పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

– నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
కూరలు లేకుండఁ జేయు కూరయె రుచియౌ
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
రైలింజెను రోడ్డుమీద రయమున దిరిగెన్

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
(1)కం.
కాలానుగుణంబుగ పలు
జాలంబుల  జిక్కు జనులు ,జాగృతి  లేకన్
ఏ  లీలన్  దొరలుచు  నా
రైలింజను  రోడ్డు మీద  రయమున దిరిగెన్ ?             1
(2)కం.
రైలెక్కిన ప్రతి  వాడును
ఆలస్యము లేక  నింటి కరుగగ దలఁచున్
రైలా పట్టా దప్పఁగ
రైలింజను రోడ్డు మీద  రయమున దిరిగెన్

చిరువోలు  సత్య ప్రసూన, న్యూ  ఢిల్లీ

(1)కం.
రైలు బయట,పట్టా పయి
వీలు కొలదిని  నడువంగ  విజ్ఞానులచే
చాల నభివృద్ధి గాంచగ
రైలింజను  రోడ్డు మీద రయమున  దిరిగెన్           1
(2)కం.
రైలింజను పడి పోవఁగ
తా లాగించి  దరి జేర్చ తరలించి  రటన్
యే లీలను  కన  వచ్చెనొ
రైలింజను  రోడ్డు మీద  రయమున  దిరిగెన్
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
(1)కం.
పాలకు లాంగ్లేయు లపుడు
తోలించిరి ట్రాములెన్నొ తురగములఁ బో
గీ లాగ నిపుడు దొరకగ
రైలింజను, రోడ్డుపైన రయమునఁ దిరిగెన్!
(2)కం.
కీలక పరిణామము, నలు
మూలల మెట్రోలు తిరుగు ముచ్చట యవి ప
ట్టాల పథమ్ముల, లాగగ
రైలింజను, రోడ్డుపైన రయమునఁ దిరిగెన్!

మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫోర్నియా
కం.
బాలికకు నాట బొమ్మలు
బోలెడు గొనె తండ్రి యందు ‘బుర్’ యను ధ్వనితో
కీలును త్రిప్పగ బొమ్మగు
రైలింజను రోడ్డుపైన రయమునఁ దిరిగెన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked