ధారావాహికలు

రామాయణ సంగ్రహం

కుబేరుడి హితబోధ

డా. అక్కిరాజు రామాపతిరావు

ఇట్లా దశకంఠుడు చెలరేగిపోతుండగా కుబేరుడు తమ్ముడి ప్రవర్తనకు బాధపడి దూత నోకరిని హితవు బోధించడానికి పంపించాడు. ఆ దూత లంకకు రాగానే ముందు విభీషణుణ్ణి దర్శించాడు. విభీషణుడు ఆ దూతను ఆదరించి కుశలప్రశ్నలు వేసి ధనదుడి క్షేమసమాచారం కనుక్కున్నాడు. సమయం, సందర్భం చూసి విభీషణుడు ఆ దూతను రావణుడి సమక్షానికి తీసుకొని వెళ్లి అతడు వచ్చిన దెందుకో మనవి చేశాడు. అప్పుడా దూత ధనదుడి మాటలుగా ఇట్లా చెప్పాడు. “నీవు నా తమ్ముడివి కాబట్టి నీ మంచి చెడ్డలు తెలుసుకొని బోధించడం నా కర్తవ్యమ్, ఎందుకంటే సోదరబంధం విడదీయ రానిది. నీవు ఈ మధ్య ఋషులను, దేవతలను క్రూరంగా హింసిస్తున్నట్లు తెలుసుకున్నాను. నందనవనాన్ని ధ్వంసం చేసినట్లు విని బాధపడ్డాను. క్రూరకర్మలన్నిటికీ తగిన దండన ఉంటుందని నీకు తెలుసు ననుకుంటాను. పాపపు పనులు చేయకూడదు. ఊహించనైనా కూడదు. స్వానుభవం ఒకటి చెపుతున్నాను విను. ‘శివానుగ్రహం కోసం నేను ఒకప్పుడు హిమపర్వత సానువులలో తపస్సు చేస్తున్నాను. అక్కడ జగద్ధాత్రితో పరమశివుడు విహరిస్తుండటం నా కంటపడింది. నాకే పాపపు తలపులు కలగలేదు. నిజం చెపుతున్నాను. అయితే కుతూహలంగా, ఉత్కంఠతో ఆ దివ్యసుందరి ఎవరు? అని

ఎడమ కంటితో వోరగా వాళ్ళ క్రీడను చూశాను. నాకు ఆ దృశ్యం వింత కొలిపింది. అట్లా చూసినందుకు ఉమాదేవి నన్ను కోపించి తీవ్రంగా అసహ్యించుకున్నది. ఆమె కోపాగ్నిజ్వాల నా కంటిని కాల్చివేసింది. అప్పటి నుంచి నేను ఏకాక్షినైనాను. ఆ నా కన్ను పింగళవర్ణం పొందింది. నేను అక్కడ నుంచి దుఃఖభారవివశున్నై మరలివచ్చి వేరొకచోట కఠోర నియమాలతో పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేశాను ఆయన అనుగ్రహం అర్థిస్తూ. మహాదేవుడు ప్రత్యక్షమైనాడు. నా తపస్సును మెచ్చుకున్నాడు. ‘నిన్ను నా ప్రియసఖుడిగా చేసుకుంటున్నాను. ఇక నీకూ, నాకూ గాఢమైత్రి వర్ధిల్లుతుంది. ఉమాదేవి ఆగ్రహం వల్ల పింగళవర్ణం పొందిన నీ కంటిని గూర్చి నీవు విచార పడవద్దు. నీకు ఇప్పటి నుంచీ ‘ఏకాక్షిపింగళుడ’నే పేరు కలుగుతుంది. నా మైత్రి నీకు లభించింది కదా! ఇక విచారమెందుకు?’ అన్నాడు మహాదేవుడు. చిన్న తప్పుకే ఇంత కఠినశిక్ష పొందాను నేను. మహాదేవుణ్ణి ఉపాసించి ఆయన మైత్రి సంపాదించి కృతార్థున్నైనాను. ఇక నీ వేమో ఘోరాతిఘోర పాపాలు చేస్తున్నావు! దేవతలు, ఋషులు కూడబలుక్కుని నీ వధోపాయం ఆలోచిస్తున్నారట. కులనాశకుడివి కావద్దు’ అని కుబేరుడు పంపిన హితబోధ సారాంశాన్ని దూత దశగ్రీవుడికి విన్పించాడు.

దశగ్రీవుడి దురాగ్రహం

దశకంఠుడు ఆగ్రహోదగ్రుడైనాడు. పండ్లు పటపటగీటాడు. ‘ఓరీ మూర్ఖుడా! మీ ధనపతి నాకు హితవు బోధించే పాటివాడా? మహేశ్వరుడితో స్నేహం సంపాదించానని నిక్కుతున్నాడేమో! వాడి నీలుగుడు అణచివేస్తాను. నా తడాఖా చూపిస్తాను. తాను లోకపాలుడట. వీడి పంతమేమితో చూస్తాను. వీడితో పాటు తక్కిన లోకపాలురను కూడా మట్టి గరిపిస్తాను! ఈ దెబ్బతో ముల్లోకాలూ గడగడలాడిపోవాలి’. అంటూ సర్రున కత్తిదూసి దూత తల నరికాడు దశకంఠుడు. ఆ తరువాత కొంత కాలానికి మందీమార్బలమూ చేకూర్చుకొని ముల్లోకాలనూ నిర్జించే కాంక్షతో ముందుగా ముక్కంటి స్నేహితుడైన కుబేరుడిపై దండయాత్రకు వెడలాడు.

దశకంఠుడి దిగ్విజయ సంరంభం

ప్రహస్తుడు, మహోదరుడు, మారీచుడు, శుకుడు, సారణుడు అనే మంత్రులతో దశగ్రీవుడు మహాహంకారంతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. కోపంతో లోకాలన్నిటినీ కాల్చి వేసేవాడిలా అతడు చూపట్టాడప్పుడు. నదులు, ఉపనదులు, వనాలు, ఉపవనాలు, కొండలు, పర్వతాలు దాటి ముందుగా కైలాసపర్వత ప్రదేశం చేరుకొని కుబేరుడిపై యుద్ధం ప్రకటించాడు. కుబేరుడు కూడా యుద్ధ సన్నద్ధుడైనాడు. వాళ్ళిద్దరి

సైన్యాల మధ్య తుముల యుద్ధం జరిగింది. కుబేరుడి ధాటికి రావణుడి మంత్రులు తాళలేకపోయినారు. విహ్వలులైనారు. అది చూసి కుబేరుడిపై మండిపడ్డాడు రావణుడు. సింహనాదం చేసి మంత్రులను పురికొల్పాడు. తెగింపు చూపేవారిని చేశాడు. ధైర్యస్థులను గావించాడు. ఇక వాళ్ళు పరమవిక్రమంతో విఙృంభించారు. వివిధాయుధాలు ధరించి కుబేరుడి యక్షసైన్యాలను చిందరవందర చేశారు. రక్తపుటేరులు పారించారు. అట్లానే యక్ష సైన్యాధిపతులు కూడా ఘోరంగా పోరాడారు. రావణుడు గద ధరించి యక్షుల సైన్యాలను చీల్చి చెండాడాడు. యక్షుల దైన్యం చూసి యక్షపతి ‘సంయోధకంటకుడ’నే వీరసైన్యాధిపతిని రాక్షసులపైకి పంపించాడు. ఆ మహావీరుడు మారీచుడిపై చక్రాయుధం ప్రయోగించాడు. మారీచుడు దాని ధాటికి స్మృతి కోల్పోయాడు. కొంత సేపటికి మారీచుడు స్పృహ తెచ్చుకొని సంయోధకంటకుడిపై తెగబడ్డాడు. ప్రచండమైన మారీచుడి ధాటికి సంయోధకంటకుడు నిలబడలేక యుద్ధరంగం విడిచి పారిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked