కథా భారతి

సెల్లోపాఖ్యానం

తమిరిశ జానకి
హైదరాబాద్

డ్రయివింగ్ లో ఉన్నాడు సుందరం. జేబులో సెల్ మోగుతోంది. కాదుకాదు పాడుతోంది నిను వీడని నీడను నేనే అంటూ. కాస్తంత దూరంలోనే ట్రాపిక్ పోలీస్ కనిపించాడు. జేబుదాకా వెళ్ళిన చెయ్యి వెనక్కి వచ్చేసింది. ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ లేకపోతే బండి నడుపుతూ మాట్లాడదామనే……బండి పక్కకి పెట్ట్టే ఉద్దేశం లేదు. అంత రద్దీలో పక్కకి పెట్టి కూచుంటే ఇల్లు ఎప్పటికి చేరాలి….. పైగా సి సి కెమేరాలు వచ్చి పడ్డాయిగా ప్రాణానికి అన్న కోపం . తన ప్రాణానికే ముప్పు అన్న ఆలోచన లేదు. ఇల్లుచేరాక ఇంటి గుమ్మంలో స్కూటర్ స్ట్టాండ్ వేసి వెంటనే సెల్ తీశాడు. స్నేహితుడు ప్రసాద్ కాల్. అతనితో మాట్లాడుతూనే ఇంటి తలుపు కొట్ట్టాడు. నీకసలు పిచ్చెక్కింది అంటూ పకపకా నవ్వుతూ తలుపు తీసిన భార్య కవిత మాటలకి జుట్టు పీక్కునేవాడే గానీ చెవికీ భుజానికీ మధ్య కనిపించింది సెల్. ఆమెగారి ఆత్మీయ స్నేహితురాలని అర్ధమయింది. ప్రసాద్ చెప్తున్నది వింటూ అతనికేదో కనపడుతుందన్నట్టుగా తల కూడా ఊపుతూ లోపలికి వచ్చి సోఫాలో కూచున్నాడు. స్నేహితురాలితో కబుర్లు చెప్తూనే కాఫీ కలిపే పనిలో పడింది కవిత. కాఫీ కలిపే చిన్న గిన్నె పెరట్లో రవణమ్మ తోముతున్న సంగతి గుర్తొచ్చి పెరట్లోకి నడిచింది.
చంపుతా….వచ్చావంటే….రవణమ్మ గట్టిగా అరవడంతో హడిలిపోయి గడప అవతల వేసిన కాలు వెనక్కి తీసుకుంది . తీరా చూస్తే మెడకీ భుజానికీ మధ్య సెల్ ఇరికించుకుని ఎవరితోనో మాట్లాడుతోంది. అవతలివాళ్ళమీద కోపాన్ని గిన్నెలమీద చూపిస్తూ బరబరా తోమేస్తోంది విసురుగా. స్నేహితురాలితో మాటలు కొనసాగిస్తూనే కాఫీగిన్నెని చూపిస్తూ తోవడం అయిందా తీసుకోవచ్చా అన్నట్టుగా సైగ చేసింది కవిత. తీసుకోమన్నట్టుగా చేత్తో తనుకూడా సైగ చేసింది రవణమ్మ.
అసలీ ఆడవాళ్ళకి మొగుడి సంగతి పట్టదు ప్రసాద్. అటు టీ.వీ. సీరియల్స్ చూస్తూ కూచోడమో లేకపోతే ఎవరితోనో ఒకళ్ళతో సెల్ల్ లో సొల్లు కబుర్లు గంటలతరబడి చెప్పుకోడమో అంతే. మనతో మాట్లాడే పనిలేదు. కాలిమీదకాలేసుకుని కూచుని కాఫీ కోసం ఎదురు చూస్తూ గట్టిగా నవ్వాడు తనమాటలకి తనే మురిసిపోతూ.
ఇక్కడ మా ఇంట్లోనూ అదే పరిస్థితి సుందరం. ఏవిటో ఈ ఆడవాళ్ళు. వీళ్ళని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడనుకో . నిట్టూర్చాడు ప్రసాద్.

సరిగ్గా అవే రకం ఆరోపణలు సాగుతున్నాయి స్నేహితురాళ్ళిద్దరిమధ్యనా. వేడి వేడి కాఫీ కప్పుల్లో పోస్తూ అంతకంటే వేడిగా వాడిగా మాటలధార కురిపిస్తోంది కవిత స్నేహితురాలి సెల్లో.
పొద్దున్నించీ ఆఫీసే కదా…. ఇంటికొచ్చాకైనా కాస్త కబుర్లు చెప్తారా అంటే అబ్బే అలాంటిదేమీ లేదు. ఆ సెల్ చెవికి అంటించుకుని స్నేహితులతో పిచ్చాపాటీకి అంతే ఉండదు. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టే ఉంది మనిద్దరి సంగతి. నిట్టూర్చింది అటుపక్క సెల్. మరో పెద్ద దీర్ఘ నిశ్వాసం తీసింది ఈ సెల్ కూడా.

అదేవిటోనే పొద్దున్న లేచింది మొదలు అన్నేసి సీరియల్సు చూస్తానా ఏ ఒక్క దాంట్లోనూ మన ఆడవాళ్ళు అనుభవిస్తున్న ఈ మానసిక చిత్రహింస గురించి చూపించరేమిటి ……
మానసిక చిత్రహింసా…. మరీ పెద్దమాట ఉపయోగించావేమోనే….
చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టమన్నారు కదా…అందుకని…ఇదుగో ఈ కాపీ ఆయనగారికిచ్చేస్తే ఓ పనై పోతుంది బాబూ….మీ తమ్ముడి పెళ్లి విశేషాలు చెప్పు. వింటూ కూర తరుక్కుంటాను. తర్వాత మా చెల్లెలి పెళ్లి విశేషాలు నేను చెప్తాను. ఇటు నా వంటా అటు నీ వంటా కూడా అయిపోతుంది.
నిజమే. ఈ మధ్య మా అమ్మ వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళంది. అప్పుడొకటే గోల ఎప్పుడు చూసినా ఆ సెల్లో గంటలతరబడి కబుర్లేమిటే చేసే వంట మీద కాస్త దృష్టి పెట్టు. ఉప్పేస్తే కారం వెయ్యట్లేదు కారం వేస్తే ఉప్పెయ్యట్లేదు….అల్లుడుగారెలా తింటున్నారో పాపం. మంచివాడు కాబట్టి సరిపోయింది అంది.
ఔను కదా ఈవిషయంలో మంచివాడే అయితే….అవతల్నించి నవ్వు.
మంచా గడమంచా అన్నం తింటున్నంతసేపూ ఆయన ఎవరితోనో ఒకళ్ళతో సెల్లో కహానీలు చెప్తూనే ఉంటారు కదా….ఏం తింటున్నారో కూడా పట్టించుకోని మనిషికి ఇంక రుచులు కూడానా సంబడం.

కాఫీ తాగడం అయిపోయిందిగానీ కబుర్లు అవుతాయా ఇద్దరికిద్దరూ అఖండులే మరి అందులో. ప్రసాద్ ఇంకో కాల్ వస్తోంది. అది మాట్లాడటం అయ్యాక మళ్ళీ నీకు చేస్తాను అంటూ ఆ కొత్త నెంబరు కలిపాడు. మావయ్యరామన్నపంతులు ఇంటినెంబరు అది.,,,,ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని ఆయన కోరిక మీద హాస్పిటల్ నించి ఇంటికి తీసుకొచ్చెయ్యాల్సివచ్చిందని వాళ్ళబ్బాయి చెప్పడంతో ఆ విషయం స్నేహితుడితో చెప్పేసి వాడు చెప్తున్నదేదో వింటూ వంటింటివైపు నడిచాడు. ఏవిటన్నట్టుగా చూసింది కవిత. మా రామన్నపంతులు మావయ్య అంటూ చెయ్యి పైకి చూపించాడు. పోయారా అన్నట్టుగా తనూ సైగ చేసింది కవిత. గబగబా తల అడ్డంగా ఊపాడు. సీరియస్ అన్నాడు. ఏవిట్రా సీరియస్ నేనేదో వేళాకోళంగా చెప్తుంటే” చిన్నబుచ్చుకున్నాడు ప్రసాద్. “అబ్బా నీతో కాదురా” అంటూ సద్ది చెప్పాడు సుందరం..

ఓ రండు గంటలు బస్సు ప్రయాణం చేసి రామన్నపంతులు మావయ్య ఊరు చేరుకున్నాడు సుందరం. వాళ్ళింట్లో ముందుగదిలో అడుగు పెట్టాడు. మావయ్య ముగ్గురు కొడుకులూ అక్కడే కూచునిఉన్నారు. ఇద్దరు ఆస్తిపాస్తుల గురించి చర్చించుకుంటూ కాగితాలమీద లెక్కలు రాసుకుంటున్నారు. ఒకడు ఆ పక్కగా నిలబడి సెల్లో గట్టిగా ధూంధాంలాడుతున్నాడు ఎవరిమీదో. ఇంతలో మోగనే మోగింది సుందరం జేబులో నిను వీడని నీడను నేనే అని పాడుతూ సెల్. తీసి చూశాడు. యముడిలాంటి ఆఫీసర్ గారి నెంబరది. రేపు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉంది ఆ విషయం గుర్తుకి రాగానే అప్రమత్తుడై హలో సార్ అన్నాడు నెంబరుకి స్పందన ఇస్తూ. లెక్కలు రాస్తున్న ఇద్దరూ డబ్బులెక్కల్లో తల మునకలై ఉండి తలెందుకెత్తుతారు…సెల్లో ధూంధాంలాడుతున్నవాడు దానికి తగ్గట్టు తల కదుపుతున్నాడు కాబట్టి ఆ కదలికల్లో ఓసారి సుందరం కనిపించాడు కంటిముందు. సుందరాన్ని గుర్తుపట్టి చేత్తో లోపలి గదివైపు చూపించాడు. బహుశా ఆ గదిలోకెళ్ళి ఫోన్ మాటాడుకోమంటున్నాడేమో ఇక్కడ తనో పక్క అరిచి మాటాడుతున్నాడు కదా అని…..అలా అర్థం చేసుకున్నాడు సుందరం. వెంటనే ఆఫీసర్ తో మాటాడుతూనే ఆ గదిలోకెళ్ళాడు. పచ్చివెలక్కాయ గొంతుకి అడ్డు పడినట్టయింది. అక్కడ మంచమ్మీద మావయ్య……పక్కన కుర్చీలో పెద్దకూతురు పూర్ణమ్మ…ఆవిడ చేతిలో కర్ణాభరణం. సుందరాన్ని చూస్తూనే అక్కడే ఉన్న మరో కుర్చీ చూపించింది రెండోచేత్తో కూచోమన్నట్టుగా. ఇబ్బందిగా చూస్తూనే టక్కున కూచున్నాడు. ఆఫీసర్ గారిచేత తిట్లు తప్పవన్న దిగులు మొహాన్ని ఎలాగో ఆవరించేసే ఉంటుంది కాబట్టి ఇక్కడి ఈ పరిస్థితికి ఈమొహం సరిపోతుందని కుదుటపడ్డాడు కాస్త. ఇదుగో నాన్నోయ్ అమెరికా నించి నీ మనవరాలు నిన్ను పలకరిస్తుందిట అంటూ స్పీకర్ ఆన్ చేసి సెల్ ఆయన చెవి దగ్గిర పెట్టి తను ఓ చేత్తో పట్టుకుంది పూర్ణమ్మ. ఆయనకి అర్థం అవుతోందో లేదో ఆ దేవుడికి తెలియాలి. అలా ధారావాహికలాగా మాటాడుతూనే ఉంది ఆ మనవరాలు. అంతూదరీ కనపడలేదు సుందరానికి. మావయ్య వంక చూస్తూ రకరకాల హావభావాలతో తను తిప్పగలిగినంతగా కళ్ళూ మొహం చేతులూ తిప్పాడు. ఆయన తిప్పాలేడు…..తిప్పే పరిస్థితిలోనూలేడు చెవి దగ్గిర సెల్లయ్యె. ఇంతలో వంటావిడ కాబోలు మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ వెంటనే రెండు కప్పులు టీ కూడా పట్టుకొచ్చింది. టీ తాగుతున్నంతసేపూ ఉస్సురుస్సురంటూ అపసోపాలు పడిపోతున్న పూర్ణమ్మని పలకరించే సాహసం చెయ్యలేకపోయాడు సుందరం. తాగడం పూర్తయ్యేసరికి నిను వీడని నీడను నేనే పాట జేబులో. తప్పదు….వెంటనే బయల్దేరి వెళ్ళాలి….ఎంత పొద్దుపోయినా ముందు ఆఫీసర్ గారింటికెళ్ళి కలవాలి. లేకపోతే రేపు ఆయనగారి కోపానికి గురి కావల్సిందే…..కంగారుపడుతూ లేచాడు సుందరం. ఆ మనవరాలు ఏం కబుర్లు చెప్తోందో ఆ తాతగారికి ఏమి అర్థమవుతోందో తెలియదు కానీ తన పరిస్థితి తనకి బాగానే తెలుస్తోంది. మెల్లిగా గదిలోంచి ఇవతలపడ్డాడు. ఆ తర్వాత ముందు గదిలోకొచ్చి ముగ్గురు అన్నదమ్ముల చెవుల్లోనూ సెల్ ఉండడంతో చెయ్యి ఊపి బయట పడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked