కథా భారతి

పుస్తకం వనితా విత్తం

– ఆర్. శర్మ దంతుర్తి

పట్టువదలని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ విక్రం ఆదిత్య ఎప్పటి లాగానే పాతబట్టలున్న లాండ్రీ బాస్కెట్ తనకున్న పాత కార్లో వేసుకుని మౌనంగా తమ ఊరిలో ఉన్న ఒకే ఒక లాండ్రోమాట్ వైపు జాగ్రత్తగా, స్పీడ్ లిమిట్ లోపునే నడపసాగాడు. ఆఖరికి రేడియో కూడా పెట్టకుండా విక్రం మౌనంగా బండి నడపడం చూసి బాస్కెట్ బట్టల్లో ఉన్న మురికి భేతాళుడు ఇలా అన్నాడు. “విక్రం నువ్వెందుకైతే ఆదివారం అయినా సరే మోరల్ గా, స్పీడ్ లిమిట్ దాటకుండా డ్రైవ్ చేస్తున్నావో నాకు తెలియదు కానీ చాలా మంది ఎన్నారైలు అమెరికాలో ఇటువంటి చిన్న చిన్న మోరల్స్ గురించి అంతగా పట్టించుకోరు. నువ్వు నడిపే ఈ స్పీడ్ లో లాండ్రోమాట్ కి వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది కనక నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి రాజారావు కథ చెపుతాను, విను.”

రాజారావు అమెరికా వచ్చేనాటికి ఇక్కడ అమెరికాలో అంతమంది దేశీయులుగానీ, తెలుగువాళ్ళుకానీ ఉండేవారు కాదు. ఎం. ఎస్ లో జేరడానికి వచ్చిన రాజారావు తంతే బూర్లెబుట్టలో పడ్డట్టు, రాగానే ఒక మాంఛి దేశీ ప్రొఫెసర్ దగ్గిర రీసెర్చ్ కి – కుదిరాడు అనడం కంటే వాళ్ళ డిపార్ట్ మెంట్ హెడ్ వల్ల కుదిర్చబడ్డాడు అనడం మంచిది. కాలక్షేపానికి ఇంటర్నెట్టూ, ఆన్ లైన్ వీడియోలు, ఆఖరికి డీవీడీలు కూడా లేని ఆ రోజుల్లో పొద్దున్నే స్కూల్ కెళ్ళిన రాజారావు అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూసుకోకుండా అలుపులేకుండా లేబ్ లో పనిచేసేవాడు. అటువంటి డెడికేషన్ చూసి మన దేశీ ప్రొఫెసర్ కూతుర్నిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకున్నాడు రాజారావుని. పెళ్ళయ్యిన ఆర్నెల్లకి పెళ్ళాంతో కొత్తదనం తీరిపోయి మళ్ళీ రీసెర్చ్ లో పడిపోయాడు రాజారావు. ఉత్తరోత్తరా ఆ రీసెర్చ్ లోంచి తేలి బయటకొచ్చేసరికి మావగారు రిటైరై పోవడం, ఆయన రికమెండేషన్ తో అదే యూనివర్సిటీలో ఉద్యోగం, ప్రమోషంతో పాటు టెన్యూర్ సంపాదించటంవంటి పనులన్నీ చక చకా పూర్తిచేసాడు రాజారావు. ఎప్పుడైతే ఒక్కసారి టెన్యూర్ పని పూర్తైపోయిందో, అప్పట్నుండి ఇంక డిపార్ట్ మెంట్ లో పెద్ద కష్టపడక్కర్లేదు కనక, తెలుగు సాహిత్యం మీద విరుచుకుపడ్డాడు డాక్టర్ రావ్. పనిలో పనిగా హిందీ సాహిత్యం మీదా, ఘజల్స్ మీదా, ఆఖరికి వేమన శతకం మీదా, సుమతీ శతకారునిమీదా (బద్దెన అంటే చిన్నతనం కదా!) కూడా రీసెర్చ్ కొనసాగించాడు. ఈ నేపధ్యం లో టెక్నికల్ యుగం ఇంటర్నెట్టుతో అవతరించింది.
ఓ మారుమూల చలి రాష్ట్రంలో తానేదో, తన ఉద్యోగం ఏదో అన్నట్టు చాలాకాలం గడిపేసిన రాజారావుకి కొత్తగా వచ్చిన ఈ ఇంటర్నెట్టూ, ఈ-మెయిలూ, విశ్వప్రపంచానికి తలుపులు తెరిచాయి. ఒక్కసారి రాజారావులోని రచయిత ఒళ్ళువిరుచుకుంటూ విజృంభించి బయటకొచ్చాడు. మొదటిసారి సిగరెట్టు కాల్చినవాడూ, మందు కొట్టినవాడూ ఆ వ్యసనం ముందు ముందు ఎలా మానుకోలేరో అలాగే ఈ ఇంటర్నెట్ రాజారావుకి ఒక వ్యసనం అయిపోయింది, చాలా తొందరగా. ఇంక అప్పట్నుంచి, వేమన పద్యాలేమిటీ, సుమతీశతకం ఏమిటీ ఇలాగ ఒక్కొక్కటీ తెలుగీషులో రాసి, స్వంత కామెంటరీతో, సంతకం మర్చిపోకుండా ఇంటర్నెట్, న్యూస్ గ్రూప్ ల మీద పోస్ట్ చేసి పారేసేవాడు. అలాస్కా నుంచి, న్యూయార్క్ దాకా, డకోటా రాష్ట్రాలనుంచి ఫ్లోరిడా దాకా ఎవరికేమి కావాల్సినా రాజరావుకో ఈ-మెయిల్ పంపితే ముత్యం మూడు గంటల్లో సమాధానం వచ్చేసేది. కొండొకచో, ఆ సమాధానం – అడిగేవాడి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా – ఇంటర్నెట్టు మీద పోస్ట్ చేసి పారేసేవాడు రాజారావు, మిగతా తెలుగు, ఇండియన్ జనాల అభివృద్దీ, ఉన్నతీ, ఆనందాల కోసం.
అతిసహజంగా ఈ ఇంటర్నెట్టు వల్ల రాజారావుకి హితులూ, స్నేహితులూ, శతృవులు పుట్టుకొచ్చారు దేశం నలుమూలల్నుంచీ. ఇందులో కొంతమంది అప్పుడే అమెరికా వచ్చిన స్టూడెంట్స్ అయితే కొంతమంది ఇక్కడ సెటిలైపొయిన ఎన్నారైలు. ఇలాంటి స్నేహితుల్లో చదువు కోసం వచ్చిన రవి ఒకడు. రవి అడపాదడపా రాజారావుతో ఈమెయిల్ మీద మాట్లాడేవాడు ఎప్పుడైనా చదువుకునే రోజుల్లో. చదువయ్యాక అట్లాంటా నుంచి కొత్త ఉద్యోగంలో చేరటానికి వర్జీనియా వెళ్తూ రాజారావింట్లో నైటు హాల్ట్ కి దిగాడు రవి. వస్తున్నట్లు ముందే ఈ-మెయిల్ పంపించి, ఫోన్ చేయడం వల్ల కాలింగ్ బెల్లు నొక్కగానే రాజారావు తలుపు తీసి రవిని ఇంట్లోకి తీసుకెళ్ళి అందర్నీ పరిచయం చేసాడు. రాత్రి భోజనం అయ్యాక నాచురల్ గా తెలుగు సాహిత్యం మీద, పాత చందమామల మీద అనర్గళంగా ఒక ఉపన్యాసం దంచి పారేసాడు రాజారావు – రవికొచ్చే ఆవులింతల్ని పట్టించుకోకుండా.
మర్నాడు బయల్దేరుతూంటే, రవి ఇలా అన్నాడు. “రాజారావు గారూ, నా దగ్గిర ‘నారాయణరావు’ పుస్తకం, కొన్ని పాత చందమామలూ, ఆంధ్రజ్యోతి వీక్లీలు ఉన్నాయి. ఇవన్నీ అమెరికా వచ్చినప్పట్నుండి జాగ్రత్తగా దాచాను. మీరు ఇవి చదవాలనుకుంటున్నారు కనక, మీరు తీస్కోండి. నేను వర్జీనియా వెళ్ళి అపార్టుమెంట్ చూసుకున్నాక ఈ-మెయిల్ పంపిస్తాను. మీరు చదివేసాక, వీలుచూసుకుని నాకు పంపించవచ్చు. ఏమంటారు?”
రాజారావు మొహం ఇంత చేసుకుని అన్నాడు, “నిజంగానా? నారాయణరావు పుస్తకం గురించి వినడమే కానీ ఎప్పుడు చదవనే లేదు. మీరు కూడా నా లైబ్రరీలోంచి కావాల్సిన పుస్తకాలు తీసుకోండి. వీలున్నప్పుడు పంపిద్దురుకానీ.”
“నాకు గురజాడ గారి ‘కన్యాశుల్కం’ ఒక్కటే చాలు రాజారావుగారూ,” అంటూ రవి తన పుస్తకాలు రాజారావుకిచ్చి కన్యాశుల్కంతో ప్రయాణం సాగించాడు.
నెల తిరిగేసరికి జీవితం ఒక గాడిలో పడి అరువు తెచ్చుకున్న కన్యాశుల్కాన్ని బూజు దులిపి చదవటం మొదలుపెట్టాక ఓ పదిరోజులు కష్టపడి – బాత్రూంలో అయితేనేం, హాల్లో కూర్చునయితేనేం, అప్పారావుగారి క్లాసిక్ చదివాననిపించాడు. ఆ మరుసటి వారంలో పుస్తకాన్ని జాగ్రత్తగా పోస్ట్ లో రాజారావుకి పంపించి ఇలాగ ఈ-మెయిల్ కొట్టాడు. “రాజారావుగారూ, ఇప్పటి వరకూ మీదగ్గర్నుంచి తెచ్చిన పుస్తకం చదవడం పడలేదు. ఇప్పుడు చదివాను. మీ పుస్తకం పోస్ట్ లో పంపించాను. మీ పుస్తకానికీ, మీ అతిధ్యానికీ అనేక ధన్యవాదాలు. మీకు పుస్తకం అందాక రిప్లై రాయండి. ‘నారాయణరావు’ చదవడం మొదలుపెట్టారా?”
ఆ పై వారానికి రాజారావు దగ్గర్నుంచి రవికి ఇలా మెసేజి వచ్చింది. “కన్యాశుల్కం వచ్చింది. థాంక్స్!” ఆశ్చర్యంగా ఇంకేమీ లేదు ఆ ఈ-మెయిల్లో – రవి ఇచ్చిన పుస్తకాల గురించికానీ, రవి గురించిగానీ.
ఇంకో ఆర్నెల్లు గడిచాక రవి మళ్ళీ రాజారావుకి ఈ-మెయిల్ పంపించాడు. “రాజారావు గారు, ఈ మధ్యన మీరు నన్ను పూర్తిగా మర్చిపోయారనుకుంటా. బిజీగా ఉన్నారా? అంతా కులాసా అనుకుంటాను. నా పుస్తకాలు చదివేసినట్లైతే, కింద అడ్రస్ కి పంపింస్తారా? వీలు చూసుకుని రిప్లై రాయగలరు… రవి.”
ఈ సారి వారాలు గడుస్తున్నా ఏవీ రిప్లై రాలేదు రాజారావు దగ్గర్నుంచి. చూసి చూసి తాను పంపించిన ఈ-మెయిల్ అందలేదేమో అనుకుని మళ్ళీ అదే మెసేజ్ పంపించాడు రవి. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా తిరిగి కళ్ళు మూసి తెరిచేంతలో ఓ ఏడాది గడిచిపోయింది, రవి వర్జీనియా వచ్చి. అనేకానేక ఈ-మెయిల్స్ కి రిప్లై రాకపోతే ఇంక ఆఖరి ఆయుధంగా, రవి ఒక ఉత్తరం ఇలా రాసి పోస్టులో పంపించాడు.
“నమస్తే రాజారావుగారు. నాకు మీరు ఈ-మెయిల్ పంపించడం మానేసారు, ఎందువలనో. ఒక్కసారి నేను మీకు అంత బద్ధ శతృవునయ్యానా? లేకపోతే మరీ అంత బిజీగా ఉన్నారా? మీకు నేనిచ్చిన పుస్తకాలు నేను మా అక్క దగ్గిరనుంచి అమెరికా వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ‘నారాయణరావు’ పుస్తకం అంటే వేరే చెప్పక్కరలేదు కదా! ఇంకపోతే పాత చందమామలు నేను చిన్నప్పట్నుంచీ దాచుకున్న వజ్రాలు. ఇవన్నీ నాకు చాలా అపురూపమైనవి. ఇలా రాస్తూన్నందుకు ఏమీ అనుకోకండి. మీరు ఈ-మెయిల్ పంపించడం మానేసారు కనక ఇలాగ పోస్టులో వ్రాయవలసి వస్తోంది. వీలు చూసుకుని పుస్తకాలు పంపిస్తారా మరి? మీరు ఇంకా కొంతకాలం ఆ బుక్స్ ఉంచుకుందామనుకుంటే ఫర్వాలేదు కానీ ఈ ఉత్తరం అందగానే నాకు, మీ క్షేమసమాచారాలతో జవాబు రాయగలరు. భవదీయుడు – రవి.”
ఇది జరిగిన మూడు వారాలకి రవికో పార్సెలు వచ్చింది రాజారావు దగ్గర్నుంచి. అందులో తానిచ్చిన పాత తెలుగు వీక్లీలు, పదో పదిహేనో చలి రాష్ట్రంలోని ఆదివారం పేపర్లు, రెండేళ్ళ క్రిందటి ఒక పాప్యులర్ ఎలక్ట్రానిక్స్ మ్యాగజైను, ఫన్నీ పేపర్ అని పిలవబడే ‘ది ఆనియన్’ లాంటివి ఉన్నాయి. ‘నారాయణరావు’ కానీ, పాత చందమామలు కానీ లేవందులో. అన్నింటికి పైన సంతకం లేకుండా కంప్యూటర్ మీద ప్రింట్ చేసిన ఉత్తరం లో ఇలా రాసి ఉంది.
“రవీ, ముక్కూ మొహం తెలియని నిన్ను ఇంట్లో ఉంచుకుని రాత్రికి అతిధ్యం ఇస్తే, థేంక్స్ చెప్పటానికి బదులు నేనేదో పుస్తకాలు దొబ్బుకుపోతానేమో అనుకుంటున్నట్లున్నావు. నీ ఈ-మెయిల్స్ చూస్తే, నన్ను దొంగ కింద జమకట్టినట్టు అనిపిస్తోంది. ఈ పార్సెల్లో నీ పుస్తకాలన్నీ పంపిస్తున్నాను ‘అపురూపంగా దాచుకోవడానికి.’ ఈ వజ్రాలని అన్నింటినీ ఇనప్పెట్లో తాళం వేసుకుని దాచుకో. ఇంతటితో మన స్నేహానికి సరి. నన్ను మళ్ళీ ఎప్పుడూ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించకు.”
ఉత్తరం చదివిన రవి మెదడు మొద్దుబారిపోగా, స్థాణువై సోఫాలో కూలబడిపోయాడు.
***
భేతాళుడు కథ ఇంతవరకే చెప్పి ఇలా అన్నాడు. “విక్రం, కధ పూర్తిగా విన్నావు కదా? రాజారావు అంత చదువుకునీ, అమెరికా ఎన్నారై అయ్యిండీ, శ్రీరంగనీతులు చెప్తూ, ఏమీ తెలియనట్టూ అంత నీచాతినీచంగా రవి పుస్తకాలు ఎలా కొట్టేయగలిగాడు? కొట్టేసాడుపో, పాత న్యూస్ పేపర్లూ, పనికిరాని పత్రికలనబడే, రోడ్డుమీద ఉచితంగా దొరికే ఆనియన్ లాంటి పేపర్లూ పంపిస్తూ స్నేహానికి సరి అనడం దేనికీ? ఇంతకీ రాజారావు రవిని విలన్ గా ప్రోజెక్ట్ చేసినట్టూ రవి చేసిన తప్పేమిటిందులో? ఈ ప్రశ్నలకీ సమాధానం తెలిసీ చెప్పకపొయావో, ఎక్కడకైనా వెళ్ళడానికి నీకున్న ఏకైక వాహనం, ఈ పాతకారు హైవే మీద పెద్ద ఏక్సిడెంట్లో పచ్చడైపోగలదు.”
అప్పటివరకూ అన్యమనస్కంగా కధ వింటున్న విక్రం, కారు ఏక్సిడెంట్ అనేది వినగానే అటెన్షన్ లోకి వచ్చి “భేతాళా, నీకు సంస్కృతం వచ్చా?” అనడిగాడు.
“ఈ కథకీ సంస్కృతానికీ ఏమిటి లంకె?”
“కొన్నింటికి, సమాధానం చెప్పడం సంస్కృతంలో సులభం. నీకు వచ్చా, రాదా?”
“కొంతవరకూ అర్ధం చేసుకోగలను.”
అప్పటికి లాండ్రోమాట్ చేరిన రవి కారు పార్క్ చేసి పాత బట్టల బాస్కెట్ తో లోపలకి నడుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు, “సరే అయితే విను, నారాయణరావు పుస్తకం కానీ అట్ట చిరిగిపోయిన పాత చందమామలు కానీ అపురూపం అని ఇటు రాజారావుకీ, అటు రవికీ తెలిసిందే. ఇలాంటి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా, అంగుళం కదలకుండా వళ్ళోకి వచ్చిపడుతూంటే వద్దనడానికి రాజారావు చవట దద్దమ్మేం కాదు. ఓ సారి చేతిలో పడ్డాక వాటిని ఇవ్వకపోవడానికి కారణం వాటిన రాసిన బాపిరాజు గారి, పబ్లిష్ చేసిన నాగిరెడ్డి చక్రపాణి గార్ల ప్రతిభే అనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి పుస్తకాలు కొట్టేయడానికీ, తనకున్న మేధస్సుకీ, చదువుకున్న చదువుకీ, చేసే ఉద్యోగానికీ, ఎదిగినట్టు చెప్పుకునే ఔన్నత్యానికీ ఏమీ సంబంధం లేదు. ఈ అపురూపమైన వజ్రాలు కొట్టేసాక మళ్ళీ మళ్ళీ అడిగించుకోవడం, ఇవ్వననో, పోయాయనో చెప్పడం కన్నా ఒక్కసారి మాత్రమే చూసిన మొహాన్ని మర్చిపోవడానికి మాంఛి పద్దతి ఈ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేయడమే. ఇంక రవి వైపు నుంచి చూస్తే అతని పుస్తకాలు పోవడం అనేది వేరే విషయం – అపురూపమైన పుస్తకాలూ, అందమైన వనితలూ, డబ్బూ చేతిలో పడగానే ఎంతటి పెద్దమనిషైనా సరే దొంగలా మారతాడని తెలియని అమాయకత్వం. పోతే, రవి చేసిన తప్పు ఈ అపురూపమైన పుస్తకాలు రాజారావు అడక్కపోయినా ఆయన చేతిలో పెట్టడమే. ఆ పుస్తకాలు కావాలని రాజారావు అడగలేదని రవి ముందే గుర్తుంచుకుంటే బాగుండేది, కానీ వాటిని తానే ఇచ్చి అరుదైన సంస్కృత పద్యం చెప్పినట్టూ చేతులు కాల్చుకోవడం అయింది.”
“ఏమిటా సంస్కృత పద్యం?” మాటలో ఆశ్చర్యం ధ్వనిస్తుండగా అడిగేడు భేతాళుడు.
బట్టలు లోడ్ చేసి, సబ్బు నీళ్ళలో కలిపాక వాషర్ తలుపు వెయ్యబోతూ చెప్పాడు విక్రం
పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతః
అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ, ఖండశః

దీని భావం ఏమిటంటే, పుస్తకం, స్త్రీ, డబ్బు, పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా మాత్రమే వస్తుంది. అదే జరిగింది రవికి నువ్వు చెప్పిన కధలో.”

ఈ విధంగా విక్రం ఆదిత్యకి మౌనభంగం కలగ్గానే, బట్టల్లోని మురికి భేతాళుడు ఫకాలున నవ్వి వాషర్ తలుపు లాక్ పడేలోపులే ఒక్క గెంతులో పాత బట్టలమీద నుంచి విక్రం వేసుకున్న జీన్ పేంట్ మీదకి చేరిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked