శీర్షికలు

ఒత్తిడిని జయిద్దాం విజయం సాధిద్దాం

ఒత్తిడి దీన్నే మనం Stress అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అ ఆ లు చదివే (క్షమించాలి ABCD) పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది! మానవ జీవనశైలిలోనే అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి! దాని ఫలితమే దినదినాభి వృధ్ధిగా పెరుగుతున్నాయి ఈ ఒత్తిళ్లు.వృత్తిగా చేసే పనులకు వ్యక్తిగా చేసే పనులు మధ్య సామరస్యం లేకపోవటం ఒకటైతే, వ్యక్తిగా పెంచుకున్న, పెరుగుతున్న అవసరాలు కూడా ఈ ఒత్తిడికి దోహద పడుతున్నాయి.
ప్రతిదినం చేయవలసిన పనుల పరుగులో అందుకోవాల్సిన బస్సు మొదలు ట్రాఫిక్ జాములతో చేరవలసిన చోటుకు చేరేవరకు సాగే ఈ ఉద్వేగంలో మనసు ఒత్తిడికి గురి అవుతూ మనిషి శారీరక మానసిక ఆరోగ్యాల ఫై ప్రభావం చూపుతోంది. దీనికి తోడుగా పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా పెరగని ఆర్ధిక వనరులు, అనవసరమైన పోటీతత్వాలతో ఇతరులతో పోల్చుకుంటూ పెంచుకునే అవసరాలు ఒత్తిడికి మూల కారణాలుగా మారుతున్నాయి. ఇంకా ఇతరత్రా అనేకానేక సామాజిక,సాంఘీక,ఆర్ధిక కారణాలు ఈ ఒత్తిడి కారణాలుగా మారుతున్నాయి. ఇదే సందర్భంలో ముఖ్యంగా నేటి సమాజంలోని నిరుద్యోగ యువత బతుకుకు భరోసా కల్పించలేని చదువుల డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు రాక ఒత్తిడితో మానసిక సమతూల్యత కోల్పోతోంది.
ఈ ఒత్తిడి పిల్లలనుండి పెద్దలవరకు సర్వ సాధారణమై Tensionble Diabetic, Blood Pressure, Gastric Ulcers, Nerves Disorders మరియు అనేకానేక మానసిక సమస్యలకు కారణాలుగా మారుతూ మనశ్శాంతి తో మనుగడ సాగించాల్సిన మానవజీవితాలు మందులతో జీవితాన్ని లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవితంలో మానసిక సమతూల్యతతో జీవించాల్సిన పరిస్థితులు ఎప్పుడో చేజారిపోయాయి ఈ ఒత్తిడి మహమ్మారి పెద్దల సంగతి సరే చివరికి పిల్లల్ని సైతం వదలకుండా శరీరంలో ఒక్కొక భాగానికి ఒక్కొక్క మందు చొప్పున కడుపు నింపుతూ ‘ కష్టాల కలి కాలం ‘ అనే స్థితిలోకి దిగజారుస్తోంది.
ఈనాటి ఈ సామాజిక పరిణామాలలో ఈ ఒత్తిడి జీవితాలకు ఉపశమనాలు ఏమైనా ఉన్నాయా అంటే, మనకు మనంగా అనే భావన పెంచుకొనే ప్రయత్నం చేయాలి. సమాజంలో ‘మనీ’ విలువలు పెరుగుతూ మానవసంబంధాలు విచ్చీన్నం అవుతున్న ఈ దశలో కష్టంలో సుఖంలో తోడుగా, నీడగా, మనకంటూ ఓ నలుగురు ఆత్మీయులను సాధించాలి. దాదాపుగా నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు దాదాపు విచ్ఛిన్నమైనప్పటి నుండి ఈ ఒత్తిడి సమస్య అందరికి ఒక సమస్యగా మారింది. మన మనసు లోని మాట మనలోనే ఉండి మనసులో ఒత్తిడి పెంచుతూ అనేకానేక మానసిక రుగ్మతలే కాదు ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పురి గొల్పుతోందీ. సామాజిక పరిస్థితులలో జరిగే మార్పు చేర్పుల పట్ల అవగాహన పెంచుకుంటూ దానికి తగ్గ విచక్షణ తోనే మనకు మనంగా ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. అందుకే మనసు విప్పితే ప్రమోదం మనసు మూసుకుంటే ప్రమాదం. అందుకే మనకు నిజమైన ఆస్తులు ఇతరులతో చక్కటి సత్సంబంధాలు మనముందున్న ప్రతి సానుకూల అవకాశం ద్వారా ఒత్తిడికి దూరంగా జరిగే ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా ఒత్తిడిలో కొన్ని ప్రయత్నాలు ఆచరించటం ద్వారా ఉపశమనం పొందే ప్రయత్నం చేయవచ్చు దానికి ఏం చేయాలి
చరవాణి లో (సెల్ ఫోన్ ) మాటలు తగ్గించి, కర స్పర్శతో చక్కటి మానవ సంబంధాల పెంపునకు కృషి చేయటం. మనసుకు దగ్గరైన వ్యక్తులతో మాట కలపటం చాలా అవసరం
పుస్తకం లేదా పేపర్ చదవటానికి ప్రయత్నం చేయటం అనవసర ఆలోచనల మళ్లింపు కోసం మానసిక ఉల్లాసం కలిగించే మ్యూజిక్ వినటం
మానసిక ప్రశాంతతలో భాగంగా ఉద్వేగాలకు అవకాశం లేని కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇవ్వటం బుల్లి తెర, పెద్దతెర మరియు నెట్ తెరలలోని ఉద్వేగ, ఉద్రేకాలకు లోను చేసే కార్యక్రమాల పట్ల దూరంగా ఉండటం. ఎందుకంటె ఇటువంటి కార్యక్రమలు మానసిక స్థితిగతులపై ప్రఘాఢమైన ప్రతికూల (Negetive Eliments) ప్రభావాలు చూపిస్తాయి.
మంచి జ్ఞాపకాలకు సంబంధించి కుటుంబంలోని వ్యక్తులతో సంభాషణలు చేయగలగడం దీనివలన గత జ్ఞాపకాలలోని సానుకూలతలు (Postive Eliments) మనసుకు హాయిని కలుగ చేస్తాయి.
ఒత్తిడికి గురి చేసే కారణల పరిష్కారానికై కుటుంబ సభ్యుల లేదా పెద్దల సలహాలు తీసుకోవటం. దీనివలన మనకు దొరకని పరిష్కారాలు వీరి అనుభవం ద్వారా పొందే అవకాశాలు ఉంటాయి. మానసిక భరోసా నిజంగానే ఆరోగ్యకరమైన జీవితానికి భరోసా!
అవకాశమున్న ప్రతిసారి మౌనంగా మనల్ని మౌనంగా ప్రశాంతతతో పరిశీలించుకోవటం. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ తప్పనిసరి చేయటం. దీనివలన ఒత్తిడి తగ్గే అవకాశమే కాదు ప్రశాంతతో మన సమస్యలకు మనమే సమాధానాలు కనుగొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించటం. దీనివలన మెదడులోని రసాయనాల (న్యూరోట్రాన్సమీటర్స్) సమతూల్యత పెరుగుతుంది.
చేయబోయే పనిపట్ల క్రమశిక్షణ తో కూడిన ప్రాధాన్యాలు ఏర్పాటు చేసుకోవటం ఏ పని ముందు ఏ పని తర్వాతా అనే ప్రణాళిక వలన చేయబోయే పనులలో తత్తరపాటు ఉండదు. అనుకున్న పనులు సక్రమంగా సాగుతాయి. ఇక్కడ ఒత్తిడికి అవకాశం ఎక్కడ!
ఒత్తిడికి సమయానికి మధ్య చాలా దగ్గర సంబంధంఉంది సమయాన్ని ఏ విషయంలో నైనా సరే సక్రమంగా వినియోగించుకోవటం అంటేనే విజయం మన చేతిలోనే ఉన్నట్లు లెఖ్ఖ!
గతం కంటే కూడా ఈ ఒత్తిళ్ల బాధితుల సంఖ్యా దిన దినాభివృద్దిగా పెరుగుతూనే వుంది. ప్రస్తుత మానవ సమాజంలో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరూ మినహాయింపు కాదు. మరి ఈ ఒత్తిళ్ల వైకుంఠపాళి లో ఓటమి ఎరుగని ప్రయాణంకోసం మానసిక భరోసా కార్యక్రమాలు విద్యార్ధి దశనుండే నైతిక స్తైర్యం పెంచే పాఠ్యాంశాలు రావాలి. కుటుంబ వాతావరణాలలో కూడా ఖచ్చితమైన కొంత సమయం అందరూ కలిసి మెలిగే పరిస్థితులు పెరగాలి.
అదే సందర్భంలో ప్రభుత్వ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ,శబ్దకాలుష్య నివారణ ,వాతావరణంలో కాలుష్యాల నివారణ,నైతిక విలువలు లేని అనాచార కార్యక్రమాల పట్ల నియంత్రణ,ఉద్రేకం,ఉద్వేగాలతో మానసిక విచక్షణ కోల్పోయే బుల్లి తెరల, పెద్ద తెరల కార్యక్రమాల పట్ల నియంత్రణ అత్యంత అవసరం. వీటివలన జీవన ప్రమాణాలతో పాటు జీవిత సమతూల్యతలకు అవకాశముంటుంది. ఒత్తిడి లేని ప్రయాణం లో ఇక ఓటమికి చోటెక్కడ!

అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

Leave a Reply

Your email address will not be published. Required fields are marked