ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

సమాజానుభూతి దృష్టితో గమనిస్తే విశ్వనాథ రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందగలిగే అనుభూతి విశేషాలను వివిధ ప్రక్రియల ద్వారా, వివిధ కవులు సాహితీ ప్రపంచంలో ప్రచలింపచేస్తున్న ప్రయోగాల ద్వారా పరిచ్చిన్నంగా పొందగలిగే వికీర్ణ స్థితిని విశ్వనాథ సమీకించి, వాటినన్నింటిని సమాజానికి సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం ఆకాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం అర్రులు సాచే ఆవేదన. పంచజిహ్వల సమాజ చేతనకు విశ్వనాథవారు అందించిన అమృతనైవేద్యమే, అనుభవకోశమే రామాయణ కల్పవృక్షం. ఆ కావ్యంలోని సన్నివేశాలు పాత్రస్వభావాలు సమాజంలో కానవచ్చే వాస్తవజీవిత ప్రతిబింబాలుగా ఉండటం వల్ల వాస్తవానుభవాన్నే, అపూర్వకాల్పనిక చైతన్యంతోనూ, కల్పనామహనీయ విశేషాలతోనూ పద్యంలో వ్రాసిన నవలా అన్నట్లు పఠితలను రమింపచేయటం చేత కాల్పనికానుభవాన్నీ, భారతీయ తత్వశాస్త్ర మర్యాదధారతో అందులోనూ అద్వైత మతదృష్టితో రామకథాతత్వాన్ని వ్యాఖ్యానించిన కావ్యం కావటం చేత జ్ఞానానుభవాన్నీ, జీవవేదనా భరితమైన ఆ కావ్యమంతా జీవచైతన్య భరతమై యుండటం చేత రసానుభవాన్నీ, భక్తికర్మ జ్ఞాన మార్గాల విశిష్ట సమన్వయంగా సాగే భారతీయ జీవన పరమార్థధార పరమ రమ్యంగా కావ్యార్థాలలో వ్యంజింపబడటం చేత ఆధ్యాత్మికానుభవాన్ని రామాయణ కల్పవృక్షం సమాజ సమగ్రానుభవ సంసిద్ధికి అందించే శక్తివంతమైన కావ్యంగా రూపొందింది. మహాకావ్యానుభూతికోసం పరితపించే సాహితీజగత్తుకు, సమాజ ప్రవృత్తికి భాగవతంలాగా పరిపూర్ణానుభవస్థితిని కల్పించే యత్నమే జీవిత ధ్యేయంగా కృషి చేసి కృతార్థుడైన యుగచైతన్యమూర్తి విశ్వనాథ.

అభ్యుదయ కవితా ప్రస్థానానికి ప్రభాతభేరి మ్రోగించిన శ్రీశ్రీ సమాజ చైతన్యంలోని సామ్యవాద ప్రవృత్తికి ప్రాణం పోశారు. మొదట భావకవితా యుగం మీద తిరుగుబాటు ప్రకటించిన శ్రీశ్రీ రష్యా విప్లవ చైతన్యంతో ఉత్తేజితుడై మరోప్రపంచం వైపు మహాప్రస్థానం సాగించాడు. అతని చైతన్యాన్ని ఒక శక్తిగా ఉద్యమంగా రూపొందించటంలో శిష్లా, నారాయణబాబు, పఠాబి, పురిపండా, ఆరుద్ర మొదలైన కవుల రచనలు కూడా తోడ్పడ్డాయి.

“లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ, పరిష్కరించే, బహిష్కరించే, బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ, నాలో కదిలే నవ్యకవిత్వం, కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి, సమర్పణంగా, సమర్చనంగా” వ్రాస్తున్నానని శ్రీశ్రీ కాలాన్ని కాహళగా మ్రోయించాడు. శ్రీశ్రీ కవితా చైతన్యం మార్క్సిజానికి ఉన్ముఖంగా సాగింది. దానిలోని గతితార్కిక భౌతికవాదం, వర్గపోరాటం మొదలైన అంశాలతో ఆవరించింది. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కొన్ని గేయాలలో ప్రపంచ కార్మికోద్యమ చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది. బూర్జువా వర్గానికీ, కార్మిక వర్గానికీ గల శత్రుత్వాన్ని కార్మికులు గుర్తించేటట్లు చేయటం, ఆనాటి సాంఘిక రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే విప్లవోద్యమాన్ని బలపరచటం, ఆర్ధిక మూలమైన సామాజిక వ్యవస్థనూ, రాజకీయ చైతన్య ప్రధానమైన వాస్తవానుభూతినే శ్రీశ్రీ తన కవితలో వ్యక్తం చేశాడు. శ్రీశ్రీ గేయాలు సామ్యవాద దృక్పథానికి సామవేదాలుగా నిలిచాయి. 1943లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. “అభ్యుదయ రచయితల సంఘానికి కమ్యూనిస్టు పార్టీ పురుడుపోయటమే కాక పాలుపట్టి పెంచింది. రచయితలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఆ పార్టీ విధానాలు ఆమోదించే కార్యక్రమం” అన్నారు ఆరుద్ర. ఒకవిధంగా అభ్యుదయ రచయితల సంఘం రాజకీయ శక్తుల నియంత్రణకు లొంగని వాటి ఆదేశాలను పాటించని రచయితలూ ఉన్నారు. తెలంగాణాలో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోనే కాకుండా స్వతంత్రంగా నిజాం ప్రభ్యుత్వాన్ని ఎదురించిన అభ్యుదయ కవులు దాశరథి, వట్టికోట, కాళోజీ మొదలైన వారెందరో ఉన్నారు. మార్క్సిజంను పూర్తిగా అంగీకరించకపోయినా అందులోని సామాజిక స్పృహను తమ కవితా చైతన్యంలో నింపుకున్న వారే అభ్యుదయ కవులు”.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked