సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో సకల జానపద మాటలు దాగి ఉంటాయి. దంపుళ్ళ పాటలు, జాజరపాటలు, ఉయ్యాల పాటలు, కూగూగు పాటలు, లాలిపాటలు, తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలూ అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో చిన్నపిల్లలను గుర్రమెక్కినట్లుగా మెడలపై ఎక్కించుకుని తిరుగుతూ పాడే పాటను కూగూగు పాటలు అనే వారు. అన్నమయ్య అలా ఎవరైనా పాడేటప్పుడు గమమించి ఈ కీర్తన మనకు కమనీయంగా అందించాడు.

కీర్తన:
పల్లవి: గుఱు తెఱిఁగిన దొంగ కూగూగు వీఁడె
గుడిలోనె దాఁగేని కూగూగు ॥పల్లవి॥
చ.1. నెలఁతల దోఁచేని నీళ్లాడఁగానె
కొలని దరిని దొంగ కూగూగు
బలువైనవుట్ల పాలారగించేని
కొలఁది మీఱిన దొంగ కూగూగు ॥గుఱు॥
చ.2. చల్ల లమ్మంగ చనుకట్టు దొడికేని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక యిందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు ॥గుఱు॥
చ.3. తావుకొన్న దొంగఁ దగిలి పట్టుండిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుండొ యేమొ
కోవిదుఁడగు దొంగ కూగూగూ ॥గుఱు॥
(రాగము: శంకరాభరణం, శృం.సం.కీర్తన; రేకు: 52-2; సం.6-56)

విశ్లేషణ:
పల్లవి: గుఱు తెఱిఁగిన దొంగ కూగూగు వీఁడె
గుడిలోనె దాఁగేని కూగూగు
ఆనవాలు బాగా ఎఱిగిన దొంగ అంటూ కూగూగు అంటున్నాడు. వీడి దారేమిటో, లక్ష్యమేమిటో బాగా తెలిసిన దొంగ వీడు. శంఖు చక్రాల ధ్వని గుర్తెరిగి విని పరవశించేటట్టి దొంగ. ఈ దొంగ ఎక్కడో కాదు గుడిలోనే దాగి ఉన్న పిల్లవాడు ఈ దొంగ.
చ.1. నెలఁతల దోఁచేని నీళ్లాడఁగానె
కొలని దరిని దొంగ కూగూగు
బలువైనవుట్ల పాలారగించేని
కొలఁది మీఱిన దొంగ కూగూగు
ఈ దొంగ ఎలాంటివాడో తెలుసా? గొల్లభామలు కొలనులో జలకాలాడుతూ ఉంటే వాళ్ళ బట్టలు రహస్యంగా దొంగిలించిన దొంగ. బలమైఅ ఉట్లలో పైన ఎక్కడో దాచిన పాలు, పెరుగు, వెన్న మొదలైనవన్నీ ఆరగిస్తూ, పట్టబోతే ఏమాత్రం దొరకకుండా తిరిగే దొంగ వీడు అంటున్నాడు అన్నమయ్య.
చ.2. చల్ల లమ్మంగ చనుకట్టు దొడికేని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక యిందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు
ఈ దొంగ ఎంత రసికకళావతంసుడైన దొంగో తెలుసా? గొల్లెతలు అందంగా ఉన్నాడు చిన్ని కృష్ణుడని ఎత్తుకుంటే వాళ్ళ వక్షోజాలను తడిమే దొంగ వీడు. వ్రేపల్లెలో ఏ యిల్లూ విడచిపెట్టకుండా ఇల్లిల్లూ తిరిగి అందరి ఇండ్ల పాలను దొంగిలించిన దొంగ.
చ.3. తావుకొన్న దొంగఁ దగిలి పట్టుండిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుండొ యేమొ
కోవిదుఁడగు దొంగ కూగూగూ
ఈ దొంగ ఇప్పుడు మెల్లగా వచ్చి తిరుమలలో స్థిరపడ్డాడు. గోవులతో వచ్చి కలియుగంలో ఇక్కడే కాపురం పెట్టేసిన దొంగ. ఈ వేంకటగిరిలో ఉంటున్న ఈ దొంగ సామాన్యుడు కాడు సుమా! బహు నేర్పరియైన దొంగ. వడ్డికాసులవాడు, ఆపద మ్రొక్కుల వాడు. అడూడుగు దండాల వాడు. కుబేరుడికి అప్పు తీరే దాకా వదలిపెట్టని దొంగ.
ముఖ్యమైన అర్ధాలు –
గుఱుతెఱగిన = కచ్చితంగా అన్నీ తెలిసిన, ఆనవాలు తెలిసిన; కూగూగు = కొంచెం పెద్ద ధ్వనితో అరవడం; గురి = లక్ష్యం, మితి; చనుకట్టు = వక్షస్తలము, తొడకు = తొనకు, కొద్దిగా కదిలు; పాలిండ్లు = వక్షస్థలము; కొల్లలాడు = దోచుకును, పట్టుకొను; నెలత = స్త్రీ; కొలను = సరస్సు, స్నానము చేయు చెరువు వంటిది; దరి = దగ్గర; బలువైన = పెద్దవిగా ఉన్న; కొలదిమీరు = హద్దు దాటి ప్రవర్తించు; తావుకొను = స్తావరంగా చేసుకొని నిలిచి ఉండు; తగిలి = వెంబడించి; చెలువుడు = ప్రియమైన వాడు, సన్నిహితుడు, చెలికాడు; కోవిదుడు = తెలివిగల, విషయములన్నీ తెలిసిన పండితుడు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked