చంద్రశేఖర్ చరిత్ర

పండితానామ్ అనేకత్వమ్

పండితులలో ఏకీభావం కుదరడం కష్టం. విశ్వవిద్యాలయాల్లో పని చేసే ఆచార్యులలో ఈ భేదభావం తరచు కనిపిస్తూ ఉంటుంది. పైనున్నవాడు చెప్పేడు కదా అని తందానా అంటే అది సృజనకి దోహదం చెయ్యదు. ఈ భేదభావ ప్రదర్శనకి కేంబ్రిడ్జి సైతం అతీతం కాదు. అక్కడ పని చేసే ఆచార్యులు కూడా మనుష్యులే కదా! వాళ్ళకీ చీము, నెత్తురు ఉన్నాయి కదా! వాళ్ళకి ఆత్మాభిమానాలు, పట్టుదలలు ఉంటాయి కదా!

తను సాధించిన ఫలితం – అనగా, శ్వేత కుబ్జతారల గరిమకి ఒక అవధి ఉంది అనే ఫలితం – గురించి ఎవ్వరూ పట్టించుకోకుండా, అందరూ గూడుపుఠాణి చేసినట్లు విస్మరిస్తున్నారంటే దానికి విద్వద్విషయానికి సంబంధించని మరొక కారణం ఏదో ఉందని చంద్రకి అనుమానం పట్టుకుంది. ఈ విషమ పరిస్థితిలో చంద్రకి ఒకే ఒక మార్గం కనిపించింది: తన ఫలితాన్ని మిల్నీ ఫలితంతో కలిపి, రంగరించి, గిలకరించి, చిట్టచివరికి అన్ని నక్షత్రాలు చరమదశలో కఠిన శిలలా తయారవుతాయని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే అప్పుడు ఎడింగ్టన్ సమర్థిస్తున్న ప్రామాణిక నమూనా తప్పు అని ఒప్పుకోవాలి. ఎందువల్లనంటే ప్రామాణిక నమూనా ప్రకారం నక్షత్రం ఎల్లవేళలా ఆదర్శ వాయు సూత్రానికి బద్ధమై ఉండాలి. నక్షత్రం అంతా ఆదర్శ వాయువులా ఉన్నప్పుడు, కడుపులో బల్లలా, ఈ రాయి ఏమిటి? మిల్నీ నమూనా తర్క రహితం అని తెలిసి కూడా ఆత్మవంచన చేసుకో లేడు కదా? రామ-రావణ యుద్ధం తప్పేటట్లు లేదు.

రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీలో సమావేశాలలో ఎడింగ్టన్ కి, జేమ్స్ జీన్స్ కి, మిల్నీ కి మధ్య త్రికోణ సమరం ముమ్మరంగా జరుగుతోంది. ఈ మూడు ఏనుగుల మధ్య చంద్రశేఖర్ ఎలక పిల్లలా నలుగుతున్నాడు. ఎడింగ్టన్ కి, జేమ్స్ జీన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. వారిద్దరికీ ఏ విషయంలోనూ ఏకీభావం లేదు. ఈయన నంది అంటే అయన తప్పకుండా పంది అంటాడు. కనీసం నక్షత్రాలు ఏ పదార్థంతో తయారయేయన్న మౌలికమైన విషయంలో కూడా వారిద్దరికీ ఏకీభావం లేదు. సమావేశాలలోను, సభలలోను వారి వాదులాటలు నిత్యసత్యాలు.

ఎడింగ్టన్ బీద కుటుంబం నుండి వచ్చిన వాడైతే జేమ్స్ జీన్స్ సంపన్నమైన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చేడు. ఇరవై ఎనిమిది ఏళ్ల పిన్న వయస్సుకే, 1905 లో, జేమ్స్ జీన్స్ కేంబ్రిడ్జి లో ఉపన్యాసకుడు పదవి అలంకరించేడు. తారాపథంలోకి ఎదుగుతున్న ఇతన్ని చూసి ప్రిన్స్^టన్ విశ్వవిద్యాలయపు అధ్యక్షుడు, ఉడ్రో విల్సన్ – తరువాత, అమెరికా అధ్యక్షుడు – పెద్ద జీతం ఇచ్చి, ఆచార్య పదవి ఇచ్చి, అమెరికా రమ్మని ఊరించేడు. కేంబ్రిడ్జిలో ఇచ్చే జీతాలతో పోల్చి చూసుకుని జేమ్స్ జీన్స్ వెంటనే అమెరికా వెళ్ళిపోయేడు. అప్పటి వరకు ప్రిన్స్^టన్ ని నమ్ముకుని ఉన్న రస్సెల్ జీతం కంటే జీన్స్ జీతం ఎక్కువ కావడంతో రస్సెల్ కళ్ళు కుట్టేయి. చేసేది ఏమి లేక లోపల్లోపలే కుములుతున్నాడు. ఈ లోగా, 1910 లో, కేంబ్రిడ్జిలో ప్లుమియన్ ఆచార్య పీఠం ఖాళీ అయింది. కేంబ్రిడ్జిలో ఉండే ఆచారం ప్రకారం ఆ పీఠం సర్ జేమ్స్ జీన్స్ కి ఇవ్వాలి. జీన్స్ అమెరికా వదలి ఇంగ్లండు తిరిగివచ్చి పీఠాన్ని అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రాజభవనపు రాజకీయాలు, కౌటిల్య నీతి ఉపయోగించి అనుభవం తక్కువ, వయస్సులో చిన్న అయిన ఎడింగ్టన్ ఆ పీఠాన్ని కొట్టేసేడు. ఈ గూడుపుఠాణిలో రస్సెల్ పాత్ర ఎంత ఉందో మనకి తెలియదు. జేమ్స్ జీన్స్ మాత్రం ఖంగు తిన్నాడు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి కాదు, నీళ్లు పోస్తే పెట్రోలు లా భగ్గున మండేది. విద్వత్ సంబంధమైన రాజకీయ కుట్రలతో విసుగెత్తిన జేమ్స్ జీన్స్ విశ్వవిద్యాలయాల నుండి విరమించుకుని హాయిగా శేష జీవితం వెళ్లబుచ్చేడు.

రోయల్ ఎస్ట్రనామికల్ సోసైటీలో జరుగుతున్న ముసుగులో గుద్దులాట జనవరి 9, 1931 నాటికి బయటకి వచ్చేసింది. మదపుటేనుగుల మధ్య జరుగుతున్న ఈ పోరు చూసి వెనక వరసలో కూర్చున్న చంద్ర బిక్కచచ్చిపోయి ఉంటాడు. మిల్ని తన మొదటి అస్త్రాన్ని సంధించి జీన్స్ మీదకి విసిరేడు. “ఒత్తిడి ఎక్కువైనప్పుడు నక్షత్రం కూలిపోవాలంటే గర్భం లోపలి పదార్థం అంతా విలక్షణమైన ద్రవరూపంలోకి మారిపోవాలి” అన్న జీన్స్ ప్రతిపాదనని హేళన చేసేడు. ప్రయోగాలలో సేకరించిన విలోకనాంకాలని సమర్ధించడానికి భౌతిక సూత్రాల పరిధిని సాగదీసేడని అభియోగం మోపేడు. అంతటితో ఉరుకున్నాడా? మిల్ని తన రెండవ అస్త్రాన్ని సంధించి ఎడింగ్టన్ ప్రతిపాదించిన గరిమ-దీప్తి సంబంధం మీదకి వదిలేడు. “నక్షత్రానికి శక్తి ఎక్కడ నుండి వస్తున్నాదో ఆలోచించకుండా క్లిష్టమైన గణిత సమీకరణాలు ఎన్ని రాసి ఏమి ప్రయోజనం?” అని ఒక చురక అంటించేడు.

గంభీరాతిశయాలు ఒలకబోస్తూ ఎడింగ్టన్ లేచేడు. లేస్తూనే జీన్స్ ప్రతిపాదనని ఉద్దేశించి “ఇలాంటి నిరాధారమైన ఉపపాద్యాలకి సమాధానాలిస్తే వాటికి గౌరవం ఆపాదించడం అవుతుంది” అంటూ జీన్స్ ని భంగపరచి, మిల్ని వైపు తిరిగేడు. మిల్నికి గణితంలో లోతైన అవగాహన లేదని మిల్నికి తెలుసన్న విషయం ఎడింగ్టన్ కి తెలుసు. కనుక ఆ ఆయువుపట్టు మీద దెబ్బ తీయడానికి సంకల్పించుకున్నాడు. “మిల్ని నక్షత్రాలని అధ్యయనం చెయ్యడానికి ఒక గణిత నమూనాని నిర్మించుకుని, ఆ నమూనా ఆసరాతో అనుమానప్రమాణం ఉపయోగించి పర్యవసానం ఏమిటో చెబుతున్నాడు. కానీ ఆ గణిత నమూనాయే దోషయుక్తం అయినప్పుడు మొదటికే మోసం కదా? మిల్ని అనేది ఏమిటంటే, ఫౌలర్ వాదం ప్రకారం శ్వేత కుబ్జతారల గర్భంలో అత్యధిక పీడనం, తాపోగ్రత ఉంటాయి. అంతే కాకుండా, అత్యధిక సాంద్రత కలిగిన వాయువులో ఎలక్ట్రానులు కాంతి వేగం కంటే చాల తక్కువ వేగంతో (అసాపేక్ష వేగంతో) తిరుగుతూ ఉంటాయి. గురుత్వ బలాన్ని ప్రతిఘటిస్తూ ఎలక్ట్రానులు బహిర్ముఖమైన అసాపేక్ష శిధిలత్వ పీడనాన్ని (non-relativistic degeneracy pressure) ప్రదర్శించడం వల్ల నక్షత్ర గర్భం గట్టి, కటిక రాయి మాదిరి తయారవుతుంది. ఎలక్ట్రానులు దరిదాపు కాంతి వేగంతో (సాపేక్ష వేగంతో) తిరిగిన పక్షంలో నక్షత్ర గర్భంలో పీడనం, తాపోగ్రత ఇంకా ఎక్కువ అవుతాయి అని మిల్ని ఒప్పుకున్నాడు. (చంద్ర అనేది కూడా ఇదే!) కానీ అటువంటి అత్యధిక పీడనం, తాపోగ్రత నక్షత్ర గర్భంలో ఉండవు. అది అసంభవం,” అంటూ తన ఖండన వాదాన్ని ఆపకుండా, “మిల్ని తన నమూనాని మరమ్మత్తు చెయ్యాలంటే ఆ నమూనాని ఇతర జాతుల తారల యెడల కూడా అనువర్తించేలా చూడాలి. ఆ ప్రయత్నం చేస్తే ఆ తారల గర్భాల్లో పీడనం ఋణ సంఖ్య అవుతుంది. అప్పుడు ఆ నమూనా నవ్వులపాలు అవుతుంది. మిల్ని కి ముందు నుయ్యి, వెనక గొయ్యి అవుతుంది. లేక, మిల్నికి “ముందు సైతాను, వెనక సముద్రం” అందామా? లేక, మిల్నికి “ముందు నేను, వెనక సముద్రం” అందామా?” అంటూ తాను విసిరిన వ్యంగ్యోక్తికి తానే నవ్వుకుంటూ విజయ గర్వంతో ఖండన ఉపన్యాసం ముగించేడు.

జీన్స్ మాత్రం తక్కువ తిన్నాడా? వేదిక ఎక్కుతూనే, “ఆచార్య మిల్ని ఉన్నదున్నట్లు ముఖం మీద చెప్పడానికి సంశయించలేదు కనుక, నేను కూడా కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నదున్నట్లు చెబుతాను,” అంటూ లంకించుకున్నాడు. “టూకీగా చెప్పాలంటే మిల్ని చెప్పినదాంట్లో ఏమీ లేదు,” అని ఒక్క ముక్కలో మిల్నిని కొట్టి పారేసి, ఎడింగ్టన్ వైపు తిరిగేడు. “ఎడింగ్టన్ నమూనాలో ఉన్నది అంతా గేసే, మరేమి లేదు,” అని ధ్వందార్థం వచ్చేలా ఒక విసురు విసిరి, మళ్లా మిల్ని వైపు తిరిగి “మిల్ని నమూనాలో గణిత సమీకరణాలు ఉన్నాయేమోకాని నక్షత్రాలు లేవు” అని మరొక చురక అంటించేడు.

ఈ వివాదంలో జి. ఎచ్. హార్డీ తోపాటు ఇతరులు కూడా తల దూర్చి వారి అభిప్రాయాలు వెలిబుచ్చేరు. చివరికి తేలింది ఏమిటంటే ఎడింగ్టన్, మిల్ని, జీన్స్ – ఈ ముగ్గురూ ఎవరికి తోచిన అవకలన సమీకరణాలతో నిండిన నమూనాలని వారు నిర్మించుకుని, తనివి తీరా వాటితో చెలగాటలాడుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఆ నమూనాలకి, ఆ నక్షత్రాలకీ మధ్య కనీసం బాదరాయణ సంబంధం అయినా ఉన్నట్లు కనబడలేదు. ఈ నమూనాలు అజగళస్తనాలు; ఎంత పితికినా పాలు రావు.

ఎనిమిది మంది గుడ్డివాళ్ళు ఏనుగుని తడిమి నట్లు వయసు మళ్లుతున్న ఈ ఆచార్య వర్గం పోరాటంలో వేడి తప్ప వెలుగు పుట్టడం లేదని చంద్రకి స్పష్టం అయిపోయింది. ఫౌలర్ ని అడిగితే మిల్నితో పని చెయ్యి అంటాడు. మిల్ని తన తప్పుదారి తెలుసుకునే ధోరణిలో లేడు. ముగ్గురూ మూడేసి కాళ్ళు ఉన్న మూడు కుందేళ్ళని పట్టుకున్నారు. ఈ రొంపిలో ఎన్నాళ్లని ఈత కొడతాడు? నక్షత్ర భౌతిక శాస్త్రపు విను వీధులలో ఏ ముఖం పెట్టుకు తిరగకలడు? కాస్తో, కూస్తో పరపతి సంపాదించేననుకున్నాడు కానీ అది కాస్తా తుడిచిపెట్టుకు పోయింది. కేంబ్రిడ్జి నుండి బయటకి ఎక్కడికైనా పోవాలి. కేంబ్రిడ్జి లో ఉన్న ఈ “శ్వేత కుబ్జ” తారలని కొన్నాళ్ళు మరచి పోవాలి!

జూలై 1931 లో, జెర్మనీలో మేక్స్ బోర్న్ దగ్గర గుళిక శాస్త్రం అధ్యయనం చెయ్యడానికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టం లేక యూరప్ ప్రయాణమై వెళ్ళేడు. మేక్స్ బోర్న్ 1920 దశకంలో, గుళిక శాస్త్రపు ఆకాశంలో ఒక వెలుగు వెలిగిన “అరుణ మహతార.” హైజంబర్గ్, పౌలి ఇతని దగ్గర పని చేసేరు. ష్రోడింగర్ ప్రతిపాదించిన తరంగ ప్రమేయం (wave function) అంటే అర్థం కాక అంతా తికమక పడుతూ ఉంటే దానిని ఒక సంభావ్య తరంగంలా (probability wave) లా పరిగణించాలని ప్రతిపాదించినది ఇతగాడే! తరువాత్తరువాత ఉదజని బాంబుకి పితామహుడని పేరు తెచ్చుకున్న ఎడ్వర్డ్ టెల్లర్ తో పరిచయం అయింది కూడా ఇక్కడే.

జెర్మనీ యాత్ర నుండి తిరిగొచ్చిన చంద్ర జీవితం చుక్కాని లేని నావలా తయారయింది. ఇంగ్లండు లోని “రాజప్రాసాదపు రాజకీయాలు” రుచించక తనంటే యూరప్ పారిపోయేడు కానీ, కేంబ్రిడ్జిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మిల్ని ఎప్పటిలాగే కొట్టుకుంటున్నాడు. తనకా 21 వ పుట్టినరోజు వచ్చేసింది కానీ తన పరిశోధనని మెచ్చుకున్నవాళ్ళు కానరాలేదు. తన గోడు తండ్రికి రాసిన ఉత్తరాల్లో వెళ్లగక్కేడు. ఎక్కడో ఇండియాలో ఉన్న తండ్రికి కేంబ్రిడ్జిలో ఉన్న రాజకీయాలు అర్థం అవుతాయా? భౌతిక శాస్త్రంలో ఉన్న మెళుకువలు అర్థం అవుతాయా? ఇండియా తిరిగి వచ్చేయమని తండ్రి సలహా ఇచ్చేడు.

ఈ సందర్భంలోనే నక్షత్ర భౌతిక శాస్త్రాన్ని వదలిపెట్టి సైద్దాంతిక భౌతిక శాస్త్రంలో కృషి చేస్తే ఎలాగుంటుందో అన్న ఆశ పుట్టుకొచ్చింది. దిశ మార్చే లోగా బకాయి పడ్డ పరిశోధనాంశాలని ఒక కొలిక్కి తెద్దామని తీవ్రంగా ప్రయత్నం చేసి 1931 ముగిసే లోగా ఒక సరి కొత్త ఫలితాన్ని సాధించేడు. పడవ ప్రయాణంలో సాధించినది ఒకటైతే, ఇది మరొక నమ్మశక్యం కాని ఫలితం! ఒక నక్షత్రం సాపేక్ష శిధిలం ఆయే తరుణంలో ఎదురయ్యే పరిస్థితినే తీసుకుందాం. అప్పుడు ఆ నక్షత్రం వెలిగక్కే వికిరణ పీడనం యొక్క వాటా మొత్తం పీడనంలో 10 శాతం కంటే ఎక్కువ ఉంటే ఆ నక్షత్రం పరిపూర్ణంగా కూలిపోకుండా ఆపగలిగే శక్తిమంతమైన సాపేక్ష శిధిల పీడనం నక్షత్ర గర్భంలో పుట్టదు. ఎలక్ట్రానులు అత్యధిక సాంద్రతతో ఎంత ఎక్కువ దట్టంగా ఉన్నా సరే, అక్కడ ఉండే అత్యధిక తాపోగ్రత వల్ల అక్కడ పరిస్థితి ఆదర్శ వాయువు లక్షణాలతోనే ఉంటుంది. సాపేక్ష శిధిలం జరగడం లేదు కనుక ఆ శిధిలావస్థ పుట్టించే పీడనం ఉండదు. ఆ పీడనం లేకపోతే నక్షత్ర గర్భంలో గట్టి శిలారూపం తయారవదు. ఈ పరిస్థితిలో ఇంధనం ఖర్చు అయిపోయి, ఆరిపోతున్న నక్షత్రం గురుత్వాకర్షక బలానికి బలి అయి కూలిపోతూ ఉంటే దాన్ని ఆపే శక్తి వేరొకటి లేక, నక్షత్రంలో సాంద్రత అనంతంగా పెరిగిపోయి, నక్షత్రం కైవారం అనంతంగా తరిగిపోయి, కేవలం బిందువుగా మారిపోతుంది. (దీనినే మనం ఈ రోజులలో “బ్లేక్ హోల్” అంటున్నాం.) మిల్ని ఈ ఫలితం చూసి పెదవి విరిచేడు. “అభ్యంతరం ఏమిటి?” అని అడిగితే “నా వాదాన్ని సమర్ధించడం లేదు కనుక” అని సమాధానం ఇచ్చేడు. చంద్ర దిగాలు పడిపోయేడు.

చంద్ర ఇండియా నుండి కేంబ్రిడ్జి వచ్చిన తరువాత పదకొండు, సుదీర్ఘమైన, పరిశోధన పత్రాలు ప్రచురించేడు. వాటిల్లో అతను ఆవిష్కరించిన ఫలితాలు, చాల ముఖ్యమైనవి, మౌలికమైనవి, విప్లవాత్మకమైనవి అని అతని నమ్మకం. ఒక నెల రోజులు జెర్మనీలో తిరిగి పెద్ద పెద్ద వ్యక్తులని కలుసుకున్నాడు. కానీ మనస్సుకి తృప్తి లేదు. ఎదో వెలితి. ఒక్కరు శెభాష్ అన్ని భుజం చరచ లేదు. నిత్యం ప్రవాహానికి ఎదురీతే!

నక్షత్ర భౌతిక శాస్త్రాన్ని వదలిపెట్టి సైద్దాంతిక భౌతిక శాస్త్రంలో కృషి చేయడం ఎలా? తను మద్రాసులో ఉన్నప్పుడు, 1929లో హైజెన్బర్గ్ ని కలుసుకున్నప్పుడు, అయన గుంపుల వాదం అధ్యయనం చెయ్యమని ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ఆ దిశలో చేసిన కొద్దిపాటి ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. హైజెన్బర్గ్, పౌలి ఎలక్ట్రానులు, తేజాణువులు (photons) మధ్య సంకర్షణల మీద రాసిన పరిశోధన పత్రాలు రాత్రింబవళ్ళు చదివేడు. అప్పుడప్పుడే తలెత్తుతున్న క్వాంటం ఎలక్ట్రోడైనమిక్స్ (Quantum Electrodynamics) అనే గుళిక వాదపు శాఖకి అది పునాది. కేంబ్రిడ్జిలో ఆధునిక గుళిక శాస్త్రానికి దిశానిర్దేశకుడైన డిరాక్ ని సంప్రదించేడు. డిరాక్, ఇంకా ముప్ఫయ్ ఏళ్ళు రాకుండానే, కేంబ్రిడ్జిలో లూసియన్ ఆచార్య పీఠాన్ని అధిష్టించిన విశిష్టుడు. ఒకానొకప్పుడు ఈ లూసియన్ ఆచార్య పీఠాన్నినూటన్ అధిష్టించేడు! చంద్ర కోరిక ప్రకారం డిరాక్ చంద్రకి ఒక సమస్యని ఇచ్చి పరిష్కరించమన్నాడు. కావలిస్తే డెన్మార్కులోని కోపెన్^హేగన్ లో ఉన్న బోర్ దగ్గర కొంతకాలం శిష్యరికం చేస్తే చెయ్యవచ్చని సలహా ఇచ్చేడు. ఇక్కడ కేంబ్రిడ్జిలో డిరాక్ దగ్గరా? అక్కడ కోపెన్^హేగన్ లో బోర్ దగ్గరా? ఎటూ తేల్చుకోలేక స్థలం మార్పుకని కోపెన్^హేగన్ వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.

నీల్స్ బోర్ 1922 లో నోబెల్ బహుమానం అందుకున్న వ్యక్తి. అయిన్^స్టయిన్ తరువాత అంతటివాడు ఇతనే అన్న పేరు ప్రతిష్ఠలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ అయిన్^స్టయిన్ లాగానే బోర్ ప్రతిభ కూడా చల్లారిపోతున్న రోజులవి. గుళిక శాస్త్రపు కళ్లెం కొత్త తరం చేతుల్లోకి వెళ్లి పోయింది. చంద్ర ఆయనని మొదటిసారి చుసేనాటికి బోర్ నలభై అయిదు ఏళ్ల కురు వృద్ధుడు!

బోర్ వ్యక్తిగతంగా నచ్చలేదు కానీ కోపెన్^హేగన్ లోని శేముష్య వాతావరణం చంద్రకి బాగా నచ్చింది.. అక్కడ కూడా విజ్ఞులలో తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాదోపవాదాలు ఎంత ఘాటుగా సాగినా అవి వారి సాంఘిక జీవితాలలో ప్రతిబింబించేవి కాదు. కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు పరిశోధనాంశాలలో వచ్చిన భేదాభిప్రాయాలు వారి సాంఘిక జీవితంలో చొరబడి వ్యక్తిగతమైన దూషణలవరకు దిగజారి పోయేవి.

అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే కోపెన్^హేగన్ లో ఎవ్వరికీ భౌతిక శాస్త్రంలో ఉన్న అభిరుచి నక్షత్రభౌతిక శాస్త్రంలో లేదు. ఈ రెండు వర్గాల వారి దృక్పథాలే వేర్వేరు. భౌతిక శాస్త్రజ్ఞులు నక్షత్రభౌతిక శాత్రవేత్తలని చిన్నచూపు చూసేవారు. కోపెన్^హేగన్ వచ్చిన కొద్ది రోజులలోనే చంద్రకి తెలిసిపోయింది, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలలో ఉన్న “వర్ణ వివక్ష.” కేంబ్రిడ్జిలో తన వారైన నక్షత్రభౌతిక శాత్రవేత్తల బృందం తన పరిశోధనాంశాలని వెలి వేసి బహిష్కరిస్తే, కోపెన్^హేగన్ లో భౌతిక శాస్త్రవేత్తల బృందం తనని పరాయివాడిగా చూసి వెలి వేస్తోంది. ఈ వివక్ష ఎంత దారుణంగా పరిణమించిందంటే ప్రతి శుక్రవారం సాయంకాలం భౌతిక శాస్త్రవేత్తల బృందం బోర్ ఇంట్లో టి తాగడానికి కలుసుకునే వారు. చంద్రని బోర్ పిల్లలతో ఆడుకోమని బయట వదిలేసి వారంతా లోపలకి వెళ్లిపోయారుట! అయినప్పటికీ కోపెన్^హేగన్ లోని శేముష్య వాతావరణం కేంబ్రిడ్జిలో వాతావరణం కంటే ఎన్నో రెట్లు మేలు అని చంద్ర అభిప్రాయం.

తను కేంబ్రిడ్జిలో ఉన్న చివరి రోజుల్లో మిల్నికి చూపించగా మిల్ని పెదవి విరచిన పరిశోధనా పత్రం సంగతి, కోపెన్^హేగన్ లో ఉండగా చంద్రకి జ్ఞాపకం వచ్చింది. నక్షత్రాలలో ఉన్న మొత్తం పీడనంలో 10 శాతం కంటె ఎక్కువ పాలు వికీర్ణ పీడనానిది అయితే, ఆ నక్షత్రం యొక్క కేంద్రం కఠిన శిలగా మారిపోకుండా ఆ నక్షత్రం పూర్తిగా మాయం అయిపోతుంది అంటూ తను తీర్మానించిన పత్రం పై మిల్ని విరుచుకు పడ్డాడు; అటువంటి పరిస్థితి అసంభవం అన్నాడు. ఆ పత్రాన్ని ఇంగ్లండులో ఏ పత్రికకి పంపినా ఆ సంపాదకులు దానిని మిల్నికో, ఎడింగ్టన్ కో పంపుతారు – వారి అభిప్రాయం కోసం. కనుక ఆ పత్రానికి ఇంగ్లండులో పుట్టగతులు ఉండవు. అందుకని జెర్మనీ నుండి ప్రచురితమయే Zeitschrift fur Astrophysik అనే పత్రికకి పంపేడు. దైవోపహతుడు నీడ కోసం తాటి చెట్టు కిందకి వచ్చి నిలబడితే నెత్తి మీద తాటి పండు పడ్డ చందాన చంద్ర సమర్పించిన పత్రం పాట్స్^డాం లో ఉన్న సంపాదకవర్గానికి చేరిన రోజునే మిల్ని పాట్స్^డాం నగరంలో ఉండడం తటస్థ పడింది. పత్రిక సంపాదకుడు దృష్టిలో రొట్టి విరిగి నేతిలో పడింది; చంద్ర పత్రం మీద మిల్ని అభిప్రాయం అడిగేడు.
మిల్ని సంపాదకుడితో ఏమిటి చెప్పేడో ఇక్కడ ప్రస్తావించనక్కరలేదు కానీ, మిల్ని పన్నెండు పేజీల పొడుగున్న ఉత్తరంలో నయాన్నా, భయాన్నా చంద్రకి చెప్పి చూసేడు. చంద్ర ఫలితం దోషయుక్తంగా ఉంది కనుక ప్రచురించ వద్దు అని నయాన్నా, ఇటువంటి నాసి రకం పత్రం ప్రచురిస్తే చంద్ర పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయని భయాన్నా చెప్పేడు. ఎవరెంతగా బెదిరించినా చంద్ర అంతరాత్మ ఆ పత్రాన్ని ప్రచురించమని పోరింది. చంద్ర స్నేహితుడు రోజెన్^ఫెల్డ్ మద్దతుతో ఆ పత్రం చివరికి ప్రచురణ పొందింది. కానీ మిల్ని ఆత్మాభిమానానికి కాసింత అంకితభావం చూపిస్తూ చంద్ర తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒక వాక్యం మధ్యలో “ఒక్కటే” ఒక మాట అతికించి సవరించవలసి వచ్చినందుకు చంద్ర తరువాత చాల చింతించేడు. “ఫెర్మి-డిరాక్ గణాంకాలు (ఒక్కటే) వాడి నక్షత్ర గర్భంలో ఎదురయ్యే ఏకైకత్వం (singularity) నుండి తప్పించుకోలేకపోయాము.” అంటే తాత్పర్యం ఏమిటి? “ఫెర్మి-డిరాక్ గణాంకాలు కాకుండా మరొక పద్ధతి ఉండి ఉండొచ్చు, ఆ మరొక పద్ధతి వాడి ఉండుంటే మూడొంతులు మిల్ని అభిప్రాయమే సరి అయినది కావచ్చు. నేను చేసిన పని మీద నాకే పరిపూర్ణమైన నమ్మకం లేదు” అనే కదా తాత్పర్యం? ఒక ప్రతిష్ఠాత్మకమైన ఫలితం లోని విశిష్టతని గుర్తించలేని, లేదా గుర్తించడానికి ఇచ్చగించని, సహోద్యోగులు ఉంటారు కనుకనే “వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది” అనే నానుడి ప్రచారంలోకి వచ్చి ఉంటుంది.

ఈ కథనం ఇలా జరుగుతూ ఉండగా, చంద్రకి బోర్ దర్శనం అడపా తడపా దొరుకుతోంది కానీ ఆ సమావేశాలలో బోర్ వినడమే కానీ, చెప్పిన సలహాలు ఏమీ లేవు. కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు డిరాక్ ప్రతిపాదించిన సమస్యని పరిష్కరించి మరొక పత్రం రాసేడు. రాసి, కాసింత ముందు, వెనకా ఆలోచించుకోకుండా, ఆ పత్రాన్ని బోర్ కి నేరుగా చూపించి ఇంగ్లండులోని రోయల్ సోసైటీ వారి పత్రికలో ప్రచురణకి సిఫార్సు చెయ్యమని అడిగేడు. అయన చేసేడు. డిరాక్ ప్రతిపాదించిన సమస్య కనుక ఆయనకి ముందు చూపించడం గౌరవం. చంద్ర ఆ పని చెయ్యలేదు కానీ పత్రం చివర మాత్రం డిరాక్ కి కృతజ్ఞతా వచనాలు చెప్పేడు. అనుభవం, లౌక్యం ఉన్న మనిషి ఇలా చెయ్యడు. పత్రిక సంపాదకుడు కృతజ్ఞతలలో డిరాక్ పేరు చూసి డిరాక్ అభిప్రాయం అడిగేడు. డిరాక్ తిన్నగా బోర్ కి ఉత్తరం రాసేడు – బోర్ సిఫార్సు చేసేడు కనుక! డిరాక్ ఏమన్నాడంటే, “భౌతిక శాస్త్రంలో ఎప్పుడు ఎంతవరకు గణితం ఉపయోగించాలో చంద్ర అవగాహనలోకి వచ్చినట్లు లేదు. ఇది అలవాటులో పొరపాటు. ఇదే రకం పొరపాటు చంద్ర రెండేళ్ల క్రితం ఒకసారి చేస్తే హైజెన్బర్గ్ పట్టుకున్నాడు. టూకీగా చెప్పాలంటే, కేవలం గణిత సంబంధమైన తర్కం, గణిత పరమైన పద్ధతులు మాత్రమే ఉపయోగించి – అనగా గుంపుల వాదం ఉపయోగించి – మనకి తెలిసున్న గణాంక పద్ధతులు కాకుండా ఇంకేవో గణాంక పద్ధతులతో ఎలక్ట్రానుల, తేజాణువుల ప్రవర్తనని అభివర్ణించగలమని అభిప్రాయపడడం. నా మాట కాదని ఈ పత్రాన్ని ప్రచురిస్తే మాత్రం ఆ పత్రం చివర నాయీ వ్యతిరేకతని కూడా జత చేయాలి.”

డిరాక్ అభిప్రాయాన్ని చదివిన చంద్ర డిరాక్ తో ఏకీభవించలేనన్నాడు. ఎడింగ్టన్ తో యుద్ధం ఇంకా ముగియ లేదు, ఇప్పుడు డిరాక్ తో మొదట్లోనే మరొక యుద్ధమా? నిలకడ మీద ఆలోచిస్తే ఇక్కడ అందరూ పంచుకోడానికి సరిపడినంత పొరపాటు జరిగింది. మొదట, చంద్ర ఎలక్ట్రానులకి ఉండే “తలతిరుగుడు” (spin) లక్షణానికి తన నమూనాలో చోటు ఇవ్వడం విస్మరించేడు; ఆ లోపాన్ని బోర్ ప్రభృతులు పట్టుకోవలసింది; పట్టుకోలేదు. ఆ పొరపాటుని కప్పిపెట్టడానికా అన్నట్లు బోర్, “అయినా సరే ఆ మినహాయించబడ్డ అంశాన్ని తరువాత పరిశీలించవచ్చని మీ అభిప్రాయం కాబోలు అనుకున్నాం,” అంటూ డిరాక్ కి సమాధానం రాసేడు. రాసి, బోర్ చంద్రని పిలచి, జరిగిన సంగతి చెప్పేడు. జరిగిన పొరపాటు తెలుసుకుని చంద్ర ఆ పత్రాన్ని వెనక్కి తీసుకుని, ఈ పరాభవంతో తనకి గుళిక వాదంలో ఇక భవిష్యత్తు లేదని ఒక తీర్మానానికి వచ్చేడు.

చుక్కాని లేని పడవలా తయారయిన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నిశ్చయించుకోలేక చంద్ర మార్చి 17, 1933 న కోపెన్^హేగన్ వదలి దారిలో హేమ్^బర్గ్ లో ఆగి ఎమిల్ ఆర్టిన్ అనే గణితశాస్త్ర వేత్తని కలుసుకుని కేంబ్రిడ్జి తిరిగి వచ్చేడు. ఎమిల్ ఆర్టిన్ సంఖ్యా వాదంలో దిట్ట. అతనితో కలసి పని చేసి గణితం వైపు దృష్టి మరల్చుదామని అతని ఊహ. కానీ అప్పటికే యూరప్ లోయుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయేమో ఆ దారి కూడా సుగమంగా కనిపించలేదు. చదువు అయిపోయిన తరువాత ఇంటికి వచ్చేయమని తండ్రి ఒత్తిడి పెడుతున్నాడు.

చంద్ర పి. ఎచ్. డి. వాచక పరీక్షలు జూన్ 20, 1933 న జరిగేయి. పి. ఎచ్. డి. పరిశోధన వ్యాసానికి వివాదాస్పదం కాని అంశాన్ని ఎంపిక చేసుకున్నాడు. మిల్ని పరిశోధన చేస్తున్న అంశం యొక్క పరిధిని పొడిగించడం కనుక గొడవలు ఉండకూడదు. పరీక్షలకి ముందు రస్సెల్ కి చూపిస్తే అయన చాల మెచ్చుకున్నారు. ఇక పరీక్ష కేవలం నామమాత్రమే. కమిటీలో ఫౌలర్, ఎడింగ్టన్ ఉన్నారు. ఫౌలర్ దిశానిర్దేశకుడు కనుకనున్ను, చంద్ర అభ్యర్థి కనుకనున్ను సంప్రదాయం ప్రకారం నల్లటి గౌనులు వేసుకుని వచ్చేరు. ఫౌలర్ పదిహేను నిముషాలు ఆలస్యంగా వచ్చేడు. ఎడింగ్టన్ సందర్భపు గంభీరతకి వ్యతిరేకంగా, పేంటు, చొక్కా, కాళ్ళకి చెప్పులు తో తయారయేడు. మెడలో టై కూడా లేదు. ఫౌలర, ఎడింగ్టన్ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టేరు. మొదట పరిశోధనాంశం గురించి క్లుప్తంగా చెప్పమన్నారు. తరువాత నక్షత్ర భౌతిక శాస్త్రంలో చంద్రకి పట్టు ఎంత గట్టిగా ఉందో పరీక్షించడం మొదలు పెట్టేరు. పట్టుమని పది నిముషాలు గడిచియో లేదో, చంద్ర సమాధానాలకి స్పందిస్తూ ఫౌలర్, ఎడింగ్టన్ ఒకరితో ఒకరు వివాదంలో పడ్డారు. చంద్ర చేతులు కట్టుకుని ఆ విడ్డూరం చూస్తూ నిలబడ్డాడు. ఫౌలర్, ఎడింగ్టన్ మధ్య వివాదం ముష్టి యుద్ధంలోకి దిగజారే లోపున పరీక్షకి కేటాయించిన పుణ్యకాలం అయిపోయింది. ఆ గది వాడుక మరొక జట్టుకి అవసరం వచ్చినట్లుంది. ఎడింగ్టన్, “దట్సాల్” అనడంతో పరీక్ష పూర్తి అయిపోయింది.

పి. ఎచ్. డి. పట్టా పుచ్చుకున్న తరువాత ఫెలోషిప్ సంపాదించి ట్రినిటి కాలేజిలోనే ఉండిపోవాలనే కోరిక చంద్ర మనస్సులో ఉంది. ఆ ఫెలోషిప్ రావడం చాల కష్టం అని ఫౌలర్ నిరుత్సాహ పరచినా తెగించి దరఖాస్తు పడేసేడు. అప్పటికే దరిదాపు పన్నెండు పత్రాలు పత్రికలలో అచ్చయ్యాయి. ఖగోళ భౌతిక శాస్త్రాన్ని చాలా కోణాల నుమ్డిప్ అవలోకించి రాసిన పత్ర లు అవి. మిల్ని వాటిని చాల బాగున్నాయని మెచ్చుకున్నాడు. “చాల క్లిష్టమైన సమస్యలని తేటతెల్లంగా వివరించినందుకు రస్సెల్ అభినందించేడు. ఎడింగ్టన్ మాత్రం నసుగుతూ, “కొత్తదనం కనిపిస్తోంది” అంటూ గోడమీద పిల్లి వాటంగా మెచ్చుకున్నాడు. దరఖాస్తు పడేసేడు కానీ ఫెలోషిప్ వస్తుందన్న ఆశ లేశమైన లేదు. అందుకని మూట, ముల్లె సర్దుకుని ఆరు నెలలలో ఇండియా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టేడు. ఈ ఆరు నెలలలు ఆక్స్ఫర్డ్ లో మిల్ని దగ్గర గడుపుదామని ప్రయాణం అవుతూ, ఆఖరి క్షణంలో ట్రినిటీ ఫెలోషిప్ విజేతల పేర్లు ప్రకటించేరని విని – ఆశని చంపుకోలేక – ట్రినిటీ కాలేజీకి వెళ్ళేడు. ఆశ్చర్యం! తన పేరు అక్కడ ఉంది! చంద్ర సంతోషానికి అవధి లేదు.

ఫిబ్రవరి 1934 లో చంద్ర మరొక చిన్న పత్రం The Observatory అనే పత్రికలో ప్రచురించేడు. ఇది యూరప్ లోఉండగా Zeitschrift fur Astrophysik అనే పత్రికలో ప్రచురించినదే కానీ, కాసింత కుదించి ఇప్పుడు – ట్రినిటీ ఫెలో కాబట్టి – ఇంగ్లండులో ధైర్యంగా ప్రచురించేడు. ఈ పత్రం మిల్ని వాదాన్ని సమూలంగా కూలగొట్టింది. అంతే కాదు; సామాన్యమైన నక్షత్రాలలో ఆదర్శ వాయువు సూత్రం నప్పుతుందన్న ఎడింగ్టన్ దృక్పథం వైపు మొగ్గు చూపింది. చంద్ర లౌక్యం నేర్చుకుంటున్నట్లు ఉన్నాడు!

జులై 1934 లో చంద్ర సోవియట్ యూనియన్ ని సందర్శించడానికి ఆహ్వానం వస్తే వెళ్ళేడు. అక్కడ అంబర్^ట్సూమియన్ (Ambertsumian) ని,, లెవ్ లేండౌ (Lev Landau) ని కలుసుకోవడం జరిగింది. అక్కడ విజ్ఞులు అంతా చంద్రకి బ్రహ్మరథం పట్టేరు. చంద్ర చేస్తున్న పనిని ఎంతగానో మెచ్చుకున్నారు. కేంబ్రిడ్జిలో, మాటవరసకి, ఏ ఒక్కరూ ప్రశంసిస్తూ మాట్లాడిన పాపాన పోలేదు. కనీసం పట్టించుకోకపోగా, “అది నేను చేసిన పనిలోనే ఒక ప్రత్యేక పరిస్థితి” అంటూ ఆ కీర్తిని వాళ్లే దక్కించుకుందికి ప్రయత్నించేరు. కేంబ్రిడ్జికి సోవియట్ యూనియన్ కి రాత్రి, పగలు మధ్య ఉన్నంత తేడా కనిపించింది.

అక్టోబరు 1934 లో అంబర్^ట్సూమియన్ సలహాని అనుసరించి మరొక పరిశోధన పత్రం రాసేడు. ఇందులో జోరుగాను, నెమ్మదిగాను కూడా ప్రయాణం చేస్తున్న ఎలక్ట్రానులు ఉన్న వాయు గోళం శిధిలావస్థ చేరుకున్నప్పుడు దాని ప్రవర్తన ఎలా ఉంటుందో వర్ణస్తూ ఒక ఖచ్చిత (అందాజు కానిది) గణిత సమీకరణాన్ని ఉత్పన్నం చేసేడు.

ఆ తరువాత కొన్ని నెలలపాటు, ఎడింగ్టన్ చంద్ర ఆఫీసుకు తరచుగా వచ్చి, చంద్రతో మంతనాలు జరిపి వెళుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు వారానికి మూడు సార్లు వచ్చి, చంద్ర చేస్తున్న పనిని తిలకించి, చంద్రతో చర్చ జరిపి, ఇబ్బందికరమైన కలనాలు చెయ్యవలసి వస్తే కావలసిన కలన యంత్రాల వంటి వనరులు సమకూర్చి సహాయం చేసి పెడుతూ ఉండేవాడు. తన మీద ఎడింగ్టన్ ఎందుకు ఇంత అపేక్ష చూపిస్తున్నాడో అని అనుమానించగలిగే లోకజ్ఞానం, పరిపక్వత చంద్రలో లేకపోయి ఉండవచ్చు. చంద్ర చేస్తున్న కలనాలు అన్నీ అనుకున్న ఫలితాలు ఇస్తే అవి మిల్ని వాదానికి చావు దెబ్బ కొట్టొచ్చు కనుక ఎడింగ్టన్ కుతూహలం చూపిస్తున్నాడని మనం అనుకోవచ్చు.

జనవరి 10, 1935. మరునాటి సాయంకాలం రోయల్ సోసైటీ వారి సభలో తన ప్రసంగానికి మెరుగులు దిద్దుతున్నాడు, చంద్ర. రాబోయే ప్రసంగంలో చెప్పదలుచుకున్న ముఖ్యాంశాలు మననం చేసుకుంటున్నాడు: ఒకటి, తక్కువ ప్రారంభ గరిమ ఉన్న నక్షత్రం శ్వేత కుబ్జతార దశకి ఒక మజిలీలా చేరుకొని, తరువాత క్రమేణా ఆరిపోతుంది. రెండు, నక్షత్రం యొక్క ప్రారంభ గరిమ ఒక అవధిని మించి ఉంటే అది మధ్యస్థంగా శ్వేత కుబ్జతార దశకి చేరుకోకుండా గమ్యం చేరుకుంటుంది. ఆ గమ్యం ఏమిటో రకరకాలుగా పరిణమించవచ్చు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked