ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 24 వ భాగము )

రాజు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు.పక్కనే శివకుమార్ కూర్చుని ఉన్నాడు.వెనకాల అభిషేక్,శివహైమ కూర్చుని ఉన్నారు.రాజు సడన్ గా అన్నాడు”విశ్వామిత్ర ఎందరికో సహాయం చేశాడు సార్.స్లమ్స్ వెకేట్ చేయించడం వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి చాలామందికి ఉపాధి కల్పించాడు.ఆర్థికంగా ఆదుకున్నాడు.డాక్టర్ల చేత వైద్యమూ,మందులూ కూడా ఇప్పించేవాడు.పోలీస్ స్టేషన్ వచ్చిన తగాదాలను జగదీష్ అతని అనుచరుల దగ్గరకు వెళ్ళకుండా తనే చాలా మటుకు పరిష్కరించేవాడు.రేప్ అండ్ మర్డర్ కేసులైతే తనే నిందితులని చంపేసేవాడు.రాగింగ్ కేసుల్ని,స్టేషన్ కొచ్చి మగపిల్లలు వేధిస్తున్నారని కంప్లయింట్ చేసినా ,పోలీసులు పట్టించుకోని ఎన్నో కేసులు తనే పరిష్కరించాడు.కాని తన పేరు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడేవాడు.కొన్ని కేసుల్లో,సెటిల్మెంటుల్లో నేనుకూడా ఇన్వాల్వ్ అవడం వల్ల నాకు విశ్వామిత్రతో చనువు పెరిగింది.ఇంత వయసొచ్చినా రెండు లాంగ్వేజెస్ లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని నాపట్ల అభిమానంగా ఉండేవాడు.అటువంటి మనిషికి రౌడి అని,గూండా అని,హంతకుడని,భూకబ్జాదారని..”రాజు మాటలింకా పూర్తి కాలేదు”రేపు మనం గవర్నర్ ని కలవబోతున్నాం కదా.వాళ్ళెవరైనా మన పిటిషన్ మీద సంతకం పెట్టడంగాని,గవర్నర్ దగ్గరికి రావడం గాని చేస్తారా?అంత ధైర్యం ఉంటుందా వాళ్ళకి?”శివహైమ అడిగింది
రాజు మొహం వెలిగిపోయింది ఆమాట వినగానే”ఎందుకు రారు మేడమ్?తప్పకుండా వస్తారు.పరుగెత్తుకుంటూ వస్తారు.”
“అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం లేకపోవచ్చుగాని,న్యాయాన్ని సమర్ధించే ధైర్యం ఉందనమాట ప్రజల్లో”అన్నాడు అభిషేక్
శివకుమార్ మాట్లాడాడు”మన ఫ్లయోవర్ డిజైన్ కి విడ్త్ ఎక్కువ.సపోర్టింగ్ పిల్లర్స్ కూడా ఎక్కువే.అందుచేత ఎక్కువ లాండ్ అక్వైర్ చేయాల్సొచ్చింది.ఎంతోమంది వ్యాపారస్తులకి,ప్రైవేట్ ప్రోపర్టీ ఓనర్స్ కి టిడిఆర్ సర్టిఫికెట్ లు,అవి వద్దన్నవాళ్ళకి కేష్ డిస్బర్స్మెంట్ ఎంతో ఎఫిషియెంట్ గా చేశాం.వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు.వాళ్ళకి కూడా ఈవిషయం చెప్పడంలో తప్పు లేదు.సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం”
“అయితే మరివాళ్ళ డాటా ఎక్కడుంది?వాళ్ళ ఫోన్ నంబర్ లు వగైరా”అడిగాడు అభిషేక్.
“ఆఫీస్ లో ఉన్నాయి”
కారు మునిసిపల్ ఆఫీస్ వద్ద ఆగింది

ఆరాత్రంతా నిద్రలేకుండా తిరిగారు ఇంటింటికీ నలుగురూ.ఒక్కర్నీ రమ్మని అడగలేదు.విషయం చెప్పారంతే.’మేమేం చెయ్యాలి?”అని అడిగినవాళ్ళకి గవర్నర్ బంగళాకి వస్తే బావుంటుందని సజెస్ట్ చేశారు.”ఏం చేస్తారు?”అన్న అడిగిన ప్రశ్నకి లేబర్ అంతా ముక్తకంఠంతో “రేప్పొద్దున్న అందరం గవర్నర్ బంగళా దగ్గరుంటాం సార్”అన్నారు.రాజు అనుకున్నాడు.‘విశ్వామిత్ర వీళ్ళందరి గుండెల్లో ఉన్నాడు.ఎలక్షన్లో నిలబడితే కళ్ళుమూసుకుని గెలుస్తాడు’

అంతా అనుకున్నట్టుగానే జరిగితే ‘బాగా జరిగిందనుకుంటాం’.కాని,అనుకున్నదానికన్నా బాగా జరిగితే”అద్భుతం”గా జరిగింది అనాలి.కాని గవర్నర్ దగ్గరికి,డెప్యూటీ సిఎమ్ దగ్గరికి వెళ్ళి తమకేసు ఎలా ప్రెజెంట్ చేయలి?అన్న ఆలోచనలతో రాత్రంతా ఆలోచనలతో బుర్ర పగలగొట్టుకున్న శివహైమ,రాజు,శివకుమార్ అభిషేక్ లకి మర్నాడు వాళ్ళు ఇంకా గవర్నర్ బంగళాకి చేరకమునుపే అక్కడ చేరిన జనసందోహాన్ని చూసి మతిపోయింది.నాలుగురోడ్ల కూడలైన గవర్నర్ బంగళా జంక్షన్ లో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది.గవర్నర్ కి ద్రోణాచార్య నిలయం గురించి తెలుసు.విశ్వామిత్రని అన్నమాచార్య మ్యూజిక్ ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా చూశాడు.ఇంటెలిజెన్స్ వింగ్ చెప్పడం వల్ల విశ్వామిత్ర ,నారాయణ టివి ప్రోగ్రామ్ ఇంటర్నెట్ లో చూశాడు.చాలా ఇమ్ప్రెస్ అయి ఉన్నాడు ఆల్రెడీ.జగదీష్ బలమైన సాక్ష్యంవచ్చిన జన సందోహం అతనికింకేమైనా సందేహాలుంటే పూర్తిగా తుడిచిపెట్టేసింది.ఇక డెప్యూటీ సిఎం కిరణ్ సంగతి.ముఖ్యమంత్రి కులపిచ్చి,డబ్బు పిచ్చి భరించలేకుండా ఉన్నాడంటతను.ఒకసారి ముఖ్యమంత్రితోటే డైరెక్ట్ గా అంటే ‘ఆ రెండూ నావెనక ఉండకపోతే నేనీ కుర్చీ ఎక్కలేను.ఎక్కినా ఇంతకాలం ఉండలేను’అన్నాడంట.ఏనిర్ణయం తీసుకోనివ్వడంట,అని నిర్ణయాలు తనే తీసుకుంటాడంట. విసిగిపోయిన డిప్యూటీ సిఎమ్ ఎప్పుడు తిరుగుబాటు చేద్దామా అనే ఊపులో ఉండి ఎమ్ ఎల్ ఏ లనందర్నీ కూడగడుతున్నాడంట.అతనికీ పిటిషన్ ‘shot in the arm’అంటారే అలాగ తగిలింది.సరిగ్గా విశ్వామిత్ర చెప్పినట్టు పదిహేను రోజుల్లో అతను నూతన ముఖ్యమంత్రి కావడం ,హోమ్ మినిష్టర్ రిజైన్ చేయడం జరిగాయి.

సరిగ్గా రెండు నెలల తరవాత …విశాఖపట్టణం కళాభారతిలో ద్రోణాచార్య,శివహైమ,విశ్వామిత్ర,శివకుమార్,అభిషేక్,రాజులకి,తెలుగు టీచర్ నారాయణకీ ఇంకా S&D డైరెక్టర్స్ పది మందికీ,సన్మానం,నూతన ముఖ్యమంత్రి,గవర్నర్ చేతులమీదుగా ఘనంగా జరిగింది.నూతన ఫ్లైఓవర్ డిజైన్ మోడల్స్ రెండూ,చెరువుల ఆధునికీకరణ మోడల్ ముఖ్యమంత్రి,గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపబడ్డాయి.నూతన ముఖ్యమంత్రి,ఫ్లైఓవర్ డిజైన్ మోడల్స్ రెండింటినీ ,నాయుడు,సుశీలమ్మ కూతురైన శృతికి అందజేశారు.ఒక డిజైన్ కి `శృతి’ ఫ్లైఓవర్ అని,రెండవదానికి `శ్రావణ్’ ఫ్లైఓవర్ అని నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఆ రెండు పేర్లు ప్రకటించగానే సభకి విచ్చేసినవారే కాక యావత్ భారతదేశం అంతటా టివిలో ఆప్రోగ్రాం చూస్తున్న వారందరి కరతాళధ్వనులతో దేశం మారుమ్రోగిపోయింది.ఆ తరవాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విశ్వామిత్ర పాడిన పాటని కింద ఇస్తున్నాను.
బృందం: కష్టాలన్నీ నష్టాలన్నీ
బాధలన్నీ భయాలన్నీ
తీరే కాలం నేడే వచ్చింది
చిరునవ్వే లోకం తీరే అవుతుంది
విశ్వామిత్ర: కాలం ఎప్పుడు ఒక్కలాగే ఉంది
మనిషి నడిచే తీరే మారాల్సి ఉంది

చరణం: నువు త్రాగే నీరు నది ఎన్నడడగదు
తాము కాచే పళ్ళు చెట్లెన్నడడగవు
కాలం ఎప్పుడు ఒక్కలాగే ఉంది
మనిషి నడిచే తీరే మారాల్సి ఉంది

డబ్బు నువ్వు సంపాదించు
సంపాదించినదీ రక్షించు
కొంత పక్కవాడికివ్వు
కొంత నువ్వు అనుభవించు
బృందం: మనం ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్టూ
మిడిల్ టూ నాటూ

విశ్వామిత్ర: పారేనీరు పండే పంట
తవ్విన ఖనిజం మండే ఇంధనం
బృందం : కాలం ఎప్పుడు ఒక్కలాగే ఉంది
మనిషి నడిచే తీరే మారాల్సి ఉంది

విశ్వామిత్ర: సోమరితనం విడిచి పెట్టు
పిరికితనం తరిమికొట్టు
కోపాన్ని వదిలిపెట్టు
నీమాటని అదుపులో పెట్టు
బృందం : పెద్ద పెద్ద మాటలు మాట్లాడతన్నావే

విశ్వామిత్ర: చెప్పకముందంతా కష్టమే
చెప్పింతర్వాతంతా సులభమే
బృందం :చెప్పినా చెప్పకపోయినా
పని చెయ్యటం మటుకు
ఎప్పుడూ కష్టమే
పని చెయ్యటం మటుకు
ఎప్పుడూ కష్టమే

విశ్వామిత్ర: మాటలు చేతలు రెండూ కావాలి
మాటలు చేతలు రెండూ కావాలి
ఎగిరే పక్షికి రెక్కలు రెండూ ఉండాలి
ఎగిరే పక్షికి రెక్కలు రెండూ ఉండాలి

కాలం ఎప్పుడు ఒక్కలాగే ఉంది
మనిషి నడిచే తీరే మారాల్సి ఉంది
బృందం: కష్టాలూ తీరే కాలం వచ్చింది
చిరునవ్వే లోకం తీరే అవుతుంది

విశ్వామిత్ర: నేనెవరో నీకు తెలిస్తే నువ్వు జ్ఞానివి
నువ్వెవరో నీకు తెలిస్తే ఆత్మజ్ఞానివి
ఆత్మజ్ఞానంలో ఉంది జ్ఞానం
కావాలన్నిటికదే ఆరంభం
Self-Knowledge is the beginning of Wisdom
అందరూ విశ్వామిత్రతో సహా: కష్టాలన్నీ నష్టాలన్నీ బాధలన్నీ భయాలన్నీ తీరే కాలం నేడే వచ్చింది చిరునవ్వే లోకం తీరే అవుతుంది

**శుభమ్**

(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked