సారస్వతం

ప్రారబ్ధ కర్మలు

-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

​ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే ‘విధి’ కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట ఉండలేం,ఉండకూడదు కూడా! మానవ జీవితం నిత్యం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి లాగా ఉండాలి. దానితో పాటు మనం కూడా అన్ని చోట్లా తిరుగుతూ నిత్యం ప్రవహించాలి. అప్పుడే జీవితం చైతన్యవంతం అవుతుంది.ఎన్నో విషయాలు అనుభవంలోకి వస్తాయి.సందర్భం వచ్చింది కనుక ఇదంతా చెప్పక తప్పలేదు.మరణానంతరం జీవితం ఉందా, లేడా అనే సందేహం నన్ను కొంతవరకు పీడిస్తుంది. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాల ఘర్షణలో మనసు తీవ్రమైన అన్వేషణ ప్రారంభించింది. ఈ అన్వేషణలోనే నాకు ఏది సత్యమో బోధపడుతుందని నా విశ్వాసం. అది నా అంతట నేను తెలుసుకోవలసిన సత్యమే!దీన్ని గురించి ఎవరో చెప్పింది నమ్మటానికి ఇష్టపడను.ఎందుకంటే అది వారి నమ్మకం మాత్రమే,అది సత్యం కాకపోవచ్చు!నమ్మకాలు సత్యాలు కావు. సత్యాన్ని ఎవరికి వారే అన్వేషించి కనుక్కోవాలి!నాలో పేరుకుపోయిన కొన్ని నమ్మకాలు కొన్నిటిని నమ్మటానికి అంగీకరించటం లేదేమో!ముందుగా ఆ నమ్మకాలనుండి నేను విముక్తుడిని కావాలి. దీనికి సాధన అవసరం. కర్మ సిద్దాంతము ప్రకారము జీవుడు పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా పొందొచ్చు!కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు
కర్మగా భావిస్తారు.హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడ ఏదో ఒకనాడు ఫలితాన్నిస్తుంది.మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. మంచి పనిచేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలానంటే ,నోములు నోచి సంతానాన్ని పొందితే ,ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు!మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే, ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది! కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.అన్ని ప్రాణులు,మనుషులు జీవించటానికి ప్రాణమే మూలం . అది అన్నింటిలో సమానంగా ఉంటుంది, కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి?ఆయా జీవుల సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి (వారి) లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.జీవుల దేహ స్వభావమే అంత. ‘జీవి’ ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారబ్ధం అంటారు. దేహప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారబ్ధమును అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాయి . కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది.మట్టిని సేకరించే పనినుండి,ఆ మట్టి నుండి కుండ తీసేవరకూ జరిగినదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక , ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పనిలేదు. అంటే, కుండ ఏర్పడ్డంతోనే ఆ పని పూర్తయింది. అంటే ‘కర్మ’ ముగిసింది.అందుకే దీన్ని ”కార్య విరోధి కర్మ” అంటారు.కర్మ అంటే–వియోగం, సంస్కారం, సంయోగాలతో కలసివున్నదని భావం! ఈ మూడూ లేకుండా కర్మ ఉండదు.బౌద్ధులు ‘కర్మ’కూ, ‘పని’కి తేడా ఉంది అని అంటారు. కర్మ మానసిక మైనదనీ, పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం! బౌద్ధంలో భగవంతుడు లేడు. ఆస్థానంలో ‘కర్మే’ ఉంది.

కర్మలు మూడు రకాలు.
1) ఆగామి కర్మలు
2) సంచిత కర్మలు
3) ప్రారబ్ధ కర్మలు
1) ఆగామి కర్మలు: మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి.అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! వివాహమైన దంపతులందరికీ సంతానం కలుగకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు.దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు.ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’!
2) సంచిత కర్మలు: మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు. దీనికి కారణం ‘సంచిత కర్మలు’.
3) ప్రారబ్ధ కర్మలు: సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము.ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది.ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం!ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు,శరీరాలు వస్తున్నాయి . కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు. ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. ఆ అనుభవాలను ,కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు. అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే!యోగసాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు evaporate చేసుకోవచ్చు! అలా కర్మలు తొలగించబడేవరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇది పరమ సత్యం. ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు. వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం.ఆ బాధను చూసి కొంతమంది ,ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు .అయితే, అది అంత మంచిది కాదేమో! కారణం–ఈ ప్రారబ్ధకర్మ నుంచి తల్లి తండ్రులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయటం వలన, వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే! అంబానీ సోదరులు అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి,నిత్యం దేవుడిని సహస్ర నామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాదిమంది బిచ్చగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధమే. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపరలు పూర్తైన వారు, తర్వాత దివ్య శరీరంతో రాశీమండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే,మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు. ఇంతకు ముందర నేను చెప్పిన విధంగా వారు యేయే అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు. జన్మ పరంపరలు పూర్తి కాకపోతే ,వారు రాశీమండలంలోకి చేరటానికి అర్హులు కారు. కారణం శరీరం నశించిన తర్వాత ,సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది.వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది.సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలుగదు.సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి.సూక్ష్మ శరీరం నశింప చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.ముముక్షువు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా ,దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే!ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తే కారణ శరీరం నశిస్తుంది. అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడుతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది.కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ,మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం
కావచ్చేమో!జాతక కధల ప్రకారం బుద్ధుడిది అది 700 వ జన్మ అని చెప్పబడింది.ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో? మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని నమ్మకం ఏమీ లేదు. అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం! ప్రాపంచిక విషయాలాలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించటం అనేదే కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం!

శుభం భూయాత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

3 Comments on ప్రారబ్ధ కర్మలు

బాల సుబ్రహ్మణ్యం చింతలపాటి said : Guest 7 years ago

శ్రీ శాస్త్రి గారు చాల క్లిష్టమైన "విషయం" అదే కర్మల గురించి చాల చక్కగా వ్రాసారు . ఇంత క్లిష్ట మైన సబ్జెక్టు ను సామాన్యులకు సైతం అరధమయ్తే రేతిలో తెలిపారు . ధన్యవాదాలండి.

  • గుంటూరు
వ్యాసమూర్తి said : Guest 7 years ago

చక్కని భాషలో అతి చక్కని విషయాలను తెలియచేసిన రచయితకు ధన్యవాదాలు!

  • హైదరాబాద్
విజయలక్ష్మి said : Guest 7 years ago

కర్మను గురించి దాని గుణ విశేషాలను గురించి సరళమైన భాషలో వివరించిన రచయితకు ధన్యవాదాలు!

  • గుంటూరు