కవితా స్రవంతి

*మనిషి జాడ*

~ సాగర్ల సత్తయ్య

కసాయిల పడగ నీడన కాలం వెళ్లదీయడమంటే

అనుక్షణం బతుకుతూ చావడమే

మృత్యువు ఏ రూపాన

మనల్ని కాటేస్తుందో

ఉహలకందని విషయమిపుడు

మనిషిని పశుత్వం

నిలువెల్లా ఆవహించినప్పుడు

చంపటం చావడం ఓ క్రీడ

తండ్రిని కొడుకు చంపడం

అన్నను తమ్ముడు చంపడం

తల్లిని బిడ్డ చంపడం

భర్తను భార్య చంపడం

భార్యను భర్త చంపడం

తన మాట వినలేదని

అధికారినే తగలబెట్టడం

వినీ వినీ

మనసు మొద్దుబారుతోంది

కరెన్సీ కల్చర్

స్వార్ధంతో సహవాసం చేస్తూ

మనిషితనాన్ని సమాధి చేస్తుంది

మానవ విలువలను వెతకడమంటే

ఎండమావిలో నీటిని వెతకడమివాళ

ఆర్థిక సంబంధాలే

మనల్ని శాసిస్తున్నపుడు

మానవ సంబంధాలెక్కడివి మన పిచ్చి గాని

మృగ్యమవుతున్న

మనిషి జాడను వెదకిపట్టగలిగే

పాతాళ గరిగె కోసం అన్వేషిస్తున్నా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked