కథా భారతి

హనుమాన్ హేవన్

డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం

శ్రీనగర్ కాలనీ లో పని ముగించుకుని బయటకు వచ్చిన సీతారాం కు బస్ స్టాప్ లో నిలబడిన ఉమాపతి కనబడ్డాడు. అసలు అతను ఉమాపతి అవునా కాదా అని కాసేపు మల్ల గుల్లాలు పడ్డాడు. ఎందుకంటే ఉమాపతి ది నల్లటి నొక్కుల క్రాపు . దూరంనుండి చూస్తే ముక్కు మొగం ఉమాపతి లాగే ఉన్నా బట్ట తల చూసి అనుమాన పడ్డాడు. ఎందుకైనా మంచిదని దగ్గరగా వెళ్ళి చూసి అతగాడు తన స్నేహితుడు ఉమాపతే అని నిర్ధారించుకుని వెనుక నుండి వెళ్ళి వీపు మీద గట్టిగా చరిచాడు. ముందుకు పడ బోయిన ఉమాపతి నిలదొక్కుకుని “ఎవడ్రా ఆది “అంటూ రౌద్రమ్ గా వెనక్కి తిరిగాడు. ముప్పై రెండు పళ్ళు కనబడేలా నవ్వాడు సీతారాం. “ఇదే మరి. ముప్పై అయిదేళ్ళ దాకా పెళ్లి చేసుకోకండా ఉంటే నొక్కుల క్రాపు పోయి బట్ట తల రాదూ ? “స్నేహితుడి భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు సీతారాం. సీతారాం ను చూడగానే ఉమాపతి ముఖం చేట అంత అయ్యింది.

ఇంటర్ లో రెండేళ్ళు, బి.ఎ.లొ మూడేళ్లు కలిసి అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ లో చదువుకున్నారు వాళ్ళు. ” ఎన్నేళ్ళు అయిందిరా నిన్ను చూసి? మా చెల్లెలు ఎలా ఉంది? నీ డ్యూప్లికేట్ ఏవంటున్నాడు? ” స్నేహితుడి చేతులు వదల కుండా ప్రశ్నలు కురిపించాడు. ” అందరు బాగున్నాము . నీ సంగతేమిటి? ఇంకా నువ్వు చంటి పిల్ల వాడివే అనుకుంటున్న్నారా మీ అమ్మా , నాన్నా. లేక నీకు ఎవరు నచ్చడం లేదా? ” ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ” అంటూ ఆటో ని పిలిచి ఇద్దరు ఎక్కారు. మూడో అంతస్తు లో ఉన్న తన ఫ్లాట్ తాళం తీసి లోపలికి తీసుకు వెళ్లాడు ఉమాపతి. ” ఇదేమిటిరా అమ్మావాళ్లు లేరా? ఇక నేను ఎందుకు వచ్చి నట్టు?” సీతారాం ఆశ్చర్యం గా అడిగాడు.

“అమ్మావాళ్ళు, అన్నా, మా ఇద్దరు చెల్లెళ్ళు గచ్చిబౌలి లో ఒకే చోట వాళ్ల ఫ్ల్యాట్స్లో ఉంటారు. నాకు ఆఫీస్ కు దగ్గర అని ఇక్కడ అద్దెకు వుంటున్నా.” క్లుప్తం గా చెప్పాడు. “అయితే ఈ రోజు సెలవు కదా పద అమ్మా వాళ్ళందరిని చూసి వెళ్తాను. మళ్లీ నేను హైదరాబాదు రావడం ఎప్పటికొ” చనువు గా అన్నాడు సీతారాం.
” నీ ఖర్మ పద ” నిట్టూర్పు విడిచి బయలు దేరాడు ఉమాపతి. “హనుమాన్ హావేన్ “అని బోర్డ్ మీద రాసి ఉన్న కాంప్లెక్స్ ముందు ఆటో ఆపించాడు ఉమాపతి.
“ముందు అమ్మా వాళ్లను చూద్దాం” ఉత్సాహం గా అన్నాడు సీతారాం. “హు! భోజనం టైమ్ అయింది నీ అదృష్టం ఎలా ఉందో “ఒకరకమైన వేదాంత ధోరణిలో అన్నాడు ఉమాపతి. స్నేహితుడి బాధ ఏమిటో అర్థం కాలేదు సీతారాం కు. చాలా కాలం తరువాత కనబడిన సీతారాం ని సాదరంగా మాట్లాడించారు ఉమాపతి తల్లి, తండ్రి. “ఎండన పడి వచ్చావు చల్లగా జూస్ తెస్తాను ” అంటూ లోపలికి వెళ్ళి గాజు గ్లాసునిండా రసం ట్రే లో పెట్టుకుని వచ్చింది ఆ ఇల్లాలు. ఆకు పచ్చ రంగులో ఉన్న ఆ రసం ఏం జూసో అర్థం కాలేదు సీతారాం కు. అడిగితే బాగుండదని గ్లాసు అందుకుని నోటిదగ్గర పెట్టు కున్నాడు. ఉమాపతి జాలిగా చూస్తున్నాడు మిత్రుడి వైపు. ఒక గుక్క తాగగానే సీతారాం ముఖం అష్ట వంకరలు తిరిగింది. “పుదీనా జూసు. బావుందా? భోజనానికి ముందు తాగితే మంచిది కూడా .” ప్రేమగా చెప్పింది ఉమాపతి తల్లి. ఎలాగో కష్టపడి రెండు గుక్కలు మింగి గ్లాసు పక్కన పెట్టేసాడు . సీతారాం. ఏమనుకున్నాడో అని స్నేహితుడి వైపు చూసాడు. “ఇప్పుడే ఏమైంది? ముందు ఉంది ముసళ్ళ పండుగ “అన్నట్టు నవ్వాడు ఉమాపతి. కాసేపు కబుర్లు అయ్యాక ” భోజనానికి లేవండి ” అన్నాడు పితృదేవుడు. “అతిధి దేవో భవ ముందు వాడికి పెట్టండి . నేను భోజనం చేసి వచ్చాను.” సీతారాం భుజంతట్టాడు ఉమాపతి. భోజనాల బల్ల దగ్గకు వెళ్ళి కుర్చీలలో కూర్చున్నారు . లోపలికి వెళ్ళి కంచాలు ఒక్కొక్కటి తీసుకు వచ్చింది ఆమె. హోటల్ లో పెట్టినట్టు కంచాల నిండా కప్పుల లో పదార్థాలు వడ్డించి ఉన్నాయి.

ఏ కప్పులో చూసిన ఆకు పచ్చ రంగులో కనబడు తోంది. బీన్స్ కూర, తోట కూర ఇగురు, పాలకూర పులుసు, ములక్కాడ ల ముద్ద కూర, మెంతి కూర పులుసు కూర కొత్తిమీర రసం ఉన్నాయి. “ఇవాళ గ్రీన్ డే ” అన్నది మాతృమూర్తి కించిత్ గర్వంగా. అర్థం కాన ట్టుగా చూసాడు సీతారాం. “ఒక్కొక్క రంగు కూరగాయల లో ఆరోగ్యానికి మంచి చేసే ఒక సుగుణం ఉంటుందట . అందుకే రోజుకు ఒక రంగు కాయగూరలు తింటాము. “ఉత్సాహం గా చెప్పాడు ముసలాయన. బలవంతంగా నవ్వాడు సీతారాం. అన్నం తీసుకు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ వూసే ఎత్తకుండా తినడం మొదలు పెట్టారు ఆ దంపతులు. ” అన్నం తెల్లగా ఉంటుంది కదా ” నవ్వి చెప్పాడు ఉమాపతి బిక్క మొగం వేసుకుని తన వైపు చూసిన మిత్రుడికి. “తిను బాబూ మొహమాటం లేకుండా తిను.. ఇంకా కావాలంటే వేస్తాను ” అచ్చం కాశీ అన్నపూర్ణ లా అన్నది ఉమాపతి తల్లి. మింగ లేక, కక్క లేక ఏదో తిన్నాననిపించి చేయి కడుక్కున్నాడు సీతారాం. కాసేపటి తరువాత సీతారాం ని పక్కనే ఉన్న అన్నగారింటికి తీసుకు వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్ట గానే ఒకామె తలుపు తీసింది అన్నయ్య ఇంట్లో ఉన్నాడా వదినా” అంటూ లోపలికి అడుగు పెట్టాడు ఉమాపతి. “పిలుస్తాను కూర్చోండి” అని చెప్పి మిలిటరీ వాళ్ళు నడిచి నట్టు కాళ్ళు ముందుకు విసురుతూ లెఫ్ట్ రైట్ తరహా లో లోపలికి వెళ్ళింది ” ఏవండీ మీ తమ్ముడు ” అంటూ. “వస్తున్నా! అంటూ లోపలి గదిలో నుండి చిన్న పిల్లలు పాకినట్టు మోకాళ్ళ మీద పాకుతూ గుమ్మం దగ్గరకు వచ్చాడు ఉమాపతి అన్న రమాపతి. “ఇదేమిటి.? అన్న విధంగా కంగారుగా ఉమాపతి వైపు చూసాడు సీతారాం. “నువ్వా సీతారాం! చాలా కాలానికి కనిపించావు. బాగున్నావా? నిలబడే ఉన్నారు? కూర్చోండి .కంగారు పడకు నేను బాగానే ఉన్నాను. ఆ మధ్యన ఒక మెడికల్ జర్నల్ లో చదివాను నడక కన్నా,పరుగు కన్నా, చిన్న పిల్లల లాగా మోకాళ్ళ మీద పాకడం చాలా మంచి వ్యాయామం అని. అందుకే. ” కుర్చీల కోసం చుట్టూ చూసాడు సీతారాం. “అబ్బే మా ఇంట్లో కుర్చీలు వాడము. ఎందుకంటే క్రింద కూర్చుని లేవడం ఒంటికి మంచిదని”. గల గల నవ్వుతూ చెప్పాడు. అప్పటికే ఉమాపతి నేల మీద చతికిల పడ్డాడు సీతారాం కూడా తప్పనిసరిగా కింద కూచున్నాడు. “ఏమోయ్ కాఫీ ఇస్తావా” అని భార్యను కేక పెట్టాడు. “వస్తున్నా , అంటూ ఆవిడ వంటగట్టు వైపుకు అదే మిలటరీ స్టైల్ లో నడుచుకుంటూ వచ్చింది. వంట గది, హాలు అంతా కలిసే ఉండడం వలన ఆవిడ మాకు కనబడుతూనే ఉంది. కాఫీ గిన్నె స్టవ్ మీద పెట్టి ఆమె ఒక చోట నిలబడ కుండా ఒకసారి కుడి కాలు జాపి మళ్లీ దగ్గరకు తీసుకోవడం, అలాగే ఎడమ కాలు జాపి మళ్లీ దగ్గరకు తీసుకోవడం చేస్తోంది. ఒకో సారి వంట గట్టు మీదకి పూర్తిగా వంగి మళ్లీ తిన్నగా నిలబడుతోంది. సీతారాం అటు వైపు కళ్లప్పగించి చూడడం గమనించి రమాపతి వివరించాడు. “తను కవాతు చేస్తున్నట్టు నడవడం వలన కీళ్ల నొప్పులు రావు. ఇప్పటి శరీర కదలికలు అన్ని వ్యాయామం లో భాగమే.” అని ఇంతలో గదిలో నుండి పదిహేనేళ్ళ రమాపతి కూతురు వచ్చింది. బాలే నృత్యం చేస్తున్నట్టు మునిగాళ్ల మీద నడుస్తూ నాట్య భంగిమలో ఉన్నట్టు చేతులు కదుపుతూనాట్యం చేస్తున్నట్టుగా అడుగులు వేస్తూ వచ్చింది.

“ఇంట్లో కూడా నాట్యం చేసినట్టు నడిస్తే మంచి వ్యాయామం అని వాళ్ళ టీచర్చె ప్పిందట ” మురిపం గా కూతురును చూస్తూ చెప్పింది రమాపతి భార్య. ఆవిడ కాఫీ ట్రే పట్టుకుని మార్చ్ ఫాస్ట్ చేస్తూ వస్తుంటే ఆ కాఫీ కాస్తా నేలపాలవుతుందేమో అని గభాలున లేచి ట్రే అందుకోబోయి, క్రింద కూర్చోవడం వలన మోకాళ్ళు పట్టుకు పోయి కూలబడ్డాడు సీతారాం. అంత సేపటి నుండి మోకాళ్ళ మీదే కూర్చున్న రమాపతి నవ్వాడు. “నువ్వూ నా లాగా మోకాళ్ళ మీద పాకడం అలవాటు చేసుకుంటే కాళ్ళు పట్టేయడం ఉండదు. ” సలహా ఇచ్చాడు. “అసలు కాళ్ళు మిగలక పోవచ్చు అరిగి పోవడం ములాన” మనసు లో అనుకున్నాడు సీతారాం. కాఫీ తాగేసి పని ఉందంటూ హడావిడి గా బయట పడ్డారు. ఇక పోదాం ఉమాపతీ” నీరసంగా అన్నాడు సీతారాం. “అయ్యో ఇంతదూరం వచ్చి మా చెల్లెళ్లను చూడకండా వెళ్తావా? పద “అంటూ పై అంతస్తుకు లాక్కు పోయాడు పోయాడు ఉమాపతి. తలుపు తీసి “రండి రండి ” అంటూ ఆహ్వానించింది ఉమాపతి చెల్లెలు. ఆమెను చూసి కంగు తిన్నాడు సీతారాం. తను ఇదివరకు చూసినప్పుడు చక్కగా కళగా కన బడేది. ఇప్పుడు చూస్తే ముఖం పిండి పూసినట్టు తెల్లగా ఉంది. ” భయ పడకు. ఫేషియల్ చేసుకుంది. ” చెవిలో చెప్పాడు ఉమాపతి. “కూర్చోండి. చాలా రోజులైంది చూసి చాలా సంతోషం మిమ్మల్ని చూడడం..” అంది. ముఖానికి ఉన్న పూత బిగుసుకు పోవడం వలన కాబోలు నోరు పూర్తిగా తెరవకుండా పెదిమలు మాత్రం కదిపి రోబో లా మాట్లాడుతోంది. ఆ సంతోషం గాని మరే భావం గాని ముఖం లో కనబడలేదు.

“కాఫీ తెస్తాను “అంది మళ్లీ. “వద్దు ఇప్పుడే అన్న ఇంట్లో తాగి వచ్చాము “చెప్పాడు సీతారాం. “పోనీ పండు తెస్తాను “అని వెళ్ళింది. ముఖం కడుక్కుని అరటి పళ్ళు, ఒక కప్పులో పెరుగు తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది. ముఖమాటం కొద్దీ ఒక పండు తీసుకుని తొక్క ఒలిచి పక్కనే ఉన్న చెత్త బుట్టలో వేయబోయాడు. “అయ్యోయ్యో పారేయకండీ ” అంటూ చేతిలో నుండి అరటి తొక్క లాక్కుంది. బిత్తర పోయి చూసాడు సీతారాం. అరటి తొక్క లోపలి భాగంతో ముఖం రుద్దుకుంటూ “అరటి తొక్క తో ముఖం మీద రుద్దుకుంటే ముఖం మీది చర్మం మెత్తగా ,సిల్క్ లా అవుతుందట ” అంది. “ఓ ” అనేసి ఏమి అనాలో తెలియక పండు తినేసాడు సీతారాం. ఉమాపతి మాత్రం వస్తున్న నవ్వు ఆపుకుంటున్నాడు. “తియ్యని పెరుగు చక్కెర వేసి తెచ్చాను తినండి. వేసవి కాలం చలవ చేస్తుంది.” ఆదరం గా చెప్పింది. సరేనని కప్పు తీసుకుని చంచాతో పెరుగు తీసుకున్నాడు. పైనే మీగడ తరక ఉంటే తీసి ప్లేట్ లో వేయబోయాడు. గబుక్కున తను చేత్తో తీసుకుంది. ఆ మీగడను రెండు చేతులతో రుద్ది మెడకు రాచుకుంది” ఇలా చేస్తే మెడ మీద ముడతలు రావు ” అంది. అంతలో ఆమె భర్త లోపలినించి వచ్చాడు. క్రాపు కన బడ కుండా గోరింటాకు పేస్ట్ పూసుకున్నాడు. ముఖం నూనె కారుతోంది. “ముప్పై ఏళ్ల కె తల్లో తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి అన్నయ్యా.
అందుకే బలవంతంగా గోరింటాకుతలకు పెట్టాను. ముఖానికి కాస్త ఆల్మండ్ ఆయిల్రా సుకుంటే మంచిదట అందుకే అది పట్టించాను .” వివరించింది. ఇంకో గది లో నుండి అయిదేళ్ళ పాప చేతులు జాపి గుడ్డి వాళ్ళు తడుముకున్నవిధంగా నడుస్తూ వచ్చింది. పాప ముఖం మీద ,కళ్ల మీద చక్రాలుగా తరిగిన బంగాళాదుంప
ముక్కలు అతికించి ఉన్నాయి. “బంగారు రంగులో ఉండే పిల్ల కాస్తా ఎండలో ఆడి నల్లబడింది. అందుకే ఇలా ఆలు గడ్డ పల్చని చక్రాలు గా చేసి ముఖం మీద పెట్టుకుంటే ట్యాన్ పోతుందిట” అంది నమ్మకంగా . ఇంకా ఉంటే ఇంకేమి సౌందర్య రహస్యాలు నేర్చుకోవాలో అని భయపడి మేము వెళ్తాము అని బయలుదేరాడు సీతారాం.

“ఇంక ఈ శిక్ష చాలురా క్షేమం గా ఇల్లు చేర్చు నన్ను. పాపం నా భార్యకు నేనొక్కడినే .” వేడుకున్నాడు “సీతారాం. “అందరి ఇళ్ళకు వెళ్ళి తనను మాత్రం చూడకండ పోతే చిన్న చెల్లి నొచ్చుకోదూ? అయిదు నిముషాలు చూసి వెడదాము.” బ్రతిమాలాడాడు ఉమాపతి . మేడ మీదే ఉన్న చిన్న చెల్లి ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీసి ” సీతారాం అన్నయ్య కూడా వచ్చాడా ” అంటూ సంతోషం గా ఆహ్వానించింది. తలుపుకు అటు ఇటు పాత బట్ట తో కుట్టిన రెండు చిన్న సంచులు కనబడ్డాయి. సీతారాం ద్రుష్టి అటు పడగానే ” రీ సైకలింగ్ అన్నయ్య! ఇప్పుడు ఫాషన్ కదా. ఆయన జీన్స్ ప్యాంట్ పాతది ఉంటే దాని కాళ్ల భాగం తో రెండు బ్యాగ్లు వచ్చాయి. ఒకటి ఇంటి తాళాలు పెట్టడానికి, ఇంకోటి ఆయన బైక్ తాళానికి. బావుందా ?” అంది. వూ అన్నాడు మొహమాటంగా. సోఫా చేతులకు జరీ అంచు తొడుగులు కనబడ్డాయి. చూడడానికి విచిత్రం గా ఉంది. ” నా చుడీదారుచొక్కా చేతులు కట్ చేసి తొడుగులు గా వేసా. ఎంత అందం వచ్చిందో చూడు.” గర్వంగా” ఇదేమిటమ్మా ఒకో గుమ్మానికి ఒకో రంగు తెర వేసావు కొత్త ఫాషనా?” చనువుగా అడిగాడు సీతారాం.”కనుక్కో లేక పోయావు చూసావా! అవన్నీ నా చుడిదారు మీది దుప్పట్టాలు అన్నయ్యా! బ్రిలిఎంట్ ఐడియా కాదు ” సంభ్రమం గా అంది. ” నిజమే. ఒకో దానికి ఒకో డిజైన్ బావుంది. ” ఆమె ఉత్సాహాన్ని నీరు గార్చ లేక అన్నాడు సీతారాం. అంతలో చిన్న చెల్లి భర్త గది లో నుండి వచ్చాడు. పైజమా, జుబ్బాలో ఉన్నాడు. ఆయన తొడుక్కున్నది పైజమా న లేక పంచ కట్టుకున్నాడా అర్థం కాలేదు. పైజమా కాళ్లకు కింది భాగం లో ఒక వైపు ఎరుపు జరీ అంచు, మరో వైపు ఆకు పచ్చ జరీ అంచు ఉన్నాయి. సీతారాం పరీక్ష గా చూస్తుంటే ఉమాపతి చెల్లి నవ్వింది.” ఏ వేడుకకు వెళ్ళినా ఈయనకు పంచలు పెడుతున్నారు అన్నయ్యా. ఈయన ఏమో పంచలు కట్టరు. అందుకే పంచలు కత్తిరించి పైజామాలు కుట్టి పెట్టాను. ఇంట్లో వాడుకో డానికి. ” అంది. ఆయన ఇబ్బంది గా నవ్వాడు . సీతారాం ఇక వెళ్దామా అన్నట్టు లేవ బోయాడు. “ఉండు అన్నయ్యా! కాస్త ఉప్మా తిని పోదువు గాని “అంటూ వంటింటి లోకి వెళ్ళి రెండు పళ్ళేలలో తీసుకు వచ్చింది. డైట్ భోజనము చేసి ఆకలి మీద ఉన్నాడేమో, చంచా పక్కన పెట్టి చేత్తో పట్టి నంత తీసుకుని నోట్లో పెట్టు కున్నాడు. పులుపు, వగరు కలిసిన చిత్రమైన రుచి నాలుకను తాకింది తినలేక నోట్లో నీళ్ళు పోసుకుని మింగాడు. ” ఏం ఉప్మా అమ్మా? కళ్ల నీళ్ళు తుడుచుకుని అడిగాడు. “నిన్న శనివారంకదా! ఇడ్లీలు చేశాను . అవి మిగిలితే చిదిపి ఉప్మా చేశాను. బావుందా? ఉత్సాహం గా అడిగింది.

“ఆ చాలా బాగుంది. “నాకే ఆకలి గా లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం, అన్న ఇంట్లో కాఫీ, పెద్ద చెల్లి ఇంట్లో పండు, కడుపు నిండు గా ఉంది. వస్తానమ్మా! ” అని వెనక్కి చూడకండా కిందకి వచ్చాడు. ఉమాపతి నవ్వుకుంటూ అతన్ని వెంబడించాడు.
ఇద్దరు ఆటో ఎక్కి ఉమాపతి ఇంటికి శ్రీ నగర్ కాలనీకి కి వచ్చారు. ” ఇప్పుడు అర్థం అయిందిరా నువ్వు ఇంత దూరంలో ఒక్కడు ఎందుకు ఉంటున్నావో అన్నాడు సీతారాం. “నాకు బట్ట తల ఎందుకు వచ్చిందో, పెళ్లి ఎందుకు కుదర లేదో తెలిసిందా?” నవ్వుతూ అన్నాడు ఉమాపతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked