ధారావాహికలు

రామాయణ సంగ్రహం

సంభ్రాంతులై మెచ్చుకున్నారు అగస్త్యముని కథనాన్ని. ‘ఇప్పుడు నాకంతా జ్ఞాపకం వస్తున్నది. రాక్షసుల వృత్తాంతం నాకిదివరకు తెలిసిందే కదా!’ అని విభీషణుడు విస్మయం ప్రకటించాడు.
అగస్త్య మహర్షి ‘రఘురామా! అట్లా రాక్షసులు ఒకనాడు వీరవిహారం చేశారు’ అని రావణాదులను గూర్చి ప్రస్తావించాడు.
శ్రీరాముడు ఆశ్చర్యపడి ‘భూలోకంలో ఎవరూ రావణుని పరాభవించ లేదా?’ అని అడిగాడు. ‘అది కూడా చెపుతాను విను’ అని అగస్త్యమహాముని చిరునవ్వు చిందించాడు. రావణుడు ఒకసారి కార్తవీర్యార్జునుడు పరిపాలించే మాహిష్మతీపురానికి వెళ్ళాడు తన జయశీలతను నిరూపించుకోవడానికి. అప్పుడు కార్తవీర్యార్జునుడు సుదతులతో జలవిహారేచ్చతో నర్మదా నదికి వెళ్ళాడు. నగరంలో లేడు. అప్పుడు రావణుడు ప్రగల్భంగా ‘నేను మీ రాజుతో యుద్ధం చేయటానికి వచ్చాను. పోయి నా యుద్ధ ఆహ్వానాన్ని తెలపండి’ అని మంత్రులను సమీపించి కోరాడు. వాళ్ళు ‘మా రాజు నగరంలో లేడు’ అని చెప్పారు. మాహిష్మతీ నగరంలో పౌరులు కూడా అదే మాట చెప్పారు. సరే! ఇప్పుడు కాకపొతే ఇంకొకసారి అనుకోని రావణుడు అక్కడి పరిసరాలలో విహరిద్దామని వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చాడు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముదితచిత్తుడైనాడు. ఆనందంతో నర్మదా నదీతీరం చేరాడు. తనతో ఉన్న శుకసారణులనే మంత్రులకు నర్మదానది అందచందాలు ప్రశంసిస్తూ చెప్పాడు. తనను తాను పొగడుకున్నాడు. “ఇక్కడ ఇంత శీతల సుగంధ వాయువు వీస్తున్నదంటే నర్మద నాకు భయపడి వాయువును సుగంధ శీతల భరితం చేసిందన్నమాట. నేను నర్మదానదిలో స్నానం చేసి శ్రమాపనోదనం పొందినట్లే మీరు కూడా ఈ నదీ జలాలలో స్నానం చేయండి. ఇంతలో నేను తీరంలో సైకతస్థలిపై సువర్ణలింగం ప్రతిష్టించి శివపూజ చేసుకుంటాను” అని తన సైన్యానికీ, మంత్రులకూ చెప్పాడు రావణుడు.

ప్రహస్తుడూ మొదలైన మంత్రులూ, ఇంకా రాక్షస ప్రముఖులూ, ఏనుగులతో సహా సర్మదానదిలో స్నానార్థమై దిగారు. స్నానానంతరం వాళ్ళు రావణుడి శివపూజ కోసం సుగంధ పుష్పాలు తెచ్చి కుప్పపోశారు. రావణుడు వివిధ స్తుతులతో శివుణ్ణి ఆరాధించాడు. సామగానంతో ప్రీతుణ్ణి చేశాడు. నృత్యసేవతో అర్చించాడు. ఇట్లా రావణుడు శివపూజ చేసుకుంటూ ఉండగా నర్మాదానది పొంగి ఆ శివపూజా స్థలిని ముంచి వేసింది. రావణుడు కోపోద్రిక్తుడూ, విచారస్వాంతుడూ అయినాడు. అసలు జరిగింది ఏమంటే

అక్కడకు దిగువన చాలా దూరంలో సహస్రబాహువైన కార్తవీర్యార్జునుడు తన సుందరీమణులతో జలక్రీడలాడుతూ తన చేతులతో నదీ ప్రవాహాన్ని అరికట్టాడు. అందువల్ల నది నీరు ఎగువకు ప్రవహించింది. ఎగువ భాగంలో నదికి వరదలు వచ్చాయి. నది పొంగి గట్లను ముంచి తీరం వెంబడి ప్రవహించింది. ఆ విధంగా రాక్షస సైన్యాన్ని కూడా ముంచింది. అందువల్ల రావణుడు తన పూజా భంగానికి చాలా చాలా కోపం తెచ్చుకున్నాడు. ఇట్లా నదిలో నీరు ఎగదట్టి ఎగువ భాగంలో పొంగటానికి కారణమేమిటో తెలుసుకొని రావలసిందిగా తన మంత్రులైన శుకసారణులను ఆజ్ఞాపించాడు రావణుడు. అక్కడకు దిగువ భాగంలో చాలా దూరాన కార్తవీర్యార్జునుడు తన పత్నులతో జలక్రీడలాడటం చూశారు శుకసారణులు. వాళ్ళు తిరిగి వచ్చి ‘వేయి చేతులతో మహాబలిష్టుడు, మహాపురుషుడు ఒకడు నదిలో భార్యలతో జలక్రీడలాడుతుండడం వల్ల ఇది సంభవించిందని’ రావణుడికి నివేదించారు. అప్పుడు రావణుడు తన మంత్రులైన మహోదరుడు, మహాపార్శ్వుడు, శుకసారణులతో కార్తవీర్యార్జునుడిని శిక్షించడానికి అతడున్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరివారంతో ‘రాక్షసేశ్వరుడు లంకాధిపతి నీతో యుద్ధం చేయటానికి వచ్చాడ’ని చెప్పవలసిందిగా రావణుడు చెప్పాడు. వాళ్ళు ఇది సమయం కాదన్నా వినిపించుకోలేదు.

 

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked