ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం

విభీషణ పట్టాభిషేకం

రావణుడి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి సంతోషంతో కౌగిలించుకున్నాడు. తన పక్కనే వినీతుడై నిలిచి ఉన్న హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు ‘నీవు ఇప్పుడు ఈ మహారాజు విభీషణుడి అనుజ్ఞ పొంది వైదేహిని చూసి నా విజయవార్త ఆమెకు తెలియచెప్పాలి’ అని కోరాడు. అప్పుడు రాక్షసులు లంకాపట్టణంలో హనుమంతుడి పట్ల వినయవిధేయతలు చూపి గౌరవించారు. వెంటనే లంకాపట్టణానికి వెళ్ళాడు హనుమంతుడు. శ్రీరాముడు ఆమెకు చెప్పవలసిందని చెప్పిన వార్త వినిపించాడు. ‘నీవు చెప్పిన ఈ విజయవార్తకు నేనెట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేడు. నీకెటువంటి బహుమానం ఇవ్వాలన్నా నేనిప్పుడు అశక్తురాలిని.’ అని సీతాదేవి మారుతిని శ్లాఘించింది.
సీతమ్మను పలువిధాల బాధలకు గురిచేసిన రాక్షసాంగనలను చంపివేస్తానని హనుమ చెప్పగా ఆమె అతణ్ణి వారించింది. “నా చుట్టూ ఉన్న ఈ స్త్రీలు నన్నెంతో బాధించినా నేను వీళ్ళకిప్పుడెటువంటి అపకారమూ కోరను” అంటూ సీతాదేవి అడవిలో ఒకసారి సంఘటించిన పులీ, ఎలుగుబంటీ కథ చెప్పింది. “పులి తరుముకొని రాగా వేటకాడు ఒక చెట్టు ఎక్కాడు. అక్కడ అంతకు ముందే ఒక ఎలుగుబంటి ఉన్నది. ఆ

ఎలుగుబంటి తనను రక్షించుకోవడానికి ఆ చెట్టెక్కింది. వేటకాడూ అదే చెట్టు ఎక్కాడు. అక్కడకు పులి వచ్చి వన్యమృగ శత్రువైన వేటగాణ్ణి కిందకు పడతోయాల్సిందిగా ఎలుగుబంటికి బోధించింది. అయితే ‘శరణాగతుణ్ణి నేను శత్రువుకు అప్పగించన’ని చెప్పింది ఎలుగుబంటి. తర్వాత కాసేపటికి ఎలుగుబంటి చెట్టుమీదనే నిద్రపోయింది. అప్పుడు పులి ‘నిన్నేమీ చేయను, ఎలుగుబంటిని కిందికి పడతోయమని వేటగాడికి చెప్పింది. కృతఘ్నుడైన ఆ మానవుడు ఎలుగుబంటిని కిందికి పడతోయబోయినాడు. అప్పుడు ఎలుగుబంటి మెలకువగా ఆ ప్రమాదం తప్పించుకుంది. ఇంకో కొమ్మ పట్టుకుని తనను తాను సంరక్షించుకుంది. అప్పుడు పులి చూశావా! నీకెంత అపకారం తలపెట్టాడో! ఈ దుష్టమానవుడు! వీణ్ణి కిందికి పడతోయి’ అని ఎలుగుబంటిని కోరింది. కాని ఎలుగుబంటి అందుకు వొప్పుకోలేదు. ఒప్పుకోకపోగా పులికి ఒక నీతిబోధ చేసింది. ‘ప్రాజ్ఞుడెప్పుడూ అపకారికి ప్రత్యపకారం తలపెట్టడు! అపకారం చేసిన వ్యక్తికి కూడా ఉపకారమే చేస్తాడు’ అనేదే ఆ నీతిబోధ సారాంశం. అదు సదాచారం. సదాచారమే సత్పురుషులకు అలంకారం” అని హనుమంతుడికి సీతాదేవి మృదువుగా ఆ కథ చెప్పింది.

ఇంకా ఆమె ఇట్లా హనుమంతుడికి బోధించింది.
పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ,
కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి. (యుద్ధ. 116.45)

‘ఎదుటివారు పాపానికి తలపెట్టినా, వధార్హులే అయినా, సజ్జనులు కారుణ్యమే చూపిస్తారు. ఏమంటే ఈలోకంలో అపరాధం చేయని దెవరు? రాక్షసులు పాపకర్ములు, అది వాళ్ళ స్వభావం, అది వాళ్ళకొక క్రీడ. కాబట్టి వాళ్ళను శిక్షించాలని నేను కోరుకోను’ అని చెప్పింది సీతాదేవి. హనుమంతుడప్పుడు ‘అమ్మా శ్రీరాముడికి అన్నివిధాలా నీవు తగిన ఇల్లాలివి’ అని సీతాదేవిని శ్లాఘించాడు. నీ సందేశ మేమిటమ్మా శ్రీరాముడికి, నేను వెళుతున్నాను అనగా సీతాదేవి ‘నా స్వామిని, నా పతిదేవుణ్ణి చూడగోరుతున్నాను’ అని చెప్పింది. అప్పుడు సంతోషంతో ‘జయశీలి శ్రీరాముణ్ణి త్వరలో నీవు చూస్తావు’ అని సెలవు తీసుకొని వెళ్ళాడు హనుమంతుడు.

హనుమంతుడు చెప్పిన సంగతి విని శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకొని తన సమీపంలో ఉన్న విభీషణుణ్ణి ఉద్దేశించి సీతను అన్నివిధాలా అలంకృతురాలిగా నాదగ్గరకు తీసుకొనిరావల్సింది అని అని చెప్పాడు. ఆ విధంగా ఆమెను విభీషణుడు సభక్తికంగా పల్లకీ ఎక్కించి రాముడి దగ్గరకు తీసుకొనివచ్చాడు. అప్పుడు విభీషణుడు ఆమెకు దారి ఇవ్వడం కోసం అక్కడ చేరిన రాక్షసులందరినీ తరిమివేయించాడు. అది చూచి, వానరుడిపై దాక్షిణ్యం వల్ల రాముడు నొచ్చుకున్నాడు. ఆ విధంగా వానరులను త్రోసివేయవద్దని విభీషణుణ్ణి వారిస్తూ ఇట్లా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked