కవితా స్రవంతి

హృదయం ఊగిసలాట

– కొలిపాక శ్రీనివాస్

గతకాలపు జ్ఞాపకాలు
వర్తమానంతో ముచ్చటిస్తున్నాయి
నిరంతరం నీ తలపులలో
పయనించి అలసిపోయిన
రోజులన్నీ గుర్తొచ్చేసరికి..!
మనసంతా కలుక్కుమంటుంది

ప్రేమగా ముచ్చటించిన
సంగతులు కాలం నీడలో
కదిలిపోతున్న క్షణాలు
యుగాలై మనోవేదనను
రగిలిస్తున్నాయి..!

అలవోకగా నీ జతలో
గడిపిన గురుతులు
ఇప్పుడు భారమై కాలము
కఠినత్వాన్ని ప్రదర్శిస్తోంది

గతములో
నీ సహచర్యపు సంగమం
ప్రకృతితో మిళితమైన
మధురానుభూతులు..
ఉప్పెనలా ఎగిసిన ప్రణయ వేదనలు
ప్రస్తుతాన్ని చుట్టుముట్టి
ఊగిసలాటలో ఊరేగిస్తున్నాయి.

సమయం తెలవని
సంభాషణలన్నీ కూడా
ఇద్దరికీ నడుమ మధ్యవర్తిగా ఉన్న
చరవాణికి అడిగితే తెలుస్తుంది.!

ఆశలకు స్వప్నాలకు మధ్య
వారధిగా నిలబడి
ఉత్తేజాన్ని కలిగించిన మాటలు
నలుదిక్కుల ప్రతిధ్వనిస్తున్నవి

నీ స్పర్శ తాలూకు ఊసుల
తార్కాణాలు అదిమీ పట్టేస్తున్నవి

హృదయం ఎప్పుడూ
ఊగిసలాటలో….
ఊహల్ని అల్లుకొని కడతేరుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked