చంద్రశేఖర్ చరిత్ర

చంద్రశేఖర్ చరిత్ర-విద్యాభ్యాసం

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (19 అక్టోబరు 1910 – 21 ఆగస్టు 1995) అవిభక్త భారత దేశపు పంజాబ్ లోని లాహోర్ నగరంలో సీతాలక్ష్మి కి చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్ అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. (తమిళులు తండ్రి పేరుని మొదటి పేరుగా వాడతారు; రెండవ పేరు పెట్టిన పేరు.) వారి వంశ వృక్షంలో చదువులకి, ప్రత్యేకించి వైజ్ఞానిక పరిజ్ఞానానికి, పెద్ద పీట పడడానికి ముఖ్య కారకుడు చంద్రశేఖర్ పితామహుడైన రామనాధన్ చంద్రశేఖర్. ఈయన విశాఖపట్నం లోని మిసెస్ ఏ.వి.ఎన్. (అంకితం వెంకట నరసింగరావు) కళాశాలలో గణితం బోధించే ఆచార్యుడుగా పనిచేసేడు. చంద్రశేఖర్ పుట్టిన ఏటనే ఈ పితామహుడు స్వర్గస్తుడవడంతో, ఆయన రచించిన, సేకరించిన, గణిత గ్రంథాలన్నింటికి చంద్రశేఖర్ వారసుడయ్యాడు. వాటిని జీవితాంతం చంద్రశేఖర్ తన దగ్గర భద్రపరచుకున్నాడట.

రామనాధన్ పిల్లలలో జ్యేష్ఠుడు చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్; ఈయనే మన కథానాయకుడయిన చంద్రశేఖర్ తండ్రి. సుబ్రహ్మణ్యన్ తన తండ్రి పనిచేసిన ఏ.వి.ఎన్. కళాశాలలో ఉత్తమ శ్రేణి విద్యార్థిగా కొన్నాళ్ళు ఒక వెలుగు వెలిగించి, తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదివి, అఖిల భారత పోటీ పరీక్షలలో నెగ్గి, బ్రిటిష్ ప్రభుత్వం వారి ఊడిగంలో ఇండియన్ అడిట్స్ అండ్ ఎకౌంట్స్ ఆఫీసులో చేరి, ప్రభుత్వం వారి ఈశాన్య భారతీయ రైల్వేలో పెద్ద ఉద్యోగస్తుడుగా పని చేసేరు. ఆ రోజులలో అది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం. చంద్రశేఖర్ తల్లి హెన్రిక్ ఇబ్సెన్ రాసిన “ద డాల్స్ హౌస్” అనే నాటికని తమిళంలోకి అనువదించిన విదుషీమణి. ఈ పుస్తకాన్ని తమిళంలో ఒక అధ్యయనాంశంగా పాఠశాలలో వాడేవారుట కూడా.

చంద్రశేఖర్ కి తొమ్మిదేళ్ల వయస్సప్పుడు, అనగా ఏప్రిల్ 26, 1920 న, శ్రీనివాస రామానుజన్ ఆ ముందు రోజు, అతని 32 వ ఏట, మరణించినట్లు తల్లి చెప్పిందిట. శ్రీనివాస రామానుజన్ కథ ఒక అద్భుత గాథ. మద్రాసులో చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్న రామానుజం (తరువాత వర్ణక్రమదోషం వల్ల రామానుజన్ అని తప్పుగా నమోదు అయింది) 1913లో కేంబ్రిడ్జి లో పనిచేస్తున్న జి. ఎచ్. హార్డీ (ఎడింగ్టన్ సహోద్యోగి) కి ఒక ఉత్తరం రాసేడు. ఆ ఉత్తరంలో తాను స్వయంకృషితో పరిశోధన చేసి ఆవిష్కరించిన కొన్ని గణిత సమీకరణాలని జత చేసి పంపి అయన వ్యాఖ్యానం కోరేడు. ఆ గణితాన్ని చూసి దిగ్భ్రమ చెందిన హార్డీ, రామానుజన్ ని వెనువెంటనే ఇంగ్లండు రప్పించుకుని, రామానుజన్ మేధ నుండి విశృంఖలంగా పొంగి పొరలి వస్తూన్న గణిత ప్రవాహాన్ని ప్రపంచానికి పరిచయం చేసేడు. రామానుజన్ రోయల్ సోసైటీ లో సభ్యత్వం గణించిన మొట్టమొదటి భారతీయుడు. ఈ పురస్కారం హార్డీ సహాయం లేకుండా జరిగి ఉండేది కాదు. రామానుజన్ మరణంతో అయన ప్రతిభ వాడవాడలా పాకిపోవడమే కాక, హార్డీ వంటి సహృదయులు, ఉదారులు బ్రిటిష్ వారిలో కూడా ఉంటారన్న సదభిప్రాయం భారత ప్రజలలో కలగసాగింది.

చంద్రశేఖర్ పుట్టి పెరిగిన ఇంట్లో సరస్వతి తాండవిస్తూ ఉండేది. వారిది సంస్కారవంతమైన ఉన్నత తరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబం. ఇంటి పనులు చెయ్యడానికి నౌకర్లు, చాకర్లు ఉండేవారు. పిల్లల ఏకైక బాధ్యత విద్యాభ్యాసం. పిల్లలు తగువులాడుకుంటూ ఉంటే ఎదో విద్వత్ సభలో సంఘర్షణలా ఉండేదిట. లక్ష్మీ కటాక్షం తొణికిసలాడుతున్న ఆ ఇంట సరస్వతికే పెద్ద పీట!

చంద్ర పుట్టిన సంవత్సరంలో – అనగా 1910 లో- గాంధీ ఇంకా దక్షిణ ఆఫ్రికాలోనే ఉన్నాడు. భారత స్వతంత్ర వాయువులు వీచడం 1885 లోనే మొదలయినప్పటికీ, గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి 1915 లో వచ్చే వరకు అవి ఒక ఉద్యమం స్థాయికి చేరుకోలేదు. జిలియన్వాలా బాగ్ లో బ్రిటిష్ వాళ్ళు జరిపిన దౌర్జన్య కాండతో స్వతంత్ర సమరం పరాకాష్టకి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశభక్తి చాటుకోడానికి రెండు మార్గాలు కనిపించేయి. సర్వం వదలుకొని స్వతంత్ర సమరంలో దూకడం, జైలు కెళ్ళడం ఒక మార్గం. బ్రిటిష్ వాడిని ఎదిరించి ఓడించడానికి జెండాలు పట్టుకుని తిరిగి, లాఠీ దెబ్బలు తినక్కరలేదు. వాడు ఏ సాంకేతిక పరిజ్ఞానంతో మనని అదుపులో పెట్టగలిగేడో అదే జ్ఞానాన్ని మనం ఔపోసన పట్టి వాడి పాఠాన్ని వాడికే అప్పచెప్పడం మరొక మార్గం. తమిళ బ్రాహ్మణులకి ఈ రెండవ మార్గం సుగమంగా తోచి ఉంటుంది. అందరి సంగతి మనకి తెలియదు కానీ సుబ్రహ్మణ్యన్ సంసారంలో ఈ రెండవ మార్గం బలం పుంజుకుంది. అందుకని అయన ఎంతో క్రమశిక్షణతో పిల్లలని విద్యార్జన మార్గంలో పెట్టడానికి ప్రత్యేక శ్రద్ధ చూపేడు. తమిళ బ్రాహ్మణులకి చదువు యెడల ఉన్న ఈ అంకిత భావాన్ని ఎత్తిపొడవడానికి “తమిళులు పిలక్కి తాడు కట్టుకు చదువుతారు” అనే లోక ప్రవాదం కూడా ఉంది!

సుబ్రహ్మణ్యన్ ఎంత శ్రమ పడినా తన తమ్ముడి ప్రతిభ ముందు దివిటి ముందు దివ్వెలా వెల వెల పోయాడు. రామనాధన్ పిల్లలలో రెండవ వాడు, అనగా చంద్రశేఖర్ పినతండ్రి, సర్ సి. వి. రామన్ భౌతిక శాస్త్రంలో, 1930 లో, నోబెల్ బహుమానం అందుకున్నాడు. అభిజాత్యమో, కావేరి నీళ్ల మహిమో తెలీదు కానీ ఒకే సంసారంలో ఇద్దరు జగత్ప్రసిద్ధమైన శాస్త్రవేత్తలు పుట్టడం అరుదైన విషయం. మరొక విశేషం ఏమిటంటే అదే కాలంలో, అదే భౌగోళిక ప్రాంతంలో జగత్ప్రసిద్ధమైన శ్రీనివాస రామానుజన్ కూడా పుట్టడం! ఇక్కడ కథకి కాసింత అప్రస్తుతమైనా కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులనదగ్గ త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితార్ కూడా సమకాలికులే అన్నది గమనించదగ్గ విశేషం.

రామన్ మాత్రం సామాన్యుడా? అతని గంభీరమైన వదనం, తీక్షణమైన కళ్లు చూడగానే అఖండ మేధోసంపన్నుడని మనస్సులో ముద్ర పడేది. తారాజువ్వలా అమిత వేగంతో విద్యాభ్యాసం పూర్తి చేసి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుండి తన పదిహేడవ ఏట బి. ఎ. డిగ్రీ సంపాదించి, పందొమ్మిదేళ్లకి ఎమ్మే డిగ్రీ పూర్తి చేసేడు. అనారోగ్యం వల్ల చదువు కొనసాగించలేక అన్న వలె తాను కూడా ఇండియన్ అడిట్స్ అండ్ ఎకౌంట్స్ లో, కలకత్తా లో, ఉద్యోగం మొదలు పెట్టేడు. తీరిక సమయంలో, కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం అధ్యయనం కొనసాగిస్తూ వచ్చేడు. ఆ విశ్వవిద్యాలయం వారు రామన్ కి 1917 లో ఆచార్య పదవి ఇవ్వడంతో కుషీగా ఉన్న ప్రభుత్వోద్యోగం వదలి పెట్టి భౌతిక శాస్త్ర పరిశోధనలు చెయ్యడంలో ములిగిపోయేడు. ఆ పరిశోధనల ఫలితంగా 1930 లో ఆయనకి నోబెల్ బహుమానం ఇచ్చేరు. ఈయన శాస్త్రీయ రంగంలో నోబెల్ బహుమానం అందుకున్న తొలి భారతీయుడు, తొలి ఆసియా ఖండపు పౌరుడు!

సుబ్రహ్మణ్యన్ అయ్యర్ తమ్ముడితో పోటీ పడలేకపోయినా తన కొడుకు చంద్రశేఖర్ బాల్యంలోనే పరిమళించడం చూసి సంతోషించేడు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులిద్దరు అలుపు లేకుండా శ్రమించేవారు. తండ్రి ఉదయం పనిలోకి వెళ్లే ముందు రోజూ పిల్లల చదువుల కొరకు కొంత కాలం గడిపే వాడు. తల్లి తమిళం నేర్పితే తండ్రి ఇంగ్లీషు నేర్పేవాడు. ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, పై చదువులకి ఇంగ్లండు వెళ్లాలన్నా ఇంగ్లీషు భాష మీద అధికారం ముఖ్యం అని అయన నమ్మకం. ఈ వాతావరణంలో చంద్రశేఖర్ మెరుపు వేగంతో ముందుకు పోతున్నాడు. తాతగారి నుండి సంక్రమించిన గణిత గ్రంథాలన్నింటిని ఆవురావురుమంటూ కబళించేసేవాడుట.

ఉద్యోగ ధర్మంతో దేశం అంతా తిరుగుతూ ఉండడం వల్ల 1923 వరకు వీరి సంసారం మద్రాసులో స్థిరపడలేదు. అప్పుడు సామంతుల శివారుగా పేరు పొందిన మైలాపూర్ లో ఎడ్వర్డ్ ఎలియట్ రోడ్డులో ఇల్లు కట్టుకున్నారు. చంద్ర విలాస్ రెండస్థుల మేడ. లోతైన వరండాలుతో, బాల్కనీలుతో, కిటికీలకి అలంకారాలుతో, పెరట్లో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లుతో – చాల అధునాతనమైన బ్రిటిష్ బంగళాను పోలిన భవంతి అది. చంద్రశేఖర్ పెరిగిన ఈ మైలాపూర్ మేడతో రామానుజన్ పెరిగిన ట్రిప్లికేన్ ఇంటిని పోల్చలేము; హస్తి మశకాంతరం!

ఒక విధంగా చంద్రశేఖర్ అదృష్టవంతుడు. సగటు తమిళ బ్రాహ్మణులతో పోల్చి చూస్తే వీరికి సిరి సంపదలు బాగానే ఉన్నాయి. పైగా చంద్రశేఖర్ సరస్వతి కటాక్షం కూడా పొందేడు. పసితనం నుండి బాల మేధావిగా గుర్తింపు పొందేడు. పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో చేరేడు. పరీక్షలలో నూటికి 100 కంటే ఎక్కువే మార్కులు వచ్చేవి. లెక్కల పుస్తకాలే కాదు, ఇంగ్లీషు పుస్తకాలు కూడ అపరిమితమైన ఉత్సాహంతో చదివేవాడు. ఇతను ఏకసంథాగ్రాహి అనే వారు. ఈ సమయానికి పినతండ్రి రామన్ కి నోబెల్ బహుమానం వచ్చేసింది. ఒక రోజు రామన్ తన అన్నగారితో రామానుజన్ ప్రతిభని కొనియాడుతున్న మాటలు విన్నాడు చంద్ర. అప్పటి నుండి గణితంలో రామానుజన్ అంతటి ఎత్తు ఎదగాలని కలలు కనేవాడుట. కానీ అడపా తడపా అతని మనోవీధిలో నిరుత్సాహపు మేఘాలు ఆవహించేవిట. ఆ సమయంలో తలుపులు వేసుకుని, చీకటి గదులో ఏకాంతంగా గంటల తరబడి కూర్చునేవాడట.

ప్రెసిడెన్సీ కాలేజిలో మొదటి రెండేళ్లు పూర్తి అయిన తరువాత ఆనర్స్ డిగ్రీకి ఏ దిశలో వెళ్లాలో నిశ్చయించుకోవలసిన సమయం అది. చంద్రశేఖర్ గణితం వైపు మొగ్గు చూపేడు. కానీ తండ్రి ఆలోచనలు మరో దిశలో ఉన్నాయి. తనలాగే ప్రభుత్వోద్యోగానికి పనికొచ్చే చదువు చదవమన్నాడు. చివరికి చంద్రకి సైన్సు మీద ఉన్న మక్కువ చూసి, తల్లి సీతాలక్ష్మి చంద్ర ఇష్టాఇష్టాలకి పూర్తి మద్దత్తు ఇవ్వడం చూసి, “కనీసం భౌతిక శాస్త్రం చదువు. అందులో కూడా గణితం ఎక్కువగానే ఉంటుంది. తరువాత ఉద్యోగం తేలికగా దొరుకుతుంది” అని తండ్రి ఒప్పించిన మీదట ఆనర్స్ డిగ్రీకి భౌతిక శాస్త్రాన్ని ఐచ్చికాంశంగా ఎన్నుకున్నాడు. ఇలా తండ్రి ప్రోద్బలంతో భౌతిక శాస్త్రం వైపు మొగ్గు చూపడం వల్ల నష్టం రాలేదనే చంద్ర నమ్మేడు; కానీ, చంద్ర చేసిన పని చూస్తే అయన గణిత శాస్త్రవేత్తలాగనే కనబడతాడు. భౌతిక శాస్త్రంలో కూడ గణితాంశాల వైపు, సైద్దాంతిక ధోరణుల వైపు ఎక్కువ మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. దరిమిలా “ఇతను భౌతిక శాస్త్రంలో అవసరానికి మించి ఎక్కువ గణితం వాడతాడు” అనే ఎడింగ్టన్ విమర్శకి గురి అవుతాడు.

సంప్రదాయం ప్రకారం భారత దేశంలో ఆరు ఋతువులు. పాశ్చాత్య ప్రపంచంలో చలామణిలో ఉన్నవి నాలుగు: వసంతం, వేసవి, ఆకురాలు కాలం, శీతాకాలం. కానీ భారత దేశంలో చాల చోట్ల మూడే కనిస్తాయి: వేసవి కాలం, వర్షా కాలం, శీతాకాలం. మద్రాసులో రెండే: వేసవి, అధిక వేసవి. ఊరు సముద్రం ఒడ్డున ఉందేమో ఊళ్ళో ఉన్న ధూళి, నీటి మీద గాలితో కలిసినప్పుడు పోసే ఉక్కపోతని భరించడం కష్టం. అందుకని సాయంత్రం అయేసరికల్లా మద్రాసు పౌరులు మెరీనా బీచికి చేరుకుంటారు – కాసింత చల్ల గాలిని మెయ్యడానికి. ఉత్తరాన సెంటు జార్జి కోట నుండి దక్షిణాన శేన్ థోమ్ వరకు – దరిదాపు ఐదు మైళ్ళు – ఎంతో వెడల్పుగా పరుచుకున్న ఈ సముద్ర తీరం ఆ రోజుల్లో ప్రపంచంలోనే సుందరమైన బీచిగా పరిగణించబడేది. ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్న గడియారం భవనం నుండి కెరటాల తాకిడి వరకు, వేడితో చురుక్కుమంటున్న ఆ ఇసుకలో నడవడం తేలికగా ఉండేది కాదు – అంత వెడల్పు ఆ సైకతస్థలి! చంద్ర తరచు మెరీనా బీచికి వెళ్ళేవాడు. ట్రిప్లికేన్ లో నివసించిన రామానుజన్ కూడా ఇదే బీచిలో తిరిగి ఉంటాడని ఊహించుకుని, అతను ఎక్కడ కూర్చుని ఉంటాడో ఊహించుకుని తను కూడా అక్కడే కూర్చుని అయిన్^స్టయిన్ అంతటివాడుగా ఎదగాలని గాలిలో మేడలు కట్టుకునేవాడు.

ఒక సారి సి. వి. రామన్, 1928 వసంతంలో, మైలాపూర్ లో అన్నగారింటికి చుట్టపు చూపుకి వచ్చినప్పుడు తనతో ఆర్థర్ ఎడింగ్టన్ రాసిన “తారల అంతర్గత తత్త్వం” (The Internal Constitution of Stars) అనే పుస్తకం పట్టుకొచ్చేడు. ఆ పుస్తకంలో అప్పటివరకు మనకి అర్థం అయినంత మేరకి ఖగోళభౌతిక శాస్త్రాన్ని కూలంకషంగా పరామర్శించి, “సుదూర భవిష్యత్తులో అతి సామాన్యమైన నక్షత్రం గురించి కూడ మన అవగాహన కాసింత మెరుగు పడుతుందని ఆశిస్తున్నాను” అంటూ భరతవాక్యం పలికేడు. ఆ వ్యాఖ్య చదివి, చికితుడయేడు చంద్రశేఖర్!

అది 1928 వేసంగి. చంద్రశేఖర్ కి తన ప్రయోగశాలలో రామన్ ఒక ఉద్యోగం ఇచ్చి, కలకత్తా తీసికెళ్లి, వెల లేని అవకాశం కల్పించేడు. గతించిన ఫిబ్రవరిలోనే రామన్ ఒక కొత్త ఫలితాన్ని ఆవిష్కరించేడు. దానిని రామన్ ఎఫెక్ట్ అని పిలవడం మొదలు పెట్టేరు. కాంతి ఒక (ద్రవ) పదార్థం మీద పడి చెదిరినప్పుడు, ఆ చెదిరిన కాంతి యొక్క వర్ణమాలని పరిశీలించి, ఆ (ద్రవ) పదార్థంలోని బణువుల నిర్మాణశిల్పాన్ని (molecular structure) అర్థం చేసుకోవచ్చు. అదీ రామన్ ప్రభావం యొక్క ఉపయోగం. రామన్ ప్రత్యేకత ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం. అంటే ప్రయోగం చేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. కాని చంద్రశేఖర్ కి రుచించినది సైద్దాంతిక భౌతిక శాస్త్రం. అనగా గణితాత్మకమైన సిద్దాంత దృష్టితో ప్రకృతిని అర్థం చేసుకోవడం. అందుకని అతనికి రామన్ ప్రయోగశాలలో గాజు సామానులు పగలగొట్టడం చేతనయినంత తేలికగా ప్రయోగాలు చెయ్యడం చేతకాలేదు. కానీ రామన్ గ్రంథాలయంలో అపురూపమైన రత్నాలు దొరికేయి. పినతండ్రి ప్రయోగాల వెనక ఉన్న సిద్దాంతాలని వెలికి తీసి సిబ్బందికి పినతండ్రి కంటే బాగా బోధపరచేవాడు. అందుకనే కాబోలు, “చెప్పడం తేలికే, చేసి చూపడం కష్టం” అంటారు!

ఈ సందర్భంలో రామన్ గ్రంథాలయంలో ఉన్న, ఎడింగ్టన్ రాసిన, “తారల అంతర్గత తత్త్వం” తీరుబడిగా చదవడానికి మరొక అవకాశం దొరికింది. శ్రీరస్తు నుండి చిత్తగించవలెను వరకు చదివేసి, సర్వం ఆకళింపు చేసుకున్నాడు.

ఆ రోజుల్లో ఆర్థర్ స్టేన్లీ ఎడింగ్టన్ గురువులకే గురువన దగ్గ ఉత్కృష్ట స్థానంలో ఆసీనుడైన శాస్త్రవేత్త. ఒంటి చేత్తో ఆధునిక నక్షత్రభౌతిక శాస్త్రం (astrophysics) అనే శాఖకి పునాదులు వేసి భవనం లేవదీసిన దిట్ట. ఒక నక్షత్రం యొక్క గరిమ (mass) కి, దాని దీప్తి (brightness) కి, దాని తాపోగ్రత (temperature) కి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని సూత్రీకరించి, వాటి సహాయంతో రోదసి లోతుల్లో చల్లగా, పలచగా ఉన్న వాయు మేఘాల నుండి నక్షత్రం ఎలా పుడుతుంది, తరువాత దాని జీవిత క్రమం ఎలా ఉంటుంది, చివరికి అవసాన దశ ఎలా చేరుకుంటుంది, తరువాత అది శిలా రూపంలోకి ఎలా మారుతుంది, మొదలైన విషయాల మీద మన ప్రాథమిక అవగాహనకి పునాదులు వేసాడీయన. నక్షత్రాలలో ఉన్న ఘటక ద్రవ్యాలేవేమిటో ఊహాగానం చేస్తూ నక్షత్రాలు వెలుగుని, వేడిని ఇవ్వడానికి మూల కారణం ఉదజని (Hydrogen) వాయువు రవిజని (Helium) గా మారడమే అని కూడ ఈయన ప్రతిపాదించేడు. అన్నిటి కంటే ముఖ్యం. అయిన్^స్టయిన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష వాదాన్ని (General Theory of Relativity) నక్షత్రభౌతిక శాస్త్రంలో ప్రయోగించడానికి కూడా ఆద్యుడు ఈయనే!

పినతండ్రి ప్రయోగశాలలో పని చేస్తున్న చంద్రశేఖర్ కి ఎడింగ్టన్ పుస్తకం సావకాశంగా చదివే అవకాశం దొరికింది. అణువులకి, వికిరణానికి మధ్య జరిగే సంకర్షణ – అనగా అణువు (atom) వికిరణాన్ని (radiation ని) ఎలా పీల్చుకుంటుంది, ఎలా వెలిగక్కుతుంది అనే విషయాలని గుళిక వాదపు (Quantum theory) దృక్కోణంలో ఎడింగ్టన్ వివరిస్తాడు. ఈ వివరణలో నక్షత్రాన్ని ఒక వాయువుతో నిండిన పేద్ద గోళంగా ఉహించుకుంటాడు. అప్పుడు ఆ వాయుగోళం ప్రవర్తనని గణిత సమీకరణాలతో వర్ణిస్తాడు. ఇదంతా సాంప్రదాయిక భౌతిక శాస్త్రంతో కాకుండా అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న గుళిక వాదంతో వర్ణిస్తాడు. ఈ పుస్తకం చదివిన తరువాత రామన్ కనిపెట్టిన రామన్ ప్రభావాన్ని గుళిక వాదంతో ఎలా సమన్వయ పరచవచ్చో అర్థం చేసుకున్నాడు, చంద్రశేఖర్.

రామన్ గ్రంథాలయంలో చంద్రకి మరొక మణిరత్నం దొరికింది. అది ఆర్నాల్డ్ సోమర్ఫెల్డ్ రాసిన “అణు నిర్మాణశిల్పం, వర్ణమాలలో రేఖలు” (Atomic Structure and Spectral Lines) అనే పుస్తకం. ఈ గ్రంథకర్త గుళిక వాదానికి పునాదులు వేసిన ఆద్యులలో ఒకరు. పరిశోధన చెయ్యడంలోను, పాఠం చెప్పడంలోనూ కూడా ఈయన దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. ఈయన శిష్యులలో హాన్స్ బేథి (Hans Bethe), ఉల్ఫ్^ గేంగ్ పౌలి (Wolfgang Pauli), వెర్నర్ హైజెన్బర్గ్ (Werner Heisenberg) ఉన్నారు. ఈ శిష్యులు ముగ్గురికి నోబెల్ బహుమానాలు వచ్చేయి కానీ గురువుకి రాలేదు. ఇది తీరని వెలితి అని హైజెన్బర్గ్ అన్నారు. ఈ హైజెన్బర్గ్ శిష్యుడు ఒకాయన, గెర్హార్డ్ బ్లాస్ (Gerhard Blass), ఈ రచయితకి భౌతిక శాస్త్రం మీద అమెరికాలో ఆసక్తి పుట్టించిన గురువు.

కాకతాళీయంగా ఈ సోమర్ఫెల్డ్ 1928 లో మద్రాసు వచ్చేరు. వచ్చేరన్న వార్త చంద్రశేఖర్ చెవిన పడింది. ఆయన ఎక్కడ బస చేస్తున్నారో ఆచూకీ లాగి, అక్కడకి వెళ్లి తలుపు తట్టేరు. ఆయన తలుపు తెరచేరు. ఆ తెరచిన తలుపు చంద్రశేఖర్ జీవిత పథాన్ని పూర్తిగా మార్చి వేసింది.

ఆర్నాల్డ్ సోమర్ఫెల్డ్ తో మాట్లాడడం వల్ల చంద్రకి కనువిప్పు అయింది. గతించిన రెండేళ్లల్లోనూ భౌతిక శాస్త్రంలో జరుగుతున్న విప్లవ ధోరణులు మొట్టమొదటిసారి చంద్ర అవగాహన లోకి వచ్చేయి. గుళిక వాదపు మొదటి దశలో ఎలక్ట్రానులని రేణువులు (particles) గాను, తేజాణువు (photon)లని తరంగాలు గాను ఊహించుకునే వారు. ఈ రెండింటిని కూడా సమయానుకూలంగా రేణువులుగానూ లెక్కలోకి తీసుకోవచ్చు, లేదా తరంగాలుగానూ లెక్కలోకి తీసుకోవచ్చు అనే కొత్త దృక్పథం గుళిక వాదపు రెండవ దశలో తలెత్తింది. బోర్ నమూనాలో ఎలక్ట్రానులు రేణువుల రూపంలో కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు ఉహించుకుంటాం – సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి. దరిమిలా అది సరికాదని తేలింది. కొత్త గుళిక వాదంలో ఎలక్ట్రానులని తరంగ ప్రమేయాలు (wave functions), లేదా సంభావ్య తరంగాలు (probability waves), గా ఉహించుకుంటాం. ఈ తరంగాలు గ్రహాల మాదిరి ప్రదక్షిణాలు చెయ్యవు; స్థలం లోనూ, కాలం లోను వ్యాపించి ఉంటాయి. అంటే ఇవి అనేక స్థలాలలో ఒకే సమయంలో కనిపించగలవు – రాసక్రీడలలో కృష్ణపరమాత్మ వలె! ఇంకా వైపరీత్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాను మీద మనం చేస్తున్న ప్రయోగం ఎక్కడో ఉన్న మరొక ఎలక్ట్రాను పసిగట్టగలదు – ఎందుకంటే ఎలక్ట్రానుల ఉనికి ఒక స్థలానికి పరిమితం కాదు కనుక!

గుళిక వాదంలో ఇలా విప్లవ వీచికలు నెమ్మదిగా తలెత్తున్న తరుణంలో జెర్మనీలో హైజెన్బర్గ్ (Heisenberg), 1927 లో, ఒక మెలిక వేసేడు. ఈయన అన్నది ఏమిటంటే అణు ప్రపంచంలో ఒక రేణువు ఒక సమయంలో ఎక్కడ ఉందో నిర్ధారించి చెప్పగలిగితే అదే సమయంలో అది ఎంత జోరుగా ప్రయాణం చేస్తున్నాదో చెప్పడం అసంభవం. అలాగే, ఒక రేణువు, ఒక సమయంలో, ఎంత జోరుగా ప్రయాణం చేస్తున్నాదో చెప్పగలిగితే అదే సమయంలో అది ఎక్కడ ఉందో నిర్ధారించి చెప్పడం అసంభవం. కష్టం కాదు, అసంభవం! అలాగే పౌలి (Pauli) సూత్రం ప్రకారం ఒకే లక్షణాలు కల రెండు ఎలక్ట్రానులు ఒకే చోట ఇమడ లేవు. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అన్నట్లు! ఇలా గుళిక వాదంలో కొత్త పోకడలు పెరుగుతూ వచ్చేయి. సోమర్ఫెల్డ్ ఈ విషయాలన్నీ ఓపికగా చంద్రకి అర్థం అయేలా బోధించి, తాను తాజాగా ప్రచురించిన రెండు పరిశోధనా పత్రాలు చదవమని ఇచ్చేరు. ఆ పత్రాలలో ఊహకందనన్ని (ట్రిలియన్ల మీద ట్రిలియన్ల మీద ట్రిలియన్లు) ఎలక్ట్రానులతో నిండిన వాయువు మీద ఈ కొత్త గుళిక శాస్త్రం ప్రయోగించి చూసేరాయన. ఎలక్ట్రానుల గుళిక ప్రవర్తన (quantum behavior of electrons) కారణంగా ఆయనకి అయాచితంగా ఒక ఫలితం ఎదురు పడింది. జనాన్ని కిక్కిరిసిన స్థలంలో నొక్కిపెట్టినప్పుడు ఏమవుతుంది? కొంతవరకు, స్థలం ఉన్నంత మేరకి, ఆ ఒత్తిడిని భరిస్తారు, తరువాత ఒక్కుమ్మడిగా బయటకి తోసే ప్రతిస్పందన బలం పుట్టుకొస్తుంది. అదే దొమ్మీ అంటే! అదే విధంగా ఎలక్ట్రానులని మరీ విపరీతంగా నొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తే అవి – పౌలి సూత్రం ప్రకారం – తరుగుతున్న స్థలంలో ఇరుక్కోలేక బయటకు తోసుకు రాడానికి ప్రయత్నం చేస్తాయి….. అంటే ఎలక్ట్రానులతో నిండిన వాయుగోళాన్ని అదే పనిగా ఒత్తిడి చేసి నొక్కలేమన్నమాట…. చంద్ర ఆలోచనలు సోమర్ఫెల్డ్ చెబుతున్న మాటల కంటే జోరుగా ముందుకి పరిగెడుతున్నాయి.

సోమర్ఫెల్డ్ “ఎలక్ట్రాను వాయువు” మీద చేసిన పరిశోధనలకి కీలకమైన గణాంక శాస్త్రం సరఫరా చేసినది కేంబ్రిడ్జిలో ఉన్న డిరాక్, రోమ్ నగరంలో ఉన్న ఫెర్మి. వీరిద్దరూ ఏమన్నారంటే ఎలక్ట్రానులని వర్ణించే తరంగ ప్రమేయం అసౌష్టవమైనది కనుక అది ఒక రకమైన ద్వం ద్వ స్వభావం ప్రదర్శిస్తుందనిన్నీ (ఈ స్వభావాన్ని వర్ణించడానికి ఇంగ్లీషులో మాట దొరకక “స్పిన్” అనడం మొదలు పెట్టేరు), అలా రెండు ముఖాలు చూపించే ఎలక్ట్రానులని కిక్కిరిసిన స్థలంలో ఎంత మేరకి నొక్కి పెట్టగలమో చెప్పడానికి ఒక కొత్త గణాంకశాస్త్రం (statistics) కనిపెట్టేరు. ఒక “కొత్త గణాంక పద్ధతి” అంటూ 1926 లో ఫెర్మీ, డిరాక్ ఉమ్మడిగా ఒక పత్రం ప్రచురించేరు. ఈ కొత్త గణాంక పద్ధతిని ఫెర్మీ- డిరాక్ గణాంకాలు (Fermi-Dirac statistics) అంటున్నారు.

ఉత్తేజితుడైన చంద్రశేఖర్ వెంటనే సోమర్ఫెల్డ్ సిఫార్సు చేసిన మరి రెండు పరిశోధన పత్రాలు పౌలీకి,
హైజెన్బర్గ్ కి రాసి తెప్పించుకున్నాడు. వీరిద్దరూ చంద్రశేఖర్ కంటే కేవలం పదేళ్లు పెద్ద. కానీ వినూత్న గుళిక శాస్త్రానికి పునాదులు వేసిన దిట్టలు. చంద్రశేఖర్ కి కావలసిన ఘటక ద్రవ్యాలన్నీ సమకూరేయి: నక్షత్రాలలో ఉన్న అణువులు, ఎలక్ట్రానులు, తేజాణువులు ఒకదానితో మరొకటి ఎలా సంకర్షించుకుంటాయో ఎడింగ్టన్ పుస్తకంలో ఉంది; కిక్కిరిసిన స్థలంలో ఎలక్ట్రానులని నొక్కిపెడితే ఏమవుతుందో లెక్కకట్టే పద్ధతిని ఫెర్మి, డిరాక్ లు చెబుతున్నారు. ఈ రెండింటిని సమన్వయపరచితే నక్షత్రగోళంలో ఏమవుతుందో లెక్క కట్టి చెప్పవచ్చు. రెండు వారాల్లో ఈ లెక్క కట్టడం పూర్తి చేసి, పత్రం రాసేసి, 1928 లో, తన పదిహేడవ ఏట – మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో ఇంకా విద్యార్థిగా ఉండగానే – Indian Journal of Physics లో ప్రచురించేడు. దాని పేరు: The Thermodynamics of the Compton Effect with Reference to the Interior of Stars.”

ఈ మొట్టమొదటి పరిశోధనా పత్రం యొక్క ప్రత్యేకత అవగాహన అవాలంటే ఆనాటి విద్వత్ వాతావరణం అర్థం కావాలి. ఆ రోజులలో కొత్త ఊహలు ప్రచురణ పొందగానే కార్చిచ్చులా వ్యాపించేవి. కాంప్టన్ ప్రభావం (Compton Effect) అనే దృగ్విషయం 1923 లో ఆవిష్కరించబడింది. అందుకని కాంప్టన్ కి 1927 లో నోబెల్ బహుమానం కూడా వచ్చింది. ఫెర్మీ, డిరాక్ ల “కొత్త గణాంక పద్ధతి” ప్రచురణ జరిగిన వెనువెంటనే ఆ కొత్త పద్ధతిని ఉపయోగించి, ఆర్. ఎచ్. ఫౌలర్ అనే ఆసామీ ఒక నక్షత్రం గురుత్వాకర్షక బలాల ప్రభావానికి కూలిపోయి, శ్వేత కుబ్జతార (white dwarf) గా ఎలా మారుతుందో 1926 లో భాష్యం చెప్పేడు. ఈ కొత్త గణాంక పద్ధతి వాడి సోమర్ఫెల్డ్ లోహాల మీద పడ్డ గురుత్వాకర్షక బలాల ప్రభావానికి వాటి కట్టడి కూలిపోకుండా ఎలక్^ట్రానుల మూకుమ్మడి ప్రవర్తన ఎలా ఎదురు బలంతో ఆపుతుందో ఒక వ్యాఖ్యానం రాసేడు. రాసి, మద్రాసు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చేడు. ఆ ఉపన్యాసం విన్న పందొమ్మిదేళ్ళ చంద్రశేఖర్ ప్రభావితుడై, “కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్ ప్రభావం” అనే పరిశోధనా పత్రం ప్రచురించేడు. ఇక్కడ పినతండ్రి కనిపెట్టిన రామన్ ప్రభావం చంద్రశేఖర్ మీద పరోక్షంగా పడి ఉండవచ్చు. తేజాణువులు (photons) బణువుల (molecules) మీద పడినప్పుడు జరిగే పరిక్షేపాన్ని (scattering ని) రామన్ ప్రభావం అంటారు. తేజాణువులు విశృంఖలమైన ఎలక్ట్రానుల మీద పడినప్పుడు జరిగే పరిక్షేపాన్ని కాంప్టన్ ప్రభావం అంటారు. కనుక సహజంగా చంద్ర కి కావలసినది కాంప్టన్ ప్రభావం.

ఈ పనికి మరి కొన్ని మెరుగులు దిద్ది మరొక పరిశోధన పత్రం రాసి మరల అదే పత్రికలో ప్రచురణకి పంపేడు. ఇంతలో మెరుపులా మరొక ఆలోచన! ఇదే పత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైన రోయల్ సోసైటీ వారి పత్రికకి పంపితేనో? ముందస్తుగా, అప్పటికే ఇండియాలో ఉన్న పత్రికలో ప్రచురణార్థం పంపిన పత్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ నిబంధనల ప్రకారం రోయల్ సోసైటీలో సభ్యత్వం ఉన్నవారి ద్వారా పంపాలి కానీ, నేరుగా పంపకూడదు. తనకి రోయల్ సోసైటీలో సభ్యత్వం ఉన్నవారిని ఎవ్వరినీ తెలియదే! ఇంతలో ఒక ఉపాయం తట్టింది. తన దగ్గర ఉన్న Statistical Mechanics అనే పుస్తకం రాసిన వ్యక్తి పేరు రాల్ఫ్ ఫౌలర్. ఆయనకి రోయల్ సోసైటీ లో సభ్యత్వం ఉంది. అయన ఎవ్వరో తెలియకపోయినా తెగించి జనవరి 1929 లో ఆయన పరిశీలనకి తన రెండవ పత్రం పంపేడు.

ముక్కు, మొహం తెలియని ఒక అనామకుడైన భారతీయ విద్యార్ధి నుండి వచ్చి తన బల్ల మీద వాలిన పత్రాన్ని ఫౌలర్ ఆసక్తితో చదివేడు. మెరుగులు దిద్దడానికి కొన్ని సూచనలు చేసి తిరిగి రాయించి ప్రచురించడానికి సిఫార్సు చేసేడు. రోయల్ సోసైటీ వారి పత్రికలో పరిశోధన పత్రం ప్రచురించడం సామాన్యమైన సంఘటన కాదు.

ఏడాది తిరిగిపోయింది. గత ఏడు సోమర్ఫెల్డ్ వచ్చినట్లే ఈ ఏడు, అక్టోబరు 1929 లో, హైజెన్బర్గ్ మద్రాసు వచ్చేరు. అయన, 1925 లో, తన 24 వ ఏట, సరికొత్త పంథాలో గుళిక శాస్త్రాన్ని ఆవిష్కరించి, 1927 లో మౌలికమైన అనిశ్చితత్త్వ సూత్రాన్ని(Principle of Uncertainty) ఉద్ఘాటించారు. ఈయనకి నోబెల్ బహుమానం ఖాయం అని 1927 నాటికే అందరూ అనుకోవడం మొదలు పెట్టేరు. అంతటి దిట్ట గుళిక శాస్త్రం మీద ఇవ్వబోయే ప్రసంగాలు అందరికి సుబోధకంగా ఉంటాయో ఉండవో అని ప్రెసిడెన్సీ కాలేజీ అధికారులు హైజెన్బర్గ్ చేస్తున్న పరిశోధనాంశాలని అందరికి అర్థం ఆయే రీతిలో విడమర్చి చెప్పమని చంద్రశేఖర్ ని అడిగేరు.

చంద్రశేఖర్ కారు అద్దెకి తీసుకుని హైజెన్బర్గ్ కి మద్రాసు నగరం అంతా చూపించేడు. సాయంకాలం మెరీనా బీచికి తీసుకెళ్ళేడు. హైజెన్బర్గ్ తో ఏకాంతంగా గడిపిన ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రశేఖర్ ఎన్నో కొత్త విషయాలు, పరిశోధన అంశాలు తెలుసుకున్నాడు. ఉదాహరణకి, “గుంపులుగా ఉన్న ఎలక్ట్రానుల ప్రవర్తనని పౌలి సూత్రం ప్రకారం అర్థం చేసుకోడానికి అప్పుడప్పుడే తలెత్తుతున్న ‘గుంపుల వాదం’ (Group theory) అనబడే గణితం అందుబాటులో ఉంటుంది” వంటి చెణుకుల వంటి సలహాలు హైజెన్బర్గ్ ఎన్నింటినో చంద్రకి ఇవ్వడం జరిగింది.

ఫౌలర్ సిఫార్సుతో చంద్రశేఖర్ కి కేంబ్రిడ్జిలోని ట్రినిటి కాలేజిలో ప్రవేశం లభించింది. చంద్రశేఖర్ పేరు దేశం అంతా తెలిసిపోయింది. అలహాబాద్ లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1930 లో జరిగినప్పుడు మేఘనాథ్ సహా వంటి దిగ్గజాలు చంద్రశేఖర్ ని తేనీటి విందులకి ఆహ్వానించేరు. చంద్రకి ఇంకా ఆనర్స్ డిగ్రీ రానే లేదు!

అలహాబాద్ నుండి తిరిగి రైలులో మద్రాసు వస్తున్న తరుణంలో ఇండియా ఇంకా బ్రిటిష్ వారి బానిసత్వంలో మగ్గుతున్నాదని జ్ఞాపకం చెయ్యడానికా అన్నట్లు ఒక మరపురాని సంఘటన జరిగింది. తండ్రి రైల్ వ్యవస్థలో ఉద్యోగస్తుడు కనుక చంద్రకి మొదటి తరగతిలో ప్రయాణం చెయ్యడానికి “పాసు” ఉండేది. ఆ రోజు చంద్ర కూర్చున్న పెట్టెలో ఒక బ్రిటిష్ దంపతులు కూడా ప్రయాణం చేస్తున్నారు. అలహాబాద్ లో బండి బయలుదేరినప్పటి నుండి ఆమె అదే పనిగా “ఈ నల్లటి ఇండియన్ తో చోటు పంచుకోవలసి వచ్చింది” అంటూ ఫిర్యాదు చెయ్యడం మొదలు పెట్టింది. ఏదో గుడ్డిలో మెల్ల, మనిషి నల్లగా ఉన్నా బ్రిటిష్ వారి లాగే సూటు, బూటు వేసుకున్నాడు కదా అని సర్దుకో లేకపోయింది. టికెట్టు కలెక్టర్ వచ్చినప్పుడు చంద్రని మరొక పెట్టెలోకి మార్చమని పెద్దగా గలాటా మొదలు పెట్టింది. చంద్రశేఖర్ ఆమెనే మరొక పెట్లోకి మారమని సలహా ఇచ్చేడు. తోక తొక్కిన తాచులా లేచి ఆమె గొలుసు లాగింది. రైలు ఆగిపోయింది. సిబ్బంది వచ్చి ఆమెని సర్దుకోమని చెప్పేరు. “బండి కదిలితే గొలుసు మళ్లా లాగుతా” అని బెదిరించింది. చివరికి ఆమెనే మరొక పెట్టె లోకి మార్చేరు. బండి కదిలింది. ఆమెని ఏ తరగతి పెట్టెలోకి మార్చేరో తనకి తెలియదని చంద్ర అంటారు.

చంద్రశేఖర్ మద్రాసు తిరిగి రాగానే భువి నుండి దివికి దిగి రావలసి వచ్చింది. రచ్చ గెలుచుకొచ్చిన ఆసామికి ఇంట పెద్ద పరీక్షలు ఎదురయ్యాయి. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. డిగ్రీ వస్తే కానీ పైకి కదలడానికి వీలు లేదు. చంద్ర పరిశోధనలు, పత్రాలు వెనక్కి నెట్టి పాఠ్యపుస్తకాలు ముందు పెట్టుకుని పరీక్షకి తయారవడం మొదలు పెట్టేడు. ప్రెసిడెన్సి కాలేజి ప్రిన్సిపాల్ చంద్రని పిలచి, “నువ్వు ప్రత్యేకించి పోటీలో పాల్గొనవలసిన అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టనవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా నీకు విద్యార్ధి వేతనం మంజూరు చేసింది. ఈ డబ్బుతో నువ్వు ఇంగ్లండు వెళ్లి చదువు కొనసాగించవచ్చు. ఒకే ఒక నిబంధన. చదువు అయిపోయిన తరువాత నువ్వు తిరిగి వచ్చి మన కాలేజిలో పాఠం చెప్పాలి” అన్నారు. ఇదే ప్రిన్సిపాలు – కొద్ది నెలల క్రితమే – మెరీనా బీచిలో నెహ్రూ ఉపన్యాసం వినడానికి చంద్ర వెళ్లినందుకు జరిమానా విధించేడు!

ఇటు B.Sc (Hons) పట్టా పుచ్చుకున్నాడో లేదో అటు 1930 లో పెద్ద చదువులకని ఇంగ్లండు ప్రయాణం అవవలసి వచ్చింది. ఇదే సమయంలో చంద్ర తల్లికి సుస్తి చేసి మంచం ఎక్కింది. ఇంగ్లండు వెళ్లడం గురించి చంద్ర తటపటాయించేడు. “నువ్వు వెళ్ళు. ఇక్కడ ఉండే సమస్యలు ఉంటూనే ఉంటాయి. నీ భవిష్యత్తు బాగోగులు నువ్వే చూసుకోవాలి,” అని ప్రోత్సాహ పరుస్తూ, “మీ చిన్నాన్న రామన్ మాటలు మాత్రం వినకు” అని సలహా ఇచ్చింది. గతంలో ఒకసారి అన్నదమ్ములు ఇరువురు కలసి కలకత్తాలో ఉమ్మడి కాపురం పెట్టిన రోజులలో, వదిన గారికి పెద్ద చదువు లేదనిన్నీ, వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అనిన్ని (ఆయనది ప్రేమించి చేసుకున్న పెళ్లి!) రామన్ ఎత్తిపొడుపులు చేస్తూ మాట్లాడిన మాటలు ఆమె ఇంకా మరచి పోలేదు!

వీటన్నిటికీ తోడు మరొక చిన్న సమస్య ఏమిటంటే చంద్రశేఖర్ ప్రేమలో పడ్డాడు. లలిత దొరైస్వామి పట్టుదల, చలాకీతనం ఉన్న కలుపుగోలు పిల్ల. ఆ రోజుల్లో అడపిల్లలు అబ్బాయిలతో పోటీపడి భౌతిక శాస్త్రం చదవడం అరుదనే చెప్పాలి. కానీ రెండు విభిన్నమైన శక్తుల ప్రభావం వల్ల లలిత తల్లిదండ్రులు ఆమెను కాలేజీకి పంపి చదివించడానికి నిశ్చయించుకున్నారు. ఒకటి, లలిత పినతల్లి, సుబ్బులక్ష్మి అయ్యర్ పన్నెండేళ్ల పసి వయస్సులో బాల వితంతువుగా పుట్టింటికి తిరిగి వచ్చింది. ఆ రోజుల్లో, బ్రాహ్మణ కుటుంబాలలో, భర్తని పోగొట్టుకున్న బాల వితంతువుల జీవితం దుర్భరం, నరక తుల్యం. బొమ్మలతో ఆడుకోవలసిన ఆ పసి బాలికకి మరో పెళ్లయే అవకాశం కానీ, తల్లి అయే అవకాశం కానీ లేవు. ఆమె జీవితం పూర్తిగా బూడిద పోసిన పన్నీరు కాకూడదనిన్నీ, భారత స్వతంత్ర సంగ్రామం నేపథ్యంలో స్త్రీ జనోద్ధరణ కూడా ఒక భాగమే అనిన్నీ సమర్ధించుకుని, దొరైస్వామి దంపతులు, సంఘాన్ని ఎదిరించి, సుబ్బులక్ష్మిని కాలేజీకి పంపి చదివించడానికి నిశ్చయించుకున్నారు. దరిమిలా ప్రెసిడెన్సీ కాలేజీకి ఎదురుగా, మెరీనా బీచి పక్కన, అమ్మాయిల చదువు కొరకు క్వీన్ మేరీ కాలేజీ కట్టడానికి సుబ్బులక్ష్మి అయ్యర్ కారకురాలు అయేరు.

సుబ్బులక్ష్మి కథ కళ్లారా చూసిన లలిత తల్లిదండ్రులు లలిత చేత యూనివర్సిటీ స్థాయి వరకు చదివించడానికి నిశ్చయించుకున్నారు. “దాని మొగుణ్ణి అదే వెతుక్కుంటుంది” అని పెళ్లి గురించి ఆరాట పడలేదు. “నా మొగుణ్ణి నేనే వెతుక్కున్నాను” అని లలిత గర్వంగా చెప్పుకునేదిట!

చంద్ర పుట్టేసరికి లలిత నాలుగు రోజుల పిల్ల. లలిత తల్లి – సావిత్రి దొరైస్వామి – చెల్లెలు సుబ్బులక్ష్మి లాగే పట్టుదల, ధైర్యం గల మనిషి. లలితకి తొమ్మిదేళ్ళప్పుడు ఆమె తండ్రి కెప్టెన్ దొరైస్వామి మొదటి ప్రపంచ యుద్ధంలో తగిలిన దెబ్బలవల్ల చనిపోయాడు. సావిత్రి అప్పుడు ఒక పక్క చదువుకుంటూ, మరొక పక్క వచ్చే మిలటరీ పింఛనుతో పిల్లలలకి చదువులు చెప్పించింది. సంసారం ఒబ్బిడిగా చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, నాలుగు రాళ్ళు వెనకేసి మైలాపూర్లో, చంద్ర విలాస్ వెనకాతలే, ఒక ఇల్లు కట్టుకుని ఉండేది. రెండిళ్ళ మధ్య గోడ ఒక్కటే అడ్డం!

లలిత ప్రెసిడెన్సీ కాలేజీలో, ఫిజిక్సు ఆనర్స్ లో, చంద్ర కంటే ఒక ఏడు వెనక్కి ఉండేది. గేలరీలా ఉన్న లెక్చర్ హాలులో అడ పిల్లలకి మొదటి వరస కేటాయించేవారు. లలిత ఎల్లప్పుడూ మొదటి వరసలో, కుడి పక్క చిట్టచివర కూర్చునేది. చంద్ర, సిగ్గు పడుతూనే, రెండవ వరసలో ఆమె వెనక బెంచిలో కూర్చునేవాడు. చూపులతోనే కలయికలు; మాట్లాడడానికి దమ్ములు లేవు. అందులోనూ మగ పిల్లవాడు అమ్మాయిని పలకరించడమే! ఇంకేమయినా ఉందా?

దేశపు ఆచారాలు ఎరిగిన పిల్లే కనుక ఒక రోజున లలితే చొరవ చేసి “నీ నోటు పుస్తకం ఒక సారి ఇస్తావా?” అని అడిగింది. వంచిన తల ఎత్తకుండా చంద్ర నోటు పుస్తకం తీసి ఇచ్చేడు. లలిత ఆ పుస్తకం పూర్తిగా అందుకోకుండా నేల మీదకి జార విడిచింది. ఇద్దరూ ఒకే సారి ఒంగేరు – పుస్తకాన్ని అందుకుందామని. తలకాయలు ఢీకొన్నాయి. గుండెకాయలు కొట్టుకున్నాయి. చూపులు కలుసుకున్నాయి. చూపులే కానీ మాటలు లేవు. లలిత సైకిలు ఎక్కి ఎడ్వర్డ్ ఎలియట్ రోడ్డు మీద ఇంటికి వెళుతూ ఉంటే ఆమె వెనకే, ఆమె రక్షణ కోసమా అన్నట్లు, చంద్ర వెళ్ళేవాడు. అంతే కానీ వీరిద్దరి మధ్య మౌనంగా ఒక ప్రేమ కలాపం జరుగుతోందనిన్నీ, రెండు కళ్ళు నాలుగయాయనిన్నీ మూడో కంటివాడికి తెలియదు.

ఇంగ్లండు వెళ్ళడానికి ముందు రోజున ఏవో కొన్ని పుస్తకాలు ఇచ్చే మిషతో చంద్ర ఇంటి వెనక వారింటికి వెళ్ళేడు. ఆ సమయంలో ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడం జరిగింది. ఏదో చెప్పాలని తహతహ. కానీ నోరు ఎండి పోయింది. మాట వచ్చే లోగా సావిత్రమ్మ కాఫీ పట్టుకొచ్చి ఇవ్వడంతో వారి మౌన సంభాషణకి తాళం పడింది.

ఇంగ్లండుకు వెళ్లే వేళ ఆసన్నమయింది. అనారోగ్యం వల్ల తల్లి బొంబాయి వెళ్లలేక పోయింది. “భారతీయ గణిత శాస్త్రానికి రామానుజన్ ఎంత పేరు ప్రఖ్యాతులు పట్టుకొచ్చేడో అలాగే భారతీయ భౌతిక శాస్త్రానికి నువ్వు కూడా తలమానికంగా నిలిచి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తావని ఆశిస్తున్నాను” అంటూ పినతండ్రి సర్ సి. వి, రామన్ పంపిన వీడ్కోలు సందేశం చూసి చంద్ర చాలా సంతోషించేడు. వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన బంధు మిత్రులు పడవ బయలుదేరే వరకు పడవలోనే ఉన్నారు. జూలై 31, 1931 సాయంకాలం లోయడ్ ట్రిస్టినో (Lloyd Tristino) లంగరెత్తి వయ్యారంగా అరేబియా సముద్రంలోకి జారుకుంది.

పడవలో ప్రయాణం చేసేవారి కాలక్షేపానికి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. మద్యపానీయాలు, ఆటలు, అమ్మాయిలు – ఒకటేమిటి? తోటి భారతీయ విద్యార్థులు ఈ కాలక్షేపపు వసతులని వినియోగించుకోడానికి ఉబలాట పడుతూ ఉంటే చంద్రశేఖర్ కాగితం, కలం తీసుకుని, నక్షత్రం శ్వేత కుబ్జతార (white dwarf) గా మారే సందర్భాన్ని వర్ణిస్తూ కొన్ని గణిత సమీకరణాలు రాసి, వాటిని పరిష్కరించి చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ సమీకరణాలు గొంతెత్తి ఒక విషయాన్ని చెప్పేయి ఆయనకి. ఏమిటా విషయం? ఒక నక్షత్రంలోని పదార్థం (లేదా ఆ నక్షత్రపు గరిమ) ఒక అవధిని మించితే ఆ నక్షత్రం తన గురుత్వ ఆకర్షణ శక్తుల ప్రభావానికి లోనయి, అందరూ అనుకుంటున్నట్లు శ్వేత కుబ్జతార దశ చేరకుండా, కూలిపోతుంది. ఈ రకం కూలిపోవడాన్ని ఇటీవల కాలంలో “గురుత్వ పతనం” (gravitational collapse) అంటున్నారు కానీ, అప్పట్లో నక్షత్రాలు ఇలా “కూలిపోవడం” అనే భావం కొత్తది; దానికి పేరు లేదు. (గణితపరంగా, eigenvalues అనేవి విడివిడిగా ఉండకుండా ఒకటై పోతే ఆ పరిస్థితిని “పతన స్థితి” లేదా degenerate state అంటారు. ఇలా సమీకరణాలు పతన స్థితిని చేరుకుంటే నక్షత్రపరంగా దాని అర్థం ఏమిటో అప్పట్లో చంద్రశేఖర్ ఊహించలేకపోయాడు!)

ఇలా గురుత్వ పతనం చెందిన నక్షత్రం ఏమవుతుంది? ఇది శ్వేత కుబ్జతార కాదు. మరి? ఆ రోజులలో కర్రి బిలం లేదా కృష్ణ బిలం (black hole) అనే పేరు వాడుకలో లేకపోయినా ఆ భావన ఊహామాత్రంగా ఉండడం ఉంది, కానీ సిద్దాంత పరంగానూ, ప్రయోగికంగానూ ఋజువు కాలేదు. కనుక గణిత సమీకరణాలు చెబుతున్న వర్తమానం చంద్రశేఖర్ కి మింగుడు పడలేదు. గణితాన్ని గుడ్డిగా నమ్మడమా? లేక ….

సమీకరణాలు, సిద్దాంతాలు చెప్పినవి అన్నీ ఎలా నమ్మేస్తాం? ఋజువు ఉండొద్దూ? ప్రత్యక్ష ప్రమాణం కావాలంటే ఆకాశంలో వెతకాలి. ఎన్నని వెతుకుతాం? ఎక్కడని వెతుకుతాం? తన ఊహ సరి అయినదే అన్న నమ్మకం చంద్రశేఖర్ కి ఉంది కానీ తన గణితం బందోబస్తుగా ఉందో లేదో? ఇంగ్లండు వెళ్లిన తరువాత మరొక నాలుగేళ్లు శ్రమించి, తన సిద్దాంతానికి, సమీకరణాలకి మెరుగులు దిద్దుతూ, 1935 లో పి. ఎచ్. డి పట్టా సంపాదించేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked