చంద్రశేఖర్ చరిత్ర

నిస్పృహ

జనవరి 12, 1935. సమయం ఉదయం. మంచం మీద నుండి లేచిన చంద్రశేఖర్ కి మరో ప్రపంచం ఎదురయింది. ఒక్క రోజులోఎంత తేడా? నిన్న ఉరకలు వేస్తున్న ఉత్సాహం! నేడు నిస్సత్తువ! నిస్తేజం! నీరసం! నిన్న గాలిలోకట్టుకున్న మేడలన్నీ నేడు నేల పాలయ్యాయి. మరీ ఎక్కువ ఆశించేడేమో? తను భారతీయుడు. నల్లటివాడు. ఇంగ్లీషు వాళ్ళ దృష్టిలో నాసిరకం వాడు. పైగా అనుభవం లేని వాడు. వయస్సులో చిన్నవాడు. వాళ్ళ సరసన నిలబడడానికి తనకి అర్హత లేదేమో! కాకపోతే ఎడింగ్టన్ చేసిన పరాభవానికి కారణం?

ఎడింగ్టన్ నోటి దురుసు మనిషి అన్న విషయం చంద్రకి తెలుసు. సర్ జేమ్స్ జీన్స్ తో దురుసుగా మాట్లాడ్డం తాను స్వయంగా చూసేడు. మిల్ని కి లెక్కలు రావని వెటకారం చెయ్యడం తాను స్వయంగా చూసేడు. కాని గత రోజు అతను చంద్రని పరాభవించిన పద్ధతిలో వెటకారంతో పాటు విషం ఉంది. ఎంతో ఉక్రోషంతో నిండిన ఆ పెద్దమనిషి వాదన సారాంశం ఏమిటంటే, “ప్రకృతిలో సాపేక్ష శిధిలత్వం అనే భావానికి తావు లేదు.” సాపేక్ష శిధిలత్వం అనే భావన చంద్ర ప్రతిపాదిస్తున్న వాదానికి మూల స్తంభం. సాపేక్ష శిధిలత్వం అనే భావనని మినహాయిస్తే మిగిలినది ఫౌలర్ ప్రతిపాదించిన నమూనాయే. ఫౌలర్ ప్రతిపాదించిన పద్ధతిలో సాంద్రమైన ఎలక్ట్రాను వాయువులో ఎలక్ట్రానులు కాంతి వేగం కంటే చాల తక్కువ వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఫౌలర్ ప్రతిపాదించిన పద్ధతిలో శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి అంటూ ఏమీ లేదు. నక్షత్రం గరిమ ఎంత ఎక్కువ ఉన్నా అది ఎల్లప్పుడూ ఒక అవసాన దశని ప్రశాంతంగా చేరుకొని, మరణించి, శిలారూపం చెందుతుంది. ఎడింగ్టన్ వేదికని ఎక్కి, తాను ఐదేళ్లు శ్రమించి చేసిన పని అంతా వ్యర్థం అని అయిదు నిమిషాలలో తేల్చేసి, వెటకారం చేసేడు.

ఆ రోజుల్లో నక్షత్రభౌతిక శాస్త్రవేత్తలు అందరూ (పొరపాటుగా) అనుకున్నది ఏమిటంటే అన్ని నక్షత్రాల జాతకాలూ దరిదాపుగా ఒకేలా ఉంటాయని. అన్నీ ఎంతో దీప్తితో ప్రకాశించే బృహత్తారలుగా జీవితం మొదలు పెట్టి, ఇంధనం ఖర్చు అయిపోతూ ఉంటే క్రమేపి ప్రధాన శ్రేణి తారలుగా కొంత కాలం గడిపి, చివరకి శ్వేత కుబ్జతారలుగా మారి, చల్లారి, శిలారూపం పొందుతాయని అనుకునేవారు. చంద్ర వచ్చి “ఆ భావన సరి కాదు, దానిని సవరించాలి” అన్నాడు.

ఈ సరికొత్త ఆలోచన ధోరణితో ఎడింగ్టన్ ఏకీభావం వ్యక్తపరచకపోతే పోయాడు; డొంక తిరుగుడు తర్కం ఉపయోగించి, దానికి తన పరపతిని జోడించి చంద్రని ఎగతాళి చేసేడు. చంద్ర గణితంలో దోషం లేదని కితాబు ఇస్తూ, ఆ గణితం వెనక ఉన్న భౌతిక శాస్త్రంలో పరస్పర విరుద్ధమైన అంశాలు ఉండడం వల్ల సాధించవలసిన సమస్యని సాధించకుండా బుర్రకి తోచిన ఏవో సమీకరణాలని రాసి, వాటిని పరిష్కరించేడని అభియోగం మోపేడు. “గుళిక వాదాన్ని, సాపేక్ష వాదం తో జోడిస్తే గుర్రానికి, గాడిదకి పుట్టిన కంచర గాడిదలా తయారయింది, చంద్ర చూపిన పరిష్కారం” అన్నాడు. అనగా, చంద్రకి లెక్కలు వచ్చేమో కానీ భౌతిక శాస్త్రం అర్థం కాలేదు అని తాత్పర్యం. ఎడింగ్టన్ ఏ లోకంలో ఉన్నాడో ఏమో? గుళిక వాదానికి సాపేక్ష వాదం జోడించినందుకు కేంబ్రిడ్జిలోనే పని చేస్తున్న, ఎడింగ్టన్ సహోద్యోగి అయిన, డిరాక్ కి 1933 లో నోబెల్ బహుమానం ఇచ్చేరన్న సంగతి మరచిపోయాడా? లేక, నిద్ర పోతున్నాడా? ఇంతటితో ఆగేడా? లేదు. ఆధునిక గుళిక వాదానికి మూల స్తంభం అయిన పౌలి సూత్రం “విశ్వవ్యాప్తంగా పనిచేయదు” అని అన్నాడు. “నీరు పల్లమెరుగు” అన్న నానుడి తెలుగు దేశంలో తప్ప ఇంకెక్కడా నిజం కాదన్నట్లు ఉంది ఈ వితండ వాదం!

ఏళ్ల తరువాత ఈ సంఘటనని జ్ఞాపకం తెచ్చుకుని చంద్ర ఇలా అంటారు: “ఎడింగ్టన్ కి ఈ సమస్యపై లోతైన అవగాహన ఉంది. మధ్యేమార్గంలో తర్కం తప్పినా, చిట్టచివరికి పర్యవసానం ఎలా ఉంటుందో ఉహించగలిగే మేథాశక్తి ఉంది. ఒక నక్షత్రం గరిమకి ఒక అవధి ఉందని ఆయన ఒప్పుకుని ఉంటే, ఆ నక్షత్రం కృష్ణ బిలంగా మారాలి అన్నది భౌతిక శాస్త్ర సూత్రాలకి అనుగుణ్యమైన పర్యవసానం. ఇది అతగాడు ఆనాడు ఒప్పుకుని ఉండుంటే ఖగోళభౌతిక శాస్త్రం ఇలా 50 ఏళ్ళు వెనకబడిపోయి ఉండేది కాదు.”

ఎడింగ్టన్ ఎంతటి తప్పుల తడక తర్కం ఉపయోగించి వాదించినా ఆ రోజుల్లో ఎవ్వరూ తెగించి ఎడింగ్టన్ ని ఎదిరించిన వారు లేకపోయారు. తన వాదం సరి అయినదే అని చంద్ర నరనరాల్లోనూ జీర్ణించిపోయిన నమ్మకం. కానీ ఆయనకి ఆసరాగా నిలబడి దన్ను ఇచ్చిన పెద్ద దిక్కు ఎవ్వరూ లేకపోయారు. తన ఇక్కట్లని తండ్రికి పూసగుచ్చినట్టు ఉత్తరాలు రాసి ఏమి ప్రయోజనం? తను స్నేహితుడనుకున్న మెక్రే, తన పక్కన కూర్చున్న మెక్రే, సమావేశం అయే వేళకి చంద్రకి కనిపించకుండా జారుకున్నాడు. యూరప్ లోఉన్న స్నేహితుడు రోజెన్^ఫెల్డ్ గుర్తుకి వచ్చేడు. జరిగినదంతా అతనికి పూసగుచ్చినట్లు రాసి, “నేను ఉత్పన్నం చేసిన సమీకరణం అంతా తప్పు అని ఎడింగ్టన్ వెటకారం చేసేడు. భౌతిక శాస్త్రంలోని రెండు మౌలికమైన సూత్రాలని – అనగా, గుళిక వాదం లోని పౌలి సూత్రాన్ని, అయిన్^స్టయిన్ సాపేక్ష వాదాన్ని – తప్పుగా ప్రయోగించేనని అభియోగం మోపేడు. ఈ వార్త బోర్ చెవిన పడేటట్లు చూడు.”

ఈ జాబు చూసి రోజెన్^ఫెల్డ్, బోర్ ఇద్దరూ నిర్విణ్ణులయేరు. ఎలక్ట్రానులని నిలకడ తరంగాలు (standing waves) గా భావించినంత సేపే పౌలి సూత్రం వర్తిస్తుందని ఎడింగ్టన్ వాదన. ఎలక్ట్రాను అణు కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు వాటిని నిలకడ తరంగాలుగా భావించవచ్చు. ఎలక్ట్రాను అణుకేంద్రం గుప్పిట నుండి బయట పడి, విశృంఖలంగా తిరుగుతున్నప్పుడు వాటిని పయనించే తరంగాలు (travelling waves) గా ఉహించుకుంటాం. ఈ పరిస్థితులలో పయనించే తరంగాలు మీద సాపేక్ష వాదం ఉపయోగించి, వాటిని సరిసమానమైన నిలకడ తరంగాలుగా మార్చి, అప్పుడు వాటి మీద పౌలి సూత్రం ప్రయోగించవచ్చని చంద్ర అభిప్రాయం. ఆ రకం మార్పిడి (transformation) ద్వారా లభించిన ఫలితం కంచర గాడిద లాంటిది అని అభివర్ణించేడు ఎడింగ్టన్. అందరికి అర్థం ఆయే ఉపమానం చెప్పాలంటే ఎడింగ్టన్ పొడుగుని గజాలు, అడుగులు, అంగుళాలులో కొలుస్తానంటే చంద్ర అదే పొడుగుని మీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తానన్నాడు.
పౌలి సూత్రం జెర్మనీ లో పని చేస్తుంది కానీ ఇంగ్లండులో పని చెయ్యదంటే ఎలా? ఎడింగ్టన్ వితండ వాదం వాదించేడు. కానీ, ఎడింగ్టన్ ని ఎదిరించడానికి ఎవ్వరికి దమ్ములు లేకపోయాయి. ఎదిరించడం బెందడిలో రాయి రువ్వడం లాంటిదే!

ఆశ్చర్యం ఏమిటంటే ఎడ్మండ్ స్టోనర్ కూడా దరిదాపు ఇటివంటి ఫలితాన్నే సాధించేడు కానీ దానిని చివరికంటా పరిష్కరించకుండా మధ్యస్థంగా ఆపేసేడు. అయినా ఎడింగ్టన్ ఆ ఫలితాన్ని, స్టోనర్ ని సమర్ధించేడు. ఆ తర్కాన్ని చివరికంటా తోసుకు వెళ్లి అంతిమ పర్యవసానం ఎలా ఉంటుందో చూడమని స్టోనర్ ని ప్రోత్సహించలేదు. ఎందువల్ల? స్టోనర్ తర్కబద్ధంగా మరి కొంచెం ముందుకి వెళ్లి ఉంటే చంద్రకి కనిపించినట్లే అతనికీ ఆ అవధి కనిపించి ఉండేది. అప్పుడు ఎడింగ్టన్ నిర్మించుకుంటున్న సిద్ధాంత భవనం భంగపడి ఉండేది. అని చంద్ర అభిప్రాయపడ్డాడంటే ఎడింగ్టన్ మీద చంద్రకి ఎంత గౌరవభావం ఉండేదో అర్థం అవుతుంది.

రోజెన్^ఫెల్డ్, “నేను, బోర్ నీ మీద జాలి పడడం తప్ప మేము చేయగలిగేది ఏమిలేదు. పోనీ నువ్వు రాసిన పత్రం, ఎడింగ్టన్ రాసిన పత్రం – రెండూ – పౌలికి పంపి అతని అభిప్రాయం కూడా సేకరించు” అని సలహా ఇచ్చేడు. చంద్ర అలానే పంపేడు. సమాధానంలో, “ఎడింగ్టన్ అభిప్రాయం పూర్తిగా తప్పుడు దారి. అతను తొక్కిన దారే రహదారి, మిగిలిన వారిది గోదారే” అని పౌలి తన అని మనస్సులో మాటని ఉత్తరంలో వెలిబుచ్చేడు కానీ అదే మాటని బహిరంగంగా చెప్పి చంద్రని సమర్ధించలేదు. పెద్దలు – అనగా, బోర్, ఫౌలర్, డిరాక్, రోజెన్^ఫెల్డ్, పౌలి, మెక్రే, మొదలైన వారు – చంద్ర వాదానికి ముఖస్తంగా మద్దతు ఇచ్చేవారే కానీ, బహిరంగంగా చంద్ర తరఫున వాదించేవారు కాదు. మిల్ని సంగతి సరేసరి; చంద్ర రాసిన పత్రాలని ప్రచురించవద్దని సలహా ఇచ్చేవాడే తప్ప ఎన్నడూ ప్రోత్సాహ పరుస్తూ మాట్లాడిన పాపాన పోలేదు.

జూన్ 1935. చంద్రని నిస్పృహ, నిరాశ ఆవహించేయి. తనకి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. తనకి తానే సహాయం చేసుకోవాలి. లౌక్యం లేకుండా పనులు జరగవు అనే జ్ఞానోదయం అయింది. మరొక పరిశోధన పత్రం ప్రచురిస్తూ, ఒక చోట హంసపాదు గుర్తు వేసి, పాదసూచికలో, “షరా: నక్షత్రగర్భంలో స్థితిని వర్ణించడానికి నేను సాపేక్షవాదం ఆధారంతో నిర్మించిన సమీకరణం సరి అయినదే అని ఎక్కువమంది ఒప్పుకుంటున్నా ఎడింగ్టన్ ఏకీభావం చూపించడం లేదు” అని ఇరికించేడు. ఈ పాదసూచికలో ఉన్న షరా ని చూసి సంపాదకులు (మూడొంతులు ఎడింగ్టన్ భక్తులు) పత్రాన్ని ప్రచురించకుండా తిరస్కరిస్తారేమన్నా భయం పీకుతోంది. సంపాదకులు ఆషామాషీగా, కారణం చెప్పకుండా, తిరస్కరించడానికి వీలు లేదు. కనుక పత్రికని పరిశీలించి ప్రచురణార్హతని నిర్ణయించే వారు తన స్నేహవర్గంలో వారు అయేటట్లు తాను అమర్చగలగాలి. ఎలా? అందుకని – సత్యనారాయణ వ్రతానికి ముందు వినాయక పూజ చేసినట్లు – సర్ జేమ్స్ జీన్స్ లేవనెత్తిన వికిరణ వాదాన్ని ప్రారంభంలోనే ప్రస్తావిస్తూ పత్రం మొదలు పెట్టేడు. అది చూసి సంపాదకులు ఆ పత్రాన్ని అభిప్రాయం సేకరణకి జేమ్స్ జీన్స్ కి పంపుతారని ఆశ. అయన కాదంటే పత్రాన్ని నిరాకరించడం తేలిక. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లు అవకుండా అటు ఎడింగ్టన్ కి కోపం రాకుండా, ఇటు చంద్రకి బాధ కలిగించకుండా ఉంటుంది కదా. చంద్ర ఊహించినట్లే సంపాదకవర్గం సర్ జేమ్స్ జీన్స్ కి అభిప్రాయ సేకరణకి పంపేరు! ఆయన పత్రం ప్రచురణార్హమే అని సిఫార్సు చేసేరు. ఈ సంఘటనని చెప్పి తాను నేర్చుకుంటున్న రాజకీయ చతురతకి ఎంతో గర్వపడ్డారు. చంద్ర ఇంత అవస్థ పడకుండానే ఆ పత్రం ప్రచురణ పొంది ఉండేదేమో! మనకి తెలియదు. కానీ ములిగిపోతున్నవాడు ఆసరాగా గడ్డిపరక దొరికినా పట్టుకుంటాడు. తనకి నోబెల్ బహుమానం తెచ్చిపెట్టిన అంశాన్ని ఒక పాదసూచిక ద్వారా ప్రపంచానికి తెలియజెయ్యవలసిన గతి పట్టింది. వసుదేవుడంతటివాడు గాడిద కళ్ళు పట్టుకోగా లేనిది చంద్ర పాదసూచికని ఆశ్రయిస్తే మురిగిపోయినది ఏముందిలెండి!

ఒకటి మాత్రం నిజం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా! ఎంత జ్ఞాన సంపద ఉన్నా, రాజకీయం తెలియకపోతే సైన్సులోనే కాదు ఈ లోకంలో ఎక్కడా గెలుచుకు రాలేము. ఈ లోకంలో నెగ్గుకు రావాలంటే ఏమి తెలుసో కంటే ఎవ్వరు తెలుసో ముఖ్యం. కార్య సాధనకి పన్నుగడలు, పన్నాగాలు ముఖ్యం. చంద్ర పడ్డ ఇక్కట్లు చూస్తే ఆయనకి లోకం పోకడ అర్థం కాలేదనిపిస్తుంది. అయన కష్టసుఖాలు అన్ని పూసగుచ్చినట్లు తండ్రికి, తమ్ముడికి ఉత్తరాలు ద్వారా రాసేవాడు. కేంబ్రిడ్జిలోని స్థానిక రాజకీయాలు వాళ్లకి ఏమి అర్థం అవుతాయి? అయన మనస్సు విప్పి మాట్లాడుకోడానికి మరొక భారతీయ స్నేహితుడు ఉన్నట్లు కనిపించదు. ఆయన అనుయాయి వర్గం అంతా శ్వేతవర్ణులు! భృత్యదేశం నుండి వచ్చినవాడు, నల్లటివాడు కనుక బ్రిటిష్ వాళ్ళకి చులకన. ఉదాహరణకి డిరాక్ ప్రభృతులకి భారత స్వతంత్ర ఉద్యమం పట్ల సానుభూతి ఉండేది కాదుట. యూరప్ లో కాసింత నయం. సోవియట్ యూనియన్ లో మరి కొంత నయం. చంద్రకి ఇంగ్లండులో స్దాన బలం లేకపోయింది. చంద్రకి దన్ను ఇచ్చి వెనక నిలిచే వారెవరైనా ఉంటే వారంతా యూరప్ లో ఉన్నారు. యుద్ధ వీచికలు వీస్తూ ఉన్న ఆ వాతావరణంలో కేంబ్రిడ్జిలో ఉన్న రాజకీయాలలో తల దూర్చడం వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. చంద్ర ఇంగ్లండులో ఏకాకి అయిపోయాడు.

చంద్రశేఖర్ పరపతి యూరప్ లోను, అమెరికా లోను క్రమేణా పెరగడం మొదలయింది. శుక్రవారం, 11 జనవరి, 1935 నాడు బర్లింగ్టన్ హవుస్ లో, బహిరంగ సభలో, పరాభవం జరగక ముందే అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన హార్లో షేప్లి (Harlow Shapley) నుండి ఆహ్వానం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked