ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 8

సత్యం మందపాటి చెబుతున్న

అడగందే అమ్మయినా పెట్టదు!

రుక్మిణి అన్నగారిని చూడటానికి చికాగో వెళ్ళిందేమో కృష్ణ, అర్జున్ అక్కడే ఒక మెక్సికన్ రెష్టారెంట్లో భోజనం చేసి, మౌంట్ బనేల్ కొండ ఎక్కి, పైన కూర్చున్నారు.
ఆస్టిన్ నగరంలో ప్రకృతికి వన్నె తెచ్చే ఎన్నో అందమైన ప్రదేశాలు వున్నాయి. వాటిల్లో మౌంట్ బనేల్ ఒకటి. ఆ కొండ మీద నించీ చూస్తుంటే పక్కనే వున్న నది, అక్కడ నీళ్ళల్లో తిరుగుతున్న చిన్నా పెద్దా బోట్లు, నీళ్ళలో స్కీయింగ్ చేస్తున్న వాళ్ళూ, ఎన్నో రకరకాల పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పూల చెట్లూ, దూరంగా పెద్ద పెద్ద భవనాలు.. ఆస్టిన్ నగరం ఎంతో సుందరంగా వుంది.
“అర్జున్, ఎలా వుంది నీ ఉద్యోగ పర్వం. ఇప్పటికి ఆరు నెలలు దాటింది కదూ..” అడిగాడు కృష్ణ.
“అవును బావా.. నువ్వు చెబుతున్నవన్నీ నేను కళ్ళారా మా ఆఫీసులో చూస్తున్నాను. ముందుగానే నీతో మాట్లాడి అవన్నీ తెలుసుకోవటం వల్ల, నాకు అవన్నీ కొత్తగా అనిపించటం లేదు. అంతేకాదు, అలాటి సమస్యలు వచ్చినప్పుడు, నువ్వు చెప్పినవి గుర్తు తెచ్చుకుని అలాగే ప్రవర్తిస్తున్నాను. మా మానేజర్, మిగతా ఇంజనీర్లు అందరూ నాతో స్నేహంగా వుంటున్నారు. ఇంతవరకూ బాగానే వుంది” అన్నాడు అర్జున్.
“వెరీ గుడ్. నా ఉద్దేశ్యం కూడా అదే. ఇక్కడ ‘వై రీయిన్వైటింగ్ ది వీల్’ అంటారు కదా. నా అనుభవాలు అన్నీ నీకు చెప్పేస్తే, మళ్ళీ నువ్వు అవన్నీ చూసి అనుభవించి ఇబ్బంది పడనఖ్కర్లేదు. అలా అయితే నీ ‘టేకాఫ్ లెవెల్’ ఎంతో పైనే వుంటుంది. నీకు అవన్నీ ఉపయోగపడటమే నాకు కావలసింది” అన్నాడు కృష్ణ.
“మా అఫీసులోనే జఫ్ అనే ఇంజనీరు ఒకతను వున్నాడు. అతను అంత తెలివైన వాడేమీ కాదుగానీ, ఎంతోమంది మానేజర్లు అతనంటే ఇష్టపడతారు. మా మానేజరుతో ప్రతి శనివారం గాల్ఫ్ ఆడతాడు. మిగతా మానేజర్లతో కలిసి అప్పుడప్పుడూ పగలు లంచికీ, సాయంత్రం ఆఫీసు అయాక బారుకీ వెడుతుంటాడు” అన్నాడు అర్జున్.
“అదే అమెరికా ఉద్యోగపర్వంలో ఎక్కువగా కనపడేది. పరిచయాలు.. అంటే కాంటాక్ట్స్ చాల ముఖ్యం. ఇలా అందరితో ఎంతో దగ్గరగా వుంటూ, ఆ పరిచయాలు పెంచుకుంటూ వెడితే చాల మంచిది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన బిజినెస్ నిర్ణయాలు వారాంతం గోల్ఫ్ కోర్సుల్లో తీసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు. అలాగే సాయంత్రం పూట బార్లలో కూడా జరుగుతుంటాయి. నేనొక పెద్ద కంప్యూటర్ కంపెనీలో పనిచేసేటప్పుడు మేము కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం ఆఫీసు అయాక అలా బార్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. దానికి మా మేనేజర్ సరదాగా ‘యాటిట్యూడ్ యడ్జస్ట్మెంట్ మీటింగ్స్’ అని పేరు పెట్టాడు. అందరూ బీర్, బ్లడీ మేరీ తాగేవారు. నేను ఆల్కహాలికుడ్ని కాదు కనుక ‘వర్జిన్ మేరీ’ తాగేవాడిని. అంటే టమోటా రసంలో కొంచెం హాట్ సాస్ కలిపినదన్నమాట” అన్నాడు కృష్ణ నవ్వుతూ.
అర్జున్ కూడా నవ్వాడు. “అలా వెళ్ళటం అవసరమా..” అని తన అనుమానం వ్యక్తపరిచాడు.
కృష్ణ మళ్ళీ నవ్వి, “ఇలాటివేవీ అవసరమూ కాదు, అనవసరమూ కాదు. అప్పటి సందర్భాన్నిబట్టి మనం చేసేయటమే. మన ఆఫీసుల్లో కూడా ఇటు గూఢ మిత్రులూ, అటు గాఢ శత్రువులూ వుంటూనే వుంటారు. మైకేల్ కోర్లియాన్ అన్నట్టు, ‘మిత్రులకి దగ్గరగానూ, శత్రువులకి ఇంకా ఎంతో దగ్గరగానూ’ వుంటే మంచిది”
“అవును. ఎంతోమంది మంచివాళ్ళు వున్నా, మా ఆఫీసులో కూడా గూఢ మిత్రులు వున్నారు. మనతో మంచిగా వుంటూ, మనం చెప్పినవాటికి వాళ్ళకి అవసరమైన రంగు పులిమి, ఇంకో నాలుగు చేదు మాత్రలు కలిపి, మానేజర్ చెవిలో సీసం పోస్తారు. గాఢ శత్రువుల కన్నా వీళ్ళే ప్రమాదకరం. జాగ్రత్తగా వుండాలి” అన్నాడు అర్జున్ సాలోచనగా.
కృష్ణ కొంచెం ఆశ్చర్యంలో పడి, లేచి సర్దుకున్నాక అన్నాడు, “అబ్బో! అప్పుడే నీకు ఇలాటి ఆఫీసు రాజకీయ సూత్రాలు బాగా అర్ధమైపోయాయే” అని.
కొంచెం సిగ్గు పడ్డాడు అర్జున్.
కృష్ణ మళ్ళీ అన్నాడు. “వాల్ స్ట్రీట్ అనే సినిమాలో మైకల్ డగ్లస్ ఒక మాట అంటాడు, ‘If you are not in, you are out’ అని. వినటానికి చాల సులభంగా, మనకి తెలిసినదే కదా అనిపిస్తుంది. కానీ నా ఉద్దేశ్యంలో అది ఒక వేద మంత్రం. నువ్వు ఉద్యోగాల్లోనే కాక, నిత్య జీవితంలో కూడా విజయాలు సాధించాలంటే, ఈ సూత్రం తప్పకుండా పాటించాల్సిందే”
”ఏదన్నా ఉదాహరణతో చెప్పు, బావా?” అడిగాడు అర్జున్.
కృష్ణ ఒక్క నిమిషం ఆలోచించి, “సరే. మన ఆఫీసుల్లో కొందరు ఉద్యోగులు ప్రొద్దున్నే ఎనిమిది గంటలకి ఆఫీసుకి వచ్చి, ఎవరితో మాట్లాడకుండా తలవంచుకుని చెప్పిన పని చేసేసి, ఐదు గంటలకి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఏమిటి, వాళ్ళు ఆఫీసులో వున్నా కంపెనీలో కానీ, మిగతా డిపార్ట్మెంటుల్లో కానీ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఆఫీసులోనే వున్నా, ఒక విధంగా లేనట్టే. దీనివల్ల రెండు నష్టాలు వున్నాయి. ఒకటి, ప్రతి సంవత్సరం జరిపే పెర్ఫార్మెంస్ రివ్యూలో, చెప్పిన పని చేస్తున్నాడు అని వ్రాస్తారు”
“అవును. అది మంచిదే కదా!” అన్నాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “అవును. కాదు. ‘అలా అయితే మేం చెప్పిన పని చేయటానికి జీతం ఇస్తున్నాం కదా, మీకు అది చాలు’ అంటారు కంపెనీ వాళ్ళు. ఆపుల్ కంపెనీని స్థాపించిన స్టీవ్ జాబ్స్ ఏమంటాడో తెలుసా? ‘నేను ఎప్పుడూ మంచి తెలివైన మంచి ఇంజనీర్లకే మా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. అంత మంచివాళ్ళని తీసుకుని, వాళ్ళకి ఏంచేయలో నేనెందుకు చెప్పటం? వాళ్ళే నాకు వాళ్ళేం చేయగలరో చెబుతారని కదా, వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చేది’ అంటాడు. అందుకని మనం ఇంకా ఎక్కువగా మన సత్తా చూపించాలి. ముఖ్యంగా మనలాగా ఇక్కడికి వలస వచ్చిన విదేశీయులు, స్థానికులకన్నా ఇంకా ఎక్కువగా తెలివితేటలు ఉపయోగించి పనిచేయాలి”
“అంటే మామూలుగా చెప్పింది చేస్తే, మామూలు ఉద్యోగిగా మిగిలిపోతాం అన్నమాట” అన్నాడు అర్జున్.
“శభాష్. నేను చెబుతున్నది నీకు బాగా వంటబడుతున్నది. మామూలుగా రోజుకు ఎనిమిది గంటలు చెప్పిన పని మాత్రమే చేస్తుంటే, ఒకటి నించీ ఐదు దాకా ఇచ్చే రాంకుల్లో మూడు వస్తుంది అన్నమాట. అంటే నీలాటి మాన్యుఫాక్త్యరింగ్ ఇంజనీరుకి, ఒకటో రాంక్ ఇవ్వాలంటే నువ్వు అడగకుండానే ఎన్నో పనులు చేయటమే కాకుండా, కొత్త కొత్త విధానాలతో అతిత్వరగా ఎక్కువ ప్రాడక్టులని తయారుచేయటానికి మార్గాలు చెబుతున్నావనీ, దానివల్ల ఎంతో ఉత్పాదక సమయం ఆదా అయి, లాభాలు ఎక్కువగా పెరుగుతున్నాయనీ, నువ్వు దూరదృష్టితో పనిచేస్తావనీ వ్రాస్తారు. అంటే నువ్వు చెప్పిన పనులనే కాక, ఎన్నో విధాలుగా కంపెనీ అభివృధ్ధికి పాటు పడుతున్నావనీ, నీకు మంచి బోనస్సులూ, జీతం పెంచటం, ప్రమోషన్లు ఇవ్వటం కూడా జరిగే అవకాశం వుంది. కార్పొరేట్ అమెరికాలో దాన్ని ‘Farr exceeding job requirements’ లేదా ‘Walking on water’ అంటారు. నీళ్ళ మీదే నడవగలవు మరి. అంటే నువ్వు ఏమాత్రం ‘బయటి వాడివి’ కాదన్నమాట. You are in, not out. అలాగే చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువ పనులు మాత్రమే చేస్తుంటే రెండో రాంక్ ఇస్తారు. ‘Exceeding some requirements’. ఇందాక చెప్పినట్టు చెప్పిందేదో చేసేసి, మాయమయిపోతుంటే మూడో రాంక్ ఇస్తారు. ‘Meeting the job requirements’. దాదాపు డెభై శాతం ఉద్యోగులకు ఈ రాంక్ వస్తుంది. వాళ్ళకి లాభాలు బాగావుంటే, ఇస్తే గిస్తే ఏ మూడు శాతమో జీతం పెరుగుదల, లేదా అదీ వుండదు. మరి నాలుగో రాంక్ వస్తే నున్ను చేయాల్సిన పనులు కూడా కొన్నే చేస్తున్నావన్నమాట. ‘Meeting few job requirements’. నిన్ను పిఐపి అంటే పెర్ఫార్మెంస్ ఇంప్రూవ్మెంట్ ప్లానులో పెట్టే అవకాశాలు కూడా వున్నాయి. అది సవ్యంగా పూర్తి చేస్తే ఉద్యోగం వుంటుంది. లేదా ఇంటికి వెళ్ళిపో నాయనా అంటారు. మరి ఐదో రాంక్ వస్తే నువ్వు ఏ పనీ చేయటంలేదని, బై బై అంటారు. ‘Not meeting any job requirements’ అని. పార్కింగ్ లాట్ దాకా వచ్చి సాగనంపుతారు. అందుకని, తలవంచి ఏదో చేసేసి ముక్కు సూటిగా పోతుంటే, నువ్వు క్రికెట్ మాచిలో లడ్డు లాంటి కాచ్ ఇచ్చేసి ఔట్ అయినట్టు అన్నమాట. అలాకాక అటూ ఇటూ చూస్తూ, ఏ బాలుకి ఎలా ఆడాలో అలా ఆడుతూ అవుటవకుండా ఆటలోనే వుంటే, నువ్వు సెంచరీ కొట్టే అవకాశాలు వుంటాయన్నమాట. అంతా నీ చేతుల్లోనే వుంది.”
“మరి మన భారతీయుల్లో చాలమంది, ఇంట్లో నించీ పనిచేస్తారు కదా. బౌతికంగా కూడా వాళ్ళు ఆఫీసులో అవుటే కదా మరి? వాళ్ళ సంగతో?” అడిగాడు అర్జున్.
“అవును, ఈ ఇంట్లో నించీ పని చేయటం అనేది ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళలో కనిపిస్తుంది. మిగతా రంగాల్లో వున్నా, వాళ్ళు అప్పుడప్పుడూ ఇంట్లోనించి చేస్తారు కానీ, ఎప్పుడూ కాదు. గణాంకాల ప్రకారం వారి ఉత్పాదకత (Productivity) అరవై శాతం కన్నా తక్కువ. చాల కంపెనీలు దీని వల్ల లాభాల కన్నా, నష్టాలే ఎక్కువగా వున్నాయని, మళ్ళీ ఆఫీసులకే రమ్మంటున్నారు. మరి ఉద్యోగులకు? చాలమంది ఇంట్లో నించీ పని చేసే వాళ్ళకు, వాళ్ళ మేనేజరూ, వారి గ్రూపులో కొంతమంది తప్ప మిగతా ఎవరితోనూ ఎక్కువ సంబంధం లేకపోగా, కొంతమంది డైరెక్టర్లకూ, సీనియర్ మేనేజర్లకూ వీళ్లెవరో కూడా తెలియదు. ఎప్పుడైనా ఆఫీసుకి వెడితే, అక్కడ ఎన్నాళ్ళనించో పనిచేస్తున్నా, చాలమందికి నేను ఫలానా సుబ్బారావుని అని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో మంచి పురోగమన ఆవకాశాలు వస్తే, ఎదురుగా కనపడేవారికి ఇస్తారు కానీ, ఎవరో తెలియని వీళ్ళకు కాదు. అంతేకాదు, చాలమంది అవకాశాల కోసం, ఏ పుట్టలో ఏ పాముందా అని ఆఫీసు గోడలకి చెవులు అన్చి వింటుంటారు. మన ఇంట్లో గోడలకి చెవులు ఆనిస్తే ఏమీ వినడదు. అందువల్ల అలాటి ‘ఇంటి’ ఉద్యోగులకు ఆ అవకాశాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. అలాగే కంపెనీలో కొంతమందిని తీసివేయాల్సిన పరిస్థితిలో, ఎక్కువగా కనపడేవారినే వుంచి, ముక్కూ ముఖం తెలియని వారికి ఉద్వాసన చెప్పే అవకాశం ఎక్కువగా వుంటుంది. నీ ఉద్యోగంలో అలాటి సమస్య వుండదులే. కాకపోతే మీ సీనియర్ మానేజ్మెంట్ వారికి కనపడేటట్తు పనిచేయి” అన్నాడు కృష్ణ.
అర్జున్ అర్ధమైందన్నట్టుగా తల వూపాడు.
కృష్ణ చెప్పటం కొనసాగించాడు. “చీకటి పడుతున్నది. ఈసారికి ఇంకొక్క విషయం చెబుతాను. మన తెలుగులో ఒక సామెత వుంది. ‘అడగందే అమ్మైనా పెట్టదు’ అని. అలాగే ఇంగ్లీషులో కూడా ‘Only crying baby gets milk’ అంటారు. ఇది ఆఫీసుల్లో కూడా బాగా పనిచేస్తుంది. మొహమాటాలు పనికిరావు. నీకు ఏది కావాలన్నా.. కొత్త కంప్యూటర్, ప్రింటర్ దగ్గర నించీ, అదే డిపార్ట్మెంటులో నీకు నచ్చిన వేరే ఉద్యోగమో, ఇతర డిపార్ట్మెంట్లలో ఇంకో ఉద్యోగమో, నీ ఉద్యోగంలోనే జీతం పెంచటం, ప్రమోషన్లు కావాలన్నా, మీ మేనేజరుని అడుగు. అడగందే అమ్మైనా పెట్టదు మరి. నీ చుట్టూ మానేజ్మెంటులో వున్న ప్రతివారినీ కనుచూపు దూరంలో పెట్టుకో. ఇహ నీకు అడ్డుండదు” అన్నాడు కృష్ణ లేచి నిలబడుతూ. “థాంక్స్ బావా. నాకు ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెబుతున్నావు” అన్నాడు అర్జున్.

కొండ మీద నించీ చూస్తుంటే, ఆస్టిన్ నగరం లైట్లతో వెలిగిపోతూ, ఎంతో అందంగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked