కవితా స్రవంతి

ఆటవెలదిలో అమెరికా

– సబ్బని లక్ష్మీనారాయణ

ఆట వెలది లోన అమెరికా కథరాసి
తేట తెల్ల పరుతు తెలుగు లోన
అగ్ర రాజ్య మదియు అన్ని రంగాలలో
ఉజ్వలమ్ము చూడు ఉర్వి మీద !

చూడ చక్కదనము చూసిన మేరనూ
అందమైన దేశ మదియ కనగ
పచ్చదనము చూడు పరిశుభ్రతయు చూడు
ముదము తోన మదియు మురిసి పోవ !

జాతులన్ని అచట రీతితో అలరారు
మతము లన్ని యచట మసలి యుండు
దేశ రక్షణమ్ము దీటైన పాలన
క్రమము శిక్షణకదియు క్రతువు చూడు

చెట్లు చేమ లవియు చేరి నిలకడగ
పచ్చదనము చూడు పరిమళింపు
అడుగు అడుగు లోన అంద మదియ చూడు
ఎంచి చూడ బతుకు ఎదలు మురియ

కుక్క పిల్ల కూడ కూడి బతుకు చుండు
చెంత నుండె తోడు చెలిమి తీరు
ముద్దు చేయ జనులు ముద్దార బతుకును
చక్కనైన బతుకు కుక్క బతుకు !

అమెరికనెడు దేశ మందరి దదియును
అద్భుతమ్ము లెన్నొ ఆలకింప
సుందరమ్ము మనకు సుస్వాగతమనును
అందమైన దేశ మదియ చూడు !

రోడ్ల మీద కార్లు రొప్పుకుంట జనులు
దారులన్ని చూడు బారు తీరి
కార్లు ఎక్కువచట దార్లు పొరలు కుంటు
చీమ బారులట్లు ధీమ తోను !

ఇండ్లు చూడ నిచట ఇంపుగా నుండును
చెక్క తోడనైన చక్కగాను
నాణ్య మైన పనియు నవ్యరీతుల తోడ
వాస యోగ్య మవియు వాసిగాను !

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked