సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

కీర్తన:
పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే ॥పల్లవి॥
చ.1. దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు
తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా
ముంగిట ముద్దులువెట్టి మోవితేనె లానుకొంటా
యెంగిలిసేసి నిదె యిందరి నొక్కమాఁటె ॥చూడ॥
చ.2. వెన్నముద్దుకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల-
చన్నులంటి సారె సారె సాముసేసీని
చిన్నిచేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి
సన్నలు సేసి పిలిచి సరసములాడీని ` ॥చూడ॥
చ.3. వుద్దగిరికృష్ణుఁడు వొడిపట్టి మానినుల
అద్దుకొని కాఁగిలించి ఆసలురేఁచీ
వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు
సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే ॥చూడ॥
(రాగము: బౌళి, శృం.సం.కీర్తన; రేకు: 839-2; సం. 18-230)

విశ్లేషణ:
పల్లవి: చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే
చూడడానికి చాలా చిన్న బాలుడిలా అమాయకంగా కనిపిస్తున్నాడమ్మా! వాని చేష్టలొక్కసారి పరికించి చూడండి తెలుస్తుంది ఎంత జాణతనపు అల్లరి పిల్లవాడో వాని అంతరాన్ని పరిశీలించినవాళ్ళకు తెలుస్తుంది. ఎక్కడ చూసినా తానే ఉంటాడు సుమా! ఏమని చెప్పగలము వాని లీలలు అంటున్నాడు అన్నమయ్య.

చ.1 దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు
తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా
ముంగిట ముద్దులువెట్టి మోవితేనె లానుకొంటా
యెంగిలిసేసి నిదె యిందరి నొక్కమాఁటె
ఈ బాల కృష్ణుడు చాలా పెద్ద దొంగ. అందరి మనసులు దొచేసేవాడు. ఈ చిన్నవాడు గొల్లెతల మొహాలు తొంగి చూచి, వారి ముఖ పద్మాలపై ఆటలాడెడు ఉంగరపు వెండ్రుకలు ఉండగా అందంగా వారి ముఖాలపై ముద్దులు పెట్టి వారి అధరామృతాలను గ్రోలుతూ యెంగిలి చేసేస్తూ ఉంటాడు అందరినీ ఒక్కమా రే! సామాన్యుడు కాడు వీడు.
చ.2. వెన్నముద్దుకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల-
చన్నులంటి సారె సారె సాముసేసీని
చిన్నిచేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి
సన్నలు సేసి పిలిచి సరసములాడీని
ఈ వెన్నముద్దల ముద్దుల కృష్ణుడు ఎంతటి రసికసిఖామణో తెలుసా! సరదాగా గొల్లెతల రొమ్ములు పట్టుకుని మాటి మాటికి సాము గారిడీలు ప్రదర్శిస్తూ ఉంటాడు. వాని లేలేత చిన్ని చిన్ని చేతులను చాచి వక్షోజాలను సుకుమారంగా స్పృశిస్తూ మెల్లిగా చెవిలో గుసగుసలాడుతూ సరస శృంగారాలు సాగించే దిట్ట ఈ బాలుడు.
చ.3. వుద్దగిరికృష్ణుఁడు వొడిపట్టి మానినుల
అద్దుకొని కాఁగిలించి ఆసలురేఁచీ
వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు
సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే
ఈ గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తిన కృష్ణుడు ఈ గొల్లెతలను తనవొడిలో వడిసి పట్టుకుని హత్తుకుంటూ ఎన్నో ఆశలు చిగురింపజేసి అనుకూలంగా శ్రీవేంకటాద్రిలో నన్ను చేరి మా చెటలన్నీ మంచి ఆసక్తికరంగా ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ హాస్యమాడుతూ ఉంటాడు సుమా!
ముఖ్యమైన అర్ధాలు –
చాటుదనము = కొంటె పనులు, చాటుమాటుగా సాగించే అల్లరి; తొయ్యలులు = స్త్రీలు, గొల్లెతలు; ముగురులు = మొహంపై అందంగా వేలాడే వెండ్రుకలు; మోవితేనె = అధరామృతము, యెంగిలి; వేడుక = సరదా; జవరాండ్ర = యౌవనము లో ఉన్న స్త్రీల; చన్నులంటి = వక్షోజాలను; సారె సారె = మాటి మాటికి; సాము = మల్ల యుద్ధము, రతి క్రీడ అనే అర్ధంలో; చెనకు = తాకు; సన్నములాడు = చిన్న చిన్న చిలిపి శృంగార చేష్టలు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked