సారస్వతం

తాపీ ధర్మారావు గారు

*శారదాప్రసాద్ *

తాపీ ధర్మారావు గారు తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు .తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు ఈయన . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.ధర్మారావు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.వారి ఇంటి పేరును గురించి వారే ఈ విధంగా చెప్పారు — “మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని రాశారట. అలా మా ఇంటి పేరు ‘తాపీ’ అయింది.” ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ,తండ్రి అప్పన్న. గిడుగు రామమూర్తి లాంటి గురువు దొరకడం ఆయన తన స్వభావానికి, నిజాయితీగా అనుకొన్న లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోయే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి కూడా సాయపడింది. తేలికైన మాటల్నివాడి తెలుగు వచనాన్నీ, కవితల్నీ కొత్త పుంతలు తొక్కించిన వారిలో తాపీ ధర్మారావు మొదటివారనే చెప్పుకోవాలి. కొడుకులు మోహనరావు, చాణక్య – ఇద్దరూ కమ్యూనిస్టులు. అందులో మోహనరావు పార్టీ కార్యకర్తల్లో ముఖ్యుడు. అతనికి కావలసిన స్ఫూర్తిని ఒక రచయితగా, ఒక సామాజిక విప్లవకారుడుగా తాపీ రగిలించాడు. తాను పార్టీతో ముడివేసుకోకుండా తన స్వతంత్రతను కాపాడు కొంటూనే కొడుకుకు సహకరించాడు. కమ్యూనిస్టు దినపత్రిక ‘విశాలాంధ్ర’కు ఆ పేరు పెట్టింది ‘తాపీ’యే నంటారు. ‘సమదర్శని, కాగడా, జనవాణి, ప్రజామిత్ర,కొండెగాడు ’ వంటి పత్రికలు తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వచ్చాయి. ‘జనవాణి’లోనే వాడుకభాషను ప్రవేశ పెట్టి విజృంభించాడు.1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో వెలువడింది. ఆలోచనలను రేకెత్తించే అనేక పుస్తకాలను రచించారు. వాటిలో కొన్ని –దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు?,పెళ్లి, దానిపుట్టుపూర్వోత్తరాలు, ఇనుపకచ్చడాలు…… చేమకూర వెంకట కవి ‘విజయవిలాసము’నకు ‘హృదయోల్లాస’ వ్యాఖ్య వ్రాసి పండిత ప్రశంసలు పొందాడు .విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము లభించింది. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారు వీరికి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదును ఇచ్చి సత్కరించారు.తాపీని గౌరవంగా చాలామంది ‘తాతాజీ’ అని పిలిచేవారు.ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే దానికి మొదటి అధ్యక్షులు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు.NTR నటించిన భీష్మ సినిమాకు కొంతభాగం ఈయన రచన చేయగా,మిగిలింది ఆరుద్ర పూర్తిచేసాడు. దీన్ని గురించి సినీ పండితులు సరదాగా–భీష్మ సినిమా మాటలు మొదటి భాగంలో తాపీగా ,మిగిలిన భాగంలో ఆదుర్దాగా సాగాయనేవారు.వీరి కుమారుల్లో ఒకడైన తాపీ చాణక్య సినీ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాపీ ధర్మారావు గారు తెలుగువారినుద్దేశించి – ‘‘అందరికి తెలియు మాటలు వందలు గద మారు బాస వాగగనేలా అందమ్మనియా, వీనుల విందనియా దాస్యమెంత వెర్రిదిరా… నీ భావము నీ జాతికి నీ భాషను చెప్పలేక నీల్గెదవు…’’ అని హెచ్చరించాడు. తెలుగు భాషకు ప్రత్యేకించి వ్యావహారిక భాషకు ఎంతో సేవచేసిన ఈ మహనీయుడు 8-5-1973 న మరణించాడు.
*ఈ **ఆంధ్రవిశారదుడికి అక్షర నీరాజనం!*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on తాపీ ధర్మారావు గారు

Turaga Siva Rama Venkateswarlu said : Guest 4 years ago

పెళ్లి, దానిపుట్టుపూర్వోత్తరాలు, ఇనుపకచ్చడాలు తాపీ ధర్మ రావు గారి రచనలు చదివాను. వీటిలో  హాస్యంకూడా ఉంటుంది. శ్రీ రమణగారి 'మిథునం' కథలో వస్తువుకి 'పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు' రచనలో  విషయానికి విరుద్ధం . కొన్ని సంస్కృతీ సంప్రదాయాలకు అలవాటుపడి ఫలితాలు పొందిన చాలామంది ధర్మారావు గారితో ఏకిభావించ లేరు. మంచి రచయితగా ధర్మారావు గారు  గౌరవించవాడు. ఆయన గురించి వివరాలు అందచేసిన శారద ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

  • Bengalore