కథా భారతి

చదువుల వెలుగులు

-G.S.S.కళ్యాణి

“భారతీ! ఇదే మన ఇల్లు!”, పాతగా ఉన్న ఒక చిన్న పెంకుటింటి చెక్కతలుపును తీసి లోపలికి అడుగు పెడుతూ అన్నాడు సత్యం.

ఏ క్షణానైనా జారిపడేట్టు ఉన్న ఆ ఇంటి పెంకులవంక ఆశ్చర్యంగా చూస్తూ తన బట్టలమూట చంకలో పెట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించింది కొత్తగా పెళ్ళై అప్పుడే కాపురానికి వచ్చిన భారతి!

“నీకు తెలుసుగా భారతీ! నాది టెంపొరరీ ఉద్యోగం! నెలసరి ఆదాయం మనిద్దరివరకే సరిగ్గా సరిపోతుంది! మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులేవీ నా దగ్గర లేవు. ఉన్నదాంట్లో సద్దుకుపోక తప్పదు మరి!”, అన్నాడు సత్యం.

భారతి సత్యం వంక చూసి చిరునవ్వు నవ్వింది. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు కావస్తూ ఉంది. దాదాపుగా ఖాళీగా ఉన్న అక్కడి వంటింట్లో ఒకటిరెండు గిన్నెలు, కొద్దిగా కూరలు మాత్రం ఉన్నాయి. వాటితోనే గబగబా వంట పూర్తి చేసి భోజనాలు వడ్డించింది భారతి. కడుపునిండా తృప్తిగా తిని వెంటనే నిద్రపోయాడు సత్యం.

భారతికి ఎందుకో నిద్రపట్టలేదు. తన మనసునిండా ఏవేవో ఆలోచనలు. భారతి తండ్రి సీతయ్య గవర్నమెంట్ ఉద్యోగి. సీతయ్యకు సంపాదన బాగానే ఉన్నా, గంపెడు సంతానంవల్ల ఎప్పుడూ పేదరికం అనుభవిస్తూ ఉండేవాడు. సీతయ్యకున్న పదిహేనుమంది సంతానంలో అందరిలోకీ పెద్దది భారతి. భారతి తర్వాత ఏడుగురు ఆడపిల్లలుకాగా ఆపై వారంతా మగపిల్లలు. సీతయ్యకు ఎప్పుడూ తన పిల్లలను ఎలా పోషించాలా అన్న ధ్యాసేతప్ప వారి చదువు గురించి పట్టించుకునే తీరిక, ఓపిక ఉండేవి కావు. తొమ్మిదోతరగతి పూర్తి కాగానే భారతిని ఇంటిపనుల కోసం బడి మాన్పించేశాడు సీతయ్య. భారతికి పదహారేళ్లు ఎప్పుడు నిండుతాయా అని ఎదురు చూసి పెళ్లిసంబంధాలు వెతకడం మొదలుపెట్టిన సీతయ్యకు అనుకోకుండా సత్యం గురించి తెలిసింది. సత్యం ఎవరూ లేని అనాథ. తెలిసినవారి సహాయంతో ఏదో కొద్దిగా చదువుకుని ప్రభుత్వసంస్థలో గుమాస్తాగా టెంపరరీ ఉద్యోగం చేస్తున్నాడు. సత్యం మంచి గుణం కలవాడని తెలిసి, పిల్ల పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది అని అనుకుని, భారతి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సత్యానికి భారతినిచ్చి గుళ్లో నిరాడంబరంగా పెళ్లి చేసేశాడు సీతయ్య!

అలా తన జీవితంలో తన ప్రమేయం లేకుండా వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్న భారతికి ఎప్పటికో నిద్ర పట్టింది. రోజులు గడుస్తున్నాయి. పండగలూ, పబ్బాలూ, పుట్టినరోజులూ,పెళ్లి వేడుకలూ, నోములూ, వ్రతాలూ, ఏవి జరుపుకోవాలన్నా తమ ఆర్ధికస్థోమత అడ్డువచ్చేది సత్యం దంపతులకి.

ఎప్పుడైనా భారతి, ‘పుట్టింట అనుభవించిన పేదరికం పెళ్లయ్యాక కూడానా!’, అని దిగులుగా ముఖం పెడితే, “భారతీ! నిన్ను సుఖపెట్టేందుకు నా దగ్గర కోట్లు లేవు! కానీ, నిన్ను మహారాణిలా చూసుకునే మనసూ, నీ కోసం నా ప్రాణాన్ని సైతం ఇవ్వగలిగే స్వచ్ఛమైన ప్రేమ నా దగ్గర ఉన్నాయి! నాకు చేతనైనంతలో నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను!”, అనేవాడు సత్యం.

కొద్దినెలలు గడిచాక భారతి గర్భవతి అయింది. వారి ఆర్ధికస్థోమత ఏమాత్రం మెరుగు పడకపోవడంతో పుట్టబోయేవాడిని ఎలా పెంచాలా అని ఆందోళన చెందారు సత్యం, భారతిలు.

ఒకరోజు సత్యం ఉద్యోగంనుండీ ఇంటికి రాగానే, “మీరొప్పుకుంటే నాకు ఏడోనెల వచ్చేవరకు నేను నాలుగిళ్ళల్లో పని చేసి డబ్బు సంపాదిస్తానండీ! సరేనా?”, అని అడిగింది భారతి.

సత్యానికి విపరీతమైన బాధ కలిగి,” చూడు భారతీ! గర్భవతిని కష్టపెట్టేటంత దౌర్భాగ్యుడిని కాదు నేను!”, అని చెప్పి ఆ రాత్రివేళ అప్పటికప్పుడు ఇంటినుండీ బయటికెవెళ్ళిపోయి ఒక ప్రైవేట్ సంస్థలో రాత్రిళ్ళు పనిచేసే ఉద్యోగంలో చేరిపోయాడు సత్యం.

ఇక అప్పటినుండీ సత్యం పగలనకా రాత్రనకా కష్టపడి ఉద్యోగం చేసి మూడునెలలలో ఎప్పటికన్నా కాస్త ఎక్కువ డబ్బులను కూడబెట్టగలిగాడు. కానీ, సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడంతో అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది! భారతికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు!
ఒక సాయంత్రంవేళ ఆరుబయట పిల్లలు ఆడుతూ ఉంటే అరుగుపైన కూర్చుని వారిని చూస్తోంది భారతి. పిల్లలందరూ కేరింతలు కొడుతూ బంతితో ఆడుతున్నారు. వారికి కొంచెం దూరంలో ఒక చిన్నపిల్లవాడు ఒక రాయిపై కూర్చుని ఆపకుండా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉండటం కనపడింది భారతికి. చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఆ పిల్లాడు అలా ఏడవటం చూసి భారతి ఆగలేక ఆ బాబుని దగ్గరకు పిలిచి విషయం అడిగింది.

“నేను ఎంత బాగా చదివినా నాకు లెక్కల్లో మంచి మార్కులు రావట్లేదు. అందుకని అమ్మ కొట్టింది!”, అని ఏడుస్తూనే సమాధానం చెప్పాడు ఆ పిల్లవాడు.

ఆ పిల్లవాడిని చూస్తే భారతికి జాలేసింది. తను పెద్దగా చదువుకోకపోయినా చదువంటే భారతికెంతో ఇష్టం. అందులోనూ లెక్కలంటే తనకు ప్రాణం. భారతి లెక్కలు చేస్తున్నప్పుడు అసలు తనకు సమయం తెలిసేది కాదు. తొమ్మిదోతరగతి వరకూ ఎప్పుడూ లెక్కల్లో తన తోటి విద్యార్ధులందరిలోనూ తనకే ఎక్కువ మార్కులు వచ్చేవి!

ఏడుస్తున్న బాబును ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తూ, “బాబూ! నీ లెక్కలపుస్తకం పట్టుకురా! మనం కలిసి చేద్దాం!”, అంది భారతి.

బాబు వెంటనే పుస్తకం పట్టుకొచ్చాడు. భారతి లెక్కలు చెప్పడం మొదలుపెట్టింది. బాబుకు భారతి చెప్పే తీరు నచ్చి లెక్కలపై శ్రద్ధ పెరిగింది. దాంతో ప్రతిరోజూ ఆ బాబు లెక్కలపాఠాలు చెప్పించుకునేందుకు భారతి వద్దకు వచ్చేవాడు. లెక్కలలో భారతి ఇచ్చిన శిక్షణతో ఆ బాబు, ఆ ఏడు జరిగిన పరీక్షల్లో వాళ్ళ బడిలో అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించగలిగాడు! అతని తల్లిదండ్రులు భారతిని మెచ్చుకుని కొంత సొమ్మును కృతజ్ఞతతో భారతికి బహుమానంగా ఇస్తూ తమ ఊరిలోని బడిలో ఆమెను టీచర్ గా చేరమని ప్రోత్సహించారు. వారి మాటలు విన్న భారతికి తను పదవతరగతి పరీక్షలకు ప్రైవేట్ గా కట్టి చదవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే సత్యంతో చెప్పి పుస్తకాలు కొనుక్కుని పట్టుదలతో చదివి పదవతరగతి పాస్ అయిపోయింది భారతి! ఆ విజయం భారతికి ఆత్మవిశ్వాసం కలిగించడంతో తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది భారతి. అందుకు సత్యం మనస్ఫూర్తిగా తన అంగీకారాన్ని తెలిపాడు.

సత్యం దంపతులకు పండంటి మగబిడ్డ కలిగాడు. భారతి , తనకు పుట్టిన బాబును చూసుకుంటూ కష్టపడి చదివి ఇంటర్,డిగ్రీలు పూర్తిచేసి టీచర్ గా ఉద్యోగం సాధించింది! పిల్లలకు అర్ధమయ్యేలా చదువు చెప్తూ అందరి మన్ననలనూ పొందిన భారతి, కొన్నేళ్లల్లో వాళ్ళ ఊళ్లోని బడికి ప్రధానోపాధ్యాయురాలు అయింది! ఆ ఊరివారంతా భారతిని ఎంతో గౌరవిస్తూ ‘మా ఊరి చదువులతల్లి!’ అని అభిమానంగా పిలుచుకునేవారు. సత్యం కూడా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి గుమాస్తా స్థాయినుండీ పదోన్నతులు పొందుతూ ఉన్నత స్థాయి పదవిలోకి వచ్చాడు. సత్యం, దంపతుల ఆర్ధికస్థితి బాగా మెరుగుపడింది. ఇల్లూ, కారూ కొనుక్కోగలిగారు. వారి పిల్లవాడిని కూడా బాగా చదివించి డాక్టర్ను చెయ్యగలిగారు.

సత్యం, భారతిలిద్దరూ తమతమ ఉద్యోగాలలో పదవీవిరమణను పొందిన తర్వాత, ఒకరోజు వారి పనిమనిషి ఇరవయ్యేళ్ళ మంగమ్మ, ఇల్లు తడిబట్ట పెట్టి తుడుస్తూ, “అమ్మా! మీరు మనూళ్ళో ఎందరికో సదువు సెప్పిన సరస్వతి కదా! నాక్కూడా సదువుకుని బాగుపడాలని ఉందమ్మా! సదువుకోని మా అయ్యకు బోలెడు ఎకరాల పొలం ఉండేదమ్మా! పంటలు సరిగా పండక తెలిసినోళ్ల దగ్గర అప్పు సేస్తే, ఆళ్ళు సమయానికి బాకీ తీర్చలేదంటూ ఏవో కాయితాలపైన సంతకాలు పెట్టించుకుని మా అయ్య పొలం మొత్తం గుంజేసుకున్నారమ్మా! అప్పటినుండీ మాకు కష్టాలు మొదలయ్యాయి. నేను సదువుకుంటే ఆ పొలం తిరిగి మా అయ్యకు దక్కేలా సేస్తే సుఖపడొచ్చని నా ఆశ! మరి నాకు సదువు నేర్పుతారా?”, అని అడిగింది భారతిని.

“ఓ! తప్పకుండా నేర్పిస్తాను! నేను కటిక పేదరికంనుండీ చదువుకుని ఈ స్థితికి రాగలిగాను! నా జీవితంలో చీకట్లు అలముకున్నప్పుడు చదువుతో వచ్చిన వెలుగులే నాకు దారి చూపాయి! చదువు రావడానికే కాదు, ఆ చదువు విలువ తెలుసుకోవడానికి కూడా చదువులతల్లి అయిన ఆ సరస్వతీదేవి కటాక్షం కావాలి మరి! ఆ బల్లపైనున్న పుస్తకం ఇటు తీసుకురా! అక్షరాలు నేర్పుతా!”, అంది భారతి.

“అలాగేనమ్మా!”, అని చేతులూ, కాళ్ళూ కడుక్కుని పుస్తకం తెచ్చుకుని భారతి ముందు కూర్చుని ఆనందంతో కలం చేతిలోకి తీసుకుంది మంగమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked