శీర్షికలు

*దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర*

—పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

[ 🔯తరింపచేసేది తీర్థం… ఆ “తరించామనే భావం” ఒక అందమైన ప్రదేశం చూసిన అనుభవంతో రావచ్చు. ఒక శక్తివంతమైన చోట కాలు మోపడం వల్ల కావచ్చు… ఈ రెంటినీ కలుపుకొన్నప్పటికీ, ఇదీ అని స్పష్టంగా విప్పి చెప్పలేని, ‘ఆధ్యాత్మిక’ అనుభవం వల్ల కావచ్చు.. బయటకు అలా విప్పి చెప్పలేక ఆత్మ పరిధిని ‘అధి’ గమించే అనుభవాన్నే ఆధ్యాత్మికత అంటాం.. భారతీయ సంస్కృతి లోని ప్రత్యేకతే అది!
మన సంస్కృతిలో ప్రతి చోటా ఒక చరిత్ర ఉంది. మనసుపెట్టి చూస్తే, ఒక ఆత్మను స్పృశించి, పైకి నడిపించే ఒక ఆధ్యాత్మికత ఉంది. అందుకే భారత దేశంలో ఏ యాత్ర చేసినా, అది కేవలం తీర్థ యాత్ర కాదు; అదో సంస్కృతి యాత్ర! అదో ఆధ్యాత్మిక అనుభవ యాత్ర!
అలాటి ఓ యాత్ర సతీసమేతంగా చేసి వచ్చిన కాలిఫోర్నియా ఫ్రెమాంట్ వాస్తవ్యులు పిల్లలమర్రి కృష్ణకుమార్ గారి అనుభవాన్ని వారి మాటల్లో రోజూ చూద్దాం…. ― సంపాదకుడు👏]

2019 మే మాసంలో నేను, నా భార్య శాంత దక్షిణ భారత దేశంలో తీర్థ యాత్రలు చేసి వచ్చాము. వెళ్ళిన చోటల్లా అక్కడి స్థల పురాణం, దానికి సంబంధించిన కథలు తెలుసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. వీటిలో కొన్ని కొందరికి తెలిసి ఉండవచ్చు. నేను తెలుసుకున్న కథల్లో కొన్ని తప్పులు కూడా ఉండవచ్చు. అయినా తెలిసినవి అందరితో పంచుకోవాలనే ఉత్సాహంతో ఈ కింది స్థల పురాణాలని రాస్తున్నాను. కొన్నిట్లో మొత్తం స్థల పురాణం కాక, కొంత విశేషంగా అనిపించిన కథలనే ఎంచుకున్నాను.

మొదట ఆంధ్ర దేశంలోని సింహాచలం వెళ్ళాము. ఈ క్షేత్రం గొప్ప వైష్ణవ క్షేత్రం కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. నేను కూడా చిన్నప్పటినుంచి వెళుతూనే ఉన్నాను. ఈ సారి ఆ ఆలయ నిర్మాణ సౌందర్యం, రాతి చెక్కడాలు, కుడ్య నిర్మాణం వంటి వాటిమీద దృష్టి సారించాను. ఇక్కడ శ్రీ లక్ష్మీ వరాహనృసింహస్వామి వారు ఉగ్రావతారంగా వెలిసి ఉన్నారు. అక్కడి ప్రధానాచార్యులు శ్రీ గుడవర్తి శ్రీనివాసాచార్యులవారిని ఈ ‘వరాహ – నరసింహ ‘ రూపం ఎందుకు వచ్చిందని ఆడిగాను. క్లుప్తంగా చెప్పాలంటే ఆ కథ ఇది:

కృత యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు అనే రాక్షసులు జన్మించారు. (వీరే వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు. శాపవశాత్తు రాక్షస జన్మలెత్తి, విష్ణు ద్వేషులైనారు). హిరణ్యాక్షుడిని వరాహావతారంలో విష్ణుమూర్తి సంహరించిన విషయం అందరికీ తెలిసి ఉన్నదే. ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడి కొడుకు, తండ్రికి విరోధంగా విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు విసుగు చెంది ప్రహ్లాదుడ్ని చంపించాలని రక రకాలైన ప్రయత్నాలు చేస్తాడు. వాటిలో భాగంగా ఈ సింహాచలం కొండమీదనుంచి ప్రహ్లాదుడిని కిందకు విసిరేయిస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి అమిత భక్తితో తననే నమ్ముకుని, అన్నిటా తననే చూస్తున్న ప్రహ్లాదుణ్ణి పట్టుకుని కాపాడతాడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్తుతించి, “నువ్వు మా బాబాయిని చంపిన రూపం, మా నాన్నని చంపే రూపం కలిసి చూడాలని ఉన్నది. దయచేసి చూపమని కోరాడు. విష్ణు మూర్తి అనుగ్రహించి, వరాహ మూర్తి రూపం ధరించి చూపాడు. ప్రహ్లాదుడు ‘నువ్వు ఈ రూపంతో ఇక్కడే వెలిసి ప్రజలని కాపాడుతూ ఉండవలసింది ‘ గా కోరతాడు. ఆ కోరిక మేరకు విష్ణుమూర్తి వెలుస్తాడు సింహాచలంలో.

ఈ గుడి 1400 ఏళ్ల పురాతనమైనది అన్నారు.

ఈ వరాహ నరసింహమూర్తి ఉగ్రావతారం కనక గొప్ప వేడి ఉంటుందనీ, అందువల్ల ‘ఆషాడ, కార్తిక, మాఘ, వైశాఖ ‘ మాసారంభాల్లో ఈ విగ్రహానికి ఒక్కొక్కసారి 120 కిలోగ్రాముల చందనం లేపనం చేస్తారు. అంటే సంవత్సరానికి 480 కిలోల చందనం లేపనం చేస్తారు. అది లేకపోతే స్వామి వారి దగ్గిరకి కూడా వెళ్ళలేమని చెప్పారు.

ఒక విశేష మేమంటే ఇక్కడ చాలా రాతి స్థంబాలపైన నరసింహుడు దర్శనమిస్తాడు. ఆ నరసింహుడి వెనక ఆది శేషుడు కనిపిస్తాడు. గుడి వెనకపక్క ఉన్న శిల్పం హిరణ్య కశిపుడిని నరసింహుడు పొట్ట చీల్చి సంహరించిన దృశ్యం కనిపిస్తుంది. ‘చందన ఒలుపు ‘ రూపం ఎలా ఉంటుందో భక్తులకి తెలియాలని (సంవత్సరంలో ఒక్క సారే – వైశాఖ పౌర్ణిమ నాడు మాత్రం నిజ రూప దర్శనం ఉంటుంది) ఒక చిత్తరువు ఉంచారు. ఇక్కడ రోజూ చాలా విశేషమైన ఆరాధన సేవ జరుగుతుంది. మంగళ హారతి కార్యక్రమం దాదాపు గంటన్నర సేపు ఉంటుంది. ఆ తరువాత భక్తులని గర్భ గుడిలోకి ప్రవేశపెడతారు. అద్భుతమైన దర్శనం ఉంటుంది. ప్రత్యేక ప్రసాదాలు పంచి పెడతారు. ఇక్కడ చాలామంది వేద పండితులున్నారు. దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉంటారు. వారు సాయంత్రం వేద పఠనం చేస్తూండగా స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని గుడి చుట్టూ ఊరేగిస్తారు. పక్కనే అతి సుందరమైన అమ్మవారి గుడి ఉన్నది. ఆయన గరుడ వాహనం, మిగతా వాహనాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం పెద్దదిగా ఉంటుంది. 7 అంతస్తులతో 11 కలశాలతో, నాసిముఖాలతో ఉంటుంది. కానీ మిగతా దిక్కుల వైపు గోపురాలు కనపడవు. *వైష్ణవ సంప్రదాయంలో ఇలా గోపురాలు అన్ని దిక్కులా కట్టే నియమం లేదనిపిస్తుంది. శైవ సంప్రదాయంలో తప్పక అన్ని దిక్కులా గోపురాలు కడతారు.* ఈ ఆరాధన సేవ భాగంగా స్వామి వారికి ‘సిం హాచల సంపంగి మాల ‘ వేస్తారు. ఇవి ప్రత్యేకమైన బంగారు రంగు ఉండే పూలు. అత్యంత సువాసన కలిగి ఉంటాయి. మా దర్శనమైన తరువాత మా భాగ్యం కొద్దీ ఆ మాల మాకు ఇచ్చారు. పెద్ద మాల! శాంత తన తృప్తి కొద్దీ అక్కడి ఆడవాళ్ళందరికీ ఆ పూలు పంచి పెట్టింది. వాటిని చాలా భక్తిగా స్వీకరించారు వారందరూ. ఈ పూలు స్వామి వారి ఉద్యానవనంలోనే పూచినవట.

ఇంకా చాలా ప్రదేశాలకి వెళ్ళాము. ఇలాగే ఒక్కొక్క క్షేత్రం గురించి విడివిడిగా రాస్తాను.

*సశేషం*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked