సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

“కన్నుల మొక్కేము అంటున్న నాయిక”
కడపను ఒకప్పుడు దేవుని గడప అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప  “గడప”  అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కాలాంతరంలో కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.అక్కడ కొలువై ఉన్న శ్రీనివాసుని పేరు కడపరాయుడు. ఈ కీర్తనలో “కన్నుల మొక్కేము నీకు కడపరాయా!” అని నాయిక కృతజ్ఞతా భావంతో అలమేలుమంగమ్మ స్వామిని వేడుకొంటోంది. చిత్తగించండి.

కీర్తన:
పల్లవి: కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ
గన్నెనాఁడె యేలితివి కడపరాయ

చ.1. కందర్పగురుఁడ వోకడపరాయ మాకు
గంద మీయఁ గదవోయి కడపరాయా
కందము నీగుణములు కడపరాయా తొంటి-
కందువకు రాఁ గదోయి కడపరాయా || కన్నుల ||

చ.2. కలువపూవుల వేసి కడపరాయా నేఁ
గలికి నంటా మెచ్చేవు కడపరాయా
కలకాలముఁ బాయకు కడపరాయా నీ-
కలపుకో లెరుఁగుదుఁ గడపరాయా || కన్నుల ||

చ.3. గరిమ శ్రీ వేంకటాద్రి కడపరాయా నన్నుఁ
గరుణించి కూడితివి కడపరాయా
గరిమేలు నేరుతువు కడపరాయా నా-
గరువ మీడేర్చితివి కడపరాయా || కన్నుల ||
(రాగం: సామంతం; రేకు సం: 879, కీర్తన; 18-472)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అలమేలుమంగమ్మ – అన్నమయ్య అలమేలుమంగమ్మతో “కడపరాయా నీకు మేము కన్నులతోనే మ్రొక్కేము స్వామీ” అని పలికిస్తున్నాడు.

పల్లవి: కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ
గన్నెనాఁడె యేలితివి కడపరాయ
అలమేలు మంగమ్మ స్వామితో ఓ కడపరాయా! ఈ అనుబంధం ఈనాటిది కాదు. నీవు నన్ను నా కన్నెప్రాయమునుండే యేలు చున్నావు అంటోంది.

చ.1. కందర్పగురుఁడ వోకడపరాయ మాకు
గంద మీయఁ గదవోయి కడపరాయా
కందము నీగుణములు కడపరాయా తొంటి-
కందువకు రాఁ గదోయి కడపరాయా
ఓ కడపరాయుడా! నీవు మన్మథునికే గురువువు! (అంటే తండ్రి అనే అర్ధంలో ప్రయోగించిన మాట). ఆ మన్మధునికి ముమ్మూర్తులా నీ పోలికలే వచ్చాయి అని చెప్పడం. నాకు గంధం ఇచ్చి నా వలపును అంగీకరించండి అంటోంది అమ్మ. మీ గుణములు మబ్బులవలె నిలకడ లేనివి సుమా! అనగా నీకు ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పలేము కనుక తొల్లి నన్ను ఎక్కడైతే కరుణించి కలిశావో అక్కడే నీకోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటాను. స్వామీ! అక్కడకు వచ్చి నన్ను కరుణించండి అని పిలుస్తోంది.

చ.2. కలువపూవుల వేసి కడపరాయా నేఁ
గలికి నంటా మెచ్చేవు కడపరాయా
కలకాలముఁ బాయకు కడపరాయా నీ-
కలపుకో లెరుఁగుదుఁ గడపరాయా

ఓ కడపరాయా! ఒకనాడు నాపై కలువపువ్వులను వేసి నన్ను సుమనోహరమైనదానినని నన్ను మెచ్చుకున్నావు. కలకాలము నన్ను విడువకుండా ఉండేందుకు నిన్ను ప్రార్ధిస్తున్నాను స్వామీ…నన్ను విడువకు. నీ కలుపుగోలు తనము నేను ఎరిగినదానను. ఎవరిపై తమకు ఎప్పుడు ప్రేమ కలుగుతుందో ఎందుకు కలుగుతుందో చెప్పలేము స్వామీ!

చ.3. గరిమ శ్రీ వేంకటాద్రి కడపరాయా నన్నుఁ
గరుణించి కూడితివి కడపరాయా
గరిమేలు నేరుతువు కడపరాయా నా-
గరువ మీడేర్చితివి కడపరాయా

ఓ కడపరాయా! చాలా ఘనమైనటువంటి శ్రీవేంకటాద్రి మీద కొలువున్న శ్రీనివాసా! నీవు కరుణ చూపించి నన్ను కూడావు. స్వామీ! తమరు మాయలు నేర్చినవారు. నాకు గర్వం పోగొట్టి నా అభిమానాన్ని నిలబెట్టినందులకు నీకు నేను సర్వదా కృతజ్ఞురాలను స్వామీ! నన్నేలుకో! అని ప్రార్ధిస్తోంది అమ్మ అలమేలుమంగమ్మ.

ముఖ్య అర్ధములు: గడపరాయా = దేవుని గడప (కడప) లో నెలవైన శ్రీనివాసా!; కన్నెనాడె = కన్నెప్రాయము నుండి అనగా కన్నె అయినప్పటినుండి; కందర్ప గురుడవు = మన్మధునికి గురుడవు, మన్మధునికి తండ్రివి; కందము = మేఘము; కందువ = ఎప్పుడూ ఉండే ప్రదేశము; కలికి = చాలా అందమైన స్త్రీ; బాయకు = విడిచిపెట్టవద్దు; కలుపుకోలు = కలివిడి తనము, అందరితో కలిసిపోవుట; గరిమ = ఘనము, గొప్పదైన; గరిమె = మాయ; గరువము = గర్వము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked