ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

సూక్ష్మంలో మొక్షంలాగా చటుక్కున పాఠకుడికి అనుభూతిని అందించ కలిగేవి ఖండకావ్యాలు, మినీకవితలే. ఈనాటి ఈ ఆధునిక కవితకు జీవితం భావచిత్రమే. ఈ భావచిత్రమే మినీ కవితకి కానీ, ఖండకవితకి కానీ రూపాన్నిస్తున్నది, నియమిస్తున్నది, దానిని అనుభవంగా పర్యవసింపచేస్తున్నది. ఈ భావచిత్ర తరంగాలే ఖండకావ్యాలకు రూపాన్నీ, గుణాన్నీ కల్పిస్తున్నాయి. అనుభూతికవిత భావచిత్రాలతోనే రూపుకడుతుంది. వాటినే అనుభూతులుగా పరివర్తింపచేస్తుంది. అందువల్లనే అనుభూతివాదులు పెద్దపెద్ద ప్రక్రియలను చేపట్టటం లేదు. అనుభూతివాదులంతా తమ రచనలకు ఖండకావ్య ప్రక్రియనే వాడుకుంటున్నారు. ఖండకావ్యం కాల్పనిక కవిత్వోద్యమంలో ప్రభవించిన ప్రధాన ప్రక్రియ. అందువల్లనే అనుభూతివాద కవిత్వం, కాల్పనికోద్యమ కవిత్వం ఒకటిగానూ, దగ్గర సంబంధం కలవిగానూ విమర్శకులు చెప్తున్నారు. అంతేకాదు, కాల్పనికోద్యమ కవులు సంప్రదాయంగా వస్తున్న మహాకావ్యాలను నిరాకరించి, ఖండకావ్య ప్రక్రియను చేపట్టారు. అనుభూతివాదులూ అంతే. వీరికి మహాకావ్య స్పృహ గిట్టలేదు. ఇదీ ఒక కారణమే.
అనుభూతి కవిత్వానికే కాక ఇతర కవిత్వాలకు కూడా ఖండకావ్య ప్రక్రియే ప్రధానమైన ఆయుధమైంది. అందువల్ల ఖండకావ్య రచన పలుదోవలపోయింది. ఈనాటి కావ్యాలలో, ఖండకావ్యాలలో భావచిత్రాలకంటే, ప్రతీకలకి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతీక ఆలోచన రేకెత్తించి, తద్ద్వారా అనుభూతికి దోవతీస్తుంది. అంటే ప్రతీక ప్రధానమైన రచనలో అనుభవం వివక్షితంగా ఉంటుంది. పఠిత అనుభూతిని సద్యఃస్ఫూర్తిగా పొందలేదు. ఆలోచనామృతంగా అనుభూతిని నమ్ముకునే అవకాశమే ఎక్కువ. దానిని అవివక్షితంగా మార్చటానికి భావచిత్రాలు తోడ్పడతాయి. ఆధునిక కవిత్వంలో ప్రతీకల కారణంగా అనిర్వచనీయత అస్పష్టత చోటు చేసుకొంది. ప్రతీకాత్మకతలో ఎంత ప్రగతి సాధించినా ఈ రచనలో భావచిత్రాలను ఎంతగా అలంకరించినా ఈ అస్పష్టత, అనిర్వచనీయత కన్పిస్తూనే ఉంది. ఇంకా గమనించాల్సిన దేమిటంటే ఈ అస్పష్టత కావ్యగుణాలలో ముఖ్యమైన లక్షణం అని కొందరు చెప్పుకుంటున్నారు.

“మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరహుకుంటూ వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!

అని మహాకవి చెప్పి ‘భావాంబరవీధి విశ్రుత విహారిణి’ అయిన కవితాకన్యను నేల మీదికి దించి, ప్రజలకందుబాటులోకి తెస్తానని, రచనను సామాజికపరం చేస్తానని చెప్పుకున్నాడు. ఛందో బందోబస్తులని తెంపినది, అభినవ

ధ్వనిధారణకి ఉద్యమించినది – ఎవరు ఏ మార్గం చేపట్టినా రచన సామాన్య మానవుడికి అందుబాటులోకి రావాలని. కానీ నేటి ప్రతీకాత్మక కవిత్వం విద్యావంతులకే అర్థం కావటం లేదు. ఈ సందర్భంలో జి.వి. సుబ్రహ్మణ్యంగారు, “అస్పష్టత – తింటున్న అన్నంలో పలుకు రాయిలా ఆధునిక కావ్యపఠితులను బాధపెడుతున్న మాట వాస్తవం” అని అన్నారు. ఈ ప్రతీకాత్మకత శిల్పం పేరుతొ కావ్యాలలో బలపడుతున్న తరుణంలోనే పాఠకుడికి కావ్యాస్వాద క్షిష్టత తొలగించాలనీ, ఆధునిక కవిత్వంలో కవిత్వానుభూతిని సాక్షాత్తుగా అనుభవిస్తున్నట్లుగా చెయ్యాలనీ బయల్దేరిన ఉద్యమమే అనుభూతి కవిత.
అనుభూతి కవుల రచనలు ఆధునిక కవిత్వంలోని అస్పష్టతను తొలగించాలన్న సంకల్పంతోనే పుట్టాయన్నట్లుగా కొనసాగాలి. సమాజం దృష్టికి ఈ విషయం ఎంత ప్రస్ఫుటంగా వస్తే అనుభూతి కవిత్వోద్యమం అంత సఫలమైందని భావించాలి. ఈనాటి అనుభూతి కవితలు పంచకోశాత్మక ప్రవృత్తులను జీవచైతన్యంతో సంవదించే ప్రయోగాలు మానవ సమగ్రానుభవానికి ఒక పాక్షిక భూమికను మాత్రం సంతరించాయి. భవిష్యత్తులో తదితర ప్రవృత్తులకి కూడా ప్రాధాన్యం కలిగే కవితలకి ఇవి మార్గదర్శకంగా నిలిచాయి. వీరి అభిప్రాయాలనన్నిటినీ చూసిన మీద అనుభూతి కవిత్వం అంటే ఏమిటి? వాటి లక్షణాలు ఇవీ అనే అభిప్రాయం ఏర్పడుతుంది.
ఎటువంటి సందేశాన్నీ, దృక్పథాన్నీ కలిగించకుండా కేవలం సమగ్ర సామాజికానుభావాన్ని కలిగించేదే అనుభూతి కవిత్వం.
అనుభూతివాదం ఆధునికం దీనికి మేనిఫెస్టో లేదు ఇది సామాజికవాదం సంఘీభావ స్పృహ లేకుండానే సమకాలీన చైతన్యాన్ని రచయితలు ఎవరంతట వారుగా పోషిస్తున్నారు.
వస్తునిర్దేశం లేదు ఖండకావ్య ప్రక్రియ ఆధారంగా భావచిత్రాలతో రూపు కడ్తున్నదే అనుభూతివాదం దీనికి మహాకావ్య స్పృహ లేదు వస్తువు కన్నా కవి అనుభూతికి ప్రాముఖ్యం అనుభూతివాదం దేశీయం జీవచైతన్య ప్రవృత్తి ద్వారా సమాజానికి సమగ్ర కళానుభవాన్ని అందించాలనే స్పృహ అనుభూతివాద కవులందరిలోనూ కన్పిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked