ధారావాహికలు

పరీక్షలు

అమరనాథ్ . జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

పరీక్షలంటే ఫియర్ ఫియర్….భయం లేదు మీకిక డియర్ డియర్!

జీవితంలో ఏవైనా కొత్త విషయాలను ఎదుర్కొనే ప్రతి సందర్భంలో చాలా మంది తమకు తామే ఒత్తిడికి గురి అవుతుంటారు. ఎందుకంటె ఎక్కవలసిన మెట్లు విజయవంతంగా ఎక్కగలనా లేదా అని! ముఖ్యంగా ఇది ఏంతో మంది విద్యార్థులు పరీక్షలలో ఎదుర్కొనే ఒక ప్రధానమైన సమస్య. చదువులు పూర్తి చేసేంత వరకు ఈ పరీక్షల తాలూకా భయం ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈభయం తాలూకా ఒత్తిడిని మానసికంగా పెంచుకుంటూ వెనకడుగు వేయటమా? లేదా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు అడుగులు కడపటమా? అనేది మన చేతిలోనే వుంది. అందుకే ప్రతి విద్యార్థి మొదట తప్పనిసరి గా మననం చేసుకోవాల్సింది సమస్యా పరిష్కారం రెండూ మన చేతిలోనే ఉన్నాయని. సముద్రంలో అలలు తగ్గినా తర్వాత స్నానం చేద్దామంటే కుదిరే పనేనా? అలలనేవి సముద్రం యొక్క సహజ లక్షణం. అదే విధంగా సమస్యలనేవి జీవితానికి సహజ లక్షణం.అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్ధవంతం గా ఎదుర్కోగలగాలి.
ముఖ్యంగా చాలా మంది విద్యార్థిని, విద్యార్థులు కామన్ గా చెప్పే మరియు భయపడే విషయాలు. సిలబస్ చాలా ఎక్కువ, మా టీచర్లు మాకు అర్ధమయ్యేటట్లు చెప్పరు, మేము యెంత చదివినా గుర్తుకు రావటం లేదు, యెంత జ్ఞాపకం చేసుకున్న జ్ఞాపకం రావటం లేదు, మాకు మతి మరుపు లాంటిదేమైనా వచ్చిందేమోనని భయంగా వుంది,ఈ పరీక్షల గండం గడిచేదెలా? అనుకున్న రాంక్ వస్తుందా రాదా? నేను చదివిన ప్రశ్నలు వస్తాయా లేక ఇంకేమైనా ప్రశ్నలు వస్తాయా? ఏమిటో పరీక్ష హాల్లోకి అడుగు పెడుతూనే మనసంతా గజి బిజీ గా ఉంటోంది అందుకే మాకు పరీక్షలంటే భయంగా ఉంటోంది అని చాలా మంది మనసు అనేక మానసిక ఆందోళనలకు గురి అవుతుంటుంది! కొన్ని సందర్భాలలో ఉన్నత చదువులు చదివే వారు కూడా ఇవే కారణాలు చెప్పటమే కాదు ఈ పరీక్షల విషయంలో విపరీతమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి భయాలలో ప్రతి ఒక్కరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక విషయం మన జ్ఞాపకం చెదరదు,మనం చదివిన చదువు మనలోనే ఉంటుంది, మన కృషి తో జరిగిన సాధన తాలూకా జ్ఞానం పదిలమే అనేక విషయాలపై ధ్యాసలు పెట్టటం వలన ఒక్కొక్కసారి అనుకున్న విషయాలు వెంటనే స్ఫురణలోకి రావు దానిని మతిమరుపుగా ఊహించరాదు. అందుకే మతిలో (మైండ్లోలో) అన్ని మెరుపులే కానీ మరుపులు లేవని!

పరీక్షల్లో శ్రమ అనే పునాదికి కావాల్సిన వనరులు ఏమిటో కూడా చూద్దాం!

  • మొట్టమొదటగాప్రతి ఒక్కరికి కావాల్సింది చేసే పని పని పట్ల సానుకూల దృక్పధం(Positiviness) ఎందుకంటె నా ఈ చదువు మరియు పరిక్షల్లో నా ఉత్తీర్ణత నా జీవితాన్ని గమనాన్ని మారుస్తుందనే ఆలోచన.
  • చేయబోయే ప్రతి పని లో మనపై మనం నమ్మకం మరియు కృషి తో శ్రమిస్తే విజయ నాదే ననే విశ్వాసం పెంచుకోవాలి.
  • ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులు,మొట్ట మొదటగా ఏర్పరుచు కోవాల్సింది ప్రాధాన్యతలు (Priorities) ఏ పని ముందు ఏ పని తర్వాత అని. కేవలం ఏర్పరుచు కోవటమే కాదు క్రమశిక్షణతో దానిని అమలు పరచాలి అంతేకాని చదువు సమయంలో సినిమాలు, షికార్లకు ప్రాధాన్యతలు పెరిగితే పరీక్షల్లో తరిగి పోవటమే జరుగుతుంది.
  • తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినాలి, ప్రశ్నించటం ద్వారా సందేహాలు తీర్చుకోవాలి. క్లాసులకు డుమ్మా కొడితే చివరికి ప్రోగ్రెస్ కార్డులో మిగిలేవి పూర్ణాలే (సున్నాలు).
  • ఎందుకంటె ఒక్కొక్కసారి మనం తరగతి గదుల్లో విన్న విషయాలే మనకు ప్రశ్నల రూపంలో రావచ్చు అందుకే వినటం అనేది అంత ముఖ్యం.
  • సమయం (Time) ఇది యెంత ముఖ్య మంటే ఎక్కువ మంది వృధా చేసేది ఇదే . గడచిన ఒక్క క్షణాన్ని కోటి రూపాయలు ఇచ్చినా కొనలేం. అందుకే ఎట్టి పరిస్థితులలో సమయాన్ని వృధా చేయవద్దు. అనవసర వ్యాపకాల కంటే అవసర వ్యాపాకాలే జీవితాన్ని విజయపధంలో నడుపుతుంది.
  • కఠినంగా అనిపించే ఏ సబ్జెక్టు అయినా పునశ్చరణ ద్వారా నెమరు వేసుకోవాలి. రానిదేదీ ఉండదు,కానీ దానికి మన ప్రయత్నం చాలా అవసరం. అడవిలో దొరికే రామచిలుకలకు కూడా మనం మాటలు నేర్పుతున్నాము మరి మనము నేర్చుకోలేమా!
  • ముఖ్యమైన ప్రశ్నలని అవే బట్టి పట్టటం కంటే సమగ్రంగా సబ్జెక్టు ను అర్ధం చేసుకుంటే పూర్తి అవగాహనతో ఏ ప్రశ్ననైనా అవలీలగ వ్రాయగలిగే శక్తి కలుగుతుంది.
  • కొన్ని కొన్ని ప్రశ్నలు బహు కష్టంగా అనిపించవచ్చు వాటిని చూచి వ్రాత రూపంలో కొన్ని సార్లు (Writing)సాధన చేయటం ద్వారా అవి మనసుకు హత్తుకుంటాయి.
  • మొబైల్ లో మితృలతో చేసే మాటల్లో ముఖ్యంగా పరీక్షల సమయం లో చదువుతున్న లేదా చదవబోయే సబ్జక్ట్స్ ఫై ఉంటే మేలనేది మరవద్దు.
  • అనవసర మాటల వలన అవి తలకెక్కి మైండ్ లో ఉండాల్సిన అసలు విషయం దెబ్బతినే ప్రమాదం వుంది.
  • ప్రశ్నల పత్రాల లీకులు లేదా మీరను కొనేవి లేదా మితృలు ఇవి వస్తాయనే చెప్పే వాటిపై అతి అంచనాలకు లోను వద్దు. సబ్జెక్టు పైన పట్టు పెంచుకోవటాని కే ప్రయత్నాలు జరగాలి.

జాగర్లపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked