కవితా స్రవంతి

గొలుసు కవిత

అయ్యయ్యో ! శివ శివా! –

(సూత్రంః శివ నిందాస్తుతి. మొదటి రెండు వాక్యాలు నిందాస్తుతి, మూడవ వాక్యం స్తుతితో శివతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం. మహాశివరాత్రి తరుణంలో మనబడి భాషాప్రేమికులు అల్లిన మారేడు దళ మాలిక.  ఆలోచనః వేణు ఓరుగంటి )

 

  1. ఎద్దునెక్కుతావు, పులితోలు తొడుగుతావు

భూతదయ నీకెక్కడయ్యా భూతేశా? శివ శివా!

పంచభూతాలూ నువ్వేకదా ఓ పరమేశా! (వేణు ఓరుగంటి)

 

  1. బూడిద రాస్తావు, పుర్రెల హారం చుడతావు!

నీదేమి అందమయా గౌరీశా? హరహరా!

నీలో సగమైనది జగన్మోహనం ఓ అర్ధనారీశా! (భాస్కర్ రాయవరం)

 

  1. త్రిశూలం పట్టుకుంటావు, శ్మశానంలో ఉంటావు,

నువ్వంటే భయంతో చావాలి కానీ, హరోం హర!

చచ్చినాకా నీదగ్గరకే చేరాలని  తపస్సు!  మృత్యుంజయా! (వేణు ఓరుగంటి)

 

  1. బొమ్మతల కొట్టేవు, బొమ్మకు తలపెట్టేవు

ఇదేమి తిక్కనో తెలీదు కానీ, తిక్కశంకరయ్యా!

చక్కటి కథలురాసిచ్చే బొమ్మ దేవుణ్ణిచ్చావు కదా, శివయ్యా! (చంద్ర రెంటచింతల)

 

  1. గరళాన్ని తృటిలో మింగావు ఎంతో సాహసం చేసితిననుకొంటివా పరమశివా!

ఎల్ల వేళలా నీవే దిక్కని కొలవమందువా ఇదెక్కడి న్యాయము సదాశివా!!

నీ మహిమ తెలిసీతెలియని అజ్ఞానులమనుకుంటివా మహ దేవా!!! (రమ కాకుళవరపు)

 

  1. కాలు కదిపితే ఆటట, నీ కన్ను తెరిస్తే మంటట

నీ నాటకాన మేమంతా నటులట, ఒట్టు వట్టి చీమలమట,

ఈ ఆటయ్యాక చేరేది  నీ గూటికేనట నటరాజా! (సుజన పాలూరి)

 

  1. శివశివ అంటేను పాపములు తొలగేను

హరహర అంటేను భయములు తీరేను

పాలాభిషేకముతో నిన్ను ప్రసన్నము చేసేము

రుద్రాభిషేకముతో నిన్ను శాంతమ్ము పరచేము

ఓరగంటితో చూసి మా కష్టాలు తీర్చేవు! (శైలజ అత్తిలి)

 

  1. పాపమణచమంటె ఒంటికాలిపై లేస్తావు!

కరుణచూపగనువ్వు  కన్నెఱ్ఱ జేస్తావు! భవహరా !

నీ శరణన్న  మరి అక్షరగతియే గాద సదాశివా!     (రాజశేఖర్ అంబటి)

 

  1. చీమ నైన కదల నీయవు గదయ్య  నీ  ఆజ్ఞ  లేనిదే !                                                                                                                                                                                                                                     పాపాత్ములకేలనయ్య  బాసటగా  నిలిచేవు  ఓ  గరళ  కంధరా !

       కల్మషం లేని ఇలని  మాకందియ్యవయ్యా !  (శ్రీవాణి మాదేటి)

 

 

  1. నీ కామమును దీర్చ దరికి జేరిన వాని నిండార చూసి కాల్చినావు

ముక్కంటితో నీవు జూసినావంటే మాడిమసయ్యేను ముల్లోకము

ఎక్కువేమి  కాదు తక్కువే కోరాము ఓరగంటను జూసి కనికరించు! (జ్యోత్స్న అంబటి)

 

  1. మహాభద్ర, వీరకాళుల చేత భీభత్సాన్ని సృష్టించావు

ఇదేమి న్యాయమయ్యా సాంభయ్యా!

గంగ విన్యాసాలని జఠాధరంలో ఆపి లోకాన్నే ఆదుకున్న గంగయ్యా (శైలజ కొట్ర)

 

  1. చిన్న పొగడ్తకే బొల్తా పడతావు భోళా శంకరా!

రాక్షసులకా వరములిచ్చెది అఙ్ఞానివయ్య హర హర!!

ఙ్ఞానవరములిచ్చావు ప్రసూనంబకు దక్షిణకైలాసవాసా శ్రీకాళస్తీశ్వరా! (భారతి అన్నె)

 

  1. ముప్పుతిప్పలు పడి మూడు లోకాలు తిరిగితేగాని గణనాధుడవ్వనీవు!

అర్థనారీశ్వరుడవు నీ చూట్టు  తిరిగితే మాత్రం వరాల పంట పండిస్తావు!

ఓహో నీ లీల ఏమనని పొగడము ఓ నీలకంఠా!!    (భారతి అన్నే)

 

  1. అడుగుదామంటే నీవే తొలి బిక్షగాడివయ్యా!!

ఇద్దామంటే నీతలతో చిక్కే గంగయ్యా!

నన్నే నీకిచ్చుకుంటా గొంతున దాచుకో శితికంఠా!! (భాస్కర్ రాయవరం)

 

  1. క్షీరసాగరమ్ములో పోరుప్రజలకు పోగాలమగునని,

విషమ్మింగుతానని నీవడిగితే  సమ్మతించినది సర్వమంగళ

పుస్తెలత్రాడుమీద అదేమినమ్మకమో పార్వతమ్మకు! (వేణు ఓరుగంటి)

 

  1. అంతటా తిరుగుతావు, అంతంతమాత్రపు యోగివనిపిస్తావు

అంతమే నువ్వని అర్ధమయ్యేసరికి, అయ్యయ్యో!

కాలం గడిచి కాలే సమయమొచ్చేసింది, కాళేశా! (వేణు ఓరుగంటి)

 

  1. ఆకారమే లేని లింగానివే, నీవు జంగానివే!

కన్ను నీవే, కోడి గుడ్డు నీవే, నిండైన ఆ బోడిగుండూ నీవే!

నిరాకారా,  వేయేల ఎంచి చూడగ బ్రహ్మాండమంత నీవే! (సుజన పాలూరి)

 

  1. మెళ్ళో పాము, మొల్లోపాము, బుసబుసలు కొడతూవుంటే

పార్వతమ్మ పక్క చేరేదెట్లయ, పన్నగేశా!

ఆదిదంపతులే అట్లాగుంటే మా పుట్టుక మాయేగదా అంబరీషా! (వేణు ఓరుగంటి)

 

  1. జగమంతట నీవు జనమంతయు నీవట జంగమయ్యా!

మరి ఈ భవ బంధాల గోల మాకేలయ్యా! (కిష్ నారే)

 

  1. ఏనుకు చర్మం చుడితివి, ఏనుగు తలనెడితివి!

ఎద్దునెక్కి తిరిగితివి, నందిని కాపలనెడితివే భూతనాథా!!

సింగమెక్కిన అంబతో కాపురమిడి జగమేలితివే జంగమయ్యా! (భాస్కర్ రాయవరం)

 

  1. అసురుని పొట్టలోన ఉంటావు అనంత విశ్వమంతయు నీవు

గుళ్ళు గోపురాలు నీకెందుకయ్యా?

నా గుప్పెడు గుండెలోన ఉండిపోవా శివా!! (కిష్ నారే)

 

  1. కస్తూరి తిలకాలు మేనంతటద్దు తందంగ యంబ యాలింగనము సేయఁ

కూసింత దయలేక చీరంత మసిబూసి యర్ధాంగినే నీవుఁ జిన్నఁబుచ్చేవు

మారేడు నీరాల సేవించువాఁడ నింకేమి యాశింతునాబూడిదై నిన్నంటదప్ప   (అంబటి రాజశేఖర్)

 

  1. గరళం మింగటమో గొప్పా ? మరుభూమిలో

ద్రిమ్మరిగ తిరగటమో లెక్కా? మరినేను భవసాగరమీదటంలేదా, మహదేవా!

దమ్ముంటే నా ఇక్కట్లను దీర్చి చూడవయ్యా  ఓ ముక్కంటీ! (వేణు ఓరుగంటి)

 

24.కోపమొస్తే మూడవకంటినే తెరిచేవు

అది అణచకుంటే వీరభద్రుడవే అయ్యేవు భవభయహరా !

వరములిచ్చే  కైలాస యోగివే నీవయ్య సిద్ధేశ్వరా  ! (శ్రీవాణి మాదేటి)

 

  1. కదిలెడిదే వల్లకాడట, కనుదెరిచిన ఆప వల్లకాదట!

గుల్లగు జీవము నీవల్ల ఏ ఫణితి గోరు లయమన

వల్లకాని వరమై కనుదెరుచుట మూయుట నీవలనేనా? ఓ పరమేశా! (చంద్ర రెంటచింతల)

 

26.ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటీ?

మాయలో కన్నుమూసుకొన్న మాకు జాగారమేలయా జంగమయా!

మాలో మత్సరమనచనగా మూడోకన్ను తెరవవయా త్రినేత్రా! (భాస్కర్ రాయవరం)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked