సారస్వతం

మనకేం కావాలి?

– దీప్తి కోడూరు

మనం రోజూ చేసే పనులు, ఆలోచనలు, తీర్మానాలు, నిశ్చయాలు అన్నీ క్రోడీకరించి చూసుకుంటే మనందరం 3 అంశాల కోసం ఆరాటపడుతుంటాము అని అర్ధమైపోతుంది.

కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే మనమే అవేంటో తెలుసుకోవచ్చు.

ఒకడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడికి ఆ అమ్మాయి తప్ప మరో లోకం లేకుండా బతికేస్తున్నాడు. వాడిని, “నీకు ఏం కావాల్రా?” అని అడిగితే ఏం చెప్తాడు. ప్రతిక్షణం తన ప్రియురాలి చెంత గడిపేస్తే చాలు అంటాడు. ఎందుకు రా? అంటే అదే నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అంటాడు.

సరే మరొకడు ఉన్నాడు. వాడికి రాజకీయాలంటే ఇష్టం. నీకేం కావాలిరా అనడిగితే, “నాకు ఫలానా పదవి కావాలి అంటాడు” వాడు నిజాయితీపరుడైతే, పదవులు ఎందుకు రా అంటే “నేను అందరికంటే గొప్ప పనులు చేసే అవకాశం వస్తుంది. అందరికీ సహాయం చేయగలను. దాని వల్ల అందరూ నన్ను గౌరవంగా చూస్తారు. ఆ తృప్తి చాలు నాకు.” అంటాడు.

అలాగే ఇంకొకడు వ్యాపారం చేసుకుంటున్నాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు రావాలని కోరుకుంటాడు. ఎందుకు? దాని వల్ల సంతోషంగా అనిపిస్తుందతడికి.

ఒక గృహిణి తన భర్త, పిల్లలు బాగుండాలని, కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగాలని కోరుకుంటుంది.

ఒక విద్యార్థి తనకు మంచి మార్కులు రావాలని కోరుకుంటాడు.

ఒక ఉద్యోగి తనకు ప్రమోషన్ రావాలని కోరుకుంటాడు.

ఇలా ప్రతివారూ తమ జీవితాలలో ఏవో కోరికలు కోరుకుంటూనే ఉంటారు. ఎన్ని కోరికలైనా, చివరికి దాని వల్ల ఏం వస్తుంది అని ప్రశ్నించుకుంటూ పొతే, రెండు విషయాల దగ్గరకు చేరుతుంది ప్రపంచమంతా.

సంతోషం, తృప్తి!

నాకు ఫలానా వస్తువు లభిస్తే సంతోషం కలుగుతుంది!

నాకు ఫలానా పరిస్థితి అనుకూలిస్తే బాగుంటుంది!

నాకు ఫలానా పని చేస్తే తృప్తిగా ఉంటుంది!

ఇవే చివరికి మనందరి సమాధానాలు!

కాబట్టి ఇప్పుడు తేలిందేమిటంటే ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా అదంతా తృప్తి, సంతోషాల కోసమే! కాకపొతే వాళ్ళ అవగాహన, వయసు, తెలివి, సామర్థ్యం, దేశ కాలమాన పరిస్థితులు మొదలైన అంశాలను బట్టి, ఆ తృప్తి, సంతోషాలని రకరకాల మార్గాల్లో వెతుక్కుంటూ ఉంటారు.

అంతే తేడా!

సరే.

ఇప్పటికి ఒక విషయం తేలింది.

మనందరం తృప్తి, సంతోషాల కోసమే పాకులాడుతున్నాము.

మరి ఏ సమయంలో మనం సంతోషంగా, తృప్తిగా ఉండాలి? రోజులో కొంత సమయమే

సంతోషంగా ఉంటే చాలా? ఫలానా రోజుల్లో సంతోషాన్ని, తృప్తిని అనుభవిస్తే సరిపోతుందా?

లేదు. లేదు.

మేము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జీవితమంతా మాకు తృప్తి, సంతోషాలు అలాగే ఉండిపోవాలి.

కాబట్టి ఇప్పుడు మనకు రెండు కొసలు దొరికాయి.

మనం ఎప్పటికీ తృప్తిగా, సంతోషంగా ఉండాలి.

హమ్మయ్య! ఇదే కదా మనందరి లక్ష్యం.

ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతుంది.

మనం రోజులో సగం సమయం నిద్ర పోతుంటాం కదా! నిద్ర లేచాక, “అబ్బ! ప్రశాంతంగా పడుకున్నాను. ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంది” అని ఒళ్ళు విరుచుకుంటూ లేస్తాము.

అంటే, మనం కోరుకునే తృప్తి, సంతోషాలు మనకు నిద్రలో లభిస్తున్నాయన్న మాట!

ఐతే, సహజంగానో, కృత్రిమంగా మత్తు మందులతోనో పూర్తిగా నిద్రలోనే ఉండిపోతే సరిపోదా?

అలా కుదరదండి. అప్పుడు నేను సంతోషంగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది?

కాబట్టి, నేను సంతోషంగా ఉంటే సరిపోదు. ఉన్నట్టు నాకు తెలియాలి.

అదీ సంగతి. ఇప్పటికి మనం లక్ష్యం సంపూర్ణం అయింది.

మనం ఎప్పటికీ తృప్తిగా, సంతోషంగా ఉండాలి. అలా ఉన్నట్లు మనకు తెలియాలి.

ఇదీ మనందరి లక్ష్యం.

ఇంతవరకు స్పష్టమైంది కదా!

ఇప్పుడు మన లక్ష్యాన్ని కొంచెం విచారిద్దాం.

ఇతర భాషల్లాగా కాకుండా తెలుగులో ప్రతి అనుభవానికి ప్రత్యేకమైన శబ్దాలున్నాయి.

ఉదాహరణకు మనసు ఉంది కదా! మనసు ఉండే స్థితిని బట్టి మన ఋషులు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని నాలుగు రకాలుగా మనసు గురించి చెప్పారు. కానీ ఆంగ్లంలో హార్ట్ అనే పదం ఒక్కటే ఉంది.

ఇప్పుడు మన లక్ష్యం లోని తృప్తి, సంతోషాల గురించి చూద్దాం.

ఏదైనా ఒక అనుభవం కానీ, అనుభూతి కానీ ఇక చాలు, ఈ మోతాదు నాకు సంపూర్ణంగా

సరిపోయింది అని ఎప్పుడు అనిపిస్తుందో ఆ అనుభూతిని తృప్తి అంటారు.

ఇకపోతే ఆ క్షణానికి నచ్చడాన్ని సుఖం అంటారు. అంటే ఆ అనుభూతి పొందుతున్నపుడు

మాత్రమే ఆ స్థితి ఉండి, తర్వాత ఉండదు. అదే సుఖం.

మనందరం ఒకసారి పొందిన అనుభవాన్ని మళ్ళీ నెమరు వేసుకుని, అటువంటి అనుభూతిని

పునశ్చరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. అలా క్షణికంగా మనం పొందిన

సుఖానుభూతిని మరికొంత సమయం పొడిగించుకోవాలని చూస్తాము. అలా కొనసాగిన

సుఖాన్ని సంతోషం అంటారు.

అలా కొంచెం సమయం కాకుండా ఆ సంతోషం ఎప్పటికీ ఉండిపోవాలనేది మనందరి

ప్రయత్నం. అలా శాశ్వ తంగా సంతోషం అలాగే ఉండిపోవడాన్ని ఆనందం అంటారు.

అలా మనం ఆనందంగా ఉండటం మనకు తెలియాలి అనుకున్నాం కదా! ఆ తెలియడాన్ని

జ్ఞానం అంటారు.

సుఖసంతోషాల విషయంలో తృప్తి ఉంటుందేమో కానీ, ఆనందం విషయంలో తృప్తి ఉండదు.

ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలని కోరుకునే ఆనందానికి, ఇక చాలు, మాకు ఇంకా ఆనందం

వద్దు అని ఎవరైనా అనగలరా?

లడ్డు తినాలనిపిస్తే ఒకటి తింటాము, రెండు తింటాము, ఇంకా నచ్చితే మూడు తింటాము. లేదా పొట్ట నిండినంత తింటాము. ఆపై ఇంకా చాలు అనిపిస్తుంది. అదే తృప్తి.. కానీ ఆ తృప్తి శాశ్వతం కాదు. కొన్నాళ్ళకు మళ్ళీ లడ్డు తినాలనిపిస్తుంది. కానీ మనం కోరుకునే ఆనందం లక్షణం అది కాదు. అది వస్తే వద్దు అనాలనిపించదు. ఇంక చాలు అనిపించేది ఆనందం కాదు.

కాబట్టి జ్ఞానంతో కూడిన ఆనందమే మన లక్ష్యం.

అవే మనకు కావలసినవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked