ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు

శుభారంభం

సత్యం మందపాటి చెబుతున్న

అమెరికా ఉద్యోగ విజయాలు – 1

ఆదివారం ప్రొద్దున్నే ఫోను మ్రోగింది. అది తెలిసిన ఫోన్ నెంబరు కాదు. సేల్స్ వాళ్ళు పిలుస్తున్నారేమో వాళ్ళని నాలుగు చివాళ్ళు పెడదామని, వెంటనే ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు కృష్ణ, కొంచెం కరుగ్గానే.
“నేను బావా, అర్జున్ మాట్లాడుతున్నాను”
“అర్జునా?.. ఏ అర్జున్?”
“ఏ అర్జున్ కాదు బావా. బి. అర్జున్. బి అంటే భమిడిపాటి అర్జున్”
అదెవరో తెలీక ముఖం ఇబ్బందిగా పెట్టాడు కృష్ణ.

ఈలోగా అర్జున్ తనే అన్నాడు, “అవునులే. నువ్వు అమెరికాకి వచ్చి ముఫై ఏళ్ళ పైనే అయింది కదా. మర్చిపోయుంటావు. నేను మీ భమిడిపాటి పాండురంగారావు మామయ్య, సుబ్బలక్ష్మిగార్ల అబ్బాయిని. ఆమదాలవలస. అప్పుడు మా నాన్నా వాళ్ళ ఇంటికి దగ్గరలో వుండేవాళ్ళుట మీరు. నువ్వు అమెరికాకి వచ్చాకనే నేను పుట్టాను కదా. ఏదో ఒకటి రెండుసార్లు ఇండియాలో కలిశాం కానీ, పెద్దగా కలవలేదు. అదీకాక ఇప్పుడు మేమెక్కడో… ఇండియాలో వుండే దూరపు చుట్టాలం కదా. నీకు గుర్తుకి రావటం కష్టం” నవ్వాడు అర్జున్.
“ఆఁ. ఇప్పుడు గుర్తుకొచ్చిందిలే. నన్ను బావా అని పిలిస్తే, నాకు సుభద్ర అనే చెల్లెలు లేదే, మరి ఈ అర్జునుడు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నానంతే..” అన్నాడు కృష్ణ తన మతిమరపుని దాచిపెడుతూ.

నవ్వుతూ అన్నాడు అర్జున్. “బావా, ముందు అసలు విషయానికి రానీ. ఇండియాలో మెకానికల్ ఇంజనీరింగులో బి.ఇ. చేసి, హైద్రాబాదులో రెండేళ్ళు ఉద్యోగం కూడా చేశాను. తర్వాత ఇప్పుడు అట్లాంటాలో మాష్టర్స్ చేశాను. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాను. మా నాన్న చెప్పాడు, ‘ఒరేయ్.. మన కృష్ణ అక్కడే ఎక్కడో టెక్ససులో ముప్పై ఏళ్ళుగా వున్నాడుట. బాగా పేరు సంపాదించి, మంచి ప్రమోషన్లతో పైకి వచ్చాడుట. ఉద్యోగంలో చేరేముందు ఆయన్ని కలిసి ఆ ఉద్యోగ విజయాలు సాధించాలంటే ఏం చేయాలో, అక్కడ రకరకాల మనుష్యులతో ఎలా మెలగాలో తెలుసుకుంటే, ఇహ నీకు అడ్డే వుండదు’ అన్నాడు. అందుకే నీ సలహాల కోసం ఫోన్ చేస్తున్నాను” అన్నాడు.
అతనా మాటలు అనగానే కృష్ణకి కూడా హుషారు వచ్చింది. “అవును. ఈ ముఫై ఎనిమిదేళ్ళలోని నా ఉద్యోగ విజయాల మీద సలహాలడిగిన వారికి అడిగిన సహాయం చేస్తూనే వున్నాను. అందులోనూ పాండురంగం మామయ్య కొడుకువి. నీతో నా అనుభవాలు పంచుకోవటానికి అభ్యంతరం ఏముంటుంది? అవునూ.. ఇప్పుడు ఎక్కడ వున్నావ్?” అడిగాడు కృష్ణ.

“అట్లాంటాలోనే. ఇక్కడ బాగానే వుంది బావా. నువ్వు ఫలానా అప్పుడు అని చెబితే, నేను అప్పుడు పిలిచి నీ ఉద్యోగ విజయ రహస్యాలను జాగ్రత్తగా వింటాను. ఇక్కడ కొందరు సాఫ్ట్వేర్ మిత్రులు వున్నారు కానీ, వాళ్ళ ఉద్యోగాలే వేరు. ఆ అవకాశాలే వేరు. వాళ్ళు ఇండియన్స్ చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంటారు. నేను ఇక్కడ మాన్యుఫాక్చరింగులో ఆఫీసులోనూ, ప్రొడక్షన్ ఫ్లోర్ మీదా రకరకాల అమెరికన్సుతో పనిచేయాలి. ఇటు ప్రొఫెషనల్సూ, అటు బ్లూ కాలర్ వర్కర్సూ.. ఇలా ఎంతోమందితో కలిసి పనిచేయాలి. నువ్వూ ఇదే రంగంలో వున్నావు కదా అని.. సహాయం చేస్తావేమోనని..” అన్నాడు అర్జున్ కొంచెం సిగ్గు పడుతూ.

కృష్ణ నవ్వుతూ అన్నాడు “అలా సిగ్గు పడకు మరి. అదేం ఫరవాలేదు. నా అనుభవాలు నీకు ఉపయోగ పడితే నాకు అంతకన్నా కావలసింది ఏముంది. ఇవాళే.. ఇక్కడే.. ఇప్పుడే.. నీ ఉద్యోగ విజయాలకి శుభారంభం పలుకుదాం. సరేనా?”
“నా లాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని రెడీగా వున్నాను. చెప్పు బావా. నువ్వు చెబుతుంటే, నేను అవసరమైన నోట్స్ వ్రాసుకుంటాను”
‘శుభం. నేను భారతదేశంలో రెండు మూడు ఇంటర్వ్యూలకి వెళ్ళినా, కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా అది ఆరోజుల్లోని వేరే ప్రపంచం. ఇప్పుడక్కడ కూడా అమెరికా పధ్ధతులే వాడుతున్నారు కనుక, నేను చెబుతున్నవి ఇక్కడా, అక్కడా, అన్ని చోట్లా పనిచేస్తాయి”
ఒక్క క్షణం సాలోచనగా ఆగి చెప్పటం ప్రారంభించాడు కృష్ణ.

“నేను అమెరికా వచ్చిన కొత్తల్లో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టే ముందు, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రెండు గంటల సెమినారుకి వెళ్ళాను. అదే నా కళ్ళు తెరిపించింది. ఆ సెమినార్లో ఉద్యోగం ఎలా సంపాదించాలో చాల బాగా సోదాహరణంగా చెప్పారు. ఎన్నో దశాబ్దాలు అయినా, నాకు బాగా నచ్చిన, నాకు ఉద్యోగాలు తెచ్చిన ఒక ముఖ్యాంశం చెబుతాను”
“అక్కడ బల్ల మీద బోర్లించిన రెండు అట్టపెట్టెలు వున్నాయి. అవి తీయగానే, ఒక దాని క్రింద తెల్లని చిన్న పాకేజ్ పెట్టె వుంది. ఆ పాకేజ్ పెట్టె మీద టూత్ పేస్ట్ అని నల్లటి అక్షరాలతో వ్రాసి వుంది. దాని ముందు వెల ఒక డాలర్ అని వ్రాసి వుంది. రెండవది ఎరుపు, తెలుపు, నీలం రంగురంగులతో అందంగా వున్న పాకేజ్ పెట్టె. దాని మీద ఏదో తెలియని పేరు వుంది. దాని ముందు, వెల ఒకటిన్నర డాలర్లు అని వ్రాసి వుంది”

“ట్రైనర్ అడిగాడు, ‘మీరు ఈ రెండిటిలో ఏది కొంటారు’ అని. అక్కడికి వచ్చిన అందరూ ఏక కంఠంతో ‘రెండవదే’ అన్నారు. ఆయన ‘ఎందుకని?’ అని అడిగాడు. ‘మొదటిదేమిటో కూడా తెలియదు. పాకేజింగ్ కూడా బాగాలేదు. రెండవది చక్కగా, అందంగా వుంది. ఆ టూత్ పేష్ట్ బాగుండే అవకాశం వుంది’ అన్నారు”
“నాకూ ఒక యాభై సెంట్లు ఎక్కువయినా, ఆ రెండోదే బాగుందనిపించింది” ఆగాడు కృష్ణ.
“అవును. పైనే అలా చెత్తగా వుంటే, లోపల ఎలా వుంటుందో.. ఏముంటుందో?“ అన్నాడు అర్జున్.
కృష్ణ చిన్నగా నవ్వి, “అవును. మేమందరం అదే చెప్పాం. మా ట్రైనర్ అప్పుడు, రెండు పాకెట్లలోనించీ
టూత్ పేస్ట్ ట్యూబులు బయటికి తీశాడు. రెండూ ఒకటే కంపెనీ తయారు చేసిన ఒకే రకం ట్యూబులు. బయటి పాకేజింగ్ తప్పితే, వేరే తేడాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటో అర్ధమయింది కదా” అడిగాడు కృష్ణ.
“అర్ధమైనట్టుగానే వుంది కానీ నువ్వు చెప్పు. నీ నోటితో వినాలని వుంది” అన్నాడు అర్జున్.

“నిన్ను కూడా మంచి కంపెనీల వాళ్ళు మంచి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే, ముందు నిన్ను నువ్వు చక్కగా పేకేజింగ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి నీతో ఇంటర్వూ చేసే రెండు గంటల్లో నీలోని సరకు తెలియటం కష్టం. ఉద్యోగంలో చేరాకనే వాళ్ళకి నీ అసలుసిసలు సత్తా తెలిసేది. ఉద్యోగం వచ్చాక మనం అక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా అంచలంచలుగా పైకి వెళ్ళవచ్చో తర్వాత చెబుతాను. ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోవటం ఎలా అన్నదే చూద్దాం. నిన్ను చక్కగా పేకేజింగ్ చేసుకోమంటే, రంగురంగుల చొక్కా వేసుకుని, క్రాఫు నున్నగా మధ్య పాపిడితో దువ్వుకుని ఇంటర్వ్యూకి వెళ్ళమని కాదు” ఆగాడు కృష్ణ.
“మరెలా బావా..” అడిగాడు అర్జున్.

“వస్తున్నా.. వస్తున్నా.. ఇక్కడ పూర్వం రోజుల్లోలా పేపర్లలో ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వటం ఏనాడో తగ్గిపోయింది. ఇంటర్నెట్ వచ్చాక, ఇప్పుడు రాచకార్యాలన్నీ అక్కడే. అక్కడ కూడా గణాంకాల ప్రకారం పది శాతం లోపు ఉద్యోగాలే ప్రకటనల్లో కనిపిస్తాయి. డెభై శాతం పైన ఉద్యోగాలు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తాయి. ఉదాహరణకి ఒక మాన్యుఫాక్చ్యరింగ్ డైరెక్టర్ గారు, ‘ఏమోయ్ సుబ్బారావ్, బాగున్నావా? మనకి ఒక క్వాలిటీ మేనేజర్ కావాలోయ్. నీకు తెలిసిన వాళ్ళెవరైనా వున్నారా?’ అని అడుగుతాడు. లేదా సుబ్బారావే ఆయన దగ్గరికి వెళ్ళి, “డైరెక్టరూ, డైరెక్టరూ! మరేమో నాకు తెలిసిన ఒక మంచి క్వాలిటీ మేనేజర్, ఉద్యోగం మారాలని చూస్తున్నాడు. అతను మన కంపెనీలో చేరితే మన కంపెనీ క్వాలిటీ బ్రహ్మాండంగా వుంటుంది. మీతో మాట్లాడమని అతనికి చెప్పనా?’ అని ఆయన్ని అడగవచ్చు. మనం ఏమీ సరకులేని వారిని రెకమెండ్ చేస్తే మన పేరుకి చెడు కనుక, మనం అలా చేయకూడదు. సమర్ధులైన వారినే రికమెండ్ చేస్తాం. అందుకని అది బాగా పని చేస్తుంది. దానికి కాంటాక్ట్స్ అవసరం. అందుకని ఎక్కడ ఏ ఏరు దాటినా తెప్ప తగలేసుకోకూడదు. అందరినీ కనుచూపు దూరంలో.. కాదు కాదు, సెల్ ఫోన్ దూరంలో వుంచుకోవటం అవసరం. జాబ్ షాపింగ్ కంపెనీలు, రిక్రూటింగ్ కంపెనీలు కూడా మనకి ఉద్యోగాలు తెప్పిస్తాయి. వాళ్ళకి మన మీద ప్రేమా, దోమా వుండి కాదు. మనకి కంపెనీ ఇచ్చే జీతాన్ని బట్టి, వాళ్ళకి కమిషన్లు వుంటాయి. మన జీతం మనదే. ఆ కమిషన్ ఏదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అందుకని ఈ దారి కూడా మంచిదే”
“బాగానే వుందే” అన్నాడు అర్జున్.

“ఇంకా వుంది, విను. ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా, మొట్టమొదట కావలసింది రెస్యూమే. రెస్జ్యూమ్ అని స్పెల్లింగ్ వున్నా, మనం రెస్యూమే అనాలి. ఫ్రెంచ్ భాషలో నించీ వచ్చిందది. దాన్నే భారతదేశంలో, ఇంగ్లండ్ మొదలైన దేశాల్లో CV అంటారు. Curriculum Vitae అన్నమాట. అది లాటిన్ మాట. Be a Roman in Rome అని ఏ దేశంలో వుంటే ఆ పేరు వాడేయటమే. ఉద్యోగం రావటానికి మొట్టమొదటి సోపానం అదే. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, రెస్యూమే లక్ష్యం ఉద్యోగం తెప్పించటం కాదు. ఇంటర్వ్యూ తెప్పించటం. ఇంటర్వ్యూలో మనం చెప్పే పధ్ధతిని బట్టి, మన ప్రవర్తనని బట్టి ఉద్యోగం వస్తుంది. అందుకని ఈ రెస్యూమేని ఆకర్షణీయంగా అలంకరించాలి”
“అదెలా?” అడిగాడు అర్జున్.

“వెరీ సింపుల్. చాలమంది చేసే రెండు తప్పులు ఏమిటంటే – ఒకటి, అదేదో వారి ఆత్మకథలా వ్రాయటం. రెండు, చదువుతుంటే ‘దీంట్లో ఏమీ లేదు’ అనిపించేలా వ్రాయటం. కొంతమంది, వాళ్ళు చిన్నప్పుడు క్రికెట్ ఆడామనీ, ఆ స్టేడియం పక్కనే పుష్పక విమానంలో తిరిగామనీ, ఇంకా ఇంకేదో చేశామనీ.. తమ ఆత్మకథ వ్రాస్తుంటారు. ఉద్యోగం ఇచ్చే మేనేజర్లకీ, హ్యోమన్ రీసోర్సస్ మేనేజర్లకీ మన జీవన తరంగాల్లో తేలేటంత సమయం వుండదు. అంతేకాక మీరు ఏ ఫుట్బాల్ ప్లేయరో, సినిమా యాక్టరో అయితే తప్ప చదివే వాళ్ళకి మీ ఆత్మకథ రుచించదు. అందుకని ఒక పేజీ లేదా రెండు పేజీలు మించకుండా – పేరాగ్రాఫులు కాకుండా బులెట్స్ లాగా వుండటం అవసరం. టెక్స్ట్ మెసేజీల్లో వాడే భాష వాడితే, నీ రెస్యూమే ఎవరూ చూడరు. రెస్యూమే పని ఉద్యోగం తెప్పించటం కాదు, ఇంటర్వ్యూకి పిలిపించటం అని కొన్ని పేరాల క్రితం అనుకున్నాం కదా. అందుకని నువ్వు ఏం వ్రాసినా కుసింత కుతూహలం కలిగేటట్టు వ్రాస్తే, అదేమిటో తెలుసుకోవాలని నిన్ను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడే అవకాశం వుంది. ఉదాహరణకి నేను ‘ఇది’ చేసి, కంపెనీ లాభాలను ఏటా ఏటేటా ఇరవై శాతం పెంచాను అని వ్రాస్తే, వాళ్ళు ఆ ‘ఇది’ ఏమిటో, ‘అది’ ఎలా చేశావో తెలుసుకోవాలనే ఆశతో నిన్ను పిలిచే అవకాశం వుంది. ఇంతకన్నా ఎక్కువ వివరాలు నేను ఇచ్చే బదులు, నీ తెలివితేటలు వుపయోగించి, జాగ్రత్తగా ఆలోచించి నీ రెస్యూమేని చక్కగా వ్రాయి. కావాలంటే నాకో, నీకు తెలిసిన మిత్రులకో చూపించి సలహాలు తీసుకో” అన్నాడు కృష్ణ.
“తప్పకుండా. అలాగే చేస్తాను” అన్నాడు అర్జున్, ఫోనులో తల వూపుతూ.

“ఇంకో విషయం. నీ రెస్యూమే నీ ఉద్యోగానికి సరిపడే ప్రతి కంపెనీ డేటాబేసులో వుండటం అవసరం. అక్కడ వుంటే వాళ్ళు కొన్ని ‘కీ వర్డ్స్’ ఆధారంగా నీ రెస్యూమేని వెతికి, అవి సరిపడితే, ఉద్యోగాలున్న డిపార్ట్మెంట్ మేనేజర్లకి అందిస్తారు. అది చాల అవసరం. ఇలాగే నెల నెలా, ప్రతి నెలా ఉద్యోగ విజయాలు ఎలా సాధించాలో చెప్పుకుందాం, అర్జునా! ఇక నీకు అడ్డే వుండదు” అన్నాడు కృష్ణ.
“ధన్యోస్మి, బావా! అలాగే” అన్నాడు అర్జున్, ఫోనులోనే మళ్ళీ తల వూపుతూ.

౦ ౦ ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked