కవితా స్రవంతి

నాన్న మొగ్గలు

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017

బహిర్గతంగా కనిపించకుండా దీవెనలు అందిస్తూ
అంతర్గతంగా అందరి క్షేమాన్ని కోరుకుంటాడు
అందరి బాగు కోరినా నాన్న ఎప్పటికీ ఒంటరిపక్షే

నాన్న మాటల్లోని గొప్పతనం అర్థమయ్యేనాటికి
అంతరార్థాన్ని విడమరిచి చెప్పే నాన్న ఉండడు
సంస్కారానికి చక్కనైన నిదర్శనం మా నాన్న

అమ్మ నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే
నాన్న ప్రపంచాన్నే నాకు పరిచయం చేసిండు
అమ్మానాన్నలు నాకు లోకం చూపించిన దేవుళ్ళు

పాతబడిన అంగీలను తాను వేసుకుంటూనే
పండుగలకు పిల్లలకు కొత్తబట్టలు ఇప్పిస్తాడు
పిల్లల సంబరమే నాన్నకు అసలైన సంబరం

ఇంటి బాధ్యతలను ఒంటిస్తంభంలా మోస్తూనే
కుటుంబానికి రక్షణకవచమై గొడుగుపడతుంటడు
ఇంటిల్లిపాదికి తోడూనీడలా నిలిచేవాడు నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked