కథా భారతి

ఊరేగింపు

G.S.S. కళ్యాణి.

అది సీతారామపాలెం అనే కుగ్రామం. సాయంత్రంవేళ ఇరుగు పొరుగు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎనభైయేళ్ల దేవమ్మ తమ ఇంటి అరుగుపైన కూర్చుని వారి మాటలను ఆసక్తిగా వింటోంది.

“ఇది విన్నావా సుభద్రా? మన ఊరి చివర కొండపైనున్న రాములవారి గుడిలో ఈ ఏడు శ్రీ రామనవమి ఉత్సవం ఘనంగా చేస్తున్నారట! “, సుభద్రతో అంది విమల.

“ఎందుకు వినలేదూ? రేపు మొదలుపెట్టి మూడు రోజులు వరుసగా ఉత్సవాలు చేస్తున్నారటగా! మూడోరోజు రాములవారిని, సీతమ్మను మన ఊళ్లోని అన్ని వీధులలో ఊరేగిస్తారుట కూడా!”, అంది సుభద్ర.

“అయితే సుభద్రా! మన వీధికి కూడా రాముడు వస్తాడా?”, కుతూహలంగా అడిగింది దేవమ్మ.

“ఓ! వస్తాడట అవ్వా! మన ఊళ్లోని అన్ని వీధులూ రాములవారిని తిప్పుతారట! “, దేవమ్మకు చెప్పింది సుభద్ర.

ఆ మాట విన్న దేవమ్మ మనసు ఒక్కసారిగా ఆనందంతో పులకించిపోవడంతో ఆమె భక్తిగా రాముడిని తన మనసులో స్మరించుకుంటూ చేతులు జోడించి నమస్కరించుకుంది.

దేవమ్మ పుట్టి, పెరిగిందంతా సీతారామపాలెంలోనే! దేవమ్మ కుటుంబంలో తరతరాలుగా శ్రీరాముడే వాళ్ళ ఇంటి ఇలవేల్పు. ప్రత్యేకించి దేవమ్మకు రాముడంటే చిన్నప్పటినుండీ అమితమైన భక్తి! దేవమ్మ చిన్నతనంలో ప్రతిరోజూ దాదాపు మూడువందల మెట్లు ఎక్కి, వారి ఊరి చివర కొండపైనున్న రాముడిని దర్శించుకుని వచ్చేది. వయసు వల్ల కొంత, అనారోగ్యం వల్ల కొంత అన్ని మెట్లు దేవమ్మ ఇప్పుడు ఎక్కలేక, ఇంట్లోనే రాముడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ రాముడికి భక్తితో పూజ చేసుకుంటోంది. పాతికేళ్ల క్రితమే దేవమ్మ భర్త కాలం చేశాడు. దేవమ్మకు ఇద్దరు కొడుకులున్నారు. ఎన్నో కష్టాలకోర్చి తన పిల్లలిద్దరినీ బాగా చదివించి వారిని పెంచి పెద్దవారిని చేసింది దేవమ్మ. వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించి, పెళ్లిళ్లు చేసుకుని పట్నంలో స్థిరపడిపోయారు. కొన్నేళ్ల క్రితం దేవమ్మ జబ్బుపడినప్పుడు పక్షవాతంతో ఆమె కుడికాలు పూర్తిగా చచ్చుపడిపోయింది. దేవమ్మను తమ దగ్గరకు వచ్చి తమతో ఉండిపొమ్మని ఆమె పిల్లలు ఎన్ని సార్లు బతిమలాడినా దేవమ్మ తన సొంత ఊరినీ, శ్రీ రాముడిని వదిలి వారివెంట పట్నం వెళ్ళడానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు!

ప్రస్తుతం గుడికి వెళ్లలేని స్థితిలో ఉన్న దేవమ్మకు, ఆ రాముడే తమ వీధికి ఊరేగింపుగా వస్తాడన్న వార్త చాలా ఆనందాన్ని కలిగించింది.

మరునాడు సీతారామపాలెం అంతా శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లతో కోలాహలం మొదలయ్యింది. ఆ గ్రామ ప్రజలు, వీధులన్నీ మామిడితోరణాలతో, రకరకాల పువ్వులతో అలంకరించారు. ప్రతి కూడలిలోనూ పందిళ్లు వేశారు. అందరూ రాముడిని స్మరించుకుంటూ ఉత్సాహంగా పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. సాయంత్రం వేళ కాగానే అందరూ తమ పనులను ఆపి మంచి దుస్తులు వేసుకుని, చక్కగా ముస్తాబై ఇంటిల్లుపాదితో కలిసి కొండపైనున్న శ్రీ రాముడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. తను కూడా అందరిలాగా రాముడి గుడికి వెళ్లాలని దేవమ్మ మనసు కొట్టుకుపోయింది. కానీ వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే ఉండిపోయింది.

ఉత్సవాలలో రెండవ రోజు కూడా మొదటిరోజులాగే ఎంతో సందడిగా జరిగింది. రాముడి గుడిలోని అలంకరణల గురించి, ఘనమైన ఏర్పాట్ల గురించీ, శ్రీ రాముడి వైభవం గురించీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విన్న దేవమ్మ ఇక ఆగలేక, “సుభద్రా! ఇవాళ గుడికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెడతావా?”, అని సుభద్రను బతిమాలాడుతున్నట్టుగా అడిగింది.

“అవ్వా! నువ్వాజనంలోకి పోలేవు! ఇంకొక్కరోజు ఓపిక పట్టు! ఆ రాముడి ఊరేగింపు మన ఇళ్ల ముందునుంచేగా వెడుతుంది? అప్పుడు శ్రీ రాముడిని తనివితీరా చూద్దువుగాని!”, అంటూ దేవమ్మకు ధైర్యం చెప్పింది సుభద్ర.

సుభద్ర చెప్పింది సబబుగానే తోచింది దేవమ్మకు. చేసేదిలేక ఊరేగింపు వస్తుందని సమాధానపడి ఆ రాత్రికి పడుకుంది దేవమ్మ.

మూడవ రోజు శ్రీరామనవమి! దేవమ్మ తెల్లవారకముందే లేచి, ‘అసలే ఇవాళ నా రాముడు వస్తాడు!’, అని అనుకుంటూ, ‘శ్రీ రామ! శ్రీ రామ!’ అన్న తారకమంత్రాన్ని మనసులో స్మరిస్తూ, మెల్లిగా పనిచేయని తన కాలును ఈడ్చుకుంటూ ఇంటి చుట్టూ ఊడ్చి, ముగ్గులు తీర్చి దిద్ది, ఇల్లు కడిగి శుభ్రం చేసి, స్నానాదులు ముగించుకుని, పెరట్లో పూసిన పూలను కోసి, మాలలు కట్టి, కొన్ని దేవుడి మందిరంలోని రాముడికి అలంకరించి మరికొన్ని సాయంత్రం ఊరేగింపుగా రానున్న రాముడికోసమని దాచి, వడపప్పూ, పానకము, జీడిపప్పులూ-నెయ్యీ ఎత్తుకెత్తు వేసి చిక్కటి పాలతో పాయసము తయారు చేసింది. శరీరం సహకరించకపోయినా చేస్తున్నదంతా రాముడికోసమని తనకుతాను పదే పదే చెప్పుకుంటూ ఆ పనులన్నీ దేవమ్మ పూర్తిచేసేసరికి సాయంత్రమయ్యింది!

‘ఇంకాసేపట్లో నా రాముడొచ్చేస్తాడు! నేను తయారు చేసిన పదార్ధాలన్నీ ఆ రాముడికి నివేదించాలి!’, అనుకూంటూ తమ ఇంటిముందున్న అరుగుపై కూర్చుని రాముడి ఊరేగింపు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది దేవమ్మ.

అప్పటికి దేవమ్మ ఉండే వీధంతా అక్కడుండేవారు ఎంతో అందంగా అలంకరించి, పిల్లలూ, పెద్దలూ అందరూ పట్టుబట్టలు కట్టుకుని రాముడి రాక కోసం చూస్తూ గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. అంతలో రాముడి గుడినుండీ ఒక అర్చకుడు వచ్చి ఏదో కారణంతో ఆ రోజు కార్యక్రమాలన్నీ ఆలస్యమయ్యాయని చెప్పి, అందువల్ల రాముడి ఊరేగింపు కార్యక్రమం రద్దయ్యిందనీ, అందరూ కొండపైనున్న రాముడి ఆలయానికి వెళ్లి రాముడి దర్శనం చేసుకోవలసిందిగా చెప్పాడు.

సీతారామపాలెం వాసులంతా ఒక్కసారిగా నిరాశ చెందారు. కానీ వారంతా అంతలోనే తేరుకుని గబగబా కొండపైనున్న గుడికి బయలుదేరి వెళ్లారు. చూస్తూండగా దేవమ్మ ఉంటున్న వీధిలోని వారంతా ఒకరితర్వాత ఒకరు గుడికి వెళ్లిపోవడంతో కొద్దిసేపట్లో ఆ వీధంతా నిర్మానుష్యంగా మారింది!
దేవమ్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. రాముడి ఊరేగింపు వస్తుందనీ, రాముడి దర్శన భాగ్యం తనకు కలుగుతుందనీ ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవమ్మ ఇప్పుడు రాముడు రావట్లేదన్న వార్తను జీర్ణించుకోలేకపోతోంది!

తమ ఇంట్లోని దేవుడి మందిరానికి వెళ్లి, ‘రామయ్యా! ఈ అభాగ్యురాలిపై నీకెందుకయ్యా ఇంత కోపం? నేను మిగతావారిలా కొండెక్కి వచ్చి నీ దర్శనం చేసుకోలేనని నీకు తెలియదా? నా కోసం వస్తానన్నవాడివి ఎందుకు రాలేదూ?? నా పై దయ చూపించు తండ్రీ!”, అంటూ భోరున విలపించింది దేవమ్మ.

అంతలో, “అవ్వా! అవ్వా!”, అంటూ ఎవరో పిలవడంతో వాకిట్లోకి వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఒక యువకుడిని చూసి ,”ఎవరు బాబూ? ఎవరు కావాలి?”, అని అడిగింది దేవమ్మ.

“అవ్వా! ఆకలి దంచేస్తోంది! ఈ వీధంతా ఖాళీగా ఉంది. ఎవ్వరూ ఇళ్లల్లో లేరు! నువ్వొక్కదానివే ఉన్నావు! తినడానికేమైనా ఇస్తావా అవ్వా?”, అని అడిగాడు ఆ వచ్చిన యువకుడు.

“ఇంతకీ నువ్వెవరు? ఎక్కడినుండి వచ్చావూ? చూస్తే మా ఊరివాడిలా లేవే?”, అడిగింది దేవమ్మ.

“నా గురించి తీరిగ్గా చెబుతానులే అవ్వా! ముందు తినడానికేమన్నా పెట్టు! ఆకలి తట్టుకోలేకపోతున్నాను!’, అన్నాడు ఆ యువకుడు.

“అయ్యో నాయనా! రా! లోపలికొచ్చి కాళ్ళు కడుక్కో!! భోజనం వడ్డిస్తాను!”, అంటూ నీళ్ల చెంబును ఆ అబ్బాయికి అందివ్వబోయింది దేవమ్మ.

కానీ ఆ రోజు పొద్దుటినుంచీ బోలెడు పనులు చేసి చేసి అలిసిపోయి ఉన్న దేవమ్మ ఒళ్ళు ఉన్నట్టుండి తూలడంతో చెంబు కాస్తా కింద పడి నీళ్లన్నీ ఆ యువకుడి కాళ్ళ మీద పడిపోయాయి.

“అరెరే! దెబ్బతగల్లేదు కద నాయనా! ముసలిదాన్ని! చేతులు పట్టివ్వవ్వు! ఏమీ అనుకోకు!”, అంది దేవమ్మ.

“పర్లేదులే అవ్వా!”, అంటూ ఆ యువకుడు కాళ్ళు తుడుచుకుని తినడానికి కూర్చున్నాడు.

దేవమ్మ అతడి ముందు విస్తరి వేసి తను రాముడికోసం వండిన పదార్ధాలన్నీ పెట్టి, “కడుపునిండా తిను నాయనా!”, అంది. ఆ యువకుడికి దేవమ్మ చేతి వంట చాలా నచ్చింది.

వడ్డించినవన్నీ తృప్తిగా తింటూ , “ఏమవ్వా? నువ్వు వెళ్లలేదా రాములవారి గుడికీ?”, అని అడిగాడు.

అందుకు దేవమ్మ ,” ఏం నాయనా ? నా కాలు చూసే ఆ మాట అడుగుతున్నావా? ఆ రాముడికి నేనంటే కోపమనుకుంటా! అందుకే ఇవాళ వస్తానని చెప్పి రాలేదు!”, అంది చిరు కోపంతో.

“అయ్యో ఆ రాముడి మనసు వెన్నలే అవ్వా! లేకపోతే నిన్ను ఇక్కడ ఉంచి ఉండకపోతే నా ఆకలి ఎవరు తీర్చేవారు?”, అన్నాడు ఆ యువకుడు.

“నిజమేలే నాయనా! ఇంద! రాముడి కోసం చేసిన వడపప్పు, పానకం, పాయసం! తిను!!”, అంటూ అవన్నీ ఆ యువకుడి విస్తరిలో వడ్డించింది దేవమ్మ. ఆ యువకుడు మంచి ఆకలిమీద ఉన్నాడేమో దేవమ్మ వడ్డించినవన్నీ గబగబా తినేశాడు.

చివరికి పాయసం తింటూ ,”ఆహా!! ఈ పాయసం అమృతంలా ఉందవ్వా! నాకు పాయసమంటే ప్రాణం! అసలు పాయసం తినడంవల్లే నేను మా అమ్మకు పుట్టానట! ఇంతకీ ఇవాళ నా పుట్టినరోజు! తెలుసా?”, అన్నాడు ఆ యువకుడు.

“పోన్లే నాయనా! నా వంట నీకు నచ్చి నీ కడుపు నింపింది! నాకదే ఆనందం!!”, అంది దేవమ్మ.

ఆ యువకుడు భోజనం ముగించి కాళ్ళూ, చేతులూ కడుక్కుని, “ఇక వెళ్ళొస్తానవ్వా!”, అన్నాడు.

“అప్పుడేనా? నిన్ను చూస్తూ ఉంటే నా మనసు ఎందుకో రాముడు రాలేదన్న బాధనుండీ తేరుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది నాయనా! పోనీ ఈపూటకు ఉండిపోకూడదా?”, ఆప్యాయంగా అడిగింది దేవమ్మ.

“నాకూ ఉండాలనే ఉంది అవ్వా! కానీ ఏం చెయ్యమంటావ్? నా బుగ్గ మీద దిష్టి చుక్క ఉంది! చూశావా? నేను కొత్త పెళ్ళికొడుకుని! మా ఆవిడ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది! నా మనసు తనవైపే లాగేస్తూ ఉంది!”, అన్నాడు ఆ యువకుడు సిగ్గులొలకబోస్తూ!

“ఓ! అలాగా! అయితే సరే! క్షేమంగా వెళ్లి లాభంగా రా నాయనా! ఎప్పుడైనా మీ ఆవిడను కూడా నీతోపాటూ మా ఇంటికి తీసుకుని రా!”, అంది అవ్వ.

“తనెప్పుడూ నాతోనే ఉంటుందిలే అవ్వా! అంటే నా గుండెల్లో అన్నమాట! అవ్వా! చాలా థాంక్స్! సమయానికి భోజనం పెట్టి నా ఆకలి తీర్చి నాకు తృప్తి కలిగించావు! ఇక వెళ్ళొస్తా!!”,అని తన బండిపైన కూర్చుని హెల్మెట్ పెట్టుకుంటూ అన్నాడు ఆ యువకుడు.

బండికున్న నెంబర్ బోర్డు పై ‘గరుడ’ అని రాసి ఉన్న అక్షరాలవంక దేవమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, “ఇంతకూ నీ పేరేమిటి బాబూ? నీ వివరాలేవీ చెప్పలేదూ?”, అని అడిగింది.

“నా పేరు జగదభిరాం అవ్వా! నేను చేసే పనుల గురించి చెప్పడం అంత సులభం కాదు. క్లుప్తంగా చెప్పాలంటే నేను ఇదిగో ఈ బండిపైన ఊరూరా ఊరేగుతూ ఉంటానన్నమాట!!”, అంటూ రెప్పపాటు కాలంలో బండిపైన రివ్వున వెళ్ళిపోయి కనుమరుగైపోయాడా యువకుడు!

ఆ మరుక్షణం దేవమ్మకు,” ఇవాళ ఇతని పుట్టిన రోజా? ఇతను కొత్త పెళ్లికొడుకా?? వాళ్ళమ్మ పాయసం తాగితే పుట్టాడా?? ‘గరుడ’ వాహనం మీద ఉరూరా ఊరేగుతూ ఉంటాడా?? ఆ వచ్చినవాడు నా శ్రీ రాముడా???”, అన్న సందేహం కలిగింది.

ఆలోచనలో పడ్డ దేవమ్మకు తమ ఇంట్లోంచీ దివ్యపరిమళాలు రావడంతో గబగబా దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళింది. దేవుడి మందిరంలో దేవమ్మ ప్రతినిత్యం పూజించుకునే శ్రీ రామచంద్రుడి విగ్రహం శతకోటి సూర్య తేజములతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది!!

‘ఆ వచ్చినది నేనేలే!’ అన్నట్లు ఉన్న శ్రీరాముడి చిరునవ్వును చూస్తూ, “శ్రీరామా! ఇన్నాళ్టికి నాపై కృప కలిగిందా స్వామీ! ధన్యురాలినయ్యాను!!”, అంటూ తన కళ్ళవెంట ఆనందభాష్పాలు జలజలా రాలుతూ ఉండగా, అమితానందంతో శ్రీరాముడి పాదాలను తాకుతూ కైవల్యాన్ని పొందింది దేవమ్మ !

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked