కథా భారతి

వ్యత్యాసం

-G. శ్రీ శేష కళ్యాణి.

ఇండియాలో మన తెలుగు సంప్రదాయాల మధ్య నోములూ, వ్రతాలూ, పూజలూ చేస్తూ పెరిగిన కాత్యాయనికి అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న గిరీష్ తో వివాహం జరిగింది. పెళ్ళైన మూడోరోజు, కాత్యాయనిని తీసుకుని అమెరికాకు వచ్చాడు గిరీష్. ఇండియాలో ట్రాఫిక్-జాంలతో నిరంతరం రద్దీగా ఉండే రోడ్లను చూసిన కళ్ళతో విశాలమైన ‘ఫ్రీ-వే’ను చూసి ఆశ్చర్యపోయింది కాత్యాయని!
కారు ఎక్కి కూర్చున్న కాసేపటికే ఇల్లు చేరేసరికి, “ఏంటండీ ఆ స్పీడూ?! గంటకు అరవై మైళ్ళ వేగంతో వెళ్లకపోతే కారును కాస్త మెల్లిగా నడపచ్చుగా?”, గిరీష్ తో అంది కాత్యాయని.
“చూడు కాత్యాయనీ! ఫ్రీ-వే పైన స్పీడ్-లిమిట్ కన్నా తక్కువగా కారు నడపటం ప్రమాదకరం! అలాచేస్తే మనల్ని పోలీసు ఆపి మనకు టికెట్ ఇచ్చే అవకాశముంది!! తెలుసా?”, అన్నాడు గిరీష్.
“టికెట్ అంటే?”, అమాయకంగా అడిగింది కాత్యాయని.
“అంటే జరిమానా విధిస్తాడన్నమాట!”, చెప్పాడు గిరీష్.
“ఆమ్మో! ఈ దేశంలో కారు నడపటం సాహసమే!”, అంది కాత్యాయని.
“కానీ నడపక తప్పదు! ఈ అమెరికాలో కారు లేకపోతే కాళ్ళు లేనట్లుగా ఉంటుంది! ఇక్కడి దూరాలు నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం! త్వరగా తయారవ్వు! వంటకు కావలసిన సరుకులు తెచ్చుకుందాం!”, అన్నాడు గిరీష్ ఇంటి తాళం తీస్తూ.
కాత్యాయని స్నానం ముగించి తయారయ్యి వంటకు కావలసిన సరుకుల జాబితాతోపాటు దేవుడి పూజకు కావలసిన పూజా సామాగ్రి వివరాలు కూడా రాసింది.
“కాత్యాయనీ! పూజలూ, నోములూవంటి చాదస్తాలు ఇక్కడ పెట్టుకోకు. ఈ దేశంలో అలాంటివి చెయ్యడం అసాధ్యం!”, అన్నాడు గిరీష్.
“అవి చాదస్తాలు కాదండీ! భగవంతుడు ఎప్పుడూ నాతో ఉన్నాడన్న నమ్మకంతో నేను ఆయనకు చేసే చిన్న సేవలు!”, అంది కాత్యాయని.
“సరేలే! నీ ఇష్టం! నాకైతే అలాంటి నమ్మకాలేం లేవు!”, అంటూ గిరీష్ కాత్యాయనీని ఇండియన్ గ్రోసరీస్ స్టోరుకు తీసుకెళ్లి అన్ని సరుకులూ కొనిపెట్టాడు. పాలు పొంగించి వంట మొదలుపెట్టిన కాత్యాయని షాపులో ఉప్పు తీసుకోవడం మర్చిపోయిందని గ్రహించి నాలిక్కరుచుకుంది.
“ఏవండీ! ఉప్పు తీసుకోవడం మర్చిపోయాను!! షాపు దగ్గరేగా! నేను వెళ్లి పట్టుకొచ్చేస్తా!”, అంది కాత్యాయని.
“బయట చీకటి పడింది. పైగా చలి! ముందే చెప్పానుగా! ఈ దేశంలో ఎక్కడికెళ్ళాలన్నా కారుండాల్సిందే! షాపుకి నడుచుకుంటూ వెళ్లలేవు! నేనెళ్ళి పట్టుకొస్తాలే!”, అంటూ గిరీష్ షాపుకెళ్లి ఉప్పు డబ్బా పట్టుకొచ్చాడు.
రోజులు గడిచే కొద్దీ, అమెరికాలో రోజువారీ పనులు సాఫీగా సాగాలంటే కారు నడపటం వచ్చిఉండటం అత్యంత అవసరమని కాత్యాయనికి తెలిసొచ్చింది. తనకు బజారునుండీ ఏ వస్తువు కావాలన్నా గిరీష్ ఆసుపత్రి నుండీ ఇంటికొచ్చేదాకా ఆగి అప్పుడు కొనుక్కోవలసి వచ్చేది! ‘మా ఊళ్ళోలాగా ఇక్కడ కూడా ఆటోలు ఉంటే బాగుండు!’, అని చాలాసార్లు అనుకునేది కాత్యాయని.
ఒకరోజు ఆసుపత్రిలో ఏదో అత్యవసరమైన పని ఉండటంవల్ల ఆలస్యమయ్యి, రాత్రి పదకొండింటికి ఇల్లు చేరుకున్నాడు గిరీష్. అప్పటికి కాత్యాయని భోజనం చేసేసి పడుకుని ఉంటుందని అనుకున్నాడు. కానీ కాత్యాయని హాల్లో కునికి పాట్లుపడుతూ కూర్చుని ఉంది. ఆశ్చర్యపోతూ అందుకు కారణమడిగాడు గిరీష్.
“వంట చేద్దామని చూస్తే బియ్యం నిండుకున్నాయండీ! అందుకే వంట చెయ్యలేకపోయాను!”, చెప్పింది కాత్యాయని.
“అయ్యో! ఈ టైం లో షాప్స్ అన్నీ మూసేస్తారు. నాక్కూడా చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడే వెళ్లి టాకోలు పట్టుకొస్తా!”, అని అప్పటికప్పుడు వెళ్లి అర్ధరాత్రి వరకూ తెరచి ఉంచే రెస్టారెంటులో వెజ్-టాకోలు పట్టుకొచ్చాడు గిరీష్. టాకోలు తినడం అలవాటులేని కాత్యాయనికి వాటి రుచి అస్సలు నచ్చలేదు. దాంతో కాత్యాయని ఆ పూటకి ఇంట్లో ఉన్న రెండు అరటిపళ్ళు తిని, గ్లాసుడు పాలు తాగి పడుకోవలసివచ్చింది.
మరుసటి రోజు పొద్దున్న కాఫీ తాగుతూ, “కాత్యాయనీ! నువ్వు ఇక కారు డ్రైవింగ్ నేర్చుకుంటే మంచిది! అప్పుడు నీకు ఏవైనా నిత్యావసరాలు అత్యవసరంగా కావాలన్నప్పుడు ఇబ్బంది పడకుండా నువ్వే బయటికెళ్లి తెచ్చేసుకోవచ్చు!”, అన్నాడు గిరీష్.
“ఆమ్మో!! ఈ దేశంలో కారు నడపటం నావల్ల కాదులెండి! అయినా నాలాంటివాళ్ల కోసం ఇంటికే ఎవరైనా సరుకులు తెచ్చిస్తే బాగుండు! “, అంది కాత్యాయని.
“అది చాలా ఖర్చుతో కూడుకున్న పని! కాబట్టి మనమున్న ఆర్ధిక పరిస్థితులలో అది అసాధ్యం! పక్కదారుల గురించి ఆలోచించటం మానేసి డ్రైవర్స్-లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు! ఇక్కడ నువ్వు బ్యాంకులూ, ఆసుపత్రులూ, మెడికల్ షాపులూ… ఇలా ఎక్కడికి వెళ్లినా, నిన్ను గుర్తింపు కార్డు స్థానంలో డ్రైవర్స్-లైసెన్స్ అడుగుతూ ఉంటారు! నీకు డ్రైవర్స్-లైసెన్స్ లేదంటే అన్నిచోట్లా ఇబ్బంది పడతావ్!”, అన్నాడు గిరీష్.
కారు డ్రైవింగ్ గురించి ఆలోచించేకొద్దీ కాత్యాయని మనసులో గుబులు మొదలైంది. ఎందుకంటే, కాత్యాయని ఇండియాలో ఉన్నప్పుడు టూ-వీలర్ నడిపేది. కారు డ్రైవింగ్ నేర్చుకోమని స్నేహితులు ప్రోత్సహిస్తే ఒకసారి ప్రయత్నిద్దామని అనుకుంది. కానీ ఆరోజే కాత్యాయనికి తెలిసిన ఒకావిడ ఫ్లై-ఓవర్ పై కారు నడుపుతూ తన ముందు వెడుతున్న ఒక కారును గుద్దింది. తప్పు ఆవిడవల్లనే జరిగిందని నిరూపణ అవ్వడంతో కారు రిపేర్ ఖర్చులతోపాటు మరికొంత సొమ్మును ఆ కారు యజమానికి నష్టపరిహారం కింద ఆవిడ కట్టుకోవలసివచ్చింది! అప్పుడు ఆవిడ పడిన వేదనను కళ్లారా చూసిన కాత్యాయని కారు నేర్చుకోవాలన్న తన ఆలోచనను అప్పటికప్పుడు విరమించుకుంది. ఆ తర్వాత కాత్యాయని కారు డ్రైవింగ్ ప్రసక్తి ఎత్తలేదు!
కానీ ఇప్పుడు అమెరికాలోని పరిస్థితులు చూశాక కారు డ్రైవింగ్ నేర్చుకుంటేనే మంచిదని అనుకున్న కాత్యాయని ఒకరోజు, “డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే పద్ధతేమిటండీ?”, అని గిరీష్ ను ఆసక్తిగా అడిగింది.
“నువ్వు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావా అని నేను ఎదురు చూస్తున్నాను! డ్రైవర్స్-లైసెన్స్ తెచ్చుకోవాలంటే ముందు నువ్వు ఒక పరీక్ష రాయాలి. అది పాస్ అయితే నీకు డ్రైవింగ్ నేర్చుకునేందుకు అర్హత వస్తుంది! ఆ తర్వాత నువ్వు కారు నడిపే పరీక్ష పాస్ అవ్వాలి! పరీక్ష కొంచెం కష్టంగానే ఉంటుంది! కానీ, ఇవాళకాకపోతే రేపైనా నేర్చుకోవలసిందేగా!”, అన్నాడు గిరీష్.
“సరే! వచ్చేవారం మంచి రోజులున్నాయి. అప్పుడు మొదలుపెడతాను! అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడన్నది నా నమ్మకం!”, అంది కాత్యాయని.
“ఏమో! నీ చాదస్తం నీదీ! అలాగే కానీ!”, అన్నాడు గిరీష్ కాస్త చిరాగ్గా.
ఆ వారాంతంలో కాత్యాయనికి తను తల్లి కాబోతున్న సంగతి తెలిసింది. గిరీష్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి!
“మరి నా కారు డ్రైవింగ్ సంగతి?”, గిరీష్ ను అడిగింది కాత్యాయని.
“ఇప్పుడదేమీ మాట్లాడకు. రెస్ట్ తీస్కో!”, అన్నాడు గిరీష్.

***

కొద్దినెలలు గడిచిన తర్వాత కాత్యాయనికి పండంటి బాబు పుట్టాడు. కాత్యాయనికి సాయం చెయ్యటానికి ఆమె తల్లి సీతాలక్ష్మి ఇండియా నుండీ అమెరికాకు వచ్చింది. గిరీష్ బాబుకి ‘అమర్’ అని పేరు పెడితే కాత్యాయని ‘దత్త’ అని పేరు పెట్టింది.
“అయితే వీడి పేరు అమరదత్త అన్నమాట!”, అంటూ బాబు పేరును ‘అమరదత్త’ గా ఖాయం చేసింది సీతాలక్ష్మి. అత్తగారి మాటకు అడ్డుచెప్పలేకపోయాడు గిరీష్. అమరదత్తకు మూడు నెలలు నిండాయి.
“కాత్యాయనీ! అత్తయ్యగారు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు కారు డ్రైవింగ్ నేర్చుకుంటే బాగుంటుంది. అప్పుడు నువ్వు క్లాసులకు వెళ్ళినప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారన్న బెంగ మనకు ఉండదు!”, అన్నాడు గిరీష్. సరేనంది కాత్యాయని.
మరుసటి రోజు గిరీష్ డ్రైవర్స్ హ్యాండ్ బుక్ పట్టుకొచ్చి, “ఈ పరీక్ష అంత తేలికేం కాదు! నాకు తెలిసినవాళ్ళు చాలామంది మొదటి ప్రయత్నంలో తప్పి, రెండో ప్రయత్నంలోనో మూడో ప్రయత్నంలోనో పాస్ అయ్యారు! తెలుసా?”, అని అన్నాడు. కాత్యాయని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయ్!
అది గమనించిన సీతాలక్ష్మి, “ఇదిగో కాత్యాయనీ! పరీక్షల విషయంలో రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం మనకు తెలియని మాట! మొదటి ప్రయత్నంలోనే ఆ పర్మిట్ ఏదో వచ్చేట్టు చూసి మన పరువు నిలబెట్టు!”, అంది.
అమరదత్తను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, మొదటి ప్రయత్నంలోనే పరీక్ష పూర్తయిపోవాలని దేవుడికి మొక్కుకుని, బాగా చదివి పరీక్ష పాస్ అయ్యి డ్రైవర్స్-లైసెన్స్ పొందటానికి పర్మిట్ తెచ్చుకుంది కాత్యాయని. సీతాలక్ష్మికి చాలా ఆనందం కలిగింది!
“కాత్యాయనీ! డ్రైవింగ్ తరగతులు ఎవరిస్తారో ఆన్లైన్ లో చూడు! చేరుదువుగాని!”, చెప్పాడు గిరీష్.
“ఆ వివరాలు నేను ఇదివరకే చూసేసాగా! మంచి రేటింగ్స్ ఉన్న డ్రైవింగ్ స్కూళ్లవాళ్ళు గంటకు చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు! మనమున్న పరిస్థితులలో అంత ఖర్చు పెట్టడం కష్టం!”, అంది కాత్యాయని.
“కాత్యాయనీ! ఏదేమైనా, నువ్వు పర్మిట్ పై ఉన్న గడువు తేదీ లోపు డ్రైవింగ్ నేర్చుకోవాలి! లేకపోతే పరీక్ష మళ్ళీ రాయాల్సి వస్తుంది!”, అంటూ భయపెట్టాడు గిరీష్.
చేసేదిలేక కాత్యాయని తమ ఇంటికి దగ్గర్లో ఒక పేరున్న డ్రైవింగ్ స్కూలును సంప్రదించి అందులో చేరిపోయింది. మొదటిరోజు డ్రైవింగ్ స్కూల్ నుండీ స్టీఫెన్ అనే వ్యక్తి కారు తీసుకుని వచ్చాడు. కాత్యాయని అమరదత్తను వదల్లేక వదల్లేక వదిలి కారు ఎక్కి కూర్చుంది. కారులోని డ్రైవర్స్ సీటులో కూర్చోవడం అదే మొదటిసారి కావడంతో ఏది ముట్టుకుంటే ఏమవుతుందోనన్న భయంతో దగ్గరగా ముడుచుకుని కూర్చుంది కాత్యాయని.
“అయ్యో! మీరు షూస్ వేసుకుని రావాలి! చెప్పులతో కారు నడపలేరు! అది మా సంస్థకున్న నియమాలలో ఒకటి!”, అన్నాడు స్టీఫెన్.
“ఓ! అలాగా! ఇప్పుడే వస్తా!”, అంటూ కాత్యాయని గబగబా ఇంట్లోకి వెళ్లి షూస్ వేసుకుని వచ్చింది.
“మీరు ఇంతకుముందెప్పుడైనా కారు నడిపారా?”, అడిగాడు స్టీఫెన్.
“లేదు!”, బదులిచ్చింది కాత్యాయని.
స్టీఫెన్ టకటకా ‘కారూ-అందలి భాగాలు’ పై ఒక క్లాస్ చెప్పాడు. స్టీఫెన్ అమెరికన్-ఇంగ్లీష్ మాట్లాడటంతో ఇండియన్-ఇంగ్లీష్ మాట్లాడే కాత్యాయనికి అతడిని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమనిపించింది.
“ఇప్పుడు రోడ్డు పైకి వెడదాం!”, అన్నాడు స్టీఫెన్.
“సరే!”, అంటూ చిరునవ్వు నవ్వింది కాత్యాయని.
స్టీఫెన్ కారు స్టీరింగ్ నూ, బ్రేక్స్ నూ కంట్రోల్ చేస్తూ రోడ్డు పై చిన్న రౌండ్ వేసి ఇంటి ముందుకు కారును తీసుకొచ్చి ఆపాడు.
ఆ తర్వాత స్టీఫెన్ కాత్యాయనిని ఒక కాగితం పై సంతకం పెట్టమని అడిగి, “మీకింకా రెండు క్లాసులున్నాయి! మావాళ్లకి ఫోను చేసి రెండో క్లాస్ బుక్ చేసుకోండి!”, అని చెప్పాడు.
సరేనని కాత్యాయని డ్రైవింగ్ స్కూలుకు ఫోను చేస్తే వాళ్ళు రెండు వారాల తర్వాత రెండో క్లాసును బుక్ చేశారు. రెండు వారాల తర్వాత స్టీఫెన్ కారు తీసుకుని మళ్ళీ వచ్చాడు. కారు ఎక్కి కూర్చున్న కాత్యాయనికి అంతా మళ్ళీ కొత్తగా అనిపించింది.
“మీరు గత రెండు వారాలలో డ్రైవింగ్ ప్రాక్టీస్ చెయ్యలేదా?”, అడిగాడు స్టీఫెన్.
“లేదు!”, చెప్పింది కాత్యాయని.
“అయ్యో! మీరు మీ సొంత కారును నడిపి ఉండాల్సింది! కొంచెం అలవాటయ్యేది!”, అని స్టీఫెన్ మళ్ళీ కారులో ఉన్న బ్రేకులూ వగైరాలూ ఓపిగ్గా చూపించి వాటి గురించి చెప్పాడు.
‘ఈసారి కొంచెం బాగానే అర్ధమయ్యిందే!’, అనుకుంది కాత్యాయని. కారును రోడ్డు మీదికి తీసుకెళ్లాడు స్టీఫెన్. అంతలో ఒక పెద్ద వాహనం కారుకు ఎదురొచ్చేసరికి కాత్యాయని కంగారు పడిపోయింది. ఇండియాలో ఎడమవైపు వాహనం నడిపే అలవాటున్న కాత్యాయనికి అమెరికాలో కుడివైపు నడపటం తికమక వ్యవహారంలా అనిపించింది.
“కీప్ రైట్! కీప్ రైట్!”, అని మాటిమాటికీ ఓర్పుగా గుర్తు చేస్తూనే ఉన్నాడు స్టీఫెన్.
కాత్యాయని తనకు తాను ఒక వెయ్యిసార్లు చెప్పుకుని ఎలాగో తన బుర్రకు వాహనం కుడి వైపు నడపాలన్న సంగతిని అలవాటు చేసింది. స్పీడోమీటర్ నూ, రోడ్డునూ, రోడ్డు పై వచ్చే సైన్ బోర్డులనూ, కారుకు బిగించి ఉన్న అద్దాలనూ, మధ్యమధ్యలో వచ్చే ట్రాఫిక్ సిగ్నళ్లనూ ఏక కాలంలోచూస్తూ, స్టీఫెన్ చెప్పే సూచనలు పాటిస్తూ, అడపా దడపా లేన్లు మారుతూ కారు నడిపేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది కాత్యాయనికి! ఎట్టకేలకు డ్రైవింగ్ ప్రాక్టీస్ దాదాపుగా పూర్తయ్యి కారులో ఇంటిని సమీపిస్తూ ఉండగా ఒక యువకుడు రోడ్డు దాటుతూ కారుకు అడ్డం వచ్చాడు. కాత్యాయని వెంటనే కారు హారన్ బలంగా నొక్కబోయింది. కానీ స్టీఫెన్ కాత్యాయనీని అలా చెయ్యొద్దని వారిస్తూ బ్రేకును బలంగా నొక్కి రోడ్డు దాటుతున్న యువకుడికి ‘సారీ!’ అన్నట్లుగా చెయ్యి ఊపాడు. దానికి ఆ యువకుడు ‘యు ఆర్ ఓ.కే.!’ అని సైగ చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయాడు. అర్ధంకానట్లు మొహం పెట్టింది కాత్యాయని.
“ఎంతో అవసరమైతే తప్ప హారన్ వాడకూడదు! “, చెప్పాడు స్టీఫెన్.
ఇండియాలో అవసరమున్నా లేకున్నా టూ వీలర్ పై వెళ్ళేటప్పుడు హారన్ మోగించుకుంటూ వెళ్లే కాత్యాయనికి ఎప్పుడుపడితే అప్పుడు హారన్ వెయ్యకూడదన్న నిబంధనను పాటించడం కొంచెం కష్టంగా తోచింది. కారు నడిపేంతసేపు స్టీఫెన్ తనను ఏ మాత్రం కంగారు పెట్టకపోయినా ఏదో చెప్పలేని ఒత్తిడికి, ఉత్కంఠకూ గురయ్యింది కాత్యాయని. మొత్తానికి అలా కాత్యాయనికి మరో డ్రైవింగ్ క్లాసు పూర్తయ్యింది. ప్రాక్టీస్ పట్ల అసంతృప్తిగా మొహం పెట్టాడు స్టీఫెన్.
“ఈసారి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వస్తాను!”, స్టీఫెన్ కి హామీ ఇచ్చింది కాత్యాయని.
ఆరోజు గిరీష్ ఆసుపత్రి నుండీ ఇంటికి రాగానే, “మన కారును ఒకసారి నడుపుతానండీ!”, అంది కాత్యాయని.
“నీ డ్రైవింగ్ క్లాసులు అన్నీ పూర్తి అవ్వనీ! అప్పుడు వెడదాం!”, అన్నాడు గిరీష్.
మరో వారం తర్వాత డ్రైవింగ్ స్కూలువారి నుండీ కాత్యాయనికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆ డ్రైవింగ్ స్కూలువారు ఏవో ఆర్ధిక సమస్యలవల్ల తమ సంస్థను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ మిగిలిన క్లాసుకు సంబంధించిన డబ్బును వాపసు చేస్తూ చెక్కును పంపించారు. విస్తుపోయింది కాత్యాయని. తన మనసుకు నచ్చిన మరో మంచి డ్రైవింగ్ స్కూలు కాత్యాయనికి ఎంతకీ దొరకలేదు!
కొద్దిరోజుల తర్వాత, ఇండియాకి తిరుగు ప్రయాణం అయిన సీతాలక్ష్మి, “డ్రైవర్స్-లైసెన్స్ విషయంలో కంగారు పడద్దు. బాబును జాగ్రత్తగా చూసుకో!”, అని కాత్యాయనికి చెప్పి ఇండియా వెళ్ళిపోయింది.
ఆపై అమరదత్తని చూసుకోవడంలో కాత్యాయనికి సమయమే తెలియలేదు. అంతలో డ్రైవింగ్ పర్మిట్ కున్న గడువు ముగిసింది! కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెచ్చించిన సమయం వృధా అవ్వడం కాత్యాయనికి బాధ కలిగించింది. ‘ఏదైతే అదే అయ్యింది! నేను ఇక ఈ కారు డ్రైవింగ్ జోలికి పోను!’, అని అనుకుంది కాత్యాయని.

***

చూస్తూండగా మూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి!
“కాత్యాయనీ! బాబుకి ఇక్కడి భాషా, పద్ధతులూ మన ఇంట్లో ఉంచుతూ అలవాటు చెయ్యడం అసాధ్యం! వాడిని ప్రీ-స్కూల్లో వెయ్యాలి!’, అన్నాడు గిరీష్.
“మన ఇంటికి చాలా దగ్గర్లో ఒక మంచి ప్రీ-స్కూల్ ఉంది. బాబుని అక్కడ చేర్పిద్దాం! “, అంది కాత్యాయని.
“రోజూ బాబుని ప్రీ-స్కూల్ కి ఎలా తీసుకెడతావ్?”, అడిగాడు గిరీష్.
“నేను వాడిని స్ట్రోలర్ లో కూర్చోబెట్టుకుని నడుచుకుంటూ తీసుకెడతాను!”, చెప్పింది కాత్యాయని.
“అది కష్టమేమో?”, సందేహం వెలిబుచ్చాడు గిరీష్.
“పర్లేదు! నాకు నడక అలవాటే!”, చెప్పింది కాత్యాయని.
ఎప్పటిలాగే, “నీ ఇష్టం!”, అన్నాడు గిరీష్.
వెంటనే అమరదత్తని ప్రీ-స్కూలులో చేర్పించి ప్రతిరోజూ అక్కడికి నడుచుకుంటూ వెళ్లిరావడం మొదలుపెట్టింది కాత్యాయని. మొదట్లో నడక బాగానే అనిపించింది. కానీ పోనుపోనూ మితిమీరిన చలి, విపరీతమైన ఎండ, వర్షం, రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండటంలాంటివి కాత్యాయనికి తీవ్రమైన ఇబ్బందిని కలిగించాయి. ‘నాకు డ్రైవింగ్ రాకపోవడంవల్ల వీడు ఇబ్బంది పడకూడదు!’, అని గట్టిగా నిర్ణయించుకుని, శ్రమకోర్చి అమరదత్తని ప్రీ-స్కూల్ కి తీసుకెళ్లేది కాత్యాయని. ఒకసారి కాత్యాయనికి విపరీతమైన జలుబు చేసి, జ్వరం వచ్చి తగ్గింది. ఆ రోజు విపరీతమైన నీరసంగా ఉండటంతో స్ట్రోలర్ ను తోసుకుంటూ నడవటం చాలా కష్టం అనిపించింది కాత్యాయనికి. ఇంటికి వచ్చాక సీతాలక్ష్మికి ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకుంది కాత్యాయని.
“అమ్మాయ్! ఒక పని చెయ్! మీరు మరో రెండు నెలల్లో ఇండియా వస్తున్నారు కదా? అప్పుడు నువ్వు ఇక్కడి డ్రైవింగ్ స్కూలులో చేరుదువుగాని. మన తెలుగులో నీకు కారు డ్రైవింగ్ కి కావలసిన మెళకువలన్నీ వాళ్ళు చేప్పేస్తారు. అమెరికా వెళ్ళాక పైపైన ప్రాక్టీస్ చేసి పరీక్ష పాస్ అయిపోయి డ్రైవర్స్-లైసెన్స్ తెచ్చేసుకుందువుగాని!”, అని కాత్యాయనికి ధైర్యం చెప్పింది సీతాలక్ష్మి,
సీతాలక్ష్మి ఇచ్చిన సలహా కాత్యాయనికి చాలా నచ్చింది. ఆ ఏడాది వాళ్ళు ఇండియా వెళ్ళగానే ఆలస్యం చెయ్యకుండా తమ ఇంటికి దగ్గర్లోని డ్రైవింగ్ స్కూలులో చేరిపోయింది కాత్యాయని. మొదటి రోజు డ్రైవింగ్ స్కూలునుండీ కిటకిటలాడుతూ ఒక పాత కారు వచ్చింది. కారులో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది! ఆశ్చర్యపోయింది కాత్యాయని.
“అలా చూస్తారేం మేడం? తొరగా ఎక్కి కూర్చోండి! నా పేరు వీరభద్ర. నేనే మీకు డ్రైవింగ్ నేర్పుతా!”, అన్నాడు వాళ్ళల్లో ఒకతను.
వీరభద్రకున్న నిప్పు కణికల్లాంటి ఎర్రటి కళ్ళు, బుర్ర మీసాలూ, బొంగురు కంఠం, తీక్షణమైన చూపులు చూసి కొద్దిగా భయపడింది కాత్యాయని. ‘ రూపం ఎలా ఉన్నా అతడి మాట మర్యాదగానే ఉందిలే!’, అనుకుంటూ కాత్యాయని కారు ఎక్కి కూర్చుంది. కారులో ఎఫ్.ఎం. రేడియోలో తెలుగు పాటలు మోగుతున్నాయి. ఒకరితర్వాత ఒకరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నారు. కాత్యాయని వంతు వచ్చింది. వీరభద్ర తెలుగు పాఠం అప్పజెప్పినట్లు ఏమేం చెయ్యాలో కాత్యాయనికి గడగడా చెప్పేశాడు. అమెరికాలో ఉన్న కారుకి, ఇండియాలో ఉన్న కారుకి చాలా తేడాలుండటం గమనించింది కాత్యాయని. అసలు ఆ కారు స్టార్ట్ చెయ్యడం కూడా తనకు కష్టమనిపించింది. ఒకపక్క గేర్లను మరోపక్క రోడ్డును చూసుకుంటూ కారు నడిపేసరికి కాత్యాయనికి అలుపొచ్చేసింది.
మర్నాడు మళ్ళీ అలాగే కిటకిటలాడుతున్న కారుతో వచ్చాడు వీరభద్ర. కాత్యాయని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చెయ్యగానే ఒక్కసారిగా కారు ముందుకి దూకింది! కాత్యాయని వంక గుడ్లురిమి చూశాడు వీరభద్ర. “సారీ!”, అంటూ కారును ముందుకు పోనిచ్చింది కాత్యాయని. అమెరికాలో కుడివైపు కారు నడపటం అలవాటు చేసుకున్న కాత్యాయని మాటిమాటికీ కుడిపక్కకు స్టీరింగ్ ని తిప్పుతూ ఉంటే, “అమ్మా! ఇది అమెరికా కాదు! ఇండియా!! కారు ఎడమవైపు నడపవమ్మా తల్లీ!”, అంటూ వీరభద్ర మొత్తుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఎఫ్.ఎం. రేడియోలో ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్…’ అంటూ దేవదాసు పాట రావడం యాదృచ్చికంగా జరిగింది! అంతలో ఒక ముసలమ్మ రోడ్డు దాటుతూ కారుకు అడ్డం వచ్చింది. కాత్యాయని కారు బ్రేకును బలంగా నొక్కి కారును ఆపి ఆ ముసలమ్మకు చెయ్యి ఊపుతూ ‘సారీ!’ చెప్పింది. కాత్యాయని వంక ఆ ముసలమ్మా, వీరభద్రా – ఇద్దరూ అయోమయంగా చూశారు!
వీరభద్ర తేరుకుని, “ఏందమ్మా! ముసలమ్మకు హారన్ వెయ్యకుండా చెయ్యూపుతారు? ఆమెను గుద్దేసుంటే మనమీద కేసు పడేది! తెలుసా? హారన్ ఎందుకు వెయ్యలేదని అందరూ మనల్నే తప్పుబట్టేవాళ్ళు!”, అన్నాడు. ‘అయ్యో! ఇది ఇండియా కదా! మర్చిపోయాను!’, అనుకుంది కాత్యాయని.
అలా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత, కాత్యాయని తన స్నేహితురాలి మారుతీ కారును కొద్దిసేపు నడపుదామని అనుకుంది. విషయం గిరీష్ తో ప్రస్తావిస్తే, ‘రోడ్డంతా పెద్ద పెద్ద గుంటలు, చీటికీ మాటికీ అడ్డమొచ్చే వీధి కుక్కలూ, రోడ్డుపై వెళ్లే పెద్ద లారీలూ, బస్సులూ…’ అంటూ ఎప్పటిలాగే కాత్యాయనిని భయపెట్టాడు గిరీష్. దాంతో కాత్యాయని తన స్నేహితురాలి కారును నడపాలన్న ఆలోచనను మానుకుంది. కారు డ్రైవింగ్ క్లాసులన్నీ పూర్తి చేసిన కాత్యాయని, డ్రైవింగ్ చెయ్యగలనన్న ఆత్మస్థైర్యంతో అమెరికాకు వచ్చింది.

***

“ఇండియాలో డ్రైవింగ్ వేరు! ఇక్కడి డ్రైవింగ్ వేరు! ఈసారైనా నెగ్గుతావా?”, అనుమానంగా అడిగాడు గిరీష్.
“నా ప్రయత్నాలన్నీ నేను చేశాను! నన్ను గెలిపిస్తాడని ఆ పరమాత్మ పై నాకు నమ్మకముంది!”, అంది కాత్యాయని.
“సర్లే! నీ చాదస్తాలన్నీ పక్కన పెట్టి డ్రైవింగ్ పరీక్షకు మళ్ళీ కట్టు!”, అన్నాడు గిరీష్.
భర్త మాటలకు కొద్దిగా నొచ్చుకున్న కాత్యాయని గట్టి పట్టుదలతో డ్రైవింగ్ పరీక్ష రాసి, పర్మిట్ తెచ్చుకుని, మళ్ళీ డ్రైవింగ్ క్లాసులలో చేరి ప్రాక్టీస్ చేసి డ్రైవర్స్-లైసెన్స్ తెచ్చుకుని గిరీష్ ను ఆశ్చర్యపరిచింది! అమరదత్త కోరిక ప్రకారం కాత్యాయనికి తెల్ల కారును కొనిపెట్టాడు గిరీష్. కొత్త కారుకు పధ్ధతి ప్రకారం పూజ చేసి ఆంజనేయుడి రక్ష కట్టింది కాత్యాయని.
ఆ మరుసటి రోజు కాత్యాయని మొదటిసారి అమరదత్తను కారులో కూర్చోపెట్టుకుని ప్రీ-స్కూలుకి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. అలాచెయ్యడం కాత్యాయనికి ఎంతో తృప్తినిచ్చింది. ఆ రోజు సాయంత్రం కాత్యాయనికి స్కూలువాళ్ళనుండీ కరోనా-వైరస్ కారణంగా స్కూళ్ళు మూసేశారంటూ ఇ-మెయిల్ వచ్చింది! రాష్ట్రమంతటా లాక్-డౌన్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనజీవనం ఎక్కడిక్కడ స్థంభించినట్లుగా అయిపోయింది! కాత్యాయని ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే పాలతో సహా నిత్యావసర సరుకులన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయ్. అమరదత్తకి ప్రీ-స్కూల్ తరగతులు కూడా అప్పుడప్పుడూ ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. కాత్యాయని కారు, వాళ్ళ పార్కింగ్-లాటులో నెలల తరబడి ఉండిపోయింది! గిరీష్ మాత్రం వైద్యుడు కావడంవల్ల కరోనా-వైరస్ బారిన పడిన వారికి అత్యవసర వైద్యసేవలనందించే బృందంలో పనిచేస్తూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయాడు.
అప్పుడప్పుడూ కాత్యాయనికి ఫోన్ చేసి, “ఈ వైరస్ నుండీ నన్ను నేను రక్షించుకోవడం అసాధ్యంలా కనపడుతోంది! పోనీ వదిలేసి వద్దామా అంటే ఆ రోగుల పరిస్థితి చూస్తే నా గుండె తరుక్కుపోతోంది! వాళ్ళను ఆ స్థితిలో వదిలేసి రాలేను! వారిని కాపాడే ప్రయత్నం చెయ్యడం ఒక వైద్యుడిగా నా కర్తవ్యం!”, అనేవాడు గిరీష్. “ఒక వైద్యుడిగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఆ పరమాత్ముడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడని నా నమ్మకం! మీకేమీ అవ్వదు. భయపడకండి!”, అని ధైర్యం చెప్తూ బదులిచ్చేది కాత్యాయని.
కొద్దిరోజుల తర్వాత ఆసుపత్రి నుండీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన గిరీష్ కాత్యాయని ఇచ్చిన మిరియాల కషాయం తాగుతూ, “కాత్యాయనీ! ఏదేమైనా ఈ అమెరికాలో ప్రతినిత్యం పధ్ధతి ప్రకారం పూజ చేసుకోవడం, ఇక్కడి డ్రైవింగ్ ను అలవాటు చేసుకుని డ్రైవర్స్-లైసెన్స్ తెచ్చుకోవడం, ఇంటికే సరుకులు తెప్పించుకోవడం, బాబుని ఇంట్లోనే ఉంచుతూ ప్రీ-స్కూల్ కు పంపటం, అన్నిటికీ మించి నేను ఆ కరోనా-వైరస్ గురించి భయపడుతున్న సమయంలో నాకు ఆత్మస్థైర్యాన్ని కలిగించి ఆ మహమ్మారి బారిన పడకుండా నేను క్షేమంగా ఇల్లు చేరగలిగేలా చెయ్యడం.. ఇలా నేను ఒకప్పుడు అసాధ్యమని అనుకున్నవన్నీ నువ్వు సాధించేశావే!”, అన్నాడు.
“అవన్నీ నేను సాధించానని అనుకుంటే పొరపాటేనండి! అసాధ్యాన్ని సాధ్యం చెయ్యగలిగే శక్తి కేవలం ఆ పరమాత్ముడికి మాత్రమే ఉంది! ఆయనపై నాకున్న నమ్మకం వల్లే ఆ పనులన్నీ సాధ్యమయ్యాయి!”, అంది కాత్యాయని.
అంతలో గిరీష్ కు అమెరికాలోనే ఉంటున్న తన తమ్ముడు రమేష్ భార్య పద్మ నుండీ ఫోన్ వచ్చింది. రమేష్ కి కరోనా-వైరస్ వచ్చిందనీ, ప్రాణాపాయ స్థితిలో అతడు ఆసుపత్రిలో ఉన్నాడనీ, గిరీష్ ను వెంటనే కలుసుకోవాలని అనుకుంటున్నాడనీ ఏడుస్తూ చెప్పింది పద్మ. ఎప్పుడూ ధైర్యంగా ఉంటూ, తన వద్దకు వచ్చే రోగులకు ధైర్యం చెప్పే గిరీష్, ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు!
తన తమ్ముడికి ఏమవుతుందోనని ఆసుపత్రికి హడావుడిగా బయలుదేరుతూ, “కాత్యాయనీ! నీకు భగవంతుడంటే నమ్మకం కదా! నా తమ్ముడి ప్రాణం నిలబెట్టమని ఆ దేవుడికి చెప్పు! ప్లీజ్!”, అన్నాడు గిరీష్ తన కన్నీళ్లను తుడుచుకుంటూ.
“కంగారు పడకండి! మీరు మీ శక్తి కొద్దీ మానవ ప్రయత్నం చెయ్యండి!”, అంది కాత్యాయని.
“అంతేలే! నా తమ్ముడి కోసం నువ్వెందుకు చేస్తావ్?”, అన్నాడు గిరీష్ బాధతో.
“ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే భగవత్కృపతోపాటూ మానవప్రయత్నం కూడా అవసరమే! అందుకే అలా అన్నాను!”, అంటూ కాత్యాయని దేవుడి దగ్గర ఉన్న కుంకుమను కొద్దిగా తీసి పొట్లం కట్టి గిరీష్ కు ఇచ్చింది. అది తీసుకుని గిరీష్ రమేష్ ఉన్న ఆసుపత్రికి వెళ్ళిపోయాడు.
ఒక నాలుగు గంటల తర్వాత గిరీష్ కాత్యాయనికి ఫోన్ చేసి, ” కాత్యాయనీ! నీ నమ్మకం నా తమ్ముడి ప్రాణం నిలబెట్టింది. వాడి ఊపిరితిత్తుల పని తీరు, ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నట్టుండి మెరుగు పడ్డాయి. హి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్!!”, అని చెప్పాడు సంతోషంగా.
“అంతా ఆ భగవంతుడి దయ!!”, అంది కాత్యాయని.

***

కొద్దిరోజుల తర్వాత, ఒకనాటి సాయంత్రం గిరీష్, కాత్యాయనీలు ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, “ఏమిటోనండీ! ఎందరో అమాయకులు ఆ కోవిడ్ బారిన పడి కష్టాలపాలవుతున్నారు! అతి త్వరలో ఆ కరోనా-వైరస్ బెడద మనందరికీ పూర్తిగా పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!”, అంది కాత్యాయని.
“అది అసాధ్యమని మాత్రం అననులే కాత్యాయనీ! ఇప్పుడు నేను కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలిగే శక్తి ఒకటుందనీ, అదే ఆ భగవంతుడనీ నమ్ముతున్నాను! మానవప్రయత్నానికి ఆ భగవంతుడి అనుగ్రహం తోడైతే, కరోనా-వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే రోజు అతి త్వరలో వస్తుంది!”, అన్నాడు గిరీష్ చిరునవ్వుతో!
తన భర్త ఆలోచనావిధానంలో వచ్చిన మార్పును గమనించి ఆనందించిన కాత్యాయని, “హమ్మయ్య! నమ్మకానికీ చాదస్తానికీ ఉన్న వ్యత్యాసం ఇప్పటికి గ్రహించారు! అసలు మన పండుగలూ, సంప్రదాయాలవంటివన్నీ ఆ భగవంతుడిపై మనకున్న నమ్మకాన్ని మరింత దృఢపరిచేందుకే! కాదంటారా?”, అని గిరీష్ ను అడిగింది.
అందుకు గిరీష్, “కాదని ఎలా అనగలను కాత్యాయనీ? మన సనాతన సంస్కృతీసాంప్రదాయాల విలువను నీవల్ల నేను ఈరోజు తెలుసుకోగలిగాను. అవి మన భావితరాలకు అందివ్వడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం!”, అన్నాడు తన ఒళ్ళో ఉన్న అమరదత్తను ముద్దాడుతూ!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked