సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈకీర్తనలో అన్నమయ్య ఒక తమాషా పద్ధతిలో అమ్మవారి సొగసులను వర్ణిస్తాడు. అమ్మా నువ్వు సహజంగానే అందగత్తెవు. నీకు ఈ కృత్రిమ మెరుగులు పూతలు ఎందుకు అంటూ ఒక చెలికత్తెగా మారి ప్రశ్నిస్తాడు. చాలా మంది భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్లు గమనించారు. ఒక విషయం మనవి చేయాలి. అన్నమయ్య సంస్కృతాంధ్రాలని ఔపోసన పట్టిన వాడు. ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక అలా రాయలేదు. చంధోబద్ధమైన శతకాలనేకం రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు అంతే! జానపదులను కూడా ఆకట్టుకోడానికి అనేక ప్రయోగాలు చేశాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాల్లో కనిపిస్తాయి. కొన్నేమో గ్రాంధికమైన సంస్కృతము మరియు తెలుగు భాషల్లో ఉంటాయి. మరికొన్నిట్లో అన్నిట్నీ కలిపి కలగాపులగంగా రాయడం. ఈవిధంగా అన్నమయ్య కీర్తనల్ని ఏ కోణంలో చూసినా ఆయనకు సర్వసమతా దృష్టి ఉందన్న సత్యం బోధ పడుతుంది.
కీర్తన:
పల్లవి: గందము వూసేవేలే కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె నెక్కుడా ॥పల్లవి॥
చ.1 అద్దము చూచేవేలే అప్పటపట్టికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘనమా ॥గంద॥

చ.2 బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా ॥గంద॥

చ.3 సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలఁ జవుల నీకునేలే వెంకటపతి –
సవరని కెమ్మో విచవికంటేనా ॥గంద॥
(రాగం: భైరవి; రేకు 1-2; సం 5-2)
విశ్లేషణ:
పల్లవి: గందము వూసేవేలే కమ్మని మేన యీ-
గందము నీ మేనితావి కంటె నెక్కుడా
అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి ఓ అలమేలుమంగా! నీ ఒంటికి చందనం పూసుకుంటున్నావెందుకు? నీ మేనిలో సహజంగా ఉన్న సుగంధం కంటే ఈ గందపు వాసన ఏం గొప్పదనీ? అంటున్నాడు.
చ.1 అద్దము చూచేవేలే అప్పటపట్టికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘనమా
చెలీ! అద్దంలో ఏముందని మాటిమాటికి చూసుకుంటున్నావు? నీ ముఖం అద్దం కంటే అపురూపమైనదని నీకు తెలియదా! కళ్ళకి తామర పువ్వులొత్తుకుంటున్నావు ఎందుకమ్మా! నేర్పెరిగిన నీ కన్నులతో పోలిస్తే తామరపువ్వులు ఏ పాటి చెప్పు? అలాంటి వాటినిఅద్దుకుంటే నీ కళ్ళల్లోని చల్లదనం తామరపువ్వులకి వెళ్తుందిగానీ? తామపువ్వులొత్తుకోవడం వల్ల కళ్ళకేం చల్లదనంవస్తుంది? అంటున్నాడు. గద్దరి అనడంలో నేర్పరి అయిన స్త్రీ అని అర్ధం. పైగా ఆమె జలజవాసిని చల్లదానికేమరుదు అని ఒక కీర్తనలో అంటాడు.

చ.2 బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా!
ఓ పడతీ! నీ ఒంటిపైన బంగారు నగలను నిండా తొడుక్కుంటున్నావు. ఎందుకు? నిగనిగలాడే నీ ఒంటి కాంతికంటే ఈ నగలు గొప్పవనుకుంటున్నావా? నీ ముందు దేనికి పనికొస్తాయని అవి? సన్నగా, పొడవుగా, నాజూగ్గా ఉన్న నీ వేళ్ళకి ఉంగరాలవి అవసరమా? తల్లీ! వేళ్ళ చివర్లో తెల్లగా మెరిసే నీ గోళ్ళకి సాటిరావు ఆ లోహపు ఉంగరాలు అంటాడు.

చ.3 సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలఁ జవుల నీకునేలే వెంకటపతి –
సవరని కెమ్మో విచవికంటేనా
ఓ కోమలీ! జుట్టు పొట్టిగా. పలుచగా, ఉంటే సవరం కావాలేమోగానీ, పొడవుగా, ఒత్తుగా నిగ నిగ మెరిసే నీ జుట్టుకి సవరమెందుకు చెప్పు? అరాళ కుంతలా అంటారు గదమ్మా నిన్ను! సవరం చుట్టుకుంటే సహజమైన నీ కొప్పుకి సరితూగుతుందంటావా? వేంకటపతి ప్రేయశివి నువ్వు. అతని ఎర్రటి పెదవుల రుచి ఎరిగినదానివి! ఆ కెమ్మోవి రుచి ముందు ఈ సమస్థ సృష్టిలో ఏవీ రుచించవు అని బహు చమత్కారంగా చెప్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు –
గందము = చందనం (గంధము), సువాసన; ఏల, ఏలే = ఎందుకు, ఎందుకే; కమ్మని = తీయని పరిమళం
మేని = ఒళ్ళు; తావి = సువాసన; ఎక్కుడా = గొప్పదా, మేలైనదా; ఒద్దిక = పోలిక; గద్దరి = గడుసరి స్త్రీ, నేర్పరి; గద్దరికన్నులు = నేర్పెరిగిన కన్నులు; మెయి = ఒళ్ళు, తనువు; ప్రతివచ్చీనా = సరితూగేనా; ఒడికపువేళ్ళు = సన్నగా పొడవుగా ఉండే నాజూకైన వేళ్ళు; వెంగలిమణులు = లోహములతో తయారు చేయబడిన నగలు; బోలునా = పోలిక ఉంటుందా! జడియు = ఎక్కువయిన ,పొడవైన, ప్రసిద్ధమైన; నెరులు = కురులు, జుట్టు; ఈవల = ఇహలోకము; చవులు = రుచులు; సవరని = అందమైన, చక్కని; కెమ్మోవి = ఎర్రని పెదవులు; చవి = రుచి.
విశేషాలు: 1. గందము అన్న పదం సరియైనదే! సులువైన భాషలో, జానపద శైలిలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో సంస్కృత పదాలను అక్షరాలలో ఇలా ఒత్తులు తీసేసి వాడటం చూడవచ్చు. జనసామాన్యం ఆనాడు అనుకునే మాట్లాడే భాషలో వ్రాశాడు. ప్రకృతి: గంధము, వికృతి: గందము అంతే!
2. యేల? (ఎందుకు), యాడ?(ఎక్కడ), ఏంది ? (ఏమిటి) వంటి పదాలు నెల్లూరు, రాయలశీమ ప్రాంతాల్లో నేటికి వాడుకలో ఉన్నాయి. ఐతే చదువుకున్న వారు నేడు ఆ పదాలని చిన్నచూపు చూశినా అవి ఎంతో అందమైన తెలుగుపదాలని గుర్తించాలి.
3. అత్తర్, సెంట్లు వంటి సుగంధ ద్రవ్యాలు రాసుకోవడం, బ్యూటీ పార్లర్లలో ఉండే రకరకాల బాడీప్యాక్్లు, కళ్ళకింద నల్లచారలకు కీరదోసకాయల ట్రీట్మెంట్, బంగాళా దుంప వైద్యం వంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవని అన్నమయ్య కీర్తనలద్వారా మనకు తెలుస్తున్నది. ఆరోజుల్లో సైరంధ్రి వంటి ఉద్యోగాలు ప్రత్యేకంగా ఉండేవి కదా!

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked