శీర్షికలు

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి
గతమాసం ప్రశ్న:
తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
శ్రీమతి జి సందిత  బెంగుళూరు
ప్రీతిన్ పెళ్ళాడన్ కవి
నా తాళంవారి తార నటులఁజిలిపిగా
నాతండు ముద్దుపేరున
తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్
పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
ఆతత రోషా కలితా
తీత విచా రాగ్ని తప్త దేహి వెడల, నీ
వ్రాతల దెలియంగ వశమె
తాతా! యని,  ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్
[తాత = బ్రహ్మ]
సూర్యకుమారి వారణాశి, చంద్రాపూర్, మహారాష్ట్ర
ఛాతీ నెక్కిన  మనుమడు
మూతిని  మీసమ్ము  లాగు  మురిపెము  కనగన్
తాతన్న భయము  లేదుర
తాతా ! యని ప్రేమతోడ తరుణిని  పిలిచెన్
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
మాతామహునకు భార్యకు
సీతారామ యను పేరు చెలగగ, పిలువన్‌
సీతా యనుటకు బదలుగ
తాతాయని ప్రేమతోడ తరుణిని పిలిచెన్‌

అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి.
తాతను పోలిన తనయను
ప్రీతిగ కన కనులు మెరిసె ప్రేమముతోడన్
పాతవి స్మృతులను తలచుచు
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్!
శివప్రసాద్  చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
తాతా శబ్దము వీడక
లేత పెదవుల వెలి జారు లేప్రాయమునన్
జాతరలో పసిపాపడు
తాతా యని ప్రేమ తోడ తరుణిని పిలిచెన్
(2)
తాత దరి వీడి యేడ్వగ
జాతర గుంపున బుడుతను జాలిగ తట్టన్
తాతయని గుడ్డి తనమున
తాతా యని ప్రేమ తోడ తరుణిని పిలిచెన్
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
శీతల పానీ యమ్ములు
ప్రీతిగ గ్రోలంగ నెంచి భేషగు నంచున్
నేతలు కూడగ నొకదరి
తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్
పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
(1)
కూతురి క్షేమము నెరుగగ
మాతామహి గృహముఁ జేర మనుమడు ప్రీతిన్
జేతుల నూపుచు ముద్దుగ
“తాతా” యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్
(మాటలురాని పిల్లలు అన్నిటినీ “తాతా” అని పిలుస్తారనే అర్ధంతో)
(2)
కూతురి గృహముకు వెడలిన
మాతామహి బయలుదేర, మనుమడు ప్రీతిన్
నాతికి “టాటా” బదులుగ
“తాతా” యని, ప్రేమతోడ తరుణిని బిలిచెన్
కూతురి యింటికి వెడలిన
మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked