కథా భారతి

అమెరికాలో యోగీశ్వరుడు – చివరి భాగం

-ఆర్. శర్మ దంతుర్తి

(జరిగిన కధ – పరమహంస గారి రెండో అమెరికా ట్రిప్పులో ఓ సర్జన్ గారింట్లో ఆయనకి పాదపూజ ఏర్పాటు చేయబడింది. ఆ పూజ తాలూకు ఫోటోలు సుబ్బారావు ఎప్పటిలాగానే ఎవరి అనుమతులూ అడక్కుండా తన వెబ్ సైట్లో పెట్టేసేడు. అయితే ఎవరికీ తెలియని మూడో పార్టీ, ఆ వెబ్ సైట్లో ఫోటోలు చూసి సర్జన్ గారింట్లో పకడ్బందీగా దొంగతనానికి పూనుకుంది. ఇంట్లో సమస్తం దోచుకోబడ్డాక సర్జన్ గారూ వాళ్ళావిడా లెంపలు వేసుకుని సుబ్బారావు శిష్యరికంలోంచి బయటపడ్డారు. దొంగతనం కేసులో జరిగినది విన్నాక పోలీసులు పరమహంస గారి వెబ్ సైటుని ఒక కంట కనిపెడుతున్నారు. సర్జన్ ని వదిలేసి మిగతా శిష్యగణం పరమహంసగారితోపాటు ఓ రిట్రీటు కి మిషిగన్ రాష్ట్రంలో “గాంగెస్” అనే ఊరికి వెళ్ళడానికి సమాయుత్తమౌతున్నారు. ఇంక చదవండి)

రోజులు గడిచి రిట్రీటుకి మరో రెండు, మూడు గంటల్లో బయల్దేరుతారనగా సుబ్బారావుకి ఆ రోజు తనింకా రోజూ వెళ్ళే వాకింగ్ కు వెళ్ళలేదని అర్జెంటుగా గుర్తొచ్చింది. ఇండియాలో అయితే పనికిరాని అలగా జనం వల్ల రోడ్డుమీద వాకింగూ లేదు వల్లకాడూ లేదు. మరి అమెరికా అంటే అందరూ సమ్మర్ లో సగం బట్టలేసుకుని వాకింగ్ కి వెళ్ళేవాళ్ళే. అందులోనూ పొట్టి నిక్కర్లు వేసుకుని తళతళ మెరుస్తూ రోడ్డుమీద జాగింగ్ చేసే తెల్ల అమ్మాయిలని చూడలేని బతుకు వ్యర్ధం. అటువంటి వాకింగు మర్చిపోతే ఎలా? వెంఠనే బయల్దేరాడు. ఆ రోజెందుకో వెళ్తూంటే కొడుకుతోపాటు అందరూ వద్దన్నారు గానీ ఇలా వెళ్ళి అలా వచ్చేసానని చెప్పి కొడుకు కొనిచ్చిన నైకీ బూట్లు వేసుకుని బయల్దేరాడు పరమహంస రోడ్దు మీదకి. ఎప్పటిలాగానే పేంటు జేబులో పాస్ పోర్ట్ ఉంఛుకున్నాడు ఎవరైనా అడిగితే చూపించడానికి. పరిసరాలు చూసుకుంటూ రోడ్డుమీద ఎవరైనా మొహమాటానికి హాయ్ అనే వాళ్ళు నిజంగా తన స్నేహితులనుకుంటూ నడక సాగించాడు.

గత రెండు మూడు వారాలుగా రోజూ తన ఇంటి ముందు రోడ్డుమీద కనిపించే యోగీశ్వరుణ్ణి తన ఇంట్లోంచి చూస్తున్న డేవిడ్ కి అనుమానం మరింత బలపడింది. వీడెవడో టెర్రరిస్టే లేకపోతే ప్రతీ ఇంట్లోకీ అలా చూడడం దేనికి? ఠంఛనుగా ప్రతీరోజూ వచ్చి చూసి వెళ్తున్నాడు. వెనక ఎవరో ఉండి వీణ్ణి పంపించారు గాబోలు. ఎప్పుడో ఒకరి మీదో, ఓ గుంపు మీదో ఎటాక్ చేయకముందే వీణ్ణి పోలీసులకి పట్టిస్తే గొడవ వదుల్తుంది. అలా ఆలోచించి ఫోన్ తీసి 911 కి ఫోన్ చేసి చెప్పాడు, యోగీశ్వరుడు ఇలా అనుమానాస్పదంగా రోజూ రోడ్డుమీద నడవడం, చుట్టూ గమనించుకుంటూ అప్పుడప్పుడూ ఫోటోలు తీయడం తాను చూస్తున్నట్టు. ఫోను అందుకున్న వాళ్ళు ఓ ఇద్దరు పోలీసులని పంపించారు చూసిపోవడానికి.

బయల్దేరిన ఇద్దరు పోలీసులకీ రోడ్డుమీద ఉల్లాసంగా నడుస్తూ అందరిళ్లకేసీ నిర్భయంగా చూస్తూ నడుస్తున్న గురువుగార్ని చూడగానే రెండు మూడు రోజుల క్రితం తమకి పోలీసు చీఫ్ పంపిన నోటిసు, పరమహంసగారి వెబ్ సైటులో పెట్టిన ఫోటోలూ, ఆయన స్వంతగా తన తేజస్సు శిష్యులకి చూపించడానికి పెట్టిన ఫోటోలూ గట్రా అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. వెంఠనే పోలీసులు హెడ్ ఆఫీసుకి సంకేతం అందిచ్చి ఇద్దర్లో ఒకాయన కిందకి దిగేడు కార్లోంచి సరిగ్గా సుబ్బారావు వెనక. అక్కడ్నుంచే మాట్లాడే మైక్రోఫోన్ తీసి చెప్పేడు పోలీసు, “కదలకుండా చేతులు పైకెత్తి నించో.” పోలీసు మాట్లాడిన మాట అర్ధం అయిందో లేదో కానీ, తాను టెర్రరిస్టుని కాదనీ పరమహంసననీ చెప్పడానికీ, పాస్ పోర్ట్ చూపించడానికీ సుబ్బరావు జేబులో చేయిపెట్టాడు.

పోలీసు ఎవరినైనా చేతులు పైకెత్తమన్నప్పుడు, మొదటగా చేయాల్సింది నోరు మూసుకుని పోలీసు చెప్పినట్టు చేయడం. అలాకాక జేబులో చేయి పెడితే, బయటకి తీసేది గన్ కావచ్చు, లేకపోతే బాంబు కావచ్చు అని పోలీసు కి అనుమానం రాదూ? అంచేత వెంఠనే రెండో పోలీస్ ని బేక్ అప్ గా ఉండమని చెప్పి మొదటి ఆయన తన గన్ బయటకి తీసి సుబ్బారావు దగ్గిరకి వచ్చాడు. గన్ చూపిస్తూ తనకేసి వచ్చిన పోలీసుని చూసి, అనుకోని సంఘఠనకి బిత్తరపోయిన సుబ్బారావు కంగారుగా ‘గాంగ్స్ వెళ్ళాలి, గోయింగ్ గాంగ్స్’ అంటూ తెలుగులోనూ ఇంగ్లీషులోనూ అనేశాడు. గాంగ్ అనే పేరు వినగానే మరో ఆలోచన లేకుండా పోలీస్ సుబ్బారావు మీద గన్ గురిపెట్టి కాల్చేడు. కింద పడబోతూంటే రెండో పోలీస్ వచ్చి సుబ్బారావుని మెదమీద నొక్కి భయంకరంగా నేలమీదకి తోసి చేతులు వెనక్కి నొక్కాడు. మూడు నిముషాల్లో సుబ్బారావుని చేతులు వెనక్కి విరిచి కట్టి బేడీలు తగిలించాక పోలీసులకి తెలిసివచ్చింది అసలు సంగతి. సుబ్బారావు జేబులో ఉన్నది పాస్ పోర్టు. సుబ్బారావు కిందపడ్డప్పుడు కలుక్కుమని వినిపించిన చప్పుడు మెడ మీద విరిగిన ఎముక. తర్వాత అరగంటలో సుబ్బారావు ఏంబులెన్సు మీద హాస్పిటల్లో జేర్చబడ్డాడు బేడీలతో సహా. ఇదంతా తన ఇంటి కిటికీలోంచి చూసిన డేవిడ్ హమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకున్నాడు తానో టెర్రరిస్టు లాంటివాణ్ణి పట్టిచ్చినందుకు.

* * * * * *

అయితే వీధిలో జరిగిన సంగతి టి.వి చూస్తేగానీ ఇళ్ళలో తెలియని ఈ రోజుల్లో సుబ్బారావు కొడుకూ మిగతావాళ్ళూ సామాను సర్దుతూనే ఉన్నారు. ఇంక బయల్దేరుదామనుకుంటూండగా వాకింగ్ అని బయటకెళ్ళిన సుబ్బారావు ఇంకా వెనక్కి రాలేదని గుర్తొచ్చింది. మరో పావుగంట చూసి కొడుకు సుబ్బారావుని వెతుక్కుంటూ బయల్దేరాడు. ఎంత వెతికినా చుట్టు పక్కల ఎక్కడా సుబ్బారావు జాడ లేదు. ఉసూరుమంటూ ఇంటికొచ్చేసరికి ఇంటిముందు పోలీస్ కారు నిలబడి ఉండడం కనిపించింది.

ఉత్తరోత్తరా జరిగినది తెలిసే సరికి సుబ్బారావు కొడుక్కి నోటమ్మట మాట రాలేదు. మర్నాటికి ఇదో పెద్ద న్యూస్ అయింది అటు అమెరికాలో, ఇటు ఇండియాలోనూ. పెద్ద న్యూసంటే అమెరికాలో గేస్ స్టేషన్ లో ఇమిగ్రేషన్ వారి అనుమతి లేకుండా పనిచేసే ఒక తెలుగువాణ్ణి ఎవరైనా గన్ తో కాల్చి చంపారనుకుందాం. దాన్ని న్యూసులో అమెరికావాడు “ఒక ఐసోలేటెడ్ ఇంసిడెంట్ లో ఇలా హత్య జరిగింది” అన్ చెప్తే మన ఇండియన్ టి.వి వారు ‘అమెరికాలో తెలుగువాళ్ళని ఇష్టమొచ్చినట్టు కాల్చిపారేస్తున్నారు రోజుకిద్దరి చొప్పున’ అని చెప్పడం లాంటిదన్నమాట. మొత్తానికి అందరికీ పబ్లిగ్గా తెలిసొచ్చినది ఏమిటంటే సుబ్బారావు మిషిగాన్ లో ఉండే “గాంగెస్” అనే ఊరికి వెళ్తున్నాడు కుటుంబంతో – శిష్యపరమాణువులకి తన మేధస్సు చూపించి వాళ్ళని దీవించి, కనికరించడానికి. సుబ్బారావు ఇండియా నుంచి వచ్చిన దైవజ్ఞ చించామణి; టెర్రరిస్టు కాదు. జేబులో చేయి పెట్టేముందు తాను “గాంగెస్ వెళ్ళాలి” అని అరిచినది పోలీసులకి “గాంగ్స్” అని వినిపిస్తే వాళ్ళు సుబ్బారావు గాంగ్ మెంబర్ అనుకున్నారు. మనం మాట్లాడే ఇంగ్లీషు అర్ధం కాకపోతే మెల్లిగా ఒక్కో అక్షరం పలుకుతూ మాట్లాడాలని అర్ధం చేసుకోకుండా సుబ్బారావు పోలీస్ చేతిలో గన్ చూసి మరింత కంగారుగా మాట్లాడేడు.

మెడమీదో ఎముకా, రెండు మూడు పక్కటెముకలూ విరిగాయి సుబ్బారావుకి. భారద్దేశం అంతా విచారం వెలిబుచ్చింది అమెరికాలో ఒక ఇండియా వాడికి ఇలా అయినందుకు. విధిగా నెలకోసారి విదేశాలకి ప్రయాణం చేసే ప్రధానమంత్రీ, విదేశాంగ శాఖా, విచారం వెలిబుచ్చి తమ వంతు సాయం చేస్తామనే ట్వీట్లు కొట్టారు. అవన్నీ పత్రికల్లో న్యూస్ లాగా వచ్చేసాయి వెంఠవెంఠనే. మరిప్పుడు న్యూస్ అంటే వాళ్ళూ వీళ్ళూ తెల్లవారు ఝామున కొట్టిన ట్వీట్లే కదా?

అయితే పరమహంసకి ఇలా అయినందుకు అందరికన్నా ఎక్కువ సంతోషించినది సర్జన్ గారు. తమ చేతికీ, పేరుకీ మట్టి అంటుకోకుండా కాగల కార్యం గంధర్వులే తీర్చారని ఆయనా వాళ్ళావిడా కసి తీరేలాగ, సంతోషంగా అనుకున్నారు.

ఇంత జరిగాక సుబ్బారావు కొడుకు తాను తప్పకుండా కోర్టులో అమెరికా పోలీసులమీద కేసు వేస్తానని పత్రికా ముఖంగా చెప్పేడు. దానికి ఆ ఊళ్ళోనే ఉన్న ఇమ్మిగ్రేషన్ లాయర్ పటేల్ గారు తనవంతు సహాయం చేస్తానని టి.వి కెమేరాల ముందు మాటిచ్చేసేడు అక్కడికక్కడే. మరి ఒక్కసారి పేరు రావాలంటే ఇటువంటివాటిని సమయానుకూలంగా వాడుకోవద్దూ? అలా సుబ్బారావు కొడుకు పోలీసులమీద కేసు వేసి కోర్టుకి లాగేడు.

కోర్టులో పోలీసులు వాదిస్తూ పరమహంస గారి వెబ్ సైటు కూడా ప్రవేశపెట్టేరు. ఆ ఫోటోలూ, విచ్చలవిడిగా ఎవరి ప్రైవసీ గురించి చూడకుండా తీసిన ఫోటోలూ అవీ చూసి జ్యూరీలో అందరూ ఆశ్చర్యంగానో, అసహ్యంగానో నోళ్ళు నొక్కుకోవడం జడ్జ్ తో సహా అందరూ చూసినదే. ఈ ఫోటోల వల్లే సర్జన్ గారింట్లో విలువైన సామాను పోయి ఉంటుందని కూడా నమ్ముతున్నట్టు పోలీసులు వివరణ ఇచ్చారు. కేసు జరుగుతున్నప్పుడు కోర్టు ఆవరణలో ఎవరో ఒకాయన “వీణ్ణి తన్ని తగలేయండిరా” అనడం కూడా ఓ టి.వి వాళ్ళు రికార్డు చేసి ప్రసారం చేస్తే అందరికీ తెలిసింది. కోర్టులో కేసు మూడు నెలలు నడిచాక జ్యూరీ తీర్పు ఇచ్చింది.

* * * * * *

జ్యూరీ తీర్పు బయటకి చెప్పే ముందు ఉండబట్టలేక జడ్జ్ గారు పరమహంస ని అడిగేరు, “మీరు ఇండియా నుంచి వచ్చారు ఇక్కడికి. ఎందుకని అంటే ఈ దేశంలో ఉన్న ఇండియన్స్ ని ఉద్ధరించడానికి అని తెలుస్తోంది మీ రాతల వల్లా, మీ మాటల వల్లానూ. అమెరికాలో ఉన్న భారతీయులు మహా అయితే గియితే ఓ రెండు మిలియన్లు ఉన్నారనుకున్నా అది రెండు శాతం జనాభా కన్నా మించదు. మీ శిష్యగణం యాభై నుంచి వందలోపు. మీరు ఇంత దూరం వచ్చి వీళ్ళని ఉద్దరించడం దేనికీ? అక్కడే ఇండియాలో ఒక బిలియన్ కి పైబడి ఉన్న వాళ్లని ఉద్ధరించవచ్చు కదా మీ ఊర్లోనే ఉంటూ?”

“అలా కాదండి. మా ఊళ్ళో ఉండి యోగా, జపం, ధ్యానం, ఆసన ప్రాణాయామాలు నేర్పుతానంటే ఎవరూ ముందుకి రారు. నేర్పినా పేరూ రాదు. అక్కడ చదువు రాని అలగా జనాలని నా పధ్ధతులు అర్ధం కావు. అదే ఇక్కడికొచ్చి ఏదైనా చేస్తే మా వాళ్లందరూ చదువుకున్నవాళ్ళు కనక వెంఠనే మంచి పేరొస్తుంది. ఇక్కడ పేరు రాగానే ఇండియాలో ఒక్కసారి గుర్తింపు వచ్చేస్తుంది. స్వామి వివేకానందగారికి అలాగే అయింది. నేనూ అంతటివాణ్ణి కనక అలా చేయగలను కదా?” పరమహంస తడువుకోకుండా చెప్పేసేడు సమాధానం.

జడ్జ్ గారు కాస్తో కూస్తో హిందూమతం గురించి తెలిసినవాడే. ఈ కేసు జరుగుతున్నప్పుడు కాస్త గూగిల్ చేసాడు హిందూ మతం గురించీ మిగతా కేసుకి సంబంధించిన విషయాలు. స్వామి వివేకానంద గారి గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. కాసేపు మౌనంగా ఉన్నాక చెప్పేడు, “నేను మీ స్వామి గారి గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాను ఈ కేసు జరుగుతున్నప్పుడు. ఆయన అమెరికా వచ్చినది పేరు తెచ్చుకోవడానిక్కాదు అనుకుంటా. నాకు అర్ధమైనంతలో పేరు కోసం, శిష్యపరమాణువులని ఉద్ధరించడానికీ కాదు ఆయన అమెరికా వచ్చినది. ఆయన చేసిన సేవలు చాలా గొప్పవని చెప్పుకోవడం నేను చదివాను. అయినా అద్భుతమైన తేజస్సుతో బ్రహ్మచారి అయిన ఆయనెక్కడా, మీరెక్కడా? ఇటువంటి బుద్దిలేని పనులు ఎందుకు చేస్తున్నారో మీరు. మీకు మరీ అంతగా ఉద్దరించాలని ఉంటే మీ ఊళ్ళోనే అవకాశాలు ఉంటాయి. అవి వాడుకోండి. ఇలాంటి వెధవ పనులు చేస్తూ ప్రజల్ని భయపెట్టడం, పేరు దండుకోవడం సేవ అనిపించుకోదు. మీరు ఏదైనా చెప్పేది ఉందా ఇంకా?”

సుబ్బారావు నోరు విప్పి ఏదో అనబోతూంటే, కొడుకు ఆయన పక్కనుంచి మోచేత్తో డొక్కలో పొడిచేడు నోరు మూసుకోమన్నట్టూ. జడ్జ్ గారు అన్నది ఏది అర్ధమైనా కాకపోయినా ఈ మోచేతి పొడుపు అర్ధమైంది పరమహంసగారికి వెంఠనే, ఇంకేమీ లేదన్నట్టూ తల అడ్డంగా ఊపేడు. వెంఠనే తీర్పు ఇవ్వబడింది.

యోగీశ్వరుణ్ణి తుపాకీతో కాల్చి లాఠీతో కొట్టి కిందపడదోసిన పోలీసు తన ఉద్యోగం తాను చేసాడు. అతనిదే మాత్రం తప్పులేదు. వేళాపాళా లేకుండా వాకింగ్ కి అని నడుస్తూ చుట్టుపక్కలవాళ్ళనీ, కనిపించిన ఇళ్ళకేసీ అనుమానాస్పదంగా చూస్తూ ఫోటోలు తీసి వెబ్ సైట్లో పెట్టిన యోగిశ్వరుడిదే తప్పు. అదీగాక పోలీసులు యోగీశ్వరుణ్ణి కింద పడదోసే సమయానికి పోలీసు పెట్టుకున్న బాడీ కెమారాలో సుబ్బారావు ‘గాంగ్స్’ అని అరవడం స్పష్టంగా కనిపించి, వినిపిస్తూంటే, జ్యూరీ పోలీసుని ఎలా తప్పు పట్టగలదు? కానీ యోగీశ్వరుడి మీద – అతను కాస్త పెద్దవాడని తెలిసినా – పోలీసులు అంత బలప్రయోగం చేయకుండా ఉండాల్సింది. దానికి చిన్నపాటి క్షమాపణ ఇచ్చుకుంటారు. మరి ఆయనకి తగిలిన దెబ్బలకి కొద్దిపాటి చికిత్స చేసినందుకు హాస్పిటల్ కి ఓ యాభైవేలు అయింది కదా? అది ఇచ్చేస్తారు. ముఖ్యంగా యోగీశ్వరులు వారి వెబ్ సైట్ మూసి తీరాలి. లేకపోతే కుదరదు. కాస్త మెడా, కరచరణాలూ ఆడగానే యోగీశ్వరులు ఇండియా వెళ్ళిపోవచ్చు. చేసిన వెధవ పనులకి జైలు శిక్ష వేయట్లేదు, సంతోషించండి.

* * * * * *

యోగీశ్వరులకి మొదట్లో దెబ్బ తగల్డం అవీ పెద్ద న్యూసే కానీ కేసు పాతబడిపోయింది కనక ఇలా జ్యూరీ తీర్పు అవీ న్యూసులో రాలేదు. అలా ప్రతీ కేసూ పేపర్లలో, అదీ మొదటి పేజీలో కూలంకషంగా వేయడం ఎక్కడ కుదురుతుంది?

సుబ్బారావు కొడుక్కి ఈ కోర్టుకేసులో సహాయం చేసిన పటేల్ గారు విచారం వెలిబుచ్చారు కేసు వీగిపోయినందుకు. కానీ చేసిన పనికి డబ్బులు తీసుకోకుండా తమ ఉదారత చాటుకున్నారు. ఈ మూడు నెలల్లో ఆయన ప్రాక్టీసు మూడు పువ్వులూ ఆరు కాయలుగా విస్తరించింది కాదూ ఈ పబ్లిసిటీ వల్ల? అయినా పటేల్ జీ ఈ కేసులో వేలు పెట్టడం ఆయనికి అమాతంగా ఒక్కసారి పేరు రావడానిక్కానీ సుబ్బారావు నెగ్గడానికి కాదు కదా?

మరో రెండు, మూడు వారాలకి యోగీశ్వరులు మంచం మీదనుంచి లేచి తిరగ గలుగుతున్నారు. డాక్టర్ చెప్పడం ప్రకారం ఆయన ఇండియా వెళ్ళిపోవచ్చు. ఆ పై వారానికి ఆయన సైలెంటుగా ఇండియా వెళ్ళిపోయి కాస్త జెట్ లాగూ, ఒళ్ళు నెప్పులూ తీరగానే – అంటే ఇండియానుంచి అమెరికా బయల్దేరిన నాలుగైదు నెలలకి – మళ్ళీ ఉద్యోగం లో జేరారు. అప్పటికి ఈయనకి పోలీసుల చేతుల్లో జరిగిన సన్మానం గురించి మర్చిపోయేరు తెలుసున్నవాళ్ళు. యోగీశ్వరులు మెడమీద వేసుకు తిరిగే కాలరు గురించి ఆరాతీస్తే అమెరికాలో కార్ ఏక్సిడెంట్ అయిందనీ, మెడ ఎముకలు సర్దుకోవడానికి అది వేసుకోమని డాక్టరు అన్నాడనీ చెప్పుకున్నాడు ఆయన చాలాకాలం.

అయితే అమెరికాలో జరిగిన ఈ ఉదంతానికి యోగీశ్వరుల భక్తులు పరువు నష్టానికి కోర్టులో సివిల్ కేసు వేయబోతే వద్దని లాయర్ అయిన పటేల్ గారు వారించారనీ, అలా వేస్తే యోగీశ్వరుల పేరు మరి కాస్త చెడిపోతుందనీ అమెరికా భక్తులకి తెలిసివచ్చింది. ఈ విషయాలు మాత్రం ఎవరికీ పైకి చెప్పకుండా జాగ్రత్త పడ్డారు గురువుగారి అమెరికా భక్త బృందం. లేకపోతే ఇంత బతుకు బతికీ ఇంటి వెనకాల చచ్చినట్టు, ఇంతటి చదువులు చదివీ అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళేలుతూ అలా ఓ యోగీశ్వరుడికి పాదపూజలు చేసి పీకల మీదకి తెచ్చుకున్నారంటే ఎంత అప్రదిష్ట!

* * * * * *

అసలు జరిగిన విషయాలు వేరే ఉన్నాయి. మంత్రం జపిస్తూ పరమహంస అయిపోయాననుకున్న సుబ్బారావుకి మెడా, వెన్ను పూసల్లో ఏదో కదిలినట్టనిపించినది స్పాండిలోసిస్ అనే వ్యాధి. అది ఓ సారి వస్తే తగ్గేది కాదు. దాని మూలానో మరో కారణమో తెలియదు కానీ పోలీసులు ఒక్కసారి మీద పడ్డప్పుడు సుబ్బారావు మెడ ఎముక విరిగింది. రెండో విషయం, చలికాలంలో ఎవర్ని ముట్టుకున్నా ఒక్కొక్కప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల చిన్న షాక్ తగులుతుందనేది సైన్సు చదువుకున్న ఎవరికైనా తెలిసినదే. దాన్ని గురువుగారు మరోలా అనుకుని ప్రచారం చేసుకున్నారు. ఇంకపోతే మూడోది, ఏక సంతా గ్రాహి అని శిష్యులు చెప్పుకున్నది పటేల్ స్టోర్ లో చేసే సంత కాదనీ సంథా అని చదువుకోవాలనీ, సంస్కృతం అంటే గుడిలో మంత్రాలకీ వాడే భాష మాత్రమేననే చిన్న చూపు ఉన్న శిష్యులకీ, స్కూల్లో ఇంటర్మీడియట్ లో మంచి మార్కుల కోసం తెలుగు బదులు హిందీయో, ఫ్రెంచి భాషో తీసుకుని హిందీ, ఫ్రెంచి, రెండూ రాక రెంటికీ చెడ్డ రేవడిలా తయారైన శిష్యులకీ ఎప్పటికీ తెలియలేదు. నాలుగో విషయం, నీలపు రంగు చూస్తే ఏం గుర్తొస్తుంది అనేది చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికొచ్చిన స్వామి వివేకానంద అడిగితే చెప్పిన సమాధానం. దాన్ని సుబ్బారావు పరమహంస గారు మక్కీకి మక్కీగా కాపీ కొట్టారు. అవి మన బిజీ ఎన్నారై సర్జన్ లకీ, అందులోనూ అసలు రాజాజీ అంటేనే తెలియని బ్రహ్మ పదార్ధాలుగా తమని భావించుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకీ తెలిసే ఛాన్సు సున్నా కదా? అయిదో విషయం, గంగానదిని ఇంగ్లీషులో గేంజెస్ అని పిలుస్తారని తెలిసినా అమెరికా వచ్చాక దాన్ని స్టైల్ గా గాంగెస్ అని పిలవడం అలవాటు చేసుకుని యోగీశ్వరులు గారు పోలీసుల దగ్గిర “గాంగెస్, గాంగెస్” అని అరిచారు. పరమహంస గారు కంగారుగా మాట్లాడిన ఇంగ్లీషులో గాంగెస్ అన్నది పోలీసులకి గాంగ్స్ అన్నట్టు వినిపిస్తే తప్పు వాళ్ళది కాదు కదా?

అయితే సుబ్బారావు పరమహంసగారు ఇండియా వెళ్ళిపోయాక తనకి జరిగిన అవమానాలన్నీ భూతద్దంలోంచి చూపిస్తూ ఈమెయిల్ మీద ఫోటోలతో సహా శిష్యులందరికీ పంపించారు. ఇదంతా జరగడానికి తానే కారణం అయినా అంతా ప్రజల తప్పు అనీ, అమెరికా అంటే తనకో రోత అనీ, తననెవరూ అర్ధం చేసుకోలేదనీ, తన పద్ధతులన్నీ అతి కష్టమైనవనీ, ఎవరికీ అర్ధం కాలేదనీ వాపోయారు. తర్వాతి రోజుల్లో ఆయన తన పాస్ పోర్ట్ లో ఉన్న అమెరికన్ వీసా చింపేసి అమెరికా మళ్ళీ జన్మలో రానని శిష్యులకి తెలియచేసారు కూడా. అయితే ఇప్పటివరకూ తాను అమెరికాలో ఉంటూ ఇండియా ఎందుకూ పనికిరాదని రాసిన మాటలన్నీ మర్చిపోయి, తాను స్వామి వివేకానంద కి ఏ మాత్రం సాటిపోనని చెప్పడానికా అన్నట్టు, వివేకానంద గారి మాటే ఒకటి ఈమెయిల్లో చెప్పేసారు – “అమెరికా వెళ్ళకముందు, నాకు ఇండియా మాతృభూమి మరి ఇప్పుడో, ఇండియా లో ప్రతి ధూళి రేణువూ నాకు అత్యంత ప్రియమైనది.” మరి ఇంతకుముందు ఇండియా అంటే ఛంఢాలం అన్నారుగా అని గూట్లే ప్రశ్నా? అలా అన్నారనుకోండి, అయితే అవన్నీ ఎవరికి గుర్తుంటాయ్ ఈ డిజిటల్ యుగంలో?

ఇక్కడ గురువుగారి సంగతి అలా ఉంటే, అటు అమెరికాలో పరమహంస గారి శిష్యులందరూ ఓ వీకెండ్ కి మళ్ళీ కలుసుకుని తమ గురువుగారికి ఇలా అయినందుకు విచారం వెలిబుచ్చారు. మరో రెండు సంవత్సరాలు ఆగితే గురువుగారు మనసు మార్చుకుని తప్పక తిరిగి అమెరికా వస్తారని తీర్మానం చేసుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో బాహుబలి లాంటి సినిమాలు, నలభై రోజుల ఎడతెగని ఐ. పి. ఎల్ క్రికెట్టూ ఆ పైన ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ రాబోతూ ఉంటే ఈ తీర్మానాలన్నీ గుర్తు పెట్టుకోవడం ఎవరి తరం? తాము చేసే ఉద్యోగాలతో సహా ఎవరి శిలువలు వాళ్ళకున్నాయి కదా, అవి మోసుకోవద్దూ?

ఏది ఏమైనా, భట్టాత్తిరి గారు నారాయణీయం రాస్తూ చెప్పినది గురువులకీ, శిష్యులకీ కూడా నిజమే కాబోలు. “కోనామ కస్య సుకృతం కధ మిత్యవేయాత్?” స్వామీ, లోకంలో ఏ జీవి ఏ పుణ్యం చేసుకుందో చెప్పడం ఎవరితరం?

​(అయిపోయింది)

[ఇందులో పాత్రలన్నీ పూర్తిగా కల్పితం. ఎక్కడైనా ఎవరికైనా ఇలా జరిగినట్టు మీకు అనిపిస్తే అది పూర్తిగా యాధృచ్చికం మాత్రమే. రోజుకో గురువూ, మఠాధిపతీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో భక్తుడికీ, భగవంతుడికీ మధ్య ఎటువంటి లంచాలూ, దళారీలు అవసరంలేదని చెప్పడానికే ఈ కధ రాసాను. స్వస్తి.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on అమెరికాలో యోగీశ్వరుడు – చివరి భాగం

రాయపెద్ది అప్పాశేషశాస్త్రి said : Guest 5 years ago

అమెరికాలో యోగీశ్వరుడు కథ అద్భుతంగా ఉన్నది.. అమెరికాలో మన దొంగస్వాముల లీలలను చక్కగా వివరించినారు. రచయిత ఆర్. శర్మ దంతుర్తి గారికి నా హార్దిక అభినందనలు

  • Adoni, Andhra pradesh, india