కథా భారతి

అవగాహనతోనే “అహాన్ని” కాపాడుకుందాం!

(మన ఆత్మగౌరవం మన చేతుల్లోనే)

-అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

సమాజంలో నిత్యం మనం విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాము. సహజంగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆలోచనా సరళిలో అనేక వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలలో మనం ఇతరులతో మెలిగేటప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించవలసి ఉంటుంది.దీనికి మన మీద మనకు అవగాహన ఎంత ముఖ్యమో ఇతరుల పట్ల కూడా మనకు అవగాహన ఉంటూ మన పరిధి మేరకు మెలగాల్సి ఉంటుంది. అప్పుడు మన ఆత్మగౌరవం (ఈగో) మనం కాపాడుకోవటమే కాదు ఇతరుల ఆత్మగౌరవం కూడా (ఈగో) కాపాడినట్లవుతుంది.
సహజంగా ప్రతి వ్యక్తి సమాజంలో తనదైన ఆలోచనా సరళితో ఇతరులతో మెలగటం మనం చూస్తూనే ఉంటాం! ఏ వ్యక్తి ఆలోచనా అయినా ప్రజామోదం, సామాజిక ఆమోదం, నీతి, నియమాలకు అనుకూలంగా (Positive) ఉండవచ్చు లేదా ప్రతికూలంగా (Negative) గా ఉండవచ్చు. ఇందులో వరుస ఏదైనా ఏ వ్యక్తి అయినా తన ఉనికి కోల్పోవటానికి సిద్ధంగా ఉండడు. తన ఆలోచనా విధానంతో ఇతరులను ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తూఉంటాడు.ఇటువంటిసందర్భాలలోనేఆత్మగౌరవానికి దెబ్బ తగిలే(Ego-Hurt) అవకాశముంటుంది. నిజానికి ఇక్కడ విచక్షణతో కూడిన ఆత్మపరిశీలన లేదా వాస్తవాన్ని కొంత సమయం తీసుకోనైనా విషయాన్ని పరిశీలించాలనుకోవటం చాలా అవసరం. ఈ విచక్షణ సక్రమంగా లేకపోతె వ్యక్తుల మధ్య వ్యత్యాసాలే కాదు అగాధాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలోనే ఘర్షణ వాతావరణాలు పెరిగి ఆత్మగౌరవాలకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
“ఉదాహరణలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నీతి,అవినీతి మధ్య చర్చ జరుగుతోందనుకోండి అందులో మొదటి వ్యక్తి అవినీతి వలన సమాజానికి కలిగే నష్టాలు మరియు ప్రజల భవిష్యత్ అంధకారంగా మారుతుందని అందుచేత అవినీతి అనేదాన్ని ఏ స్థాయిల్లో వున్నా సరే ఉక్కు పాదంతో అణచివేయాలని చెబుతాడు. దీనికి రెండవ వ్యక్తి ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అవినీతిని అరికట్టడం హరిహరాదుల వల్ల కూడా కాదని గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవటం ఎందుకని ఎద్దేవా చేస్తాడు, అవసరమనుకుంటే ఎన్నో ఉదాహరణలు తన వాదన పటిష్టతకోసం చెబుతూ అవసరమైతే ఇంకా ముందుకెళ్లి పురాణాల నుండి కూడా వాదన సమర్ధన కోసం ఉదాహరణలను గుప్పిస్తుంటాడు. నిజానికి ప్రభుత్వాలు తమ విధి విధానాలను రాజ్యాంగపరంగా అమలు చేస్తే అవినీతిని అంతం చేయవచ్చునని మొదటి వాని భావన అవినీతే పాలకుడైతే ఇంకెక్కడి అవినీతి నిర్మూలన అనే ది రెండవవాని భావం. ఇద్దరి అభిప్రాయాల్లో సారూప్యతలు వున్నా కూడా వాదన పరిపుష్టి కోసం జరిగే చర్చల్లో వాగ్వాదాలు, అరుపులు, కేకలు, ఒకరి ఫై ఒకరు చెణుకులు,ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటాలు,చివరికి ఘర్షణల వరకు విషయం నడచి అసలు విషయం లోని వాస్తవం తేలకుండానే చర్చ ముగిసి ఎవరి స్థాయిల్లో వారు తమ ఆత్మగౌరవవాలు సంతృప్తి చెందినట్లుగా(Ego Satisfaction) భావిస్తారు.

“ఇంకొక ఉదాహరణలోచెప్పుకోవాలంటేఆరోగ్యాలకు,ఆవేశకావేశాలకు,నీతి,నియమాలకు, ఆర్ధిక కుంగుబాట్లకు మొత్తం మీద మనిషి సమగ్రతను దెబ్బతీసే మహమ్మారి మద్యపానం అనేది ఒకరి వాదన. ఇదే సందర్భాల్లో మానసిక ఉల్లాసానికి,వైద్య పరంగా కూడా డాక్టర్స్ కూడా సిఫార్సు చేస్తుంటారని అదే సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా దీని మీద వచ్చే ఆదాయంతో అనేకానేక ప్రజా సంక్షేమ పధకాలను చేపడుతూ వుంటారాని ఏదో కొద్ది మంది వ్యసనపరుల కోసం దీన్ని నిర్మూలించాలనటం తెలివితక్కువ తనం అని ఇంకా వాదన పటిష్ఠతకు కోసం ఈ మధ్యపాన మనేది సురాపాన రూపంలో దేవతలా కాలం నుండి ఉందని వాదిస్తాడు! ఇలా చెప్పు కోవాలంటే మనిషి తన అహాన్ని చల్లార్చుకోవటానికి అనేకానేక ఉదాహరణలు.”

వాస్తవానికి సామాజంలో నీతి,నియమాలకు,సామాజిక ,సాంఘిక కట్టుబాట్లకు, ప్రజా సంక్షేమాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పరిపాలనాలు ఉంటే అవినీతి,అనైతికలకు ఆస్కారం ఉండదనేది ‘సూర్యుడు తూర్పున ఉదయించినంత సత్యం’ అందుచేత ముందుగా విషయం ఏదైనా మన రీతిలో కాకుండా కుటుంబం, సామాజం,సాంఘిక, నైతిక విలువలను గమనములో ఉంచుకుంటే ఏ విషయం లో నైనా చర్చలు ఫలవంతంగా ఉండి ఆత్మగౌరవాలు (ఈగోస్) దెబ్బతినే పరిస్థితులుండవు. దీనికై “వ్యక్తిగా నేను ,నా, నాది అనే రీతిలో కాకుండా కట్టుబాట్లు, నైతికత, సామాజిక అభివృద్దే ఆలంబనగా అడుగులు కదపాల్సిన అవసరం ఎంతైనావుంది”.

మానవ జీవితంలోఅనేకానేక కల్లోల్లాల్లో వ్యక్తులు,కుటుంబాలు, సంస్థలు, సమాజాలు,రాష్ట్రాలు ,దేశాలు ఇలా ప్రతి ఒక్కటి అహం చాత్ర ఛాయల్లో ఘర్షణకు గురి కావటం మన కళ్ళ ముందున్న చిత్రమే! నేను, నా, నాది అనే వాటిల్లో అధికారంకావచ్చు,జ్ఞానం కావచ్చు,ఐశ్వర్యం కావచ్చు,పరపతి కావచ్చు లేదా రాజకీయ పలుకుబడులు కావచ్చు,శారీరక దారుఢ్యాలు కావచ్చు ,వ్యక్తిగత నిపుణతలు కావచ్చు,శారీరక అందాలు కావచ్చు, వ్యక్తిగత తెలివితేటలూ కావచ్చు లేదా పొగడ్తల నిషాలతో మత్తెక్కిన మెదళ్ళు కావచ్చు ఇవన్నీ మన చేతనంలో జరిగేవే! అందుకే ఇతరులతో మెలిగే టప్పుడు విచక్షణతో సంయనంతో మెలగటమంటేనే మన గౌరవాన్ని( ఈగో ) మన కాపాడు కుంటున్నట్లు. అది ఎలాగో చూద్దాం!
మన ఆత్మగౌరవం(ఈగో) మన చేతుల్లోనే!

  1. 1.ఏ రకమైన చర్చల్లో నైనా వ్యక్తిగత విషయాలకు, దూషణలకు పాల్పడరాదు. ఇది చర్చించే అసలు విషయాన్ని పక్క దోవ పట్టిస్తుంది.
  2. ఇతరులతో చర్చ లేదా సంభాషణలు చేసే ప్రతి సందర్భంలో మనకి ఎప్పటి కప్పుడు సామాజిక మార్పు చేర్పులకు సంబంధించిన అవగాహన చాలా అవసరం. పడికట్టు పదాలతో చర్చలలో పాల్గొనటం అసంబద్ధంగా ఉంటుంది.
  3. అవసరం.
  4. వ్యక్తుల వ్యక్తిగత రూపాలకు కాదు(Physical Personality) చర్చించే విషయాన్ని పారదర్సకతో తో అర్ధం చేసుకొని దానికే ప్రాధాన్యతని ఇవ్వటం.
  5. నా స్థాయి, నా దర్పం, నా జ్ఞానం అనే ధోరణిలో తో కాకుండా ఇతరులను కూడా వినటానికి ప్రయత్నించాలి కానీ అవతలివారి నోట్లో నుంచి మాట వచ్చీ రాక ముందే మన కంతా తెలుసుననే ఖండనలుపనికిరావు. మీరు చెప్పేది ఇతరులుఎలా వినాలనుకుంటారో అలాగే ఇతరులు చెప్పేది మీరు వినే ధోరణీలో ఉండాలి లేకపోతె ఇతరుల ఆత్మగౌరవం (ఈగో) ఖచ్చితంగా దెబ్బతింటుంది.
  6. ఇతరులతో చర్చ లేదా ఏ సంభాషణ యైనా కూడా గెలవాలనే వితండవాదం కంటే కూడా వాస్తవికతకే ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తవాన్ని విజ్ఞతతో స్వీకరించాలి.
  7. వ్యక్తిగత దూషణలు, కించ పరచటాలు, అనవసరమైన ఉదాహరణలు చొప్పించటం లాంటివి చేయరాదు చర్చల అనంతరం ద్వేషాలకి, కక్ష, కార్పణ్యాలకు తావివ్వరాదు.
  8. మన ఆత్మగౌరవం మన కెంత ముఖ్యమో ఇతరుల ఆత్మగౌరవం వారికంత ముఖ్యం కనుక చర్చ లేదా సంభాషణలలో సున్నితత్వం అవసరం. లేని పోనీ డాంబికాలతో ఇతరుల మనసును నొప్పించరాదు.
  9. మన ఆత్మగౌరవం మన కెంత ముఖ్యమో ఇతరుల ఆత్మగౌరవ పరిరక్షణకూడా మనకు అంతే ముఖ్యం”తమలపాకు తో నువ్వొకటంటే తలుపు చెక్కతో నీరెండంటా” అనే ధోరణి తిరిగి ఘర్షణకు దారి తీస్తుంది. అందుకే ఒక మనిషిని ఒక మనిషి గౌరవించట మనే సంస్కారానికి శ్రీకారం చుట్టాలి.
  10. జీవితంలో అత్యంత సున్నితమైనది, సంక్లిష్టమైనది ఈ ఈగో అనబడే ఆత్మగౌరవం అందుకే దీనిని మనం పరిణితితో (Maturity) కాపాడు కోవాలి. అదే సందర్భంలో ఇతరుల గౌరవాన్ని కాపాడుతూ ఫలితం ఏదైనా హుందాగా వ్యవహరించాలి.
  11. జీవితంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది ఎప్పుడు! ఎక్కడ !ఎందుకు!ఎవరితో! ఎలా! అనే విచక్షణ ఇదే జీవితాన్ని విజయవంతంగా నడిపే తారక మంత్రం అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

సామాజిక, రాజకీయ,సాంస్కృతిక,సాంకేతిక ఇలా ఏ రంగాలలో పనిచేసేవారైనా ఏ స్థాయిల్లో ఎదిగిన వారైనా, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారైనా కూడా తమకు తామే గెలవాలను కుంటారు. నిజానికి ఎదిగే కొలది ఒదిగి ఉండాలనే చరిత్ర చెబుతుంది. సహనం,సంయమనం, భావోద్రేకాలు నియంత్రణ, విషయాన్నిహేతుబద్దంగా అర్ధం చేసుకునే మనసు కలిగినవారే వాస్తవాన్ని ఎటువంటి భేషజాలు లేకుండా అంగీకరించి ఆచరణలోకి తేవటానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి నిఖార్సైన వ్యక్తిత్వం కలవారు మాత్రమే విజ్ఞతతోవ్యవహరిస్తూ హుందాగా తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తారు. ఔనంటారా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked