కథా భారతి

” తిండి యావ” (హాస్య కధ)

పెళ్ళి చూపుల్లో ముద్దబంతి పువ్వులా ఉన్న సుందరి అందచందాల మీద గాని వాళ్ళు జరుపుతామంటున్న పెట్టిపోతలు, కట్నాల మీద గాని ధ్యాస లేదు సుబ్బారావు కి..ఆడపెళ్ళి వారు పళ్ళాలలో పెట్టిన తినుబండారాల మీదే అతని దృష్టి మొత్తం..ఉంది.చూపులయ్యాక ” ఏరా సుబ్బూ.. పిల్ల నచ్చిందా? అనడిగాడు అటు ఆడపెళ్ళి వారికి ఇటు మగ పెళ్లి వారికి మథ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుబ్బారావు సొంత మేనమామ..తినబండారాలపై దృష్టి మరచలేని సుబ్బారావు
నోరూరించే మైసూర్ పాక్ ఇంకా తినవేంటి అంటూ పచ్చగా హొయలు బోతూ నవ్వినట్లనిపించి అమాంతం ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తూ ‘ఆహా’..అన్నాడు తన్మయంగా….

ఇహనేం మా వెధవాయ్ కి పిల్ల నచ్చింది ఇక శుభస్యశీఘ్రం ..పెళ్ళున నవ్వుతూ అన్నాడు మేనమామ.

ఆ నవ్వు అదురుకి టేబిల్ పై నున్న పళ్ళాలలో నీటుగా సర్ది పెట్టిన తినుబండాలు చెల్లా చెదరు అయేసరికి ఆడపెళ్ళి వారు హడలిపోయారు..! ఇక పెళ్ళి చూపుల తతంగంలో…

ఇరు పక్షాల వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు సుబ్బారావు మాత్రం మిలమిల మెరుస్తూ నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాలకోవా బిళ్ళలను చూస్తూ…

“పిచ్చి ముండలు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో …అనుకుంటూ గుటకలు వేస్తూ ఆగలేక ఓ పాలకోవా బిళ్ళ తీసుకోబోయి కెవ్వున అరిచాడు ..

అప్పటికే అబాగా మూడు మైసూరు పాకులను నోట్లో కుక్కుకుంటూ తిన్న మేనల్లుడు పాలకోవా బిళ్ళకు ఎగబడటం చూసి తన పై పంచె తీసి మడతలు విప్పి మళ్ళీ మడతలు పెడుతున్నట్లు నటిస్తూ పంచెం అడ్డం పెట్టుకుని ఎవరికి కనబడకుండా తన పక్కనున్న సుబ్బారావు కు గట్టిగా తొడపాశం పెట్టాడు మేనమామ.

తలవంచుకు కూర్చొన్న సుందరి సుబ్బారావు అరిచిన అరుపుకు బిక్కచచ్చి పోయి అతని వంక పిచ్చిచూపులు చూడసాగింది. పాపం.. మేనమామ తొడపాశానికి గుడ్లనీరు కుక్కుకున్న సుబ్బారావుని చూస్తూ ..

ఏం లేదమ్మా ..ఏ చీమన్నా కుట్టిందేమో వెధవని ..నువ్వేం ఖంగారు పడకూ ..అన్నాడు మళ్ళీ పెళ్ళున నవ్వుతూ

.వంటింటిలోంచి హాలులోకి మరోమారు కాఫీలను తెస్తున్న సుందరి తల్లి ముందుకు తూలి పడబోయి నిగ్రహించుకొని వణుకుతున్న చేతులతో అందరికి కాఫీలను అందించింది.!

“ఏంటోయ్ పిచ్చి సన్నాసి…..అమ్మాయిని ఏమన్నా అడుగుతావట్రా …..వేడి వేడి కాఫీని ఉఫ్మని ఊదుకుంటూ పెద్ద శబ్దం వచ్చేటట్లు గుటకలు వేసి తాగుతూ అన్నాడు “మేనమామ..

పెళ్లి కూతురు ముందర తనను సన్నాసి అని పిలిచినందుకు పీకల్దాకా కోపమొచ్చినా మేనమామను ఏమనలేక సుందరి వైపు చూశాడు సుబ్బారావు ..సన్నగా నాజూగ్గా పూతరేకులా ఉన్నదనుకోని ఆమెతో ..

“.మీకు రుచిగా వంట చేయడం వచ్చా అన్నాడు.”

. పెళ్ళికొడుకు ఏది అడిగినా అవునని తలాడించు అని అంతకు ముందు చెవినిల్లు కట్టుకుని పోరిన తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ వచ్చన్నట్లు తలూపింది సుందరి.

అది చూసి సుబ్బారావు మొహం చాటంతైంది.ఇంకేం మాట్లాడేది లేదన్నట్లు సైగ చేశాడు మేనమామకు .

 ” ఏం లేదమ్మా సిటీలో కదా ఉద్యోగం. అక్కడ వీడు ఒక్కడే ఉండి వండుకు తిని అఘోరిస్తున్నాడు వెధవ. ఇదిగో వీడి అమ్మా నాన్నలు పల్లెటూరిని వదిలి రాలేరు . పొలం పుట్రా చూసుకుంటూ ఇక్కడే ఉంటారు.ఒక వేళ ఎప్పుడన్నా వచ్చినా సిటీ లో ఉండలేక ఒకటి రెండు రోజుల్లో పల్లెటూరుకు పారిపోతారు.అందుకే పెళ్ళి చేస్తే పెళ్ళాం కమ్మగా వండి పెడుతుందని ఇక పెళ్లి చేస్తున్నారు.మళ్ళీ పెళ్ళున నవ్వుతూ అన్నాడాయన .అది విని హతాశురాలయ్యింది సుందరి ఏదో అనబోయే లోపే అక్కడే ఉన్న సుందరి తల్లి..వెంటనే ..మా సుందరికి వంట చేయడం బాగా వచ్చు బాబు…కొత్త వంటలైనా తెలుసుకుని ఇట్టే వండేస్తుంది అన్నది ధీమాగా.నామమాత్రంగా వంట చేయడమే రాని కూతురికేసి చిలిపిగా చూస్తూ….గుడ్లు మిటకరించి చూస్తుండిపోయింది సుందరి.

పెళ్ళికొడుకుకు పెళ్ళి కూతురు , పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు నచ్చడం, కట్న కానుకలు పెట్టిపోతలు నచ్చడంతో తొందరలోనే మంచి ముహూర్తం కుదరటంతో సుందరి సుబ్బారావు ల పెళ్ళి వైభవంగా జరిగింది.అన్ని కార్యక్రమాలు అయ్యాక ఓ మంచి రోజు చూసుకుని సుందరిని కాపరానికి పంపారు..చీర సారెలతో దిగిన సుందరి ని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు సుబ్బారావు .ఆమెను ఎలా ఉన్నావనైనా అడక్కుండా ఇరుగు పొరుక్కి పంచటానికి సుందరి తల్లిదండ్రులు తెచ్చిన చలిమిడి,పంచదార చిలకలున్న డబ్బాల మూతతీసి ఓచేత్తో చలిమిడి తింటూ మరో చేత్తో చిలుకను కసుక్కున కొరుకి తినటం మొదలు పట్టి….చలిమిడి చాలా బాగుంది సుందరి అన్నాడు లొట్టలేస్తూ …అప్పుడు అర్థమైంది సుందరికి సుబ్బారావుకు తిండి యావ చాలా ఎక్కువని…వంట అంతంత మాత్రమే చేయటం తెలుసని సుందరికి పాపం సుబ్బారావుకి తెలియదు.ఆరోజే సుందరికి జాగ్రత్తలు చెప్పి ఆమె తల్లిదండ్రులు , వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు.

మర్నాడు ఆదివారం కావడంతో ఇద్దరూ కొంచెం లేటుగా లేచారు ..సుందరి పాలు కాచి తను తెచ్చుకున్న బ్రూకాఫి పొడి కలపి సుబ్బారావుకు అందించింది..అదేంటి ఫిల్టర్ తీసి డికాషన్తో కాఫీ పెట్టలేదా .రేపటి నుండి అలా పెట్టు ..సర్లే ఇదైనా బానే ఉంది అంటూ పెద్ద గ్లాసుడు కాఫీ తాగేశాడు….కాసేపటికి

సుందూ …ప్రేమగా పిలిచాడు వంకర్లు పోతూ

ఏంటండీ …సిగ్గుగా అడిగింది సుందరి

“మరే నువ్వు నాకు రోజూ ఇష్టంగా నేనడిగింది వండి పెట్టాలే. హోటలు తిండి తినీ తినీ నాలుక మొద్దుబారిపోయింది..ఇహనేం నువ్వు వచ్చావుగా రోజూ లొట్టలేసుకుంటూ తినొచ్చు …..అన్నాడు సుబ్బారావు

ఆ ..ఆ…మరే నేను .నాకు నసిగింది ..సుందరి ఇంతలో సుబ్బారావే

నాకు వంకాయ కూర కాయఫళంలా ఉల్లి కారం పెట్టి చేస్తే చాలా ఇష్టం..ఒక్క కాయతో అన్నవంతా తినేస్తా ..ట్చ్….తన్మయత్వంతో వంకాయ కూర తింటున్నట్టే అన్నాడు

…మా అమ్మే సరిగా చేయదని మానాన్న తిడుతుంటాడు నా పిండాకూడు నాకస్సలు రాదే…వామ్మో..వేవిళ్ళ వాళ్ళకు ఉన్నన్ని కోరికలు ఈయనకు ..హూ ఫ్రై ఒకటి తెలుసు ..వంకాయలని ముక్కలుగా తరిగి నీళ్ళలో పారేసి నూనెలో వేయించి ఉప్పుకారం జల్లాలని అమ్మ చెప్పిందని మనసులో అనుకుంటూ …ఎలాగైనా వంటలన్ని ఓ వారంలో ఫోను చేసి అమ్మనడిగి నేర్చుకోవాల్సిందే .అక్కడకీ అమ్మ నేర్చుకోవే వంట అంటే తను విందా ..ససేమిరా చేయను పొమ్మంది. పెళ్ళైనాక ప్పుడు నేర్చుకుంటాలే అన్న . సుందరి.

హి హి హి…అలాగే నండి చేస్తాను …ఇంకా అంది …తరువాత ఎందకన్నానా అని మనసులో కుయ్యొమొర్రోమని అనుకుంది సుందరి

సుందరి అలా అనగానే ..ఇంకానా అంటూ ఉత్సాహంగా మొదలెట్టాడు సుబ్బారావు.

హూఊఊ….కంది పచ్చడి.. కంది పచ్చడంటే పడిచస్తాను తెలుసా…వేడి వేడి అన్నంలో కలుపుకుని ఇంత నెయ్యేసుకు తింటే….అబ్బా ..ట్చ్ ట్చ్..స్వర్గం బెత్తెడు దూరంలో కనబడుతుంది…

ఇంక బీరకాయ తొక్కు పచ్చడి …ఏం రుచిలే ..అందరూ తొక్కు తీసి పారేస్తారు ఆ తొక్కుతో పచ్చడి చేసుకుతింటే …ఆహా..

ఇక మజ్జిగ పులుసు ..సొరకాయ ముక్కలేసి మజ్జిగ పులుసు పెడితే అందులో ఊరమిరపకాయలు నంజుకుంటుంటే …సుబ్బారావు కళ్ళు మెరుస్తున్నాయి…

అలా అనర్గళంగా నవకాయ పిండి వంటల గురించి మొహం వాచినట్టు నాలిక పీకేసినట్టు మాట్లాడుతుంటే …

వింటున్న సుందరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది..

అన్నట్లు టిఫెన్ ఏం చేస్తున్నావు ..నిన్ననేగా వచ్చావు..ఈ రోజు పప్పు నానబోసి రుబ్బి పెట్టుకో ఇడ్లీలకి ..ఈ పూట చక్కగా జీడి పప్పు ఉప్మా చేయి
అన్నాడతడు. సుందరి వంటింటిలోకి వెళ్ళిపోయింది
***
సుందరీ…సుందరీ…సుందూ …స్రూ….టిఫెన్ రడీ అయ్యిందా …అంటూ పిలిచాడు సుబ్బారావు .ప్రేమగా …మహా ఆత్రంగా .

“వస్తున్నానండీ ..అంటూ ఉప్మా చేసిన బాండీని టేబిల్ మీద పెట్టింది సుందరి . చేశాను కానీ పల్చగ వచ్చిందండీ ….
సరిగా రాలేదండీ ..ఈ పూటకు హోటలు నుండి టిఫెన్ తెప్పించరూ గోముగా అన్నది సుందరి.

పల్చనైతే అయ్యింది ..బానే ఉంటుంది .అంటూ బాండీ లోకి చూసి ఖంగుతిన్నాడు సుబ్బారావు

. ఆ ఉప్మాని చూస్తుంటే ఉప్మాలా లేదు ఒకరకమైన నీళ్ళ జావలా ఉంది. దానిలో నల్లగా మాడిన తిరమోత అక్కడక్కడా కనిపిస్తుంటే పచ్చి కరివేపాకును తిరగమోతలో కాక గార్నిష్ కోసం వేసిందేమో అవి తేలుతున్నాయి..వెరసి ఆ ఉప్మా చూస్తుంటే వికారం కలుగుతూ ఉన్నఫళాన మురుక్కాలువలో పారబోయాలనిపిస్తుంది ఎవరికైన…!!

నా పిండాకూడు ..ఇంత పల్చగా చేశావేంటే..వంట చేయడం వచ్చునన్నావు అబద్ధం చెప్పావా…ఇది పేట్లో పోసుకుంటే కుక్కలా నాక్కుంటూ తినాలి అంటూ ..గయ్మన్నాడు సుబ్బారావు..

మరేం చేయనండి పల్చనైందని చెప్పాగా ..అందుకే అని నసుగుతున్న సుందరితో…

ఏమైన..నువ్వు తొలిసారి చేసావుగా …అని గట్టిగా నిట్టూర్చాడతడు ..ఓ రెండు గ్లాసులు పట్రా పో..ఆ పంచదార డబ్బా కూడా పట్రా..అంటూ గదిమాడు తిండియావ ఉన్న సుబ్బారావు అది వేస్టు చేయడమెందుకు తాగేద్దామన్న తలంపుతో.

బాండీవైపు చూశాడు…సుందరి చే తయారు చేయబడిన ఆ ఉప్మా నీళ్ళ నీళ్ళగా పల్చగా కలిసిన రవ్వతో రవ్వఉండలతోమాడినపోపుగింజలతోఉండి చూస్తే ..ఆ ఉప్మా తాగడానికి కించుత్తు భయం కలిగింది సుబ్బారావుకి.అయినా ముద్దుల పెళ్ళాం మొదటి చేసింది అని ఒక పక్క ఏదీ తినకుండ వదలని అతని తిండియావ తో…..

గ్లాసులో బాండీలోని ఉప్మాని గరిటెతో ఆబాగా గబగబా పోసుకుని కాస్త పంచదార వేసి చెంచాతో గిర్రున తిప్పాడు సుబ్బారావు.ఆ విసురుడికి నీళ్ళగా ఉన్న ఉప్మా గ్లాసు కాస్తా కింద పడింది గ్లాసు కింద పడగానే సదరు పల్చని ఉప్మా ఉరకలేస్తూ ప్రవహించే నది లా నేలంతా పాకింది.. అరెఅరే అనుకుని మళ్ళీ బాండీ లోది గ్లాసులో పోసుకున్నాడు. రెండు చెంచాల పంచదారను వేసుకుని తిప్పుకుని ఊదుకుంటూ ఊదుకుంటూ ఉప్మాను తాగేశాడు.అలా ఆ బాండీలోని ఉప్మా నంతా ఊదుకుంటూ తాగేస్తుంటే .కర్రగా బిగుసుకు పోయి చూస్తుండిపోయింది సుందరి. .

జావుప్మాను మొత్తం జుర్రేశాక బ్రేవ్ మని తేన్చాడు సుబ్బారావు..పేపరు తీసుకుని చదవడం మొదలు పెట్టాడు .. ఒక అరగంట తరువాత కడుపులో గుడగడలాడుతూ తిప్పటం మొదలు పెట్టింది … మరో పదినిమిషాల్లో బాత్రూమ్కుకు పరిగెత్తి భళ్ళున వాంతి చేసుకున్నాడు …మరలా మరో వాంతి ..తరువాత రెండు లూజు మోషన్స్ అయి నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు..తలతిప్పి చూస్తే టేబుల్ పై ఉప్మా బాండీ కనిపించేసరికి మళ్ళీ వికారం పుట్టి ఇహ బ్రాత్రూమ్కి వెళ్ళే శక్తి లేక అక్కడి కక్కడే డోక్కున్నాడు పాపం సుబ్బారావు..

సుబ్బారావు ఇలా డోక్కోవడం బ్రాత్రూమ్ చుట్టూ తిరగడం చూసి ఖంగారు పడిపోయింది సుందరి..ఏం చేయాలో పాలుపోక మిడిగుడ్లేసుకుని చూస్తోంది…
అలా సుందరి చేసిన జావుప్మా ఓ గంటలో పదిహేను సార్లు సుబ్బారావుని బాత్రూమ్కి పరిగెత్తిచ్చింది..కాస్త విరోచనాలు తగ్గాక మొహం వేలాడేసి కాళ్ళు చేతులు పీక్కుపోతుంటే

సుం…దూ ….సూ …హీన స్వరంతో సుందరిని పిలిచాడు సుబ్బారావు..

“ఏవండి… వద్దంటే తిన్నారు చూడండి …కాస్త పెరుగులో మెంతులు వేసివ్వనా …కొంచెం జీలకర్ర నములుతారా…ఖంగ ఖంగారుగా అంటోంది సుందరి .

“వద్దూ..చాలా నీర్సంగా ఉంది…కొంచెం చలిమిడి పెట్టు …”…

“హమ్మో…ఇన్ని సార్లు మోషన్స్ కి వెళ్ళారు . హవ్వ హవ్వ….అయినా చలిమిడి తింటారా ఎవరైనా….అంటూ బుగ్గలు ఠపీ ఠపీ మని నొక్కుకుంది సుందరి

ఏ ..య్ …సూ ..ఇంకేం లేవుగా తినటానికి . పోనీ కాసిని మురుకులు ఓ పంచదార చిలక ఇవ్వు …

ఇదేంటండీ బాబు …అన్ని వాంతులై, మోషన్స్ అయినాయిగా..అవెందుకు ఇప్పుడు తినటం …పోనీ కాస్త మజ్జిగ తేనా…అంది సుందరి అయోమయంలో

మాట వింటేగా..తానే వెళ్లి మురుకుల డబ్బా పంచదార చిలకలున్న డబ్బా ముందు పెట్టుక్కూర్చున్నాడు. ఓ చేత్తో చిలకని కొరుక్కుంటూ మరో చేత్తో మురుకులను పరాపరా కొరుకుతూ ..సుందరి వద్దు వద్దని నెత్తీ నోరూ బాదుకుంటున్నా ..ఓ పదినిమిషాల్లో రెండు డబ్బాలు ఖాళీ చేసి ఓ చెంబుడు మంచినీళ్ళు తాగి బ్రేవ్ మని త్రేన్చాడు సుబ్బారావు

ఓ గంట గడిచింది మళ్ళీ కడుపులో గుడగుడ వికారం మొదలైంది సుబ్బారావుకి.ఈసారి భళ్ళున వాంతులతో మోషన్స్ తీవ్రతకు దాదాపు స్పృహ తప్పిపడిపోయే స్థితిలోలబోదిబోమంటూ పక్కింటి వాళ్ళ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్ళింది సుందరి. అక్కడ జరిగింది తెలుసుకుని డాక్టర్ ఎడ్మిట్ చేసుకుని రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి..డిశ్చార్జ్ చేస్తూ మెత్తగా చీవాట్లు పెడుతూ

” చూడండి మిస్టర్ సుబ్రావ్… .మీ మిసెస్ జరిగిందంతా చెప్పారు.

.మీరెపుడు హెల్దీ ఫుడ్ అదీ మితంగా తినాలి అది అందరకీ వర్తిస్తుందనుకోండి.. ..వేస్టైపోతుందనో ఏదో లాగించేయాలనో .అన్ హెల్దీ ఫుడ్ తింటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

వంట రాదని మీ శ్రీమతి మీద నిందలేయకండి ..వంటలో గొప్పగా చేయి తిరిగిన వారైనా ఒక్కో సారి సరిగా చేయలేరు .అలా సరిగా రాని పదార్థాన్ని తిని ప్రాణాలమీదకు తెచ్చుకుంటారా ఎవరైనా…పైగా వాంతులు విరోచనాలయ్యేటప్పుడు ఆయిల్ ఫుడ్ తింటారా….

.ఆవిడకి వంట చేయటం కొత్త కాబట్టి ఒకటి రెండు సార్లు సరిగా చేయలేక పోయినా తరువాత చక్కగా చేస్తారు. ఆడవాళ్లు పట్టు బడితే వంట నేర్చుకోవడం ఎంతసేపు… ..ఈ మందులు మరో రెండు రోజులు వాడండి.మరో నాలుగు రోజుల వరకూ సాత్వికాహారాన్ని తీసుకోండి..మజ్జిగ రసం ,తీసుకుంటే మంచిది. ఇతర ఫుడ్ ఎవాయిడ్ చేయండి ..అన్నాడు డాక్టర్

బుద్ధిగా తలూపాడు సుబ్బారావు..డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాడు సుబ్బారావు ..సుందరి అతణ్ని రెస్ట్ తీసుకోమని ఇంట్లో పని చూసుకుని మజ్జిగ తెస్తానని వంటింట్లోకి వెళ్ళింది.

రెండు రోజుల నుండి మజ్జిగ , మజ్జిగ రసమే తాగుతున్న సుబ్బారావుకి టేబుల్ మీద డబ్బాలో చలిమిడి ఉందన్న విషయం జ్ఞప్తికి వచ్చింది.వెంటనే అంత నీరసంలోనూ ఒక్క ఉదుకుటున లేచాడు డబ్బా మూత తీసి చూశాడు డబ్బాలో మూడొంతుల చలిమిడి ఉంది..మరేం ఆలోచించలేదతడు….

వంటింటి లోంచి మజ్జిగ తెస్తున్న సుందరి, ‌‌సుబ్బారావు డబ్బాలోని చలిమిడిని ఉండలు ఉండలుగా తీసుకుని గుటుక్కున మింగడం చూసి కెవ్వు కెవ్వుమని అరస్తూ పడిపోయింది ..!!🙏
****

హాస్య కధా రచన

హంసగీతి
27.3.19

హామీ పత్రం

నేను వ్రాసిన “తిండియావ ” అనే కధ నా స్వంత రచన. ఇది ఇంత వరకు ఏ పత్రకలలో గాని వెబ్ సైట్లలో గాని ప్రచురింపబడలేదు .

హంసగీతి
హైదరాబాద్
pH no 9866955756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked