సంగీత రంజని

సంగీత రంజని జనవరి 2019

కేదార గౌళ \ దేశ్

-డా. కోదాటి సాంబయ్య

కేదారగౌళ 28 వ మేళకర్త హరికాంభోజి జన్యం…భక్తీ, శృంగార రసాలు పలికించే రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఉపాంగ రాగం, వర్జ్య రాగం.
ఆరోహణ: స రి మ ప ని స ….అవరోహణ: స ని ద ప మ గ రి స…చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం, కైశిక నిషాధం.
ని ద పా అన్నప్పుడు ని ద దానిప అనీ…మ గ రీ అన్నప్పుడు మ గ గామరీ అనీ పలుకుతుంది. ఈ రెండు ప్రయోగాలలో దానిప, గామరీ అనే గమకాలు కేదారగౌళ రాగం యొక్క ముఖ్యమైన గమకాలు . సురటి, నారాయణ గౌళ రాగాలు ఇంచుమించు కేదారగౌళ స్వరస్థానాలు ఒక్కటే. పాడేప్పుడు జాగ్రత్తగా పాడాలి. గమకాల తోటే మూడు రాగాలనూ పోల్చవచ్చు. ఉదయం పూట పాడవలసిన రాగం.
కేదారగౌళ లో కొన్ని ముఖ్యమైన రచనలు:
సామి దయ జూడ-ఆది తాళ వర్ణం-తిరువట్టియూర్ త్యాగయ్య; వేణుగానలోలుని గన, తులసీ బిల్వ, కరుణా జలధి -త్యాగయ్య; సరగున పాలింప-రామనాధపురం ( పూచి)శ్రీనివాస అయ్యంగార్ ; ఏమి గావలేనే మనసా-జ్ఞానానంద తీర్థ( ఓగిరాల వీరరాఘవ శర్మ); పరాకేల నన్ను- శ్యామశాస్త్రి; కొలువుడీ – అన్నమయ్య;
నీల కంఠం భజేహం, నీలోత్పలాంబికాయై, అభయాంబ నాయక -ముత్తుస్వామి దీక్షితులు; విరిబోణి-ఝంప తాళ వర్ణం- రుద్రపట్నం వెంకట్రామ అయ్యర్;

తెలుగు చలన చిత్రాలలో కూడా కేదారగౌళ లో కొన్ని పాటలు ఉన్నాయి:
ఆడబ్రతుకే-సుమంగళి; చిలకన్న చిలకవే- జయం మనదే; వగలాడి వయ్యారం- అన్నపూర్ణ;
(దేశ్) అలిగిన వేలనే-గుండమ్మకథ; కలువల రాజా- జయం మనదే; మురళీధరా-భలే రాముడు; వేణుగాన లోలుని-రెండు కుటుంబాల కథ; భలే తాత మన బాపూజీ- దొంగ రాముడు; పూజలు సేయ – నోము ; ఓహో చెలి-జగదేక వీరుని కథ; తిరుమల తిరుపతి-మహామంత్రి తిమ్మరుసు; మోముజూడా వేడుక-భక్త శబరి;
ఎంత దూరమూ-ఏకవీర; అన్నీ మంచి శకునములే- శ్రీ కృష్ణార్జున యుద్ధం; వీణా పాడవే రాగమయీ- సీతారామ కల్యాణం;

దేశ్ హిందుస్తానీ సంగీతం లోని ఖమాజ్ థాట్ కు చెందినది. జాతీయ గీతం వందేమాతరం ఈ రాగం లోనే స్వర పరచబడినది. విశ్వ కవి రవీంద్ర నాధ ఠాగూర్
చాలా గీతాలు కూడా ఈ రాగం లోనే ఉన్నాయి . ఔడవ-సంపూర్ణ వర్జ్య రాగం.
ఆరోహణ: ని స రి మ ప ని స …అవరోహణ: స ని ద ప మ గ రి గ స …ఆరోహణ లో శుద్ధ నిషాధం, అవరోహణలో కోమల్ నిషాధం ఉంటుంది.
జాగ్రత్తగా పాడకపోతే తిలక్ కామోద్ ఛాయలు వచ్చే అవకాశం ఉంది.

అలిగిన వేళనే…చిత్రం: గుండమ్మ కథ, రచన: పింగళి నాగేంద్ర రావు. సంగీతం: ఘంటశాల, గానం: పి. సుశీల; అభినయం: ఎన్టీఆర్, సావిత్రి
1. సాహిత్యం: చిన్ని కృష్ణుని మీద అనేక వేల పాటలు వచ్చాయి. కానీ ఇక్కడ సందర్భం చూడండి. అలిగిన భర్తను చిలిపి కృష్ణుని తో పోలుస్తూ పాడిన పాట.
రుస రుస లాడే చూపులు, ముసిముసి నవ్వులు, తహ తహ లాడుచూ, అల్లన మెల్లన, నల్ల పిల్లి …. (కృష్ణుడు నల్లగా ఉంటాడు కాబట్టి, మెల్లగా చప్పుడు కాకుండా నడుస్తున్నాడు కాబట్టి , చీకట్లో కనబడకుండా ఉంటాడు కాబట్టి ఇక్కడ నల్ల పిల్లి అనే పదం ఉపయోగించారు పింగళి గారు ) వంటి పదాలు పాట అందాన్ని పెంచాయి. పాట వింటున్నంత సేపూ మనకు పోతన పద్యం గుర్తుకు వస్తుంది.
2. సంగీతం: హిందుస్తానీ లో ప్రసిద్ధ విద్వాంసుడు.. బడే గులాం అలీ ఖాన్ మద్రాస్ లో నెల రోజులు ఘంటశాల గారి ఇంట్లోనే బస చేశారు. అప్పుడు చాలా హిందుస్తానీ రాగాలతో ఘంటశాల గారికి పరిచయం ఏర్పడింది. తరువాత వారు సంగీత దర్శకత్వం లో ఆయా రాగాలను అందంగా వాడుకున్నారు.
దేశ్ రాగం లో వచ్చే అందమైన స్వర ప్రయోగాలు, సంచారాలు, గమకాలూ చాలా గొప్పగా వాడుకున్నారు .ఈ పాటలో వచ్చే షెహనాయి BGM ఎవరు వాయించారో వారికి శతాధిక వందనములు.
3. గానం: పి. సుశీల గారి గానం గురించి ఎంత చెప్పినా తక్కువే….మధ్య మధ్య లో రాగాలాప్, అల్లరిదేమని అన్నప్పుడు ఆమె గొంతులో జాలు వారిన గమకం అన్నీ అద్భుతాలే. ముఖ్యంగా సావిత్రి గారికి నేపధ్యగానం చేస్తున్నప్పుడు సుశీలమ్మ గొంతు ఇంకా ఇంకా కొత్త అందాలు సంతరించుకుంటుంది.
4. అభినయం: సినిమాలో చేసేదే నటన, మళ్ళీ అందులో అలిగినట్టు నటన. నిజంగానే ఎన్టీఆర్ బుంగమూతి పాటకే హైలైట్…ఆ ముసి ముసి నవ్వులు అనితర సాధ్యం. కావాలంటే ఈ పాట తమిళ వర్షన్ చూడండి.. తేడా ……తెలుస్తుంది. సావిత్రి కూడా పాత్రకు తగట్టు జీవించింది.

పల్లవి:
అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుస రుస లాడే చూపుల లోనే
ముసి ముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి ॥

చరణం: 1
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి ॥

చరణం: 2
మోహన మురళీ గానము వినగా
తహ తహ లాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి ॥

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked