కథా భారతి

నిధి రహస్యం

G.S.S.కళ్యాణి

రాజయ్య, కోటయ్య గోపాలపురంలో వర్తకులు. వారిరువురి వ్యాపారాలూ పోటాపోటీగా నడుస్తూ ఉండేవి. నలుగురికీ మంచి చేస్తే మనకు ఆ భగవంతుడు మంచి చేస్తాడన్నది రాజయ్య నమ్మకమైతే, ఈ కలియుగంలో అందరితో మంచిగా ఉంటూపోతే వ్యాపారం సమర్థవంతంగా చెయ్యలేమనేది కోటయ్య నమ్మకం.
రాజయ్య మంచితనం తెలిసినవారంతా ఎట్టిపరిస్థితులలోనూ రాజయ్య తమను మోసం చెయ్యడన్న ధీమాతో ఉంటూ, తమ వ్యాపార అవసరాల కోసం రాజయ్య వద్దకు మాత్రమే వెళ్లేవారు. రాజయ్యకు తరతరాలుగా సంక్రమించిన ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అందువల్ల రాజయ్య తన వ్యాపారానికి సంబంధించి ఏ సాహసోపేత నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు వెనుకాడేవాడు కాదు. ఆ కారణంగా అప్పుడప్పుడూ కోటయ్య కన్నా రాజయ్యకు వ్యాపారంలో ఎక్కువ లాభం వస్తూ ఉండేది.
కోటయ్య పూర్వీకులు ఆస్తులేవీ పెద్దగా కూడబెట్టలేదు! అందుకని తన వ్యాపారానికి నష్టం కలిగించే అవకాశమున్న వ్యవహారాలకు దూరంగా ఉంటూ, డబ్బుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తపడుతూ ఉండేవాడు కోటయ్య. అంతేకాదు! అధిక లాభాల మోజులోపడి కోటయ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న మోసాలకు కూడా పాల్పడుతూ ఉండేవాడు!
ఇలా ఉండగా ఒక ఏడాది రాజయ్య మరొక పెద్ద వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల అతడికి వ్యాపారంలో లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చూస్తూండగా కోట్లకు అధికారి అయిపోయాడు రాజయ్య! వ్యాపారంలో రాజయ్య ప్రగతిని చూసి సహించలేకపోయాడు కోటయ్య.
ఒకరోజు రాత్రి కోటయ్య తన భార్య కాంతిమతితో, “ఆ రాజయ్య సంపాదించినంత డబ్బు నేను ఈ జన్మలో సంపాదించగలనంటావా కాంతీ? అది నావల్ల కాదేమో!”, అని అన్నాడు ఒకింత నిరాశతో.
భర్త బాధను అర్ధం చేసుకున్న కాంతిమతి, “నిరాశ పడకండీ! ఆ రాజయ్యకు పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులున్నాయి! మీకున్నదంతా మీ కష్టార్జితమేగా! మీక్కూడా వెనకదన్నుగా ఆస్తి ఉండుంటే మీరు ఆ రాజయ్యను వ్యాపారంలో ఎప్పుడో మించిపోయి ఉండేవారు!”, అంది.
“అంత ఆస్తి నాకెవడిస్తాడే?!”, అన్నాడు కోటయ్య.
“ఏ నిధిలాంటిదో దొరకడం ఒక్కటే మార్గం! అది ఎలాగో సాధ్యపడదు కాబట్టి అక్కర్లేని ఆలోచనలు మానేసి ఇక హాయిగా పడుకోండి! నాకు నిద్ర ముంచుకొస్తోంది!!”, అంది కాంతిమతి దుప్పటి కప్పుకుంటూ.
తన భార్య చెప్పినట్లుగా ఎక్కడో ఒక గుప్త నిధి ఉండి, ఆ నిధి రహస్యం తనకు తెలిస్తే ఎంత బాగుండో అని అనుకుంటూ పడుకున్నాడు కోటయ్య.
కొద్దివారాల తర్వాత గోపాలపురం గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. అతడు మహాతపస్వి అనీ, త్రికాల జ్ఞానసంపన్నుడనీ తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు ఆయన దర్శనానికి తండోపతండాలుగా వెళ్లడం మొదలుపెట్టారు. సాధువు వచ్చాడన్న వార్త కోటయ్య దాకా వచ్చింది. రాజయ్య ఆ సాధువుకు కానుకలు సమర్పించేందుకు వెడుతున్నాడని కూడా కోటయ్యకు తెలిసింది. రాజయ్య కన్నా ఆ సాధువు దర్శనం తనే ముందుగా చేసుకోవాలన్న ఉద్దేశంతో కోటయ్య సాధువు కోసం ధనం, నగలూ, పట్టు వస్త్రాలూ, పళ్ళు, పూలూ తీసుకుని గబగబా ఆ సాధువున్న స్థలానికి వెళ్ళాడు. కానీ అప్పటికే అక్కడ రాజయ్య ఆ సాధువు పాదాలవద్ద కూర్చుని ఉండటం చూసి కోటయ్య కొంత అసూయ చెందాడు. అయినప్పటికీ తను తీసుకెళ్లిన కానుకలు సాధువుకు సమర్పించి వినయంగా నమస్కరించాడు కోటయ్య.
“కానుకలు ఘనంగా ఇస్తున్నావు?! ఏం కావాలి నాయనా? నీ కొరికేమిటీ??”, కోటయ్యను ఆప్యాయంగా అడిగాడు సాధువు.
రాజయ్య వింటూ ఉండగా తన కోరికను బయటపెట్టడం ఇష్టంలేని కోటయ్య, “నా మనసులో ఉన్న కోరికను గ్రహించగల సమర్థులు మీరు! మీరే నాకు దారి చూపాలి!!”, అన్నాడు సాధువుతో.
“నీకు కావలసినది నిధి రహస్యమేగా?”, అడిగాడు సాధువు కోటయ్య వంక చిరునవ్వుతో చూస్తూ.
“అవును స్వామీ!!”, అన్నాడు కోటయ్య సంభ్రమాశ్చర్యాలతో.
“సరే! చెబుతాను విను! ఈ గోపాలపురం పొలిమేరలలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది! అది నీకు తెలుసుగా?”, అడిగాడు సాధువు.
“తెలియకేం స్వామీ! ఎప్పుడో రాజులనాటి ఆలయం అది! ఆ ఆలయంవల్లేగా మా ఊరికి గోపాలపురం అన్న పేరు వచ్చిందీ?! పైగా ఆ గుడిలో గర్భాలయం భక్తుల కోసం ఎల్లవేళలా తెరిచే ఉంటుంది! అదీ దాని ప్రత్యేకత!”, అన్నాడు కోటయ్య.
“మంచిది!! చూడు నాయనా! ఆ ఆలయంలోనే నిధి నిక్షిప్తమై ఉంది! దాన్ని వెతికి పట్టుకో!!”, అని మందహాసంతో చెప్పాడు సాధువు. కోటయ్యకు పరమానందం కలిగింది.
అంతలో కోటయ్య రాజయ్య వంక చూస్తూ, “స్వామీ! మీరు నిధికి సంబంధించిన రహస్యం నాతో మాత్రమే చెప్తే బాగుండేది. ఇక్కడున్నవారందరికీ ఇప్పుడు ఆ రహస్యం తెలిసిపోయింది కదా?! మరిప్పుడు ఎట్లా స్వామీ??”, అని సాధువును కంగారుగా అడిగాడు.
“కంగారు పడకు నాయనా! ఈ రహస్యం అందరికీ తెలిసినప్పటికీ కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే ఆ నిధిని పొందగలరు!”, అన్నాడు సాధువు.
“సంతోషం స్వామీ!”, అంటూ సాధువు వద్ద సెలవు తీసుకుని ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు కోటయ్య.
ఆ మరుసటిరోజునుండీ కోటయ్య తన వ్యాపార వ్యవహారాలను వీలైనంత త్వరగా ముగించుకుని ప్రతిరోజూ వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అయితే తను ఆ ఆలయంలో నిధి కోసం వెతుకుతున్న సంగతి ఇంకెవ్వరికీ తెలియకూడదని, బాగా చీకటి పడ్డాకే అక్కడికి వెళ్ళేవాడు కోటయ్య.
రోజులు గడుస్తున్నాయి. నిధి కోసం ఒక్క అణువుకూడా వదలకుండా గుడి ప్రాంగణమంతా క్షుణ్ణంగా పరిశీలించిన కోటయ్యకు కనీసం ఆ నిధి ఆనవాళ్లు కూడా లభించలేదు!
కొద్దినెలల గడిచాయి. అయినప్పటికీ కోటయ్య పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతి రోజూ గుడికి వెళ్లి నిధి కోసం వెతికి వస్తూనే ఉన్నాడు. ఒకనాడు అలా నిధికోసం వెతికి ఇంటికి వస్తూ ఉంటే కోటయ్యకు గుడి ప్రాంగణంలో ధ్యానంలో నిమగ్నుడై ఉన్న రాజయ్య కనిపించాడు! రాజయ్య కూడా తనలాగే నిధి కోసం వచ్చి ఉంటాడని అనుకుని కోటయ్య రాజయ్యను మనసులో తిట్టుకున్నాడు.
‘ఆ సాధువు ఉత్త మోసకారిలా ఉన్నాడు! లేకపోతే నిధి రహస్యం నాకు మాత్రమే చెప్పకుండా ఇలా అందరికీ తెలిసేలా ఎందుకు చెప్పినట్టు?’, అని సాధువును కూడా తిట్టుకున్న కోటయ్య నిధిపై ఆశ వదులుకుని గుడికి వెళ్ళటం మానుకున్నాడు.
రెండేళ్లు గడిచాయి. ఏ కారణంతోనో రాజయ్య వ్యాపారాన్ని పూర్తిగా వదిలేశాడని తెలిసింది కోటయ్యకు. ఇక వ్యాపారంలో తనకు తిరుగేలేదని తెగ సంతోషపడిపోయాడు కోటయ్య. కొంత కాలం తర్వాత మునుపటి సాధువు మళ్ళీ గోపాలపురం గ్రామానికి వచ్చాడు. నిధి గురించి సాధువును నిలదీద్దామని ఆవేశంతో ఊగిపోతూ సాధువు వద్దకు వెళ్ళాడు కోటయ్య.
కోటయ్యను చూస్తూనే సాధువు, “ఏం నాయనా? నీకు నిధి దొరకలేదా??”, అని అడిగాడు.
“ఏం స్వామీ? వెటకారం చేస్తున్నారా? ఏదో అన్నీ తెలిసిన వారని నమ్మి నిధి రహస్యం చెప్పమని మిమ్మల్ని అడిగాను! మీరు నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు!! మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు!”, అన్నాడు కోటయ్య బాధా, కోపం కలగలిసిన స్వరంలో.
“తప్పు నాయనా! నువ్వు నిజం తెలుసుకోకుండా మాటలతో పరులను నిందించకూడదు!! నేను నిధి గురించి నీకు చెప్పిన విషయంలో ఎటువంటి అబద్ధమూ లేదు!”, అన్నాడు సాధువు.
“మరి ఆ నిధి నాకు దొరకలేదేం??”, కాస్త గట్టిగానే అడిగాడు కోటయ్య.
“ఆ నిధి అర్హత ఉన్నవారికి మాత్రమే దొరుకుతుందని ముందే చెప్పాను కదా నాయనా?! రాజయ్యకు ఆ అర్హత ఉంది! కాబట్టే అతడికి ఆ నిధి దొరికింది!!”, అన్నాడు సాధువు.
“ఇంకేం?? నా అనుమానం నిజమయ్యింది!! మీకు ఆ రాజయ్య అంటే ఇష్టం కాబోలు! నిధి కచ్చితంగా ఎక్కడుందో మీరు ఆ రాజయ్యకు చెప్పేశారన్నమాట!!!”, అన్నాడు కోటయ్య కట్టలుతెంచుకుంటున్న కోపాన్ని అణచుకుంటూ.
“నాయనా! నేను సర్వసంగపరిత్యాగిని!! నాకు అందరూ సమానమే! నిధి గురించి నీకు చెబుతున్నప్పుడే రాజయ్య కూడా విన్నాడు! అతడితో ప్రత్యేకంగా నిధి విషయం నేను ఎప్పుడూ మాట్లాడలేదు! ఇంతకీ ఆ రాజయ్య ఇప్పుడెక్కడున్నాడో నీకు తెలుసా?”, కోటయ్యను అడిగాడు సాధువు.
“రాజయ్య వ్యాపారాన్నీ, ఆస్తినీ వదిలి ఎటో వెళ్ళిపోయాడు! అంత నిధి దొరికిన తర్వాత ఇక వ్యాపారం అనవసరమని అనుకున్నాడో ఏమో! కానీ అతడు వెళ్ళేటప్పుడు తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వెంట తీసుకెళ్లలేదట!!”, అన్నాడు కోటయ్య.
“అంతా అయోమయంగా ఉంది కద నాయనా? వివరిస్తాను విను! నన్ను నువ్వు అడుగుదామని అనుకున్నది ఇహ లోకానికి మాత్రమే ఉపయోగపడే నిధి. కానీ నేను నీకు చూపించింది ఇహ-పరాలను ఇవ్వగలిగే పెన్నిధి! అదే ఆ భగవత్ సన్నిధి!! నువ్వు గుడిలో ప్రతి అంగుళం నిధి కోసమని వెతికావు. కానీ నీ ముందు నువ్వేది కోరినా ఇవ్వగల వేణుగోపాలస్వామి ఉన్నాడని నీవు మరిచావు!! ఆయన కరుణను మించిన నిధి ఉండదు కదా! ఆ అపారమైన నిధిని రాజయ్య గుర్తించాడు! వేణుగోపాలుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిక్షణం సేవించి ఈ భవబంధాలనుండీ విముక్తుడయ్యాడు రాజయ్య! డబ్బు, ధనం వంటివి వాడినకొద్దీ తరిగిపోయే నిధులు! ఆ పరమాత్మ కృప ఎన్నటికీ తరగని అమూల్యమైన నిధి!! అదే నేను చెప్పిన నిధి రహస్యం!”, అన్నాడు సాధువు.
సత్యాన్ని గ్రహించిన కోటయ్యకు తన తప్పేంటో తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి! సాధువు పాదాలపై పడి తన అజ్ఞానాన్ని క్షమించమని కోరుకుని ఇల్లు చేరుకున్నాడు కోటయ్య. ఆపై కోటయ్య తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని వ్యాపారాన్ని కేవలం లాభాపేక్షతోనే కాకుండా నలుగురికీ మేలు చెయ్యాలన్న సత్సంకల్పంతో నడిపిస్తూ, భగవద్సేవకు తన శేషజీవితాన్ని అంకితం చేసి కృతార్థుడయ్యాడు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked