–రచన: ఆచార్య రాణి సదాశివ మూర్తి
సంస్కృతమ్ము నుండి సంస్కారములనొందె
తమిళ కన్నడాలతళుకులొందె
మలయసింహళములమక్కువన్ మన్నించె
మధ్యదేశభాష మదిని నిల్పె.
ఒరియ నుడిని గూడి ఒరవడి గుడికట్టె
తెల్ల వాని భాష తెగువ జూచె.
పారసీకపుర్దు భాషల యాసల
తనవి చేసుకొనియె తనివి దీర.
తెలుగు పాత్రలోన తేనెలూరగ నిండి
భాషలన్నికలిసి బాస జేసె
మధురసమ్ములేము మధుపాత్ర తెలుగేను
దేశభాషలందు తెలుగు లెస్స
భాష తెలుగు జూడ భావమ్ము తెలుగేను
బలము మేమె వెనుక ఫలము తెలుగు.
పలికె నిట్లు తాము పలుకుబడుల పెంచె
తెలుగు జగతిలోన తేజరిల్ల.
రాజసభలలోన రాణించె రసరమ్య
కవులకావ్యవాటి కన్య తాను.
పద్యగద్యకృతుల పరిపాటి తానాయె
తెలుగు నింగి తనకు తెన్ను యనుచు.
-:-