సారస్వతం

అనుభూతి – ప్రాచీన దృక్పథం (4- భాగం)

– సునీల పావులూరు

ఈ పంచకోశాల ద్వారా కలిగే సంపూర్ణమైన అనుభూతే సమగ్రానుభూతి. ఒక్కొక్క కోశం ద్వారా ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పాక్షికంగా ఉంటుంది. సమాజం పాక్షికానుభూతిని కాకుండా సమగ్రానుభూతిని కాంక్షిస్తోంది.

అనుభవం మానవసమాజానికి మూడు రకాలుగా అందించబడుతోంది. శాస్త్రపరంగానూ, తత్త్వపరంగానూ, కవిత్వపరంగానూ అనుభవ ఏకసూత్రత జరుగుతోంది.

“భూమిమీద మనిషి అడుగు పెట్టినప్పట్నించీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికీ, ఈ ప్రపంచంతో సంధానం (adjustment) కుదుర్చుకోవటానికీ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమంటే విభిన్నమైన ప్రాపంచిక అనుభవాల్లో ఏకసూత్రతని సాదృశ్యాన్ని సాధించటమన్నమాట. ఈ ప్రయత్నం శాస్త్రం ద్వారా, తత్త్వం ద్వారా, కవిత్వం ద్వారా మూడు విధాలుగా సాగింది. భౌతిక సంఘటనల్లో ఏకసూత్రతని సాధించటానికి శాస్త్రం పూనుకుంది. వివిధ శాస్త్రాలకు చెందిన భౌతిక సూత్రాలన్నీ, మానసిక, ఆత్మిక విషయాలన్నిటినీ కలిపి ఒకే సూత్రానికి గుచ్చటానికి తత్త్వం పరిశ్రమించింది. మన సజీవ అనుభవాల్లోని ఏకసూత్రతని – దీన్నే సార్వత్రిక సాదృశ్యమన్నాడు – అనుభూతి ద్వారా ఆవిష్కరించటం కవిత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే మార్గానికి మూడు మార్గాలవి”16 మానవుడు ప్రపంచంలోని విభిన్న అనుభవాలలో ఏకసూత్రతని, సాదృశ్యాన్ని సాధించాలనుకొంటున్నాడు. ఇలా సాధించటం మూడు మార్గాల ద్వారా జరుగుతోంది. శాస్త్రం, తత్త్వం, కవిత్వం – ఇవి మూడూ అనుభవ ఏకసూత్రతని మూడు దృక్పథాలతో ప్రపంచానికి అందిస్తున్నాయి. మనిషి భౌతిక సంఘటనలకి అధిక ప్రాముఖ్యం కల్పిస్తుంది శాస్త్రం. భౌతిక, మానసిక, ఆత్మిక విషయాలను అన్నింటినీ ఒకే సూత్రంగా చేయటానికి ప్రయత్నిస్తోంది తత్త్వం. కానీ కవిత్వం మనిషి సజీవ అనుభవాలలోని ఏకసూత్రతని ఆవిష్కరించటానికి ప్రయత్నిస్తోంది. ఇంద్రియాలనుభవాల ద్వారా పారమార్థిక సత్యాలను కవిత్వం ఒక్కటే గ్రహిస్తుంది. శాస్త్రం అనుభూతికి దారి చూపిస్తుందే కానీ అనుభూతిని ఇవ్వలేదు. అనుభూతి స్వసాధనీయ వస్తువు. అది కవిత్వం ద్వారానే సాధ్యం. “కవి భావన మానసిక శక్తుల్లో కెల్లా శాస్త్రీయమైనది; ఎందుకంటే అదొక్కటే సార్వత్రిక సాదృశ్యాన్ని (Universal analogy) గ్రహించగలదు”17 రసం ఎలా సామాజిక నిష్ఠమో అనుభూతి కూడా అలానే సామాజిక నిష్ఠమే. సమాజంలోని ప్రతిమనిషీ అనుభవాన్ని పొందటం సహజం. అది తాత్కాలికం కావచ్చు. కానీ ఒక సంఘటన వలన కలిగిన అనుభూతిని తాత్కాలికంగా మర్చిపోయినట్లు కన్పించినా వాస్తవానికి అది మనలో నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తి నిష్ఠమై ఉన్న వైయక్తికానుభూతులను ఒక చోట సంఘటిత పరచి సామాజికానుభూతిగా మార్చగల శక్తి కవికి మాత్రమే ఉంది. ఈ కవి సమాజానుభవాసక్తిని తనదైన మార్గంలో ప్రతిభ చేత దర్శింపచేయగలగటమే కాకుండా సమాజానికి సమగ్రానుభూతిని తన రచనల ద్వారా అందిస్తాడు.

స్థూలంగా ఆనంద వివేచనం ఇది. అయితే రసం ఎంతవరకు ఆనందమయ అనుభూతి అవుతుంది అన్న విషయం బహుధా చర్చించబడింది. రసం లేదా కావ్యానుభూతి జీవితంలోని ఇతరానుభూతులకంటే భిన్నమైంది. అది బౌద్ధికానుభూతి కాదు. ప్రత్యక్షం, పరోక్షం అయిన ఇంద్రియానుభూతి రాగాత్మక అనుభూతి కాదు. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతమైంది. వ్యక్తి చైతన్య పరిధులకు మించిన సాధారణీకృతానుభవం. కానీ ఈ రసానందం శుద్ధాత్మానందం కాదు. అయితే ఈ భావాలు విశుద్ధాలు. అంటే సాదారణీకృతాలు కావటంతో రాగద్వేషాల స్పర్శలేకుండా ఉంటాయి. కాబట్టి కావ్యానందంలో భౌతికాంశ తక్కువగానూ, చిన్మయాంశ ఎక్కువగానూ ఉంటుంది. అందుకనే మమ్ముటుడు ‘సకల ప్రయోజన మౌళిభూతం సమనంతర మేవ రసాస్వాదన సముద్భూతం విగళిత వేద్యాంతర మానందమ్’ అని పేర్కొనటం జరిగింది.

ఈ రసానందమే అనుభూతివాదానికి పునాది అని ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తమ వాదాన్ని ప్రతిపాదించారు. వారు చెప్పిన ఆనంద అనుభవంలోని పంచకోశవిభాగం ఈ కింది విధంగా ఉంది.

– సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked