సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఏల నీవు సిగ్గువడే వింతలోనను

ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని వలచి వలపించుకొన్న అమ్మ పద్మావతీదేవి ఆభిజాత్యంతో అంటున్న మాటలను మనకు వినిపిస్తున్నాడు. “స్వామీ! మీరెందుకు సిగ్గుపడతారు. నేను మీ పట్టపు రాణిని. నిన్ను ఎంతమంది కాంతలు మోహించినా వలచినా నాకేమి స్వామీ! బంగారం వంటి భార్యను నేనే కదా! నీ హృదయంలో నే నాకు చోటిచ్చావు నాకు ఇంక నాకు దిగులేమిటి” అంటున్నది అమ్మ. అన్నమయ్య అమ్మచే పలికిస్తున్నాడు అందంగా. అదేమిటో ….ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం….

కీర్తన:
పల్లవి: ఏల నీవు సిగ్గువడే వింతలోనను
మేలిమియిల్లాల నీకు మించి నేనేకాదా || ఏ ల నీవు ||

చ.1. క్కడఁ దిరిగినా మాయింటికే వత్తువు నీవు
తొక్కుమెట్టాడి నిన్ను దూరనేఁటికి
పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా
తక్కిన చుట్టుపు పొందు తామరే కాదా

చ.2. తలఁపు నీకేడనున్న తనువు నాపై వేతువు
చెలరేఁగి నిన్ను రట్టుసేయనేఁటికి
సొలసి చల్లగాలికి చోట్లెన్ని గలిగినా
మలయఁ బేరైనచోటు మలయాద్రిగాదా || ఏ ల నీవు ||

చ.3. నింద నీకెంత మోచినా నీవె నన్నుఁ గూడితివి
కందువ నీ గుణాలు పొగడనేఁటికి
యెందరు శ్రీ వెంకటేశ యింతులు గలిగినాను
యిందిరను నీయిల్లు నా యెదలోనె కాదా || ఏ ల నీవు ||
(రాగం: పాడి; రేకు: 133-5,కీర్తన; 7-197)

విశ్లేషణ:
పల్లవి: ఏల నీవు సిగ్గువడే వింతలోనను
మేలిమియిల్లాల నీకు మించి నేనేకాదా

అన్నమయ్య తాను పద్మావతీదేవిగా మారి అమ్మ అంతరంగాన్ని స్వామివారికి నివేదిస్తున్నాడు. స్వామీ! మీకు బంగారం లాంటి భార్యను నేనే కదా! ఇంకా ఈ సిగ్గులెందులకు. ఎంత మంది నిన్ను వలచినప్పటికీ నీ ప్రాణాన్ని నేనే! అని ఆభిజాత్యంతో అమ్మ పలికే పలుకులను వినిపిస్తున్నాడు అన్నమయ్య.

చ.1 ఎక్కడఁ దిరిగినా మాయింటికే వత్తువు నీవు
తొక్కుమెట్టాడి నిన్ను దూరనేఁటికి
పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా
తక్కిన చుట్టుపు పొందు తామరే కాదా

తమరు ఎక్కడ తిరిగినప్పటికీ ఎవరితో వినోదించినప్పటికీ చివరకు వచ్చేది మన ఇంటికే గదా! మిమ్మల్ను కష్టపెట్టి నేను మాట్లాడడం వలన ఉపయోగం ఉంటుందా చెప్పండి? తుమ్మెద తోటలో ఎన్ని పుష్పాలపై వాలినప్పటికీ దాని చుట్టపు పొందు తామర పూవుతోనే కదా! ఇంత చిన్న చిన్న విషయాలకు యాగీ చేసి మీ మనసు కష్టపెట్టడం ఎందుకు స్వామీ! అంటోంది అమ్మ.

చ.2. తలఁపు నీకేడనున్న తనువు నాపై వేతువు
చెలరేఁగి నిన్ను రట్టుసేయనేఁటికి
సొలసి చల్లగాలికి చోట్లెన్ని గలిగినా
మలయఁ బేరైనచోటు మలయాద్రిగాదా

నీ అలోచనలు ఎవరిపై ఉన్నా కూడా చివరకు తనువు నాతోనే కదా పంచుకుంటావు. నీ మనసులో భక్తులు, యోగులు, మునులు, ఋషులు అనేకమంది ఉండవచ్చునని మరొక భావంతో అన్నమయ్య అంటున్నాడు. ప్రపంచంలో చల్లని పవనాలు ఎన్ని చోట్ల ఉన్నప్పటికీ మలయ పరవతంపై వీచే గాలులు ఆ పర్వతానికే స్వంతం గదా! అలాగే నీవు ఎన్ని చోట్ల విహరించినా సేద తీరేది మాత్రం నాతోనే కదా స్వామీ! అంటున్నది.

చ.3. నింద నీకెంత మోచినా నీవె నన్నుఁ గూడితివి
కందువ నీ గుణాలు పొగడనేఁటికి
యెందరు శ్రీ వెంకటేశ యింతులు గలిగినాను
యిందిరను నీయిల్లు నా యెదలోనె కాదా

మిమ్ములను ఎంతమంది ఎన్నివిధములుగా కోరుకున్నప్పటికీ మీ మనసు నాపైనే. మీరు సదా నన్నే కూడి ఉంటారు కదా! ఇక ఈ ఏకాంతమున మీ గుణగణాదులు నేను పొగడవలసిన పని ఏమున్నది స్వామీ! శ్రీనివాసా! నీవు ఎందరు కాంతలను పొందినప్పటికీ నీ హృదయం మాత్రం ఇందిరాదేవిదే కదా! నా గృహమే నీ ఎద..నీ హృదయం… నాకు ఇంతకంటే కావలసినదేమున్నది స్వామీ అంటున్నది ఇందిరాదేవి.

ముఖ్య అర్ధములు: మేలిమి = బంగారము, ఆధిక్యము, ఔత్కృష్ట్యము, గౌరవము; మించి = అన్నిటికంటే ఎక్కువ; తొక్కుమెట్ట = కష్టపెట్టడం; చుట్టపు పొందు = బంధుప్రీతి; రట్టు = అల్లరి; మలయాద్రి = చల్లని మలయమారుతం వీచే కొండ; మోయు = వహించు, భారము మోయు; కందువ = ఏకాంతమున, చమత్కారముగ; ఎదలోన = నీ హృదయములో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked