే వాడికి జుట్టు తెల్లవాడిలా ఉంది భాష కొంచెం వాళ్ళలాగ కొంచెం తమలాగా ఉఛ్ఛరిస్తున్నాడు. వంటిరంగు మాత్రం తమలాగానే చాలామటుకు నలుపు. వీడు ఎక్కడనుంచి వచ్చాడో కనుక్కుందామనుకునే లోపున ఒక పుకారు బయల్దేరింది రాజ్యంలో.

ఆ పుకారు ప్రకారం ఓ తెల్లవాడు ఓ వయసులో ఉన్న నల్లదాన్ని కొనుక్కున్నాడు దాసీగా ఇంట్లో పనులు చేయడానికి. తన ఇంట్లో ఉండే ఈ నల్లదాన్ని రోజూ గమనించే తెల్లవాడికి ఈ నల్లదాని వంటి నిగనిగలు చూసేసరికి మతిపోయింది. నల్లదైన తన దాసీని పెళ్ళి చేసుకుంటానని మిగతా తెల్లవాళ్ళతో చెప్తే వాళ్ళెలాగా ఒప్పుకోరని తెలిసిందే. తనకున్న దగ్గిర స్నేహితులతో చర్చిస్తే తేలినదేమిటంటే, తెల్లవాడికి ఈ నల్లది దాసీ. కార్యేషు దాసీ అయినప్పుడు శయనేషు రంభా అవడంలో తప్పులేదు కనక పెళ్ళి అనేమాట తలపెట్టకుండా, ఆవిణ్ణి తెల్లవాడు తన ఇష్టం వచ్చినట్టూ వాడుకోవచ్చు. అలా తెల్లవాడు కొంతకాలం ఈవిడతో పండగ చేసుకున్నాక ఈ తెలుపూ నలుపూ కాని వాడు పుట్టాడు. వీణ్ణి రహస్యంగా ఎలాగోలా పెంచి పెద్దచేసేసరికి ఇలా తెలుపూ నలుపూకాని గోధుమరంగు మనిషి ఒకడు తయారయ్యేడు రాజ్యంలో.

ఈ తతంగం రాజు దగ్గిరకి వెళ్ళింది. తెల్లరాజు ఈ గోధుమరంగు వాణ్ణి పిలిచి విచారణ సాగించాడు. ఎంత అడిగినా తన తండ్రి ఎవరో తల్లి ఎవరో చెప్పనని మొండికేసాడు గోధుమవాడు. దీనిక్కారణం ఏమంటే, తాను ఫలానా తెల్ల తండ్రికీ, నల్ల తల్లికీ పుట్టాడని తెలిస్తే తన తల్లినీ తండ్రినీ కొరత వేస్తాడు రాజు. ఎంత చర్మం రంగు మారినా ఏ రంగు మనిషి తన తల్లినీ తండ్రినీ పణంగా పెట్టగలడు? అలా ఎంతకాలం విచారణ సాగినా గోథుమ రంగువాడు ఏ మాటా చెప్పాడు కాదు. ఏమీ తేలక ఈ గోథుమవాడు తమ మథ్య బతక్కూడదని తెలిసి తెల్లరాజ్యం వీణ్ణి ఉరితీసింది.

అదే వాళ్ళు చేసిన తప్పు.

గోథుమవాడి తల్లి ఊర్లో అందరికీ తెలియకుండా గుండెలమీద కొట్టుకుంటూ తనకి కడుపు చేసిన యజమాని చేతకానితనానికి రోజూ శాపనార్థాలు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది. ఎంత తెల్లవాడైనా తండ్రికి తన స్వంత కొడుకు – గోథుమరంగు అయితే మాత్రం – చావడం చూసి గుండె రగిలిపోయింది. బయటకి చెప్తే తన జీవితానికే గండం. చెప్పకపోతే గుండెల్లో అణుచుకోలేని రంపపు కోత. ఈ దశలో తనకి తెల్సున్న నల్ల దాసీలనందర్నీ పోగుచేసి తాను వాళ్ళవైపు ఉన్నట్టూ, వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళలాగానే మనుషులనీ కావలిస్తే దాన్నినిర్థారించి చూపిస్తాననీ చెప్పడం సాగించేడు. తాము కూడా జంతువులే అనుకునే ఆలోచన నరనరాల్లో జీర్ణించుకున్న నల్లవాళ్లకి ఈ సంగతి అర్థం అవ్వడానికి విడమర్చి చెప్పడానికి చాలా రోజులు పట్టింది.

కాస్త థైర్యం, వయసులో ఉన్న నల్లవాడొకడు అడిగాడు, ఈ తెల్లాయనని, “మేమూ మీలాంటివాళ్లమేనని ఎలా ఋజువు చేస్తారు? చేస్తే మాత్రం రాజూ మంత్రులూ నమ్మవద్దూ?”

తెల్లాయన చాల సులభంగా చెప్పాడు దీనికి సమాథానం. తన చేతిమీద చిన్న గాటు పెట్టుకుని బయటకొచ్చిన రక్తం చూపించి చెప్పాడు, “చూడండి, ఈ రక్తం. మీరు గాటుపెట్టుకున్నా ఇదే రంగులో వస్తుంది బయటకి. మీకు రెండు చేతులు, రెండుకాళ్ళూ నాకు ఉన్నట్టే ఉన్నాయా లేదా? చదువు నేర్చుకుంటే మీరూ నాలాగే డబ్బులూ, సంపదా సంపాదించగలరు కూడా. చర్మం రంగు తప్ప మీకూ మాకూ ఏవిటి తేడా?”

“మీకు ఎందుకంత పట్టింపు మా నల్లవాళ్ల గురించి? మేము ఎప్పట్లాగే దాసీలుగా ఉంటాం, మాకు ఇది బాగానే ఉంది కదా? మీకూ బాగానే ఉన్నట్టుంది” ఓ కొత్త ఒరవడి మనకెందుకొచ్చిన గోలరా అనుకునే ముసలి నల్లవాడొకడన్నాడు అందరిముందూ.

తెల్లాయనకి వళ్ళు మండి అరిచేడు, “పోయి ఓ సారి మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి. తెల్లవాడి మోచేతి నీళ్ళు ఎంతకాలం తాగుతారు?తిండి ఒక్కటేనా కావాల్సింది జీవితంలో? మీకు స్వేచ్ఛ అక్కర్లేదా? ఎందుకంత పట్టింపు అని అడిగారు కనక చెప్తున్నా, ఆ ఉరితీయబడిన గోధుమవాడు నా కొడుకే.”

ఈ సంగతి విన్నాక తాము రాజ్యంలో విన్న పుకారు – తెల్లవాళ్ళు తమ నల్ల ఆడవాళ్లకి కడుపు చేస్తున్నారనే విషయం – నిజమని తెలిసిన నల్లవాళ్ళకి రగిలిపోయింది.

మొత్తానికి ఇలా కిందా మీదా పడి ఆ తెల్లాయన ఈ నల్లవాళ్లకి పురిపెట్టాక ఈ నల్లవాళ్లందరూ కలిసి ఏం చేస్తే మంచిదా అని ఆలోచించే లోపుల గోథుమరంగువాళ్ళు మరి కొందరు పుట్టుకొచ్చారు. వీళ్ళలో కొంతమందికి జుట్టు నల్లవాళ్లకి లాగా ఉంటే కొంతమందికి తెల్లవాళ్లకి లాగా ఉంది. చర్మం కూడా కొంతమందికి నలుపు, కొంతమందికి తెలుపు. కానీ మొత్తానికి వీళ్ళు అటు నలుపూ ఇటు తెలుపూ కాక గోథుమరంగు జాతిగా స్థిరపడ్డారు. రాజు దీర్ఘంగా విచారిస్తే తెలిసినదేమంటే, తెల్లవాడు నల్లదాసీతో పండగ చేసుకున్నట్టే, కొంతమంది తెల్ల అమ్మాయిలు నల్ల మొగాళ్ళతో పండగ చేసుకుంటున్నారు రాజ్యంలో! రోజూ కష్టపడి పనిచేసే నల్లవాడి ఆరోగ్యం, కండలూ అవీ చూసి తెల్ల అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారుట. ఇది తెలిసి రాజు బుర్ర తిరిగిపోయింది. ఒకణ్ణైతే ఉరి తీయొచ్చుకానీ రాజ్యంలో ఉన్న గోథుమరంగువాళ్ళందర్నీ ఉరితీయడం ఎలా? ఏం చేయాలో తెలియక రాజు తలపట్టుకుని మంత్రులనందర్నీ పిలిచి రహస్యంగా సమావేశం పెట్టాడు.

సమావేశంలో అత్యధికంగా ఎవరు ఎలా ఒప్పుకుంటే అలా చేద్దామని నిర్ణయించారు సమావేశం మొదలవకముందే. రోజుల, నెలల తరబడి తలలు పట్టుకుని సమావేశంలో మంత్రులూ రాజూ నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నాక మొత్తానికి ఒక ఒడంబడిక తయారైంది. దాని ప్రకారం ఇలా కొత్త నిర్ణయం చేసారు రాజ్యంలో. రాజ్యం ప్రజలందరదీను. నలుపూ తెలుపూ అనేది లేకుండా రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం అందరూ సహకరించాలి. ఇప్పటినుండి ఈ రాజ్యంలో నలుపూ తెలుపూ, గోధుమరంగూ, పసుపూ, నీలం అనేవేవీ లెక్కలోకి రావు. ఎందుకంటే నల్లవాళ్ళు, గోధుమవాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో గానీ వాళ్ళు అంటున్నట్టూ ఎవరి చర్మం గాటు పెట్టినా ఒకే రంగు రక్తం బయటకి వస్తోంది. అలాగే మిగతా వంట్లో ప్రవహించే నీరూ, పీల్చుకునే గాలీ, తినే తిండీ అన్నీ ఒకే రంగులో ఉన్నై అన్ని రంగుల జనాలకీను. ఇటువంటప్పుడు అందరూ ఒకటే కదా? అలా ఒడంబడికతో కాస్త సామరస్యం మొదలైంది.

నల్లవాళ్ళు సంతోషంగా పండగ చేసుకున్నారు. మొదట ఉరితీయబడిన గోథుమరంగువాడి విగ్రహం ఒకటి ముఖ్యమైన కూడలిలో పెట్టారు ఆయన గౌరవార్థం. ఆయన తెల్ల తండ్రీ, నల్ల తల్లీ చచ్చిపోయేలోపులే ఇది జరగడం వల్ల – వాళ్ళిద్దరూ తమ కొడుకువల్ల రాజ్యంలో వచ్చిన మార్పుకి సంతోషంగా మరో పాతికేళ్ళు బతికారు.

అయితే రాజుపెట్టిన సమావేశంలో ఇలా కొత్త కొత్త నిర్ణయాలు – అదీ గోధుమరంగు, నల్ల రంగు వాళ్ళ గురించి – తెల్లవాళ్ళైన తన మంత్రులు ఇలా ఎలా అంగీకరించారో తెల్ల రాజుకి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తెలియలేదు. ఆయన ఆ సందేహాన్ని ఎవరిని అడుగుదామన్నా తనని సింహాసనం మీదనుంచి దింపేస్తారేమోనని అనుమానంతో నోరు విప్పలేకపోయేడు. ఈ సందేహం తీరకుండానే, తెల్లరాజ్యం రంగు మారిపోతున్నందుకు ఆయన దిగులుతో మంచం పట్టి రోగం ముదిరి చచ్చిపోయేడు.

అయితే మనోరోగంతో చచ్చిపోయిన తెల్లరాజుకి తెలియని విషయం ఏమిటంటే తను సమావేశానికి పిలిచిన తన మంత్రుల్లో, ప్రథానమంత్రితో సహా అందరికీ చిన్నిల్లు, పెద్దిల్లూ అన్నట్టూ తెల్లావిడతో ఒక పెద్దిల్లూ, నల్లావిడతో ఒక చిన్నిల్లూ ఉన్నై. అంటే ఈ మంత్రుల్లోనే గోథుమరంగు పిల్లలున్న మంత్రులు తొంభై శాతం పైనే ఉన్నారు. ఇలా ఎందుకు జరిగిందా అని ఉత్తరోత్తరా కనుక్కుంటే తెలిసిన విషయం ఏమిటంటే ఈ రంగు ప్రభావం రావడానిక్కారణం పూర్తిగా తెల్లవాళ్ళే. తెల్లవాళ్ళు, నల్లవాళ్లతో తమ రంగు పోల్చుకుని తాము బాగా పాలిపోయినట్టు ఉన్నట్టూ, ఒకటే రంగు రోజూ చూసుకోవడం కాస్త విసుగనిపించి తామూ కొంచెం గోథుమరంగుగా, నల్లగా కనపడడానికి ప్రయాస మొదలుపెట్టారు. ఓ సారి అది మొదలవగానే నల్ల అమ్మాయిలు – దాసీలైతే మాత్రం, వీళ్ల కళ్లకి అందంగా కనబడ్డం మొదలైంది. తమకున్న తెల్ల పెళ్ళాలని వదిలేస్తే వాళ్ళు తన్ని తగలేస్తారని తెలుసు కనక ఉన్న తెల్ల పెళ్ళాలని పెద్దింట్లో ఉంచి, ఈ నల్ల అమ్మాయిలతో చిన్నిల్లు వేరేగా పెట్టి గోథుమరంగు జనాలని కనడం మొదలుపెట్టారు. మంత్రులే ఇలా చేస్తున్నారని తెలిసాక యథారాజా తథా ప్రజా అన్నట్టూ ప్రజల్లో దాదాపు ప్రతీ ఒక్క తెల్లవాడూ పెద్దిల్లూ చిన్నిల్లూ మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన చిన్నిల్లు గురించి పెద్దింటి ఆడవాళ్లకి చూచాయగా తెలియగానే వాళ్ళూ తమ తెల్ల మొగుళ్లకి తెలియకుండా మరో చిన్నిల్లు పెట్టుకున్నారు వేరేగా, తప్పు చేసే మొగుడికి తమని అడిగే థైర్యం లేదని తెలిసాక. ఈ విషయాలన్నీ రాజుకి తెలియకుండా జాగ్రత్తపడ్డారు మంత్రులందరూను. ఎప్పుడైనా రాజుగారు ఈ విషయాలు విన్నా తన తెల్ల మంత్రులు అలా చేయరనీ, ఇవన్నీ పితూరీలనీ అనుకోవడం ఒకటీ, తన సింహాసనం మీద ప్రేమతో ఒకటీ ఎప్పుడూ నోరెత్తలేకపోయేడు.

తర్వాత రాజ్యానికి పేరు మారలేదు కానీ రాజులు మారుతూ వచ్చారు. అలా ఒక్క తెల్లవాడి అడవిలో వేటతో మొదలై తెల్లరాజ్యం పక్క పక్క రంగు రంగుల రాజ్యాలని తనలో కలుపుకుంటూ విస్తరించింది. మరో నూరేళ్ళకి తెల్ల రాజ్యం పేరు అలాగే ఉన్నా రాజ్యంలో నల్లవాడు కానీ తెల్లవాడు కానీ భూతద్దం పెట్టి గాలించినా ఒక్కడు కనపళ్ళేదు. మొత్తం అంతా గోధుమరంగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked