బాలానందం

కపట పూజ

-ఆదూరి. హైమావతి

కనపర్తి అనే గ్రామంలో కామయ్య అనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అంత ధనం ఉన్నా పిల్లి కైనా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిలిచేత్తో కకినైనా అదలించేవాడుకాదు. పరమ పిసినారి. ఇలా ఉండగా ఓ మారు ఆ గ్రామానికి ఒక ముని వచ్చి ఆ ఊరి శివాలయంలో,  హిమాలయాల నుండి తెచ్చిన శివ లింగాన్ని ప్రతిష్టించి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేయసాగాడు. ఊరి జనమంతా తమ వంతుగా పాలు పెరుగు, నెయ్యి, వంటివి తీసుకెళ్లి అభిషేకంలో పాల్గొన సాగారు. అంతా తన ఇంటిముందు నుండే వెళ్లడం, తనకేసి హేళనగా చూడటం సహించలేక పోయాడు కామయ్య.

– ఒక అల్లరివాడు ‘ఎంతమంది వచ్చినా కామయ్యగారు ఆలయానికి రారులేవోయ్! పాపం ఆ పాలు, పెరుగు అమ్ముకుంటే నాల్గు డబ్బులు వెనకేసుకోవచ్చు. శివలింగానికి అభిషేకం చేస్తే ఏం వస్తుంది చెప్పు” అని నవ్వుకోవడం చూసి రోషం వచ్చింది. అయినా సేరు పాలు చూస్తూ చూస్తూ ఆ రాతిమీద పోయడం ఎలా?’ అని కామయ్య మనసొప్పలేదు. రాత్రంతా ఆలోచించి ఉపాయం పన్నాడు. ఇంట్లో చాలా కాలంనాటి పాత వరిపిండి ఉండటం గుర్తుకువచ్చి దాన్ని వస్త్రకాయం పట్టి , దాన్ని నీటి లో కలిపి కొద్దిగా కర్పూరం వేసి ఆ పిండి పాలను ఓ చెంబులో పోసుకుని, విభూది పట్టీలు పెట్టుకుని పాతకాలపు పంచె కట్టుకుని శివాభిషేకానికి వెళుతున్నట్లు అందరికీ తెలియాలని దారిన పోయే వారినంతా పలుకరిస్తూ శివాలయానికి బయలుదేరాడు కామయ్య . అంతా నోళ్లు వెళ్లబెట్టుకుని కామయ్య చూడటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది. ఆ పిండిపాలతో శివునికి అభిషేకం చేసి, అంతకు ముందు అభిషేకపు పాలను ప్రసాదంగా తెచ్చుకున్నాడు ఆ చెంబు నిండా. ఆపాలనుకాచి తోడుపెట్టి ఆ పెరుగు చెంబుతో మరునాడు యధాప్రకారం శివునికి పెరుగుతో అభిషేకం చేసి, అంతకు ముందు చేసిన మీగడ పెరుగు చెంబునిండా తెచ్చుకుని, దాన్ని చిలికి, వచ్చిన ఆ వెన్న కాచి, మరునాడు నేతిచెంబుతో వెళ్లాడు అభిషేకానికి. అభిషేకం కాగానే ప్రసాదంగా అంతకు ముందు చేసిన తేనెను తీసుకుని వచ్చాడు. ఆ తేనెను ఒక సీసాలో భద్రపరి చాడు. ఆ తేనె చూడగానే అతగాని మనస్సులో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. మరునాటి నుండీ దాన్ని అమలు పరచసాగాడు. సులువుగా పిండిపాలు అభిషేకం చేసి రోజూ నెయ్యి తెచ్చుకుని దాన్ని డబ్బాలలో నింపి పట్నంలో అమ్మ వచ్చని భావించి అలాగే చేయసాగాడు. అతడి ఆలోచన తెలీని అమాయకపు ఊరి జనం అతడిలో మార్పు వచ్చిందని భ్రమించారు. ఊరి జనమంతా తనను గొప్ప వ్యక్తిగా చూడటం కామయ్యకు మహా ఆనందంగా ఉంది. – కొన్నాళ్లకు ఆ ముని గ్రామం వదిలి వెళుతూ గ్రామస్తులతో ‘అయ్యలారా! మనం ఒక గుమ్మడి గింజనాటితే మనకు ఎన్నో గుమ్మడికాయలు ఇస్తుంది.

ఒక మామిడి టెంక నాటితే ఎన్నో ఏళ్లు మామి డి కాయలు మనమే కాక మనతోటి మనుషులంతా తింటారు, రైతులు బస్తా విత్తనాలు పొలంలో చల్లి తే ఎన్నోబస్తాలధాన్యం లభిస్తుంది.వేప విత్తనం నాటి వేప మొక్క కరివేపాకు విత్తనం నాటితే కరివేప మొక్క మొలుస్తాయి. ఇలామనం దానికి తగిన ఫలితం పొందుతాం. వేపనాటి మామిడి ఫలాలు పొంద లేము కదా! ఈ పూజలు త్యాగ భావం నేర్చుకోనే! మనం ఏమిస్తే దానికి తగిన ప్రతిఫలం మనకు లభిస్తుంది. ఐతే కొందరు దేవుని సైతం మోసం చేయను ప్రయత్నిస్తారు. అలాంటివారికి అంతే ప్రతిఫలం ఉంటుంది. ఈ విషయం తెలుసు కుని మీ తోటివారికి సాయపడండి. దేవుడెప్పుడూ కానుకలు, ముడుపులు , అభిషేకాలూ కోరడు. త్యాగభావంతో బ్రతకడం నేర్చుకుంటే ఆయనకు అదే ఇష్టం. అలాంటి వారినే దేవుడు తన భక్తులుగా అంగీకరిస్తాడు. మీరంతా ఈ 40 దినాలుగా ఏమేమి భగవంతునికి అర్పించారో అదే మీ ఇంట ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి పొందుగాక!” అని చెప్పిఆయన వెళ్లి పోయాడు. అంతా ఇళ్లకు వెళ్లారు. – ఆ మరునాటినుండి ఊరి వారందరికీ ఆవులు, గేదెలు రెట్టింపు పాలివ్వగా, కామయ్య పశువులు ఇచ్చేపాలు మాత్రం ముక్కకంపు గొట్టే పిండి పాలగా ఉన్నాయి. అవి ఎవ్వరూ కొనడం లేదు. దేవుడు సర్వాంతర్యామి అనీ, ఆయన్ను మోసం చేయలేమనీ కామయ్యకు తెలిసి వచ్చింది. చెంపలేసుకుని అప్పటినుంచీ కాస్త దాన ధర్మాలు చేయసాగాడు. ఆలయంలో మంచి పాలు తీసుకెళ్ళి అభిషేకం చేసి దేవుని క్షమార్పణకు కోరుకోసాగాడు.

“నీతి- ఏమి ఇస్తేమో అలాంటి ఫలితమే మనకూ లభిస్తుంది.”

***ఆదూరి.హైమావతి. ఈకధ నాస్వంత రచన అనిహమీ ఇస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on కపట పూజ

రమణరావు ఎం వి said : Guest 6 years ago

కామయ్య మహా పిసినారి. దేవుడంటే నమ్మకం లేని కామయ్య శివుడికి పాలతో కాకుండా వరిపిండి నీటిలో కలిపి ఆ నీళ్లతో అభిషేకాలు చేస్తూ. గుడిలోనుండి పాలూ పెరుగూ తేనే తీసుకెళ్తూ ఉంటాడు. దేవుడు తనలోనే ఉన్నాడని తెలియక తనను తానే మోసగించుకుంటూ ఉంటాడు. చివరికి 'చేసుకున్నవారికి చేసుకున్నంత' అన్నట్టు స్వామీజీ అనుగ్రహం వల్ల అందరి ఆవులూ బాగా పాలిస్తూ ఉంటే అతడికి మాత్రం పిండిపాలే గతి అయింది. దాంతో తన తప్పు తెలుసుకున్న కామయ్య ధర్మ మార్గం లోకి అడుగు పెడతాడు.ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎవరినైనా మోసం చేయగలమేమో గాని ఆత్మసాక్షి అయిన దేవుడిని మోసగించలేము. అంతే కాదు. మనకి ఉన్నదేదో నలుగురితో పంచుకోవాలి గాని స్వార్ధ బుద్ధి పనికిరాదు. ఎదుగుతున్న బాలలకి ఇవన్నీ అర్ధం కావాలంటే మరిన్ని ఇలాంటి కథలు రావాలి.

  • విశాఖపట్నం (ఆంధ్ర ప్రదేశ్ ) . Presently in Chandler(Arizona)