సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

–  టేకుమళ్ళ వెంకటప్పయ్య

చెలియమోము చూడరమ్మా

ఇది ఒక శృంగార సంకీర్తన. అన్నమయ్య, చెలులలో ఒకచెలికత్తెగా మారి అమ్మ అలమేలు
మంగమ్మ ముఖసౌందర్యం చూడమంటున్నాడు. అమ్మ బాహ్యప్రపంచంలో ఇక్కడ ఉన్నప్పటికీ ఆమె
చిత్తమంతా శ్రీవేంకటేశ్వరుని మీదనే అని సరదాగా వేళాకోళమాడుతూ
పరామర్శిస్తున్నాడు. ఆ విశేషాలు చూద్దాం.

కీర్తన:

పల్లవి: చెలియమోము చూడరమ్మా

చెలియమోహము నేఁడు చెలుల కగ్గలమాయ ॥పల్లవి॥

చ.1.చిత్త మాతని మీఁద చేయి చెలియ మీఁద

కొత్తెన గమనంబు కొన వేళ్ల మీఁద

తత్తరపుఁ దాపంబు తనువల్లి మీఁద

బిత్తరపుఁ గోపంబు ప్రియ సతుల మీఁద ॥చెలియ॥

చ.2.అలపులును సొలపులును అంగజుని మీఁద

తలపంత యెడ లేక దైవంబు మీఁద

పలుకులును బంతములు ప్రాణంబు మీఁద

తెలుపులును తెగువలును దీమసము మీద ॥చెలియ॥

చ.3.ఇంపు సొంపులు వేంకటేశ్వరుని మీఁద

గుంపైన చందురులు కుచయుగము మీఁద

కెంపుఁ గనుగవచూపు గిలిగింత మీఁద

దంపతుల పరిణతులు తమకంబు మీఁద ॥చెలియ॥

(రాగం: కాంబోధి ; రేకు: 34-4, కీర్తన; 6-133)

విశ్లేషణ:

పల్లవి: చెలియమోము చూడరమ్మా

చెలియమోహము నేఁడు చెలుల కగ్గలమాయ

చెలులారా! అమ్మ ముఖం చూశారా! ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో! అమ్మ అలమేలుమంగమ్మ
ముఖసౌందర్యం ఈ రోజు ఎంత అధికంగా అతిశయించి ఉన్నదో మనకందరికి విదితమౌతున్నదిగదా!

చ.1 చిత్త మాతని మీఁద చేయి చెలియ మీఁద

కొత్తెన గమనంబు కొన వేళ్ల మీఁద

తత్తరపుఁ దాపంబు తనువల్లి మీఁద

బిత్తరపుఁ గోపంబు ప్రియ సతుల మీఁద

అమ్మ చేతులు చెలులమీద ఉన్నా మనస్సుమాత్రం ఆ గోవిందునిమీదనే ఉన్నది. కొన వేళ్ళతో
చెలులను తాకుతూ పరామర్శిస్తున్నా..ఆమె తాపం మాత్రం స్వామి కలయిక, చేరిక మీదనే
ఉన్నది. ఈ కోపం అంతా చెలులమీద చూపిస్తున్నది.

చ.2.అలపులును సొలపులును అంగజుని మీఁద

తలపంత యెడ లేక దైవంబు మీఁద

పలుకులును బంతములు ప్రాణంబు మీఁద

తెలుపులును తెగువలును దీమసము మీద

అమ్మ తన అలుపులు సొలపులు ఆ మన్మధుని మీద చూపిస్తోంది. చిత్తం మాత్రం సదా ఆ
శ్రీనివాసుని మీదనే ఉన్నది. మాటలు చేతలు ఇహలోకంలో ఉన్నా తెగువ ధైర్యం మాత్రం
ఎక్కువగా ఉన్నది.

చ.3.ఇంపు సొంపులు వేంకటేశ్వరుని మీఁద

గుంపైన చందురులు కుచయుగము మీఁద

కెంపుఁ గనుగవచూపు గిలిగింత మీఁద

దంపతుల పరిణతులు తమకంబు మీఁద

అమ్మ యిష్టాలు సంతోషాలు మాత్రం విడవకుండా ఆ శ్రీవేంకటేశ్వరుని మీద, అమ్మ
వక్షస్థల కాంతులు ప్రకాశవంతంగా చంద్రుని వెన్నెలవలె నున్నది. ఆమె కన్నులుచూపు
స్వామిని మనోఫలకంలో తిలకిస్తూ ఉన్నాయి. ఆ జంట మోహము పరిణతిచెందిన ప్రణయాన్ని
తెలియజేస్తూ ఉన్నది అంటున్నాడు అన్నమయ్య.

ముఖ్య అర్ధములు: అగ్గలము = వెగ్గలము, అధికము; చిత్తము = మనసు; కొత్తెము =
తాటిపండు యందలి ముంజె; కొనవేళ్ళు = ముని వేళ్ళు; తత్తరము = తొందరతో కూడినటువంటి;
తాపము = మోహము; తనువల్లి = తనువల్లుకొనడం, కౌగిలి; బిత్తరపు = తళుకైన,
ప్రకాశించు; అంగజుడు = మన్మధుడు; దీమసము = ధైర్యము; గుంపైన చందురులు = ఎన్నో
చంద్రుల కాంతి; కుచయుగము = వక్షస్థలము; కనుగవ = కన్నులౙత; పరిణతులు = పరిపక్వము
చెందు, పరిపాకముఁ బొందుట.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked